ఆరట్ల ఆరగింపు | Receive blessings by getting rid of devotion | Sakshi
Sakshi News home page

ఆరట్ల ఆరగింపు

Published Thu, Sep 28 2017 12:08 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Receive blessings by getting rid of devotion - Sakshi

ఓలిగలు.. బొబ్బట్లు.. భక్ష్యాలు.. పోలెలు..
పూరన్‌ పోలి.. స్టఫ్డ్‌ పాన్‌కేక్స్‌... ఇలా ఈ అట్లకు ఎన్నో పేర్లు.
పేరు ఏదైనా అమ్మవారికి ఈ ఆరట్ల ఆరగింపు భక్తితో చేసి దీవెనలు పొందండి.

గుమ్మడి బొబ్బట్లు
కావలసినవి: గుమ్మడికాయ తురుము – 3 కప్పులు, తురిమిన బెల్లం – 1 1/2 కప్పు, మైదా – 3/4 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్, నెయ్యి – సరిపడ

తయారి: ∙మందపాటి బాణలిలో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయేలా 5 నిమిషాలు వేయించాలి ∙తరిగిన బెల్లం వేసి సన్నని మంటపై కలుపుతూ ఉండాలి ∙యాలకుల పొడి వేసి మిశ్రమం ఉండలా తయరయ్యేంత వరకు కలిపి స్టౌ ఆఫ్‌ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఒక గిన్నెలో మైదా పిండి, ఒక స్పూన్‌ నెయ్యి వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మెత్తని చపాతి పిండిలా కలుపుకోవాలి ∙గిన్నెపై మూతపెట్టి 1 గంట సేపు పిండిని నాననివ్వాలి ∙పిండిని ఒకే సైజులో ఉండేలా ఉండల్లా చేసి పెట్టుకోవాలి ∙అరచేతిలో నెయ్యి రాసుకుని పిండి ముద్దను తీసుకుని మధ్యలో గుమ్మడి తురుము మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా జాగ్రత్తగా మూసివేయాలి ∙ఇప్పుడు అప్పడాల పీటపైన కొంచెం పిండి చల్లి నెమ్మదిగా చపాతీలా ఒత్తుకోవాలి ∙స్టౌ వెలిగించి, పెనం పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక బొబ్బట్టు వేసి బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చుకోవాలి ∙వేడి వేడి గుమ్మడి బొబ్బట్టుపై నెయ్యి వేసి వేడిగా సర్వ్‌ చేయాలి.

డ్రైఫ్రూట్స్‌ బొబ్బట్లు
కావలసినవి: మైదా పిండి – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – తగినంత, నీళ్లు – తగినంత, జీడిపప్పు పొడి – టేబుల్‌ స్పూను, పిస్తా పొడి – టేబుల్‌æస్పూను, బాదం పప్పుల పొడి – టేబుల్‌ స్పూను, ఏలకుల పొడి – అర టీ స్పూను, కొబ్బరి తురుము – టేబుల్‌ స్పూను

తయారి: ∙ఒక పాత్రలో మైదా, నెయ్యి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి ∙కొద్ది కొద్దిగా నీరు జత చేస్తూ చపాతీపిండిలా తయారుచేసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్‌లో కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి ∙మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙డ్రైఫ్రూట్స్‌ మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక ప్లాస్టిక్‌ కవర్‌ మీద నూనె రాసి, మైదా పిండి ఉంచి చేతితో చపాతీలా ఒత్తి, అందులో డ్రై ఫ్రూట్స్‌ మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, మరోమారు చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక నెయ్యి వేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్‌ బొబ్బట్టును పెనం మీద వేసి రెండు వైపులా గోధుమరంగులోకి వచ్చేవరకు కాల్చి తీసేయాలి.

డేట్స్‌ పాన్‌ కేక్‌
కావలసినవి: మైదా పిండి – కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – కొద్దిగా, ఖర్జూరాలు – కప్పు (గింజలు తీసి ముక్కలు చేయాలి), పాలు – అర కప్పు, వెనిలా ఎసెన్స్‌ – టీ స్పూను, బటర్‌ – కొద్దిగా, తేనె – టేబుల్‌ స్పూను

తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్‌ వేసి కలపాలి. మిక్సీలో మైదాపిండి మిశ్రమం, పాలు, ఖర్జూరం ముక్కలు వేసి చిక్కగా అయ్యేలా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙వెనిలా ఎసెన్స్‌ జత చేయాలి . స్టౌ మీద పెనం వేడయ్యాక, కొద్దిగా బటర్‌ వేసి పెనమంతా అంటేలా చేయాలి ∙పెద్ద స్పూనుతో మైదా పిండి, ఖర్జూరం మిశ్రమం వేసి మందంగా ఉండేలా పరచాలి ∙రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. (పెద్ద మంట మీద కాల్చకూడదు) ∙ప్లేట్‌లోకి తీసి, పైన కొద్దిగా తేనె వేసి సర్వ్‌ చేయాలి.

పూర్ణం బొబ్బట్లు
కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు, గోధుమరవ్వ – టీ స్పూను, ఉప్పు – చిటికెడు, నెయ్యి – అర టీ స్పూను నూనె – అర టేబుల్‌ స్పూను, నీళ్లు – తగినంత
పూర్ణం తయారీకి: సెనగ పప్పు – అర కప్పు, బెల్లం తురుము – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, కొబ్బరి తురుము – పావు కప్పు, నీళ్లు – తగినన్ని

తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ, చపాతీ పిండిలా కలపాలి. నూనె జత చేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు గంటసేపు నాననివ్వాలి ∙ఒక పాత్రలో సెనగ పప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, బయటకు తీసి తడి పోయేవరకు చల్లారనివ్వాలి. ∙మిక్సీలో వేసి పొడి చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఏలకుల పొడి, బెల్లం తురుము, కొబ్బరి తురుము జత చేయాలి ∙చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙నానబెట్టిన మైదా పిండిని కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙అరిటాకు లేదా ప్లాస్టిక్‌ కవర్‌ మీద మైదా పిండి ఉండ ఉంచి చపాతీ మాదిరిగా చేతితో ఒత్తాలి ∙పూర్ణం ఉండ అందులో ఉంచి, మైదాపిండితో మూసేసి మరోమారు చపాతీలా చేతితో ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె లేదా నెయ్యి వేసి కాగిన తరవాత, ఒత్తి ఉంచుకున్న బొబ్బట్టు జాగ్రత్తగా వేయాలి ∙రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి తీసేయాలి.

క్యారెట్‌ బొబ్బట్లు
కావలసినవి: గోధుమపిండి – 2 కప్పులు, క్యారెట్‌ తురుము – 1 కప్పు, తరిగిన బెల్లం – 1 కప్పు, యాలకుల పొడి – 1 స్పూను, నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – సరిపడ

తయారి: ∙ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకుని నీళ్ళు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ ముద్దపై కొంచెం నూనె వేసి ఒక గంట సేపు నాననివ్వాలి ∙ఒక మందపాటి బాణలిని స్టౌ మీద పెట్టి, క్యారెట్‌ తురుము, బెల్లం వేసి కలుపుతూ ఉండాలి ∙ఈ మిశ్రమానికి యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి సన్న మంటపై కలుపుతూ ఉండాలి ∙ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. బాణలికి అంటుకోకుండా, అంచుల్లో నెయ్యి పక్కకు వస్తున్నప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్దను నూనె రాసిన ప్లాస్టిక్‌ కవర్‌పై తీసుకుని చిన్న చపాతీ మాదిరిగా చేతితో ఒత్తుకోవాలి ∙ఈ చపాతీ మధ్యలో క్యారెట్‌ మిశ్రమాన్ని తీసుకుని అంచులు పూర్తిగా మూసివేసి, కొబ్బరి మిశ్రమం బయటకు రాకుండా చపాతీ మాదిరిగా చేసుకోవాలి ∙వేడిచేసిన పెనంపై నెయ్యి వేసి వేడయ్యాక, రెండువైపులా బాగా కాల్చుకోవాలి.

నువ్వులు కొబ్బరి బొబ్బట్లు
కావలసినవి: నువ్వులు – అర కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు, బెల్లం తురుము – కప్పు, నూనె – టేబుల్‌ స్పూను, ఏలకుల పొడి – అర టీ స్పూను, మైదా పిండి – రెండు కప్పులు,
నీళ్లు – తగినన్ని, ఉప్పు – కొద్దిగా, నెయ్యి – అరకప్పు

తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నూనె జత చేసి మరో మారు కలిపి గంట సేపు పక్కన ఉంచాలి ∙మిక్సీలో నువ్వులు, కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, పాత్రలోకి తీసుకోవాలి ∙నువ్వుల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙ప్లాస్టిక్‌ కవర్‌ మీద కొద్దిగా నూనె రాసి, మైదా పిండి ఉండ ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి ∙నువ్వుల మిశ్రమం ఉండను ఉంచి, అన్ని వైపులా మూసి, మరోమారు చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టు వేసి నేతితో రెండు వైపులా కాల్చి తీసేయాలి.
– సేకరణ: డా. వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement