ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక భారతదేశం. మన సాంప్రదాయపు పర్వదినాలను జరుపుకోవటంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాలలో ఉండే చిన్న చిన్న వైరుధ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానం గా ఇవి ఆహారవిహారాలలో గల ప్రాంతీయ భేదాల్ని సూచిస్తాయి. భాద్రపద మాసంలో వచ్చే ‘వినాయక చవితి’ కి కూడా ఇది వర్తిస్తుంది. కుడుములు, ఉండ్రాళ్లు, గొట్టెక్క బుట్టలు వంటి పిండి వంటలను ఆస్వాదించేటప్పుడు రకరకాల పచ్చళ్లను నంజుకోవడం తెలుగువారి ప్రత్యేకత. అప్పటికప్పుడు తాజాగా తయారుచేసుకునే వాటిలో విశిష్టమైనవి... ‘చింతకాయ, కొత్తిమీర, అల్లం, నువ్వుల పప్పు’ పచ్చళ్లు. ప్రధాన భక్ష్యాలతో పాటు నంజుకునే సహద్రవ్యాలు లేదా‡అనుద్రవ్యాలను ‘వ్యంజనాలు’ అంటారు. ఇవి నాలుకకు రుచిని కలిగించడమే కాకుండా, తెలుగువారి మనసులకు కూడా ఆనందం కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. వీటి అవసరాలను, ఆరోగ్య ప్రయోజనాలను ఆయుర్వేదం చక్కగా వివరించింది.స్థూలంగా చెప్పాలంటే భాద్రపద మాసం వర్ష ఋతువు, వాత ప్రకోపం, పిత్త సంచయం కలిగి ఉండే వాతావరణం. ప్రాణుల్లో శక్తి కొంచెం తక్కువగా ఉండే సమయం. వినాయకచవితి పండుగ రోజున కనిపించే పిండి వంటలు, వ్యంజనాలకు బలం కలిగించే గుణం, వాతపిత్తాలను తగ్గించి ఆరోగ్య పరిరక్షణ చేసే లక్షణం కూడా ఉన్నాయి. పచ్చళ్లకు వాడే ప్రధాన పదార్థాలతో పాటు, వాటి తయారీలో ముఖ్యపాత్రను పోషించే ఉప్పు పులుపు కారాలు, ముఖ్య అతిథిగా దర్శనమిచ్చే ఇంగువ, నువ్వుల నూనె గుణగణాలను ఆయుర్వేదం అభివర్ణించింది.
చింతకాయ (పచ్చడి)
‘‘అమిలకా అమ్లా గురుః వాతహరా పిత్త కఫాస్రకృత్‘పక్వాతు దీపనీరూక్షా రస ఉష్ణా కఫవాత నుత్‘‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి చింతకాయ/చింతపండుకు పర్యాయ పదాలు.
కొత్తిమీర
ఇవి ధనియాల యొక్క ఆకులు. ధాన్యకం, ధానకం, కునటీ, కుస్తుంబురు మొదలైనవి ధనియాలకు పర్యాయ పదాలు. ఇవి కొంచెం కారంగా, ఘాటుగా ఉంటాయి. జీర్ణమైన తరవాత మృదువుగా ఉంటుంది. ఆకలిని పుట్టించి అరుగుదలకు సహకరిస్తుంది. ఉష్ణవీర్యమైనప్పటికీ మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. జ్వరం, అతిసారం, దగ్గు, ఆయాసం, దప్పిక, వాంతులను తగ్గిస్తుంది. త్రిదోష హరం, బల్యం, క్రిమి హరం. ధనియాలు వాటి ఆకులైన కొత్తిమీరకు సమాన గుణకర్మలు ఉంటాయని చెప్పారు.
ఆర్ద్రంతు తద్గుణం స్వాదు విశేషాత్ పిత్త నాశనం
అల్లం
దీనికి ఆర్ద్రక, కటుభద్ర, శృంగబేర వంటి పర్యాయపదాలు ఉన్నాయి. కటురస ప్రధానమైనప్పటికీ, జీర్ణమైన తరువాత మృదువుగా ఉంటుంది. శరీరంలోని నీటిని ఆర్చి, వాతకఫాలను తొలగిస్తుంది. అగ్నిదీపకం, శరీరానికి వేడి కలిగిస్తుంది. కొంచెం ఉప్పును కలిపి అల్లం తింటే, అరుచిని, కంఠ రోగాల్ని తగ్గిస్తుంది. తీక్ష›్ణగుణం కలిగి ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతనైనా శరీరంలో రక్తం కారుతున్నప్పుడు , జ్వరం వచ్చినప్పుడు, వేసవికాలంలోను అతిగా సేవించకూడదు.‘భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం!అగ్ని సందీపనం, రుచ్యం, జిహ్వా కంఠ విశోధనమ్
నువ్వులు
నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో ఉంటుంది. బలకరం, కేశాలకు మంచిది. స్తన్య వర్ధకం. ఆకలిని, బుద్ధిని పెంచుతాయి. నల్ల నువ్వులు శ్రేష్ఠం. తెల్లనివి మధ్యమం.
నువ్వుల నూనె: తిలతైలం గురుస్థైర్యం బలవర్ణకరం సరం, వృష్యం... వాతపిత్త కఫాపహం... కృశానాం తేన బృంహణం... లేఖనం, బద్ధ విణ్మూత్రం గర్భాశయ విశోధనం...’’ బరువైన ద్రవ్యం, త్రిదోష హరం. నీరసించిన వారికి బలం కలిగించి బరువును పెంచుతుంది. కొవ్వును కరిగించే గుణం కలిగి స్థూలకాయులకు బరువును తగ్గిస్తుంది. గట్టిగా ఉన్న మలాన్ని మెత్తబరచి నెట్టివేస్తుంది. స్త్రీలలో గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇంగువ (హింగు): ఉష్ణం, పాచనం, రుచ్యం తీక్షవాత కఫఘ్నం, పిత్త వర్ధనంశరీరానికి వేడిని కలిగిస్తుంది, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. కడుపు నొప్పి, కడుపులోని వాయువుని పోగొడుతుంది.
గుర్తు ఉంచుకోవలసిన సారాంశం:
పిండివంటలు శోభిల్ల పండుగలనుగురుతరంబుగ చేయుడి కూర్మి మీరసాంప్రదాయపు భక్ష్యముల్ శాస్త్రహితముమనసు రంజిల్ల సేవించి మనగ వలయుకొత్తిమిరి చింత అల్లముల్ కోరుకొనుచుమంచి పచ్చళ్లు చేయంగ మరువ వలదుహింగు తిల తైల సంపర్క హిత గుణాన అఖిల జనరంజకములయ్య వ్యంజనములు
డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment