కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త ! | Research Warning For Coffee Lovers | Sakshi
Sakshi News home page

కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త !

Published Sat, Sep 22 2018 8:17 AM | Last Updated on Sat, Sep 22 2018 8:17 AM

Research Warning For Coffee Lovers - Sakshi

ఒకప్పుడు ఇరానీ చాయ్‌కి కేరాఫ్‌గా ఉన్న సిటీలో ఇప్పుడు కాఫీ ఘుమఘుమలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కాఫీ డేలు, కాఫీషాప్‌లు అనధికార ఆఫీసులుగా, వినోద కేంద్రాలుగా మారిపోతూ గంటల తరబడి కాలక్షేపాలకు వేదికలవుతున్నాయి. సిటీలో కాఫీ ప్రియత్వం ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగుచూసిన ఓ పరిశోధన కాఫీ ప్రియులైన యువతులకు పలు హెచ్చరికలు చేస్తోంది. 

సాక్షి, సిటీబ్యూరో  : ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రీ ప్రొడక్షన్‌ ప్రకారం... జాతీయస్థాయిలో 14శాతం మంది (దాదాపు 2.71 కోట్ల మంది) దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోని ప్రతి ఆరుగురు జంటల్లో ఓ జంట బాధితులే. జీవనశైలి మార్పులు, ఆరోగ్య పరిస్థితులు, జన్యు పరమైన సమస్యలు వంటివి దీనికి కారణాలుగా వైద్యరంగం పేర్కొంటోంది. ఇదే క్రమంలో మనం ఇష్టంగా తాగే కాఫీ సైతం నట్టింట్లో కేర్‌ మనే సవ్వడిని దూరం చేస్తుందని తాజాగా వెల్లడైంది. మహిళలపై కాఫీ చూపే వ్యతిరేక ప్రభావాలపై 1988 నుంచే పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఏవీ కూడా నిర్దిష్టంగా దీని ప్రభావాన్ని తేల్చలేకపోయాయి. అయితే తాజాగా భారీ స్థాయిలో వేలాది మంది మహిళల్ని భాగస్తుల్ని చేస్తూ డెన్మార్క్‌లో నిర్వహించిన పరిశోధన మాత్రం వీటికి భిన్నంగా పలు అంశాల్ని వెలుగులోకి తెచ్చింది.

చాక్లెట్‌ కూడా...  
బెడ్‌ కాఫీ గొంతులో పడకుండా మంచం దిగని వారెందరో. చాలా మందికి అదొక రోజువారీ వ్యసనం. ఇంతగా అది ఒక అలవాటు స్థాయి నుంచి వ్యసనం స్థాయికి చేరడానికి కాఫీలో ఉండే కెఫైన్‌  కారణంగా చెబుతారు. పొద్దున్నే కాఫీ తాగే ఈ తరాల నాటి సంప్రదాయానికి అదనంగా ఇప్పుడు నగరవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న కాఫీ షాప్‌లు జతయ్యాయి. అక్కడ గంటల తరబడి కాలక్షేపం చేసే యువత పెద్ద పెద్ద మగ్గుల్లో కాఫీలను తాగడం అత్యంత సహజంగా మారింది. నేరుగా అధిక పరిమాణంలో కెఫైన్‌ను అందించే కాఫీతో పాటు టీ మరికొన్ని ఫ్లేవర్డ్‌ డ్రింక్స్, కొన్ని రకాల చాక్లెట్స్‌ కూడా కొద్దో గొప్పో కెఫైన్‌ను కలిగి ఉంటాయి.

కెఫైన్‌.. కేర్‌ఫుల్‌  
పెళ్లికాని యువతులతో పాటు సంతానం కోసం ఎదురుచూసే వివాహితలు కూడా కెఫైన్‌ పరిమాణం విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కెఫైన్‌ సంతాన ప్రక్రియకు అవరోధంగా నిలుస్తుందని, పిండం వృద్ధి చెందకుండా అడ్డుకుంటుందని డెన్మార్క్‌ పరిశోధన హెచ్చరిస్తోంది. హార్మోన్ల ప్రక్రియను కూడా కెఫైన్‌ దెబ్బతీస్తోందని స్పష్టం చేసింది. ప్రతిరోజు 300 మి.గ్రా. మించి (అంటే ఒక కప్పునకు మించి అనుకోవచ్చు) కెఫైన్‌ను తీసుకునే మహిళలకు సంతానలేమి అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. అయితే పూర్తిగా దీనికి దూరం కాలేని మహిళలు... రోజుకు 200 మి.గ్రాకు తమ అలవాటును పరిమితం చేయాల్సి ఉంటుంది.  
– డాక్టర్‌ రాధికారాణి అక్కినేని,అపోలో ఫెర్టిలిటీ, కొండాపూర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement