సమాజాన్ని సంస్కరించే బాధ్యత విశ్వాసిదే! | responsibility to reform society! | Sakshi
Sakshi News home page

సమాజాన్ని సంస్కరించే బాధ్యత విశ్వాసిదే!

Published Sun, Dec 6 2015 4:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

సమాజాన్ని సంస్కరించే బాధ్యత విశ్వాసిదే!

సమాజాన్ని సంస్కరించే బాధ్యత విశ్వాసిదే!

సువార్త
అమెరికాలో కొందరు ధనవంతులు ఖరీదైన చర్చి కట్టించుకొని గొప్ప దైవజనుడు క్లారెన్స్ జోర్డన్‌ని ఆహ్వానించారు. చర్చి ఎంత ఖరీదైనదో ఆయనకు వివరిస్తూ, చర్చి గోపురం మీది సిలువకే లక్ష డాలర్లయ్యాయి తెలుసా! అన్నారు. ‘‘మిమ్మల్నెవడో బాగా మోసం చేశాడు. రక్షణను, సిలువను దేవుడు ఉచితంగా ఇచ్చాడని మీకు తెలియదా?’’ అన్నాడాయన ఇక ఉండబట్టలేక. కొందరికర్థమయ్యేది డబ్బు భాష ఒక్కటే.

ఒకసారి యేసు బోధ చేస్తుంటే వేలాదిమంది పొద్దు పోయేవరకు శ్రద్ధగా వింటున్నారు. భోజనాల కోసం వారిని ఇళ్లకు పంపమని శిష్యులంటే, ‘‘మీరే వారికి భోజనం పెట్టండి’’ అని ప్రభువు వారినే ఆదేశించాడు. పెడితే తినడం మాత్రమే తెలిసిన శిష్యులకిది రుచించలేదు. ఫిలిప్పు అనే శిష్యుడు లెక్కలేసి అందుకు రెండొందల దీనారాలు (అప్పట్లో చాలా మొత్తం) కావాలన్నాడు (మత్తయి 14:16 ; యోహాను 6:7).

అది అరణ్యం, రాత్రి కావస్తోంది, పైగా ఐదు వేల మంది జనం!! ఈ మూడూ శిష్యుల దృష్టిలో సమస్యలు. కాని అలనాడు అరణ్యంలో ఆరు లక్షలమందికి పైగా ఉన్న ఇశ్రాయేలీయులను 40 ఏళ్ల పాటు ‘మన్నా’తో పోషించిన దేవునికి అవి సమస్యలు కావు కదా. ఒక బాలునివైన ఐదు రొట్టెలు, రెండు చేపల్ని ప్రభువు ఆశీర్వదించి శిష్యులచేతికిచ్చి పంచగా అంతా తృప్తిగా తినగా మిగిలిన ముక్కలే 12 గంపలకెత్తారు.
 
దేవుని ఆదేశాలు, సంకల్పాలు ఎన్ని ఆటంకాలున్నా నెరవేరి తీరుతాయన్నది చరిత్ర చెబుతోంది. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు రొట్టెలు, చేపల్ని కూడా శూన్యంలో నుండి సృష్టించగలడు. కాని కొత్త నిబంధన కాలమైన నేటి ‘కృపాయుగం’లో దేవుడు విశ్వాసి ద్వారానే అద్భుతాలు చేస్తాడు. ఒక బాలుని ఆహారాన్ని, అసాధ్యమని తేల్చిన శిష్యుల ద్వారానే దేవుడు వేలాది మందికి పంచాడు.

ఎంత ప్రార్థన చేస్తాడు, ఎంత క్రమంగా చర్చికెళ్తాడు, ఎంత బైబిల్ జ్ఞానముంది అన్నవి కాదు, విశ్వాసిలో ఎంత ‘ఉద్యమ శక్తి’ ఉంది అన్నదే అతని ఆత్మీయ స్థాయికి కొలబద్ద! ‘‘మీరే వారికి భోజనం పెట్టండి’’ అని ఆనాడు ఆదేశించినట్టే ‘మీరే సమాజాన్ని బాగు చేయండి’ అని ప్రభువు ఈనాడు ఆదేశిస్తున్నాడు. ఇది ప్రతి విశ్వాసి చెవుల్లో మారుమోగాలి. అందరికన్నా ఎక్కువగా సమాజం గురించి విశ్వాసే ఆలోచించాలి.

ఎందుకంటే పొరుగువారిని దేవుడు ప్రేమించమన్నాడు గనుక, ఆ పొరుగువారంతా మన చుట్టూ సమాజంలో ఉన్నారు గనుక. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు బాగు చేస్తాడు’ అనుకోవడం పిరికితనం, బాధ్యతల నుండి తప్పించుకోవడం, ‘ప్రార్థన చేస్తాం’ లేదా ‘చేద్దాం’ అనే మాట ఊతపదమయింది. మనింట్లో దొంగలు పడితే మోకరించి ప్రార్థిస్తామా, మూలనున్న కర్రందుకుంటామా?

కుటుంబాన్ని, చర్చిని, సమాజాన్ని సంస్కరించుకునే బాధ్యత పూర్తిగా విశ్వాసిదే! సతీసహగమనం, బాల్యవివాహం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విలియంకేరీకి, కృష్ణా, గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించి ఒకప్పటి కరువు ప్రాంతాలైన ఈనాటి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలు ఆహారానికి సంపదకు నిలయంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ అనే మరో విశ్వాసికి వారసులే నేటితరం విశ్వాసులు. ఆవగింజంత విశ్వాసముంటే కొండల్ని పెకిలించవచ్చునన్న యేసు మాటను వారు సార్థకం చేశారు, మనం నిరర్ధకం చేస్తున్నాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement