
రిటైర్డ్ హబ్బీ సిండ్రోమ్!
నేర్చుకుందాం! మార్చుకుందాం!
పదవీ విరమణ అనేది సాధారణ విషయం. అయితే ఆడవాళ్లకు మాత్రం ఇది అసాధారణ భయంగా మారుతుంది. రిటైర్ కాబోయే భర్తలను తలుచుకుంటూ భార్యలు గడగడలాడుతున్నారట. దీనికి కారణం పదవీ విరమణ పొందిన భర్తల నుంచి రకరకాలుగా ఇబ్బందులు ఎదురుకావడం. దీనివల్ల నిద్రలేమి, కృంగుబాటు... తదితర సమస్యలతో మహిళలు బాధపడుతున్నారు. పదవీ విరమణ పొందిన భర్త నుంచి భార్య ఎదుర్కొనే సమస్యను ‘రిటైర్డ్ హబ్బీ సిండ్రోమ్’ అని పిలుస్తున్నారు.
ఉద్యోగం చేస్తున్నప్పటితో పోల్చితే, విరమణ తరువాత పురుషుల మానసిక స్థితిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయట! చాలామంది పురుషులు తమ ఉద్యోగ విరమణ తాలూకు బాధను, అసంతృప్తిని రకరకాల మార్గాలలో స్త్రీలపై ప్రదర్శిస్తున్నారట.
‘‘ఉద్యోగం చేసే స్త్రీలపై ఈ సిండ్రోమ్ ప్రభావం అధికంగా ఉంది. ఒకవైపు ఉద్యోగం తాలూకు ఒత్తిడి, మరోవైపు పదవీ విరమణ పొందిన భర్త నుంచి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అంటున్నారు ఇటాలియన్ పరిశోధకులు. ఇది కేవలం ఒకటి రెండు దేశాలకే పరిమితమైన సమస్య కాదని ‘ప్రపంచ సమస్య’ అని అంటున్నారు ‘పడోవ యూనివర్శిటీ’కి చెందిన డా. మార్క్ బెర్టోని అనే సామాజిక శాస్త్రవేత్త. ఈ నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, విరమణ తీసుకోనున్న వారి కోసం కొన్ని సూచనలు....
* ఎప్పుడూ తీరిగ్గా కూర్చుని, ఏదో ఆలోచించకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండండి. దీనివల్ల శరీరం, మనస్సు చురుగ్గా ఉంటాయి.
*ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇంటిపనికి అవసరమైన టైమ్ కేటాయించడం కుదరకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు వీలైనంత ఎక్కువగా ఇంటిపనుల్లో పాలుపంచుకోండి.
* పదవీ విరమణ అంటే ‘పదవి’కి మాత్రమే ‘విరమణ’, మనసుకు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. విహారయాత్రలకు ప్రాధాన్యత ఇవ్వండి.
* పుస్తకాలు చదవడం, పాత సినిమాలు చూడడం, పజిల్స్ నింపడం ద్వారా ఉల్లాసంగా ఉండవచ్చు.
* మీ మాటలతో భార్యను ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ మాట తూలినా ‘సారీ’ చెప్పడం మరవకండి.