తిరిగొచ్చిన పర్సు
‘‘కలిసొచ్చే కాలం వస్తే రాదా పోయిన సొమ్ము రెట్టింపై’’ అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు ఇవికా జెర్కొవిక్ (50). తూర్పు క్రోషియాలోని ఓ పల్లెటూరిలో నివసించే జెర్కోవిక్ ఒక రోజు మధ్యాహ్నం తన ఇంటి రూఫ్ రిపేర్ నిమిత్తం కొంత సొమ్ము బ్యాంక్ నుంచి డ్రా చేశాడు. అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో పాల్గొన్నాడు. అక్కడ ఓ స్నేహితుడు అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే అతడిని ఆసుపత్రిలో చేర్పించాడు. ఇదంతా అయి ఇంటికెళ్లి చూసుకుంటే జేబులోని వాలెట్ కనిపించలేదు. ఎక్కడో పడిపోయిందో, ఎవరైనా కొట్టేశారో అనుకుని బాధపడి ఊరుకున్నాడు. ఇది జరిగి 14 సంవత్సరాలైన తర్వాత జెర్కోవిక్ ఇంటికి ఓ పార్సిల్ వచ్చింది.
అది విప్పి చూస్తే పోయిన వాలెట్ ఉంది. ఆ వాలెట్‌లో పోయిన సొమ్ముకు రెట్టింపును మించి ఉంది. అయితే సదరు వాలెట్‌ను ఎవరు పంపారో మాత్రం చిరునామా లేదు. ‘‘అసలు కన్నా వడ్డీ ముద్దు’’అన్నట్టు... ఆ వాలెట్ ‘చోరుడు’ 14 ఏళ్లకు వడ్డీ లెక్కించి మరీ పంపించడంతో ‘‘మంచి దొంగవు నీవు... లెక్కల్లో బ్యాంకర్‌ని మించినావు’’ అంటూ జెర్కోవిక్ తన అజ్ఞాత దొంగ మిత్రుడ్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు.