నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా ఉండే బాధను భరించడం కంటే చనిపోవడం మేలన్నంత తీవ్రంగా నొప్పులు ఉంటున్నాయి. ఈ సమస్యకు ఏవైనా పరిష్కారాలు ఉంటే వివరంగా చెప్పండి.
కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని కొందరు నిర్లక్ష్యం చేసి, వ్యాధిని బాగా ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, కొన్ని నాటు పూతమందులు వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ.
అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పువచ్చింది. ఈ మందుల కారణంగా రోగుల్లోనూ విశేషమైన మెరుగుదలకు అవకాశం చిక్కింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ సమస్యతో బాధపడేవారికి ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు.
కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్‌ఆర్‌డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్‌కి వాడేలాంటివనే అపోహ మరికొందరిలో ఉంది. దాంతో బాధల తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. అయితే రోగులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు.
బయోలజిక్స్ గురించి: పైన పేర్కొన్నట్లుగా సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్కీ›్లరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండలైటిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన చాలామంది రోగులు... ఆ తర్వాత తమ వ్యాధులు బాగా ముదరడం వల్ల వ్యాధితీవ్రత బాగా పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్‌సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వీటిని వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరిజు వేసుకొని, ఒక సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది.
డాక్టర్ విజయ ప్రసన్న పరిమి
సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్,
Comments
Please login to add a commentAdd a comment