Modern Medicine
-
ప్రసూతి సమస్యలకు ఆధునిక వైద్యం
తిరుపతి తుడా: మూడు రోజులుగా తిరుపతిలో ప్రసూతి, గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు ఆదివారంతో ముగిసింది. ఆధునిక విధానాలతో పాటు ప్రసూతి వైద్యంలో సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు. చివరి రోజు మొత్తం నాలుగు సెషన్లలో సదస్సు జరిగింది. గర్భిణుల్లో మూర్ఛ వ్యాధి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ సూచనలు చేశారు. ‘సేఫ్ మదర్, సేఫ్ బేబీ, సేఫ్ గైనకాలజిస్ట్‘ అనే అంశంపై డాక్టర్ పద్మజ మాట్లాడారు. ఈ ఏడాది ప్రసూతి, గైనకాలజీ సొసైటీ నినాదం కూడా అదే కావడం విశేషం. గర్భిణిల్లో థైరాయిడ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ కావ్య వివరించారు. ఇన్ ఫెర్టిలిటీలో ల్యాప్రోస్కోపీ పాత్రపై డాక్టర్ రామచంద్రయ్య ప్రసంగించారు. అనంతరం పీజీ వైద్య విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పేపర్ ప్రజెంటేషన్‌లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో తిరుపతి గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ భారతి, ఉపాధ్యక్షులు సునీత సుబ్రమణ్యం, ఆశాలత, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ లక్ష్మీ సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పార్ధసారధిరెడ్డి, శేషసాయి, సునీత, మాధవి, భవాని, శ్రీదేవి, పద్మావతి, రాధ, ఉమాదేవి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కీళ్లవాతానికి మంచి చికిత్స ఉందా?
నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా ఉండే బాధను భరించడం కంటే చనిపోవడం మేలన్నంత తీవ్రంగా నొప్పులు ఉంటున్నాయి. ఈ సమస్యకు ఏవైనా పరిష్కారాలు ఉంటే వివరంగా చెప్పండి. కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని కొందరు నిర్లక్ష్యం చేసి, వ్యాధిని బాగా ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, కొన్ని నాటు పూతమందులు వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పువచ్చింది. ఈ మందుల కారణంగా రోగుల్లోనూ విశేషమైన మెరుగుదలకు అవకాశం చిక్కింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ సమస్యతో బాధపడేవారికి ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్ఆర్డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్‌కి వాడేలాంటివనే అపోహ మరికొందరిలో ఉంది. దాంతో బాధల తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. అయితే రోగులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. బయోలజిక్స్ గురించి: పైన పేర్కొన్నట్లుగా సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్కీ›్లరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండలైటిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన చాలామంది రోగులు... ఆ తర్వాత తమ వ్యాధులు బాగా ముదరడం వల్ల వ్యాధితీవ్రత బాగా పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్‌సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వీటిని వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరిజు వేసుకొని, ఒక సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, -
మానసిక రోగానికి మందేది?
►పెద్దాసుపత్రిలో వైద్యుల కొరత ►ఆచార్యుల పోస్టులన్నీ ఖాళీ ►పీజీ సీట్లు లేక వెలవెల ►వైద్యుల నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కర్నూలు(హాస్పిటల్): మనోరోగానికి మందేలేదనేది పాత సామెత. కానీ ఎలాంటి మనోరోగానికైనా మందులున్నాయని ఆధునిక వైద్యం చెబుతోంది. ఈ మేరకు ఆధునిక సైకియాట్రిక్ వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలో రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ వైద్యం చాలా అభివృద్ధి చెంది ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ దీనికి విరుద్ధంగా ఇక్కడి పరిస్థితి నెలకొంది. మానసిక వైద్యానికి ఇక్కడ నిపుణులైన వైద్యులు ఒక్కరూ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మానసిక వైద్యవిద్యను పూర్తి చేసిన ఓ వైద్యునితో ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు. ఆసుపత్రిలోని మానసిక వైద్యవిభాగానికి ప్రతిరోజూ చికిత్స కోసం కొత్త రోగులు 60 మంది దాకా వస్తుండగా, పాత రోగులు వందకు పైగానే ఉంటున్నారు. నిత్యం 10 నుంచి 15 మంది ఈ విభాగంలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విభాగానికి ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరయ్యాయి. ఎనిదేళ్ల క్రితం ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్ డాక్టర్ ప్రమోద్‌కుమార్ బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన స్థానంలో డాక్టర్ విజయచందర్ కొంత కాలం పనిచేశారు. ఆయన కూడా నాలుగేళ్ల క్రితం బదిలీ అయ్యారు. ఆ తర్వాత డాక్టర్ రంజిత్‌కుమార్ బా«ధ్యతలు తీసుకున్నారు. ఆయన సైతం రెండేళ్ల క్రితం రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విభాగం నిపుణులైన వైద్యులు లేక ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇతర మెడికల్ కాలేజిలో మానసిక వైద్యవిభాగంలో పీజీ వైద్యవిద్యను పూర్తి చేసిన వచ్చిన డాక్టర్ రాజశేఖరరెడ్డి సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు జనరల్ మెడిసిన్ హెచ్‌వోడి డాక్టర్ నరసింహులును మానసిక వైద్య విభాగానికి కూడా ఇన్చార్జ్ హెచ్వోడీగా ఉంటున్నారు. భారత వైద్యవిదాన మండలి తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్‌లో పనిచేసే ఓ ప్రొఫెసర్ పేరును ఇక్కడ చూపిస్తూ మోసగిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పీజీ వైద్యవిద్యకూ దూరం 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు మానసిక వైద్యవిభాగానికి పీజీ సీట్లు లేవు. రాయలసీమ జిల్లాలకు తలమానికమైన ఈ ఆసుపత్రిలో ఎండీ సైకియాట్రి పీజీ కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు. పీజీ సీట్లు వస్తే ఇక్కడకు వచ్చే రోగులతో దీనిని ప్రత్యేక ఇన్సిట్యూట్గా మార్చేందుకు వీలుందని వైద్యులు చెబుతున్నారు. వార్డునూ పట్టించుకోని వైనం మానసిక వైద్య విభాగాన్ని సైతం ప్రభుత్వంతో పాటు అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వార్డులోని పడకలు పాతబడిపోయి, చిరిగిపోయి, గడ్డి తేలుతున్నా ఏ ఒక్కరూ దీని గురించి ఆలోచించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రోగులు ఉన్న పడకలపై మాత్రమే దుప్పట్లు వేస్తున్నారు. దీనికితోడు ఈ విభాగాన్ని సైతం సరిగ్గా శుభ్రం చేయడం లేదని రోగుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విభాగం చుట్టూ ముళ్లపొదలు, చెత్తాచెదారం పెరిగిపోవడంతో సాయంత్రం, రాత్రిళ్లు పాములు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు పాములు వార్డులోకే వస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నిత్యం పందులు ఇక్కడ తిరగడం, మురుగునీరు ప్రవహించడం వల్ల తీవ్ర దుర్గంధం నెలకొంటోంది. వైద్యులను నియమించాలని కోరుతూనే ఉన్నాం మానసిక వైద్య విభాగంలో వైద్యులను నియమించాలని కొంత కాలంలో రాష్ట్ర ఉన్నతాధికారులను కోరుతూనే ఉన్నాం. త్వరలోనే వైద్యులను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఒక సీనియర్ రెసిడెంట్‌తో పాటు మెడిసిన్ విభాగాధిపతిని ఇన్ఛార్జిగా నియమించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. –డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ వైద్యులకు ప్రైవేటుపైనే మక్కువ ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగం కంటే ప్రైవేటు మెడికల్ కాలేజిలలో సైకియాట్రిస్ట్‌లకు వేతనాలు అధికంగా ఇస్తున్నారు. దీంతో పాటు సైకియాట్రిస్ట్‌లకు ఇటీవల క్లినిక్‌లలో ప్రైవేటు ప్రాక్టీస్ బాగా పెరిగింది. ఈ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే జీతం సరిపోవడం లేదని చాలా మంది వైద్యులు ఇక్కడికి వచ్చి పనిచేసేందుకు ముందుకు రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇటీవల వైద్యులకు పదోన్నతులు ఇచ్చినా అధిక శాతం వైజాగ్ ఆసుపత్రికి బదిలీ చేసిందనే విమర్శలు ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఏ ఒక్కరినీ పంపించేందుకు అధికారులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యులను నియమించాలని రోగులు కోరుతున్నారు. -
ఆధునిక వైద్యంతో క్యాన్సర్‌కు చెక్
- కేఎంసీ ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్ - సిల్వర్ జూబ్లీ కాలేజీలో జాతీయ సెమినార్ కర్నూలు సిటీ: ప్రస్తుత సమాజంలో ప్రతి 100 మందిలో 3 నుంచి 10 మంది వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఇలాంటి వ్యాధిని ఆధునిక పద్ధతులతో కొంత మేరకు నయం చేయగలుగుతున్నామని కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాంప్రసాద్ అన్నారు. స్థానిక సిల్వర్ జూబీ డిగ్రీ కాలేజీలో వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో 'క్యాన్సర్ బయాలజీ' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ శుక్రవారం ప్రారంభమైంది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డా.అబ్దుల్ ఖాదర్ అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.రాంప్రసాద్, ప్రముఖ వక్తలుగా సీసీఎంబీ శాస్త్రవేత్త డా.శ్రీధర్ రావు, సెంటర్ ఫర్ డీఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ ప్రొఫెసర్ డా.మురళీధరన్ భాష్యం, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ బ్రహ్మానందం, డా.నరేష్ హాజరయ్యారు. కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారుతుండడం, చెడు వ్యసనాల వల్ల క్యాన్సర్ సోకుతోందన్నారు. లివర్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, మహిళల్లో గర్భాశాయ, బ్రిస్ట్ క్యాన్సర్లు వేధిస్తున్నాయన్నారు. ప్రతి వంద మందిలో 3 నుంచి 10 మంది వరకు వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. డాక్టర్.మురళీధర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జన్యువులో వచ్చే మార్పులు, క్యాన్సర్ కారణాలను వివరించారు. కణ జీవిత చక్రంపై మైటోకాండ్రియాలోని మార్పుల వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రొఫెసర్లు డా.బ్రహ్మానందం, డాక్టర్ నరేష్ తెలియజేశారు. అనంతరం పరిశోధన పత్రాల సంపుటిని, ఈ-సావనీర్‌ను ఆవిష్కరించారు. సెమినార్ కార్యవర్గ కార్యదర్శి డాక్టర్.జాన్సన్ సాటురస్, డాక్టర్.మైఖెల్ డేవిడ్, విజయ్‌కూమార్, వెంకటేశ్వరరావు, పార్వతి, సునీత, మాధురి, మాధవీలత, నాగరాజశెట్టి, వెంకటనర్సయ్య, ఉమాదేవి, లలితకూమారి, తదితరులు పాల్గొన్నారు. -
ఆ......రోజుల్లోనే!
‘హ్యాంగోవర్గా ఉంది’ అని మత్తు మత్తుగా అనగానే కుప్పలు తెప్పలుగా సలహాలు వచ్చిపడతాయి. ఆధునిక వైద్యం పుణ్యమా అని పరిష్కార మార్గాలు కూడా ఎన్నో దొరుకుతాయి. కానీ, 1,900ల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్‌లో హ్యాంగోవర్‌ను దించే పరిష్కారాలు లోకానికి తెలియజేశారు వైద్యులు. మందు ఎక్కువై శిరోభారానికి గురి కావడం, ఆకలిగా అనిపించకపోవడం, కళ్లు తిరగడం... మొదలైన సమస్యలకు పరిష్కార మార్గాలు, మందులకు సంబంధించి గ్రీకులో రాయబడిన ఆధారాలను కైరోలో కనుగొన్నారు. ‘‘హ్యాంగోవర్‌ను తగ్గించడానికి రకరకాల పరిష్కార మార్గాలు ఆరోజుల్లోనే కనుక్కోవడం ఆశ్చర్యం కలిగించే విషయం’’ అంటున్నాడు యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కు చెందిన చరిత్రకారుడు ప్రొఫెసర్ వివియన్ నటన్. వాడిపోయిన గులాబీలు, వాననీటితో కూడా హ్యాంగోవర్‌ను ఎలా తగ్గించవచ్చో వైద్యులు సూచించారు. -
ఆగని హాహాకారాలు !
సాక్షి, గుంటూరు : ఆధునిక వైద్యం, శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల అవగాహనారాహిత్యం, పౌష్టికాహారలోపం కలగలిపి మాతాశిశువుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు మాతాశిశు మరణాల రేటు తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంతాల దరి చేరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రులు ఉన్నా వైద్యులు లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తల చిత్తశుద్ధిలోపం తదితర కారణాల వల్ల గర్భిణులు, పుట్టినబిడ్డలకు సరైన వైద్యరక్షణ లభించడం లేదు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో గర్భిణులకు వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. పుట్టిన బిడ్డ ఆరోగ్యం గా ఎదగడానికి ప్రభుత్వం చేపట్టిన వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఆచరణలో సరిగ్గా అమలు కావడం లేదు. మాతాశిశు మరణాల సంఖ్య అధికంగా ఉందని, తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇటీవల విజయవాడలో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రక్తహీనత వల్లే అధిక మరణాలు.. నాలుగేళ్లుగా జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలను పరిశీలిస్తే ఎక్కువమంది మహిళలు రక్తహీనతతో ప్రసవ సమయంలో మృతి చెందుతున్నట్లు ప్రభుత్వ డెత్ఆడిట్లో నమోదైంది. వాస్తవానికి జిల్లాలో మాతాశిశు మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖకు మాత్రం ఆ సమాచారం అందడం లేదు. మాతాశిశు మరణాల వివరాలను వైద్య,ఆరోగ్యశాఖకు నివేదిస్తే, సవాలక్ష విచారణలను ఎదుర్కొనవలసి వస్తోందని, సంజాయిషీలు చెప్పుకోవాల్సి ఉందనే భయంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మృతుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. వాస్తవానికి ఈ సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు అందినప్పుడే అందుకు అనుగుణ ంగా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. మరణాలకు కారణాల్ని అన్వేషించి భవిష్య త్లో అటువంటివి తలెత్తకుండా జాగ్రత్త పడగలరు. క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రభుత్వ వైద్యసిబ్బంది చెప్పడం లేదనే కారణంతోనే ఆశ కార్యకర్తలను ఏర్పాటుచేసి సమాచారమిచ్చిన వారికి రూ. 50 చొప్పున పారితోషికం అందిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. మరణాలు ఇలా... 2005-06లో శిశుమరణాలు 1027, మాతృమరణాలు 49. 2009-10లో శిశుమరణాలు అత్యధికంగా 1,710, మాతృమరణాలు 49. 2010-11లో శిశుమరణాలు 1299, మాతృమరణాలు 61 నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 2013-14 సంవత్సరంలో 783 శిశు మరణాలు, 81 మాతృ మరణాలు జరగగా, 2014 డిసెంబర్ నెల వరకు 506 శిశు మరణాలు, 56 మాతృ మరణాలు నమోదయ్యాయి. అనధికారికంగా మృతుల సంఖ్య ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది. తూతూ మంత్రంగా సమీక్షలు.. మాతా శిశుమరణాల రేటును తగ్గించేందుకు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేకపోవడం గమనార్హం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడమనే సమస్యపై జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదు. జననీ సురక్షయోజన, అంగన్వాడీ పథకం ద్వారా పోషకాహారం అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఈ వైద్యుడు.. అటవీ సంరక్షకుడు
బళ్లారిలో ల్యాప్రోస్కోపిలో అత్యాధునిక వైద్యం అందిస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎస్కే అరుణ్ వన్యప్రాణులను, అటవీ సంరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు. దీంతో ఆయన పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనను బళ్లారి జిల్లా అటవీ, వన్యప్రాణుల సంరక్షుడిగా కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరంలోని సత్యనారాయణ పేటలో పాండురంగ నర్సింగ్ హోంను నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్కే అరుణ్ వారంలో రెండు రోజుల పాటు అడవుల్లో గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి అడవులు, గ్రామాల్లోని పొలాల్లో తిరుగుతూ మంచి మంచి ఫొటోలు తీయడం అలవాటుగా చేసుకున్నారు. దాదాపు రూ.10 లక్షలు విలువ చేసే కెమెరాను కొనుగోలు చేసుకుని.. ఆడవుల్లో సంచరిస్తూ పులులు, సింహాలు, అరుదైన పక్షుల ఫొటోలు తీస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే అరుణ్ సాక్షితో మాట్లాడుతూ.. సమాజంలో డబ్బులు సంపాదించడమే ప్రధానం కాదని, ఆరోగ్యంతో పాటు మనకు నిత్యం అవసరమవుతున్న నీరు, మంచిగాలిని ఎలా సంపాదించుకోవాలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. అడవులు ఉంటేనే వర్షాలు పడతాయని గుర్తు చేశారు. తుంగభద్ర, కావేరి నదులు నిండుతున్నాయంటే అందుకు కారణం డ్యాంల పైభాగాన ఉన్న విశాలమైన అడవులు, కొండలే కారణమన్నారు. - సాక్షి, బళ్లారి డాక్టర్ ఎస్కే అరుణ్ -
కీళ్ల వాతానికి ఆధునిక వైద్యం
తిరుపతి కార్పొరేషన్: ‘ఒక్కోసారి కీళ్లవాతం సమస్య ఏర్పడితే చక్కని నడకను కోల్పోవడం, ఇతర దీర్ఘకాలిక రోగాలు తలెత్తుతాయి. పైగా వారి దినచర్యలు దెబ్బతింటాయి. తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. అలాంటి వారికి రుమటాలజి కీళ్లవాతానికి అందించే ఆధునిక వైద్య విద్యావిధానంతో కీళ్లు, ఎముకల, కండరాల సమతుల్యం ద్వారా తిరిగి చక్కని నడక, ఆరోగ్యం కల్పించవచ్చు’ అని ప్రముఖ రుమటాలజి వైద్యులు డాక్టర్ పీ.దామోదరం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కీళ్లు, ఎముకలు, కండరాల సమస్యల నివారణకు చక్కటి నడక, రోజూ వ్యాయామం చేయడం వలన కఠినమైన వ్యాధులు దూరం చేయవచ్చని తెలిపారు. చిన్నవయసులో కీళ్లవాతం వస్తే అది వారి చదువుతో పాటు వివాహ సమస్యలు, తీవ్ర మానసిక ఒత్తిడి, కుటుంబ పరంగా పలు సమస్యలకు దారి తీస్తుందన్నారు. కీళ్లవాతంలో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అ న్నారు. ఇది ముఖ్యంగా నడివయస్సు కల్గిన స్త్రీలలో ఎక్కువగా వస్తుంటుం దని, జన్యువులు, హార్మోన్లు, ఇతర అంతుపట్టని కారణాలు ఈ వ్యాధికి కారణమన్నారు. దేశంలో రుమటాల జిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలావరకు కీళ్లవాత రోగులు సరైన వైద్య సేవలు పొందలేక పోతున్నారని అన్నారు. ప్రాథమిక దశలోనే కీళ్లవాతం గుర్తించడం శులభమన్నారు. చేతివేళ్లు, కీళ్లు లేక మోకాళ్ల కీళ్లు, నడుములు, పాదాలు వాయడం లేక నొప్పి, ఉదయం సమయంలో కీళ్లు బిగిసుకుపోవడం వంటి లక్షణా లు కనిపిస్తే తక్షణమే రుమటాలజి వై ద్యుడిని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆయన సూచిం చారు. ఇప్పటికే రాయలసీమలోనే మొదటిగా తిరుపతిలో శుభోదయ రుమటాలజి సెంటర్‌ను ఏర్పాటు చే సి, ఎన్నో జఠిలమైన కీళ్ల సమస్యలు, అరుదైన కీళ్ల వాత జబ్బులను నయం చేస్తున్నామని గుర్తుచేశారు. సెంటర్ ఏర్పాటు చేసి ఈ ఆదివారం నాటికి రెండు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. వందలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించినట్టు తెలి పారు. వ్యాధ్రిగస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పట్టణాలకే పరిమితమైన అత్యాధునిక వైద్యం
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజమండ్రి, న్యూస్‌లైన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ సదస్సు శుక్రవారం రాజమండ్రిలోని చెరుకూరి కల్యాణ మండపంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ స్వలింగ సంపర్కుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గేలకు మద్దతు లభించిందని, అదే కోల్‌కతాలో ఒక వైద్యుడిపై ఒక రోగి వేసిన కేసులో రూ.7 కోట్లు చెల్లించాల్సి వస్తే ప్రజల నుంచి మద్దతు లభించలేదని చెప్పారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ అత్యాధునిక వైద్యం కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైందన్నారు. నిష్ణాతులైన వైద్యులున్నా సౌకర్యాలులేక గ్రామాల్లో పూర్తిస్థాయి వైద్యం అందించలేకపోతున్నారన్నారు. వైద్య విధానాల్లో వస్తున్న మార్పులపై పలువురు వైద్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, జీఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు
=చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు =ఆప్నా రాష్ట్ర సదస్సులో డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం, న్యూస్‌లైన్ : అత్యాధునిక వైద్యం ధనవంతులకే అందుతోంది.. చిన్న ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం హన్మకొండ పద్మాక్షి కాలనీలోని జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో నిర్వహించిన 21వ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (ఆప్నా) రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ ఉద్యమంలో, రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు సామాజిక దృక్పథంతో సేవలందించినపుడే వైద్య వృత్తిపై ప్రజల్లో గౌరం పెరుగుతుందని చెప్పారు. ఇక్కడికి వచ్చే మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఓపీ విభాగంలో 10 శాతం మేర ఉచితంగా సేవలందించాలని సూచిం చారు. ప్రభుత్వ పరంగా నర్సింగ్ హోమ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. చారిత్మ్రాకమైన వరంగల్ నగరం లో మొట్టమొదటి సారిగా ఆప్నా రాష్ర్ట స్థాయి సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతకుముం దు ఆప్నా సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం భవిష్యత్‌లో చిన్న ఆస్పత్రుల సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన కార్యచరణతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్‌పై చర్చించి పలు నిర్ణయా లు తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో సవరణలు అవసరం : నర్సింగరెడ్డి, ఆప్నా రాష్ర్ట అధ్యక్షుడు ఆరోగ్యశ్రీ పథకం కార్పొరేట్ ఆస్పత్రులకు వరంగా మారిం దని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా చిన్న చిన్న ఆస్పత్రులకు ఒరిగిందేమీ లేదన్నారు. నిబంధనలు కార్పొరేట్ ఆస్పత్రులకు వర్తించే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని కోరారు. 20 నుంచి 50 పడకల ఆస్పత్రికి కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేసినప్పుడే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులను పట్టణాలకే పరిమితం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చికిత్స పొందేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏడు సంవత్సరాల నుంచి అమల వుతున్న ఈ పథకంలోని విధానాల ద్వారా చిన్న ఆస్పత్రులు పెద్ద ఎత్తున మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి : రవీందర్‌రెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు మారుమూల ప్రాంతాల ప్రజలతోపాటు పేదలకు అందుబాటులో ఉంటున్న చిన్న చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్‌కు ఆరో గ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసినపుడే ప్రజలకు లబ్ధిచేకూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చయ్యే వైద్యానికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి ప్రభుత్వం రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నా రు. నర్సింగ్ హోమ్‌ల అనుమతి విషయంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందని, వాటిని తొలగించి సహకరించాలని కోరారు. వైద్యులు సేవాభావంతో మెలగాలి : ప్రొఫెసర్ సీతారామరాజు, జయ హాస్పిటల్ అడ్వయిజర్ ప్రభుత్వ వైద్యులతోపాటు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ వైద్యు లు పేద ప్రజలకు సేవా భావంతో మెరుగైనా వైద్యం అందించాలని సూచించారు. వైద్య వృత్తి అన్ని వృత్తుల్లోకెల్ల గొప్ప ది.. దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. వైద్య వృత్తిని కొంత మంది వ్యాపారంగా మారస్తున్నారని అలాం టి విధానాన్ని మానుకుంటే వారిని ప్రజలు దేవుళ్లుగా భావి స్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తరువాత అసోసియేషన్ ప్రత్యేక కమిటీని ఎన్నుకుని చిన్న ఆస్పత్రుల తో మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైనా వైద్యం అం దించాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యు డు ఎం.రమేశ్‌రెడ్డి, ఆప్నా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, వైద్యులు కాంతారెడ్డి, కృష్ణారావు, శ్రీనివాసమూర్తి, కె.అశోక్‌రెడ్డి, కె.రమేశ్‌రెడ్డి, ఇ.రవీందర్‌రెడ్డి, ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంధ్యరాణి, కొత్తగట్టు శ్రీనివాస్, విజయ్‌చందర్‌రెడ్డి, కంకణాల మల్లేశం, బందెల మోహన్‌రావు, కాళీప్రసాద్, మోహన్‌దాస్, కె.ప్రమీల, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రోగి మానసిక స్థితి అర్థం చేసుకోవాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ఆధునిక వైద్యరంగంలో వైద్యులు,రోగుల మధ్య అవగాహన పెంపొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంగళూరుకు చెందిన జయదేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ సెంటర్(జేఐసీఎస్ఆర్) డెరైక్టర్ డాక్టర్ సీఎన్ మంజునాథ్ అభిప్రాయపడ్డారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆరో కార్డియాలజీ చైర్ గోల్డ్‌మెడల్ ఓరేషన్ సదస్సుకు డాక్టర్ మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్యూట్ రుమాటిక్ ఫీవర్, మైట్రల్ స్టెనోసిస్ అండ్ బెలూన్ వాల్వ్ ప్లాస్టీ విధానంపై వైద్యులు మరింత అవగాహన పెంచుకోవాలని కోరారు. అదే క్రమంలో వైద్యులు రోగి జబ్బు గురించే కాకుండా వారి మానసిక స్థితిని కూడా అర్థం చేసుకుని వైద్యం అందించాలన్నారు. అనంతరం స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ మాట్లాడుతూ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ నిర్వహించే ఇలాంటి సదస్సులకు నిష్ణాతులైన నిపుణులను పిలిపించి, వారి అనుభవాలను వైద్యులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్డియాలజీలో పలు అంశాలపై నిపుణులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం ద్వారా వైద్యుల్లో తలెత్తే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ వనజ, రిజిస్ట్రార్ డాక్టర్ ఆంజనేయులు, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ యర్రమరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం డాక్టర్ మంజునాథ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహక దాత డాక్టర్ శ్యామలా శాస్త్రి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీ.సత్యనారాయణ, ఆర్ఎంవో డాక్టర్ వెంకట కోటిరెడ్డి, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శివకుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోబాకు భూపాల్ పాల్గొన్నారు.