ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి తుడా: మూడు రోజులుగా తిరుపతిలో ప్రసూతి, గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు ఆదివారంతో ముగిసింది. ఆధునిక విధానాలతో పాటు ప్రసూతి వైద్యంలో సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు. చివరి రోజు మొత్తం నాలుగు సెషన్లలో సదస్సు జరిగింది. గర్భిణుల్లో మూర్ఛ వ్యాధి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ సూచనలు చేశారు. ‘సేఫ్ మదర్, సేఫ్ బేబీ, సేఫ్ గైనకాలజిస్ట్‘ అనే అంశంపై డాక్టర్ పద్మజ మాట్లాడారు.
ఈ ఏడాది ప్రసూతి, గైనకాలజీ సొసైటీ నినాదం కూడా అదే కావడం విశేషం. గర్భిణిల్లో థైరాయిడ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ కావ్య వివరించారు. ఇన్ ఫెర్టిలిటీలో ల్యాప్రోస్కోపీ పాత్రపై డాక్టర్ రామచంద్రయ్య ప్రసంగించారు. అనంతరం పీజీ వైద్య విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
పేపర్ ప్రజెంటేషన్‌లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో తిరుపతి గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ భారతి, ఉపాధ్యక్షులు సునీత సుబ్రమణ్యం, ఆశాలత, ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ లక్ష్మీ సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పార్ధసారధిరెడ్డి, శేషసాయి, సునీత, మాధవి, భవాని, శ్రీదేవి, పద్మావతి, రాధ, ఉమాదేవి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment