మానసిక రోగానికి మందేది? | Mandedi mental illness? | Sakshi
Sakshi News home page

మానసిక రోగానికి మందేది?

Published Thu, Sep 7 2017 4:41 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

మానసిక రోగానికి మందేది?

మానసిక రోగానికి మందేది?

పెద్దాసుపత్రిలో వైద్యుల కొరత
ఆచార్యుల పోస్టులన్నీ ఖాళీ
పీజీ సీట్లు లేక వెలవెల
వైద్యుల నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం


కర్నూలు(హాస్పిటల్‌): మనోరోగానికి మందేలేదనేది పాత సామెత. కానీ ఎలాంటి మనోరోగానికైనా మందులున్నాయని ఆధునిక వైద్యం చెబుతోంది. ఈ మేరకు ఆధునిక సైకియాట్రిక్‌ వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలో రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ వైద్యం చాలా అభివృద్ధి చెంది ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ దీనికి విరుద్ధంగా ఇక్కడి పరిస్థితి నెలకొంది. మానసిక వైద్యానికి ఇక్కడ నిపుణులైన వైద్యులు ఒక్కరూ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మానసిక వైద్యవిద్యను పూర్తి చేసిన ఓ వైద్యునితో ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు. 

ఆసుపత్రిలోని మానసిక వైద్యవిభాగానికి ప్రతిరోజూ చికిత్స కోసం కొత్త రోగులు 60 మంది దాకా వస్తుండగా, పాత రోగులు వందకు పైగానే ఉంటున్నారు. నిత్యం 10 నుంచి 15 మంది ఈ విభాగంలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విభాగానికి ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. ఎనిదేళ్ల క్రితం ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన స్థానంలో డాక్టర్‌ విజయచందర్‌ కొంత కాలం పనిచేశారు. ఆయన కూడా నాలుగేళ్ల క్రితం బదిలీ అయ్యారు. ఆ తర్వాత డాక్టర్‌ రంజిత్‌కుమార్‌ బా«ధ్యతలు తీసుకున్నారు. ఆయన సైతం రెండేళ్ల క్రితం రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విభాగం నిపుణులైన వైద్యులు లేక ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇతర మెడికల్‌ కాలేజిలో మానసిక వైద్యవిభాగంలో పీజీ వైద్యవిద్యను పూర్తి చేసిన వచ్చిన డాక్టర్‌ రాజశేఖరరెడ్డి సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడి డాక్టర్‌ నరసింహులును మానసిక వైద్య విభాగానికి కూడా ఇన్‌చార్జ్‌ హెచ్‌వోడీగా ఉంటున్నారు. భారత వైద్యవిదాన మండలి తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్‌లో పనిచేసే ఓ ప్రొఫెసర్‌ పేరును ఇక్కడ చూపిస్తూ మోసగిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  

పీజీ వైద్యవిద్యకూ దూరం
60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు మానసిక వైద్యవిభాగానికి పీజీ సీట్లు లేవు. రాయలసీమ జిల్లాలకు తలమానికమైన ఈ ఆసుపత్రిలో ఎండీ సైకియాట్రి పీజీ కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు. పీజీ సీట్లు వస్తే ఇక్కడకు వచ్చే రోగులతో దీనిని ప్రత్యేక ఇన్సిట్యూట్‌గా మార్చేందుకు వీలుందని వైద్యులు చెబుతున్నారు.  

వార్డునూ పట్టించుకోని వైనం
మానసిక వైద్య విభాగాన్ని సైతం ప్రభుత్వంతో పాటు అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వార్డులోని పడకలు పాతబడిపోయి, చిరిగిపోయి, గడ్డి తేలుతున్నా ఏ ఒక్కరూ దీని గురించి ఆలోచించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రోగులు ఉన్న పడకలపై మాత్రమే దుప్పట్లు వేస్తున్నారు. దీనికితోడు ఈ విభాగాన్ని సైతం సరిగ్గా శుభ్రం చేయడం లేదని రోగుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విభాగం చుట్టూ ముళ్లపొదలు, చెత్తాచెదారం పెరిగిపోవడంతో సాయంత్రం, రాత్రిళ్లు పాములు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు పాములు వార్డులోకే వస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నిత్యం పందులు ఇక్కడ తిరగడం, మురుగునీరు ప్రవహించడం వల్ల తీవ్ర దుర్గంధం నెలకొంటోంది.  

వైద్యులను నియమించాలని కోరుతూనే ఉన్నాం
మానసిక వైద్య విభాగంలో వైద్యులను నియమించాలని కొంత కాలంలో రాష్ట్ర ఉన్నతాధికారులను కోరుతూనే ఉన్నాం. త్వరలోనే వైద్యులను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఒక సీనియర్‌ రెసిడెంట్‌తో పాటు మెడిసిన్‌ విభాగాధిపతిని ఇన్‌ఛార్జిగా నియమించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.  
–డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, కర్నూలు మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌

వైద్యులకు ప్రైవేటుపైనే మక్కువ
ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగం కంటే ప్రైవేటు మెడికల్‌ కాలేజిలలో సైకియాట్రిస్ట్‌లకు వేతనాలు అధికంగా ఇస్తున్నారు. దీంతో పాటు సైకియాట్రిస్ట్‌లకు ఇటీవల క్లినిక్‌లలో ప్రైవేటు ప్రాక్టీస్‌ బాగా పెరిగింది. ఈ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే జీతం సరిపోవడం లేదని చాలా మంది వైద్యులు ఇక్కడికి వచ్చి పనిచేసేందుకు ముందుకు రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇటీవల వైద్యులకు పదోన్నతులు ఇచ్చినా అధిక శాతం వైజాగ్‌ ఆసుపత్రికి బదిలీ చేసిందనే విమర్శలు ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఏ ఒక్కరినీ పంపించేందుకు అధికారులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యులను నియమించాలని రోగులు కోరుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement