
హెచ్‌ఐవి లేదా ఎయిడ్స్ వచ్చినవారిని సమాజం దూరం పెడుతుంది. వారికి అన్నం పెట్టడానికి కూడా ముందుకు రావడానికి సాహసించరు. ఇందుకు విరుద్ధంగా ‘మీల్స్ ఆన్ వీల్స్’ పేరుతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారికి అమెరికాలోని ‘ఇండియానా’ రాష్ట్రంలోని ఓ సంస్థ కడుపు నిండా అన్నం పెడుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మంచి ప్రయత్నానికి ‘ర్యాన్స్ మీల్ ఫర్ లైఫ్’ గా గుర్తింపు వచ్చింది. ఈ కార్యక్రమానికి ‘ర్యాన్స్ మీల్’ అనే పేరు పెట్టడానికి వెనుక ఒక చిన్న కారణం ఉంది. కొన్నేళ్ల కిందట కొకొమోకు చెందిన ‘ర్యాన్ వైట్’ అనే 18 సంవత్సరాల యువకుడు హెచ్‌ఐవి కారణంగా మరణించాడు. తన 13 సంవత్సరాల వయసులో కలుషిత రక్తం ద్వారా ఆ బాలుడిలోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఐదు సంవత్సరాలు వ్యాధితో పోరాడి కన్నుమూశాడు. అందువల్ల ఈ సత్కార్యానికి అతడి పేరు పెట్టారు. అదే సంవత్సరం అక్టోబరు మాసంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ‘రాష్ట్ర రాజధాని ఇండియానాపొలిస్‌లో రోజుకి 250 మందికి భోజనం అందిస్తూ, వారానికి 2500 మందికి అందించే స్థాయికి ఎదిగాం’ అని చెబుతారు ‘మీల్స్ ఆన్ వీల్స్’ ప్రాజెక్టు మేనేజర్ నిక్ ఫెన్నింగ్.
‘ఇండియానాలో సుమారు 12,000 మంది హెచ్‌ఐవితో బాధపడుతున్నారు. అందులో సగం కంటె ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు’ అని చెబుతారు నిక్. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆహారం ఇవ్వడమే కాకుండా, వారికి కావలసిన ఆరోగ్య సదుపాయాలు చూస్తారు. ‘ఒంటరితనంతో బాధపడుతున్న వారు, వయసు పైబడినవారు ఎంతోమందికి మేం అన్నం పెట్టగలుగుతున్నాం’ అంటూ సంబరంగా చెబుతారు నిక్. ‘‘ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రబలిన ఎయిడ్స్ కారణంగా కొందరు వారి జీవితభాగస్వాములను కోల్పోయి, ఒంటరివారయ్యారు. వారంతా నలుగురితో కలవాలని, వారి బాధను నలుగురితో పంచుకోవాలని ఆశిస్తున్నారు’’ అంటున్నారు నిక్. ‘మీల్స్ ఆన్ వీల్స్’ కేవలం హెచ్‌ఐవి బాధితులకు మాత్రమే కాకుండా, దివ్యాంగులకు, పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులకు కూడా కడుపు నింపుతున్నారు. చాలా దేశాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న హెచ్‌ఐవీ బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమం జరిగితే చాలా బాగుంటుందని సామాజిక సేవకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment