పొడుపు పద్యాలు | riddle storys for summer special | Sakshi
Sakshi News home page

పొడుపు పద్యాలు

Published Fri, May 6 2016 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

riddle storys for summer special

తెలుగు పద్యాల్లో టంగ్ ట్విస్టర్లే కాదు, చమత్కారభరితమైన పొడుపు కథలూ ఉన్నాయి. బుర్రకు పదును పెట్టే చమత్కారానికి మచ్చుగా కొన్ని పద్యాలు...

ఇంటికిని వింటికిని ప్రాణమేది చెపుమ
కంట మింటను మనమేమి కాంచగలము?
నవ్వు పువ్వు దేనిని గూడి పొలుపుగాంచు
ఒకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు

ఇంటికి ప్రాణం ఏది? వింటికి ప్రాణం ఏది? అనే రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటి పాదంలో. రెండింటికీ ఒకటే సమాధానం- నారి. ఇంటికి ప్రాణం ఇల్లాలు (నారి), విల్లుకు ఆధారం అల్లెతాడు (నారి).

కంటిలో దేనిని చూస్తాం? మింటిలో (ఆకాశంలో) దేనిని చూస్తాం? అనే రెండు ప్రశ్నలు రెండో పాదంలో ఉన్నాయి. ఈ రెండింటికీ ఒకటే సమాధానం-తారలు. తారలు అంటే నక్షత్రాలనే అర్థంతో పాటు కనుపాపలనే అర్థం కూడా ఉంది.

నవ్వు దేనితో కలిసి మనోహరంగా ఉంటుంది? పువ్వు దేనితో కలిసి మనోహరంగా ఉంటుంది? అనే రెండు ప్రశ్నలు మూడో పాదంలో ఉన్నాయి. సమాధానం ఒక్కటే-వలపు. వలపు పండినప్పుడే నవ్వులూ పువ్వులూ రాణిస్తాయని కవిహృదయం.

ఒడల నిండ కన్నులుండు నింద్రుడు కాడు
కంఠమందు నలుపు! కాడు శివుడు!
ఫణుల బట్టి చంపు పక్షీంద్రుడా? కాదు
దీని భావమేమి తెలిసికొనుడు

ఒళ్లంతా కళ్లుంటాయి గాని ఇంద్రుడు కాడట. మెడ నల్లగా ఉంటుంది గాని శివుడు కాడట. పాములను పట్టి చంపగలిగినా గరుత్మంతుడు కూడా కాడట. ఇదీ పొడుపు కథ. దీనికి సమాధానం ఏమిటంటారా? నెమలి.

కరయుగంబు గలదు చరణంబులా లేవు
కడుపు, నడుము, వీపు, మెడయు గలవు
శిరము లేదు గాని నరుల బట్టుక మ్రింగి
సొగసు గూర్చు దీని సొగసు గనుడి

చేతులు ఉన్నాయి కాని కాళ్లు లేవు. కడుపు, నడుము, వీపు, మెడ ఉన్నాయి. తల లేదు. ఇలాంటిది ఏకంగా మనిషిని మింగేసి, సొగసునిస్తుందట?  ఇదేమిటంటారా? చొక్కా.

వండగ నెండిన దొక్కటి
వండక మరి పచ్చిదొకటి వడికాలినదిన్
తిండికి రుచియై యుండును
ఖండితముగ దీని దెల్పు కవియుం గలడే!

వంటలో ఉడికించగా ఎండినది (కాచు), వండకుండా పచ్చిగా ఉన్నది (తమలపాకు), బాగా కాలినది (సున్నం). ఈ మూడు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అదేమిటో అర్థమైంది కదా! ఆకు, వక్క, సున్నం, కాచు కలిపి చుట్టిన కిళ్లీ తింటే రుచిగా ఉండదూ మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement