పద్య నాటకం.. పౌరాణిక పరిమళం
పద్య నాటకం.. పౌరాణిక పరిమళం
Published Sat, Jan 28 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
- అలరించిన నంది నాటకోత్సవాలు
కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు పురాణ గాథలకు అద్దం పట్టాయి. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జనతా సేవా సమితి ఆధ్వర్యంలో ‘అన్నమాచార్య’ నాటకం ప్రదర్శించారు. నందవర వైదిక బ్రాహ్మణ వంశంలో జన్మించిన అన్నమాచార్యులు వెంకటేశ్వరస్వామి భక్తుడిగా మారడం.. ఆయనపై వేలాది కీర్తనలు పాడడం.. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు అనేక అష్టకష్టాలు ఎదుర్కోవడం.. కాళ్వ నరసింహరాయుడు అనే రాజు అన్నమయ్యను ఆస్థాన గాయకుడుగా నియమించడం..తదితర ఘట్టాలు ప్రేక్షకులను అలరింపజేశాయి. అన్నమయ్య..వెంకటేశ్వరస్వామిని చేరి ఆయనలో ఐక్యవడంతో నాటకం ముగుస్తుది. వరకవుల నరహరి రాజు.. రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపిన సతీసావిత్రి...
అనంతపురం లలిత కళాపరిషత్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సతీసావిత్రి పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భర్త ప్రాణాలను కాపాడుకోవడంలో సతీసావిత్రి చూపిన చొరవ, అంకితభావాన్ని ఈ నాటకంలో చక్కగా ప్రదర్శించారు. రాజకుమారి అయిన సావిత్రి సత్యవంతుణ్ణి ప్రేమించి వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది. అయితే సత్యవంతుడికి వివాహ అనంతరం ప్రాణగండముందని నారదుడు తెలియజేస్తాడు. అయినా సత్యవంతుడినే వివాహమాడతానని సావిత్రి భీష్మించుకుంటుంది. తన ప్రేమను నిరూపించుకున్న సావిత్రికి ఆమె తల్లిదండ్రులు సత్యవంతుడికిచ్చి వివాహం చేస్తారు. వివాహం తర్వాత సావిత్రి, సత్యవంతుడు అడవికి వెళ్లి కట్టెలు కొడుతుంటారు. కట్టెలు కొడుతూ కింద పడిపోయిన సత్యవంతుని ప్రాణాలను యమధర్మరాజు తీసుకెళ్తుంటాడు. తన భర్త ప్రాణాలను తిరిగి ఇవ్వమని వెంటపడిన సావిత్రి వాగులు, వంకలు, అరణ్యాలు దాటి ఇహలోకాన్ని చేరుతుంది. సావిత్రి పాతివ్రత్యాన్ని గ్రహించిన యముడు సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. భార్యాభర్తల మధ్య అమితమైన అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచిన సావిత్రి కథను ఈ నాటకం అత్యంత హృద్యంగా చిత్రించింది.
ఆకట్టుకున్న కృష్ణా నదీ చరిత్ర...
తిరుపతి వెంకటపద్మావతి నాట్యమండలి వారు ప్రదర్శించిన కృష్ణానదీ చరిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. భూలోకంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆకాశవాణి.. ఇంద్రుని వద్దకు వెళ్లి ప్రజల కష్టాలను తీర్చమని వేడుకుంటుంది. ఇంద్రుడు విష్ణుమూర్తిని వేడుకుని కృష్ణవేణిని ఉద్భవింపజేస్తాడు. విష్ణుమూర్తి కృష్ణవేణిని నదీ ప్రవాహినిగా ప్రవహింపజేస్తూ ఆమెకు తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మను కోరతాడు. సహ్యముని తపస్సు చేసి పర్వత ప్రాంతమే కృష్ణవేణికి తగిన ప్రాంతమని సూచిస్తాడు. విష్ణుమూర్తి.. కృష్ణవేణిని పర్వత ప్రాంతానికి పంపించగా సహ్యముని రావి చెట్టుగా మారి కృష్ణవేణిని నదిగా ప్రవహింపజేస్తాడు. వి.ఎస్.భరద్వాజ్ రచన, దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ పద్య నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
స్నేహభావానికి ప్రతిబింబంగా నిలిచిన కుచేలోపాఖ్యానం...
కళామయి సాంస్కృతిక సంస్థ(రంగారెడ్డి జిల్లా) కళాకారులు ప్రదర్శించిన కుచేలో పాఖ్యానం పద్యనాటకం కృష్ణ, కుచేలుర స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. సాందీపుడు అనే గురువు వద్ద ఆశ్రమ పాఠశాలలో సుధాముడు, శ్రీకృష్ణుడు విద్యను అభ్యసిస్తారు. విద్యను అభ్యసించే క్రమంలో వారిద్దరి మధ్య తరగని స్నేహం ఏర్పడుతుంది. పేద బ్రాహ్మణుడు. తొడుక్కోవడానికి సరిౖయెన దుస్తులు కూడా లేని దుస్థితిలో ఉన్న సుధాముడిని అందరూ కుచేలుడు అని అవహేళన చేస్తుంటారు. అదే అతని పేరుగా ప్రాచుర్యంలోకి వస్తుంది. విద్యాభ్యాసం అనంతరం కృష్ణుడు ద్వారకకు వెళ్లిపోగా కుచేలుడు పౌరహిత్యం చేసుకుంటూ జీవిస్తుంటాడు. వివాహ అనంతరం చాలీచాలని జీతం చూసిన అతని భార్య కృష్ణుని వద్దకు వెళ్లిరమ్మని సలహా ఇస్తుంది.
కృష్ణుడిని వెతుక్కుంటూ అరణ్యాలకు వెళ్లిన కుచేలుడిని చూసిన కృష్ణుడు గరుత్మంతుడితో ద్వారకకు తరలిస్తాడు. ద్వారకలో ద్వారపాలకులు కుచేలుడిని అడ్డగిస్తారు. అయితే కృష్ణుడు ప్రత్యక్షంగా కుచేలుడిని చూసి లోపలికి తీసుకెళ్లి సింహాసనంపై కూర్చుండబెట్టి కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగిస్తాడు. కుచేలునికి తగిన సత్కారము చేస్తాడు. నిజమైన స్నేహానికి పేద, ధనిక అనే భేదభావములు ఉండవు అని తెలియజెప్పిన భారత గాథను ఈ నాటకం చక్కగా వివరించింది. ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలను అమరలింగ శర్మ నిర్వహించారు.
నేటి నాటక ప్రదర్శనలు...
ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మార్కండేయ విజయం పద్యనాటకం, సాయంత్రం 4 గంటలకు స్వామి అయ్యప్ప పద్యనాటకం, సాయంత్రం 7 మైరావన పద్యనాటక ప్రదర్శనలు ఉంటాయని లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement