బీఏ సుబ్బారావు దర్శక నిర్మాణంలో యస్వీరంగారావు, కాంతారావు, బాలయ్య... ముఖ్య పాత్రలు పోషించిన ఒక పౌరాణిక చిత్రంలోని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘మహాత్మా...తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది. అపూర్వ మహిమా శోభితులైన తమ దర్శనభాగ్యంతో నా జన్మచరితార్థం అయింది’’ ఆనందడోలికల్లో ఊగిపోతూ అన్నాడు బలిచక్రవర్తి.‘‘తామెవ్వరు? నివాసస్థానం ఏది?’’ అని అడిగాడు బలిచక్రవర్తి తన ఎదురుగా ఉన్న వటుడిని.‘‘బలిరాజా! తానెవరో తెలసి తెలియజెప్పేవాడు పరమాత్ముడు ఒక్కడే. ఇక నివాసమందువా...ఈ విశాల విశ్వమంతయూ నా ఆవాసమే. సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు’’ మార్మికభాషలో తన గురించి చెప్పాడు వటుడు.‘‘వటుడా! బాలుడవైనా పరమార్థజ్ఞానపూర్వకమైన నీ సంభాషణతో నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వల్ల తమకు కాగల కార్యం ఏమిటి?’’ అని వినయంగా అడిగాడు బలిచక్రవర్తి.‘‘మహారాజా! బ్రహ్మచారులకు, తాపసులకు లోకకళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యసాధనకు నిన్ను యాచించడానికి వచ్చాను’’ అన్నాడు వటుడు.‘‘స్వామి! ఈ యాగదీక్షా సాక్షిగా ఆజ్ఞాపించండి...మీ కామితం ఏదైనా నెరవేరుస్తాను’’ ఆనందంగా అన్నాడు బలిచక్రవర్తి.‘‘నాయనా బలిచక్రవర్తి! తొందరపడకు... ఈ వటువు దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన’’ అంటూ బలిచక్రవర్తిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు ఆయన పక్కనే ఉన్న ఆచార్యులవారు. అయినప్పటికీ...‘‘ఆచార్యా! ఆ మహావిష్ణువు మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా’’ అన్నాడు బలిచక్రవర్తి.పరిస్థితిని గ్రహించిన వటువు...‘‘నా రాక మీ గురువర్యులకు కంటకప్రాయమైనట్లున్నది. నా వలన మీకే భేదాభిప్రాయాలు రాకుండా ఉండుగాక... అనుమతి అయినచో వెళ్లివస్తాను’’ అని అన్నాడో లేదో బలిచక్రవర్తి ఆందోళన పడ్డాడు.‘‘నా చెంతకు వచ్చి మీరు రిక్తహస్తాలతో పోవడం యాగసంకల్పానికే కళంకం! నాపై కరుణించి తమ ఈప్సితార్థం ఏమిటో సెలవియ్యండి’’ అని వటువును అడిగాడు.‘‘మహారాజా! ఏకాకి బ్రహ్మచారిని. నాకంటూ కావల్సింది ఏమీలేదు. నీకంత కోరిక ఉంటే మూడు అడుగుల నేల దానం ఇవ్వు’’ అని బలిచక్రవర్తిని కోరాడు వడుగు.‘‘మహాత్మా! ఇదేమి హాస్యం. దాత ఘనతనైనా గుర్తించవద్దా! మేరుపర్వతం దగ్గరకు వెళ్లి తృణఘనం కోరుకుంటారా?’’ ఆశ్చర్యపోయాడు బలిచక్రవర్తి.‘‘ముష్ఠి మూడు అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా...మరేదైనా అడగండి. కాంచనాలా? సిరులా? చింతామణిపీఠమా? ఇంతెందుకు ఈ త్రిభువనాధిపత్యమే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కూడా అన్నాడు.
‘‘చక్రవర్తి! యాచకులకు పేరాశ ఉండకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండం అవుతుంది. నీకిష్టమైతే నా కోరిక తీర్చు’’ అని చల్లగా అడిగాడు వటుడు.‘‘ఇష్టమా! ఇంత చిన్నకోరిక కష్టమా!! ఆవశ్యం నెరవేర్చుతా’’ వటుడి కోరిక తీర్చడానికి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి.మళ్లీ రంగంలోకి దిగారు ఆచార్యులవారు.‘‘బలిచక్రవర్తీ...తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవవంశ వైభవానికి అగ్నిపరీక్ష అని మాత్రం గుర్తుంచుకో. ఇతడు దనుజకులాన్నే దగ్ధపటలం చేయడానికి వచ్చాడు. నా మాట విని ఇతడిని తిరస్కరించు. ఆత్మహాని కోరితెచ్చుకుంటావా నాయనా!’’’ అన్నారు ఆచార్యులవారు.‘‘గురుదేవా! ఈ రాజ్యవైభవములు, అధికార ప్రాభవములు దానధర్మముల కన్నా మిన్న కాదు. ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం న్యాయమేనా’’ అంటూ వటుడు అడిగినవాటిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి.‘బ్రహ్మార్పణమస్తు’‘‘బలిచక్రవర్తి! ఇంకో అడుగు?’’ అడిగాడు వటుడు.‘‘ఇదిగో ప్రభు...నా శిరస్సు...దీనిపై మోపండి’’ అని తలవంచాడు బలిచక్రవర్తి.
‘‘శుక్రాచార్యులవారు! శిష్యబృందంతో ఆనందకోలాహలంగా ఉన్నారు, ఏదో విశేషం ఉండకపోదూ’’ అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన నారదుడు. ‘‘ఉన్నది. ఈనాడు మా దానవజాతికి పర్వదినం. ఇంతకాలం తమకు ఎదురులేదని విర్రవీగిన ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం నారదా’’ కసిగా అన్నారు శుక్రాచార్యులవారు.శుక్రాచార్యులవారి మాట విని ‘నారాయణ నారాయణ’ అన్నాడు నారదుడు.‘‘శివ శివా! మా ఆశ్రమప్రాంతంలో అన్యస్మరణ అపచారం నారదా! ఎన్నిసార్లు మందలించినా నీ పెడబుద్ధి మానవా’’ కోపంగా అన్నారు శుక్రాచార్యులు. ఆయన చేతుల్లో శిశువు కనిపిస్తుంది.‘‘నా బుద్ధికేంగానీ, ఈ బుద్ధి నీకెప్పటి నుంచి! పూజాపునస్కారాలు మాని సంసార ఝంజాటనంలో పడినట్లువు. పుత్రుడా. పుత్రికా?’’ శుక్రాచార్యుల వారి చేతుల్లో ఉన్న శిశువును చూస్తూ అడిగాడు నారదుడు.‘‘మాపై అనుగ్రహించి, మా కష్టాలను తొలగించడానికి మహేశ్వరుడు ఒసంగిన వరప్రసాదం ఈ చిరంజీవి. మహత్తర దానవ మహాసామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ జరగబోతుంది. నారదా! సురపక్షపాతి విష్ణువుకుతంత్రాలకు త్వరలోనే తగిన శాస్తి లభిసుం్తది’’ కళ్లనిండా సంతోషంతో అన్నారు శుక్రాచార్యులు.‘‘అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించడానికి ఈ ప్రయత్నమన్నమాట’’ అన్నాడు నారదుడు.‘‘అవును’’‘‘అంతా నీ వెర్రి. సిద్ధాంతచర్చల్లో శివకేశవుల వాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు. నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదు.’’ అన్నాడు నారదుడు.‘‘చాలించు నారదా! ఆశ్రితపక్షపాతి అయిన ఆ దామోదరుడికి, భక్తజనసులభుడైన పరమేశ్వరుడికి సామ్యమా! నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకు ఆరాధ్యుడు. ఆ విష్ణువు, జిష్ణువు అతని పాదధూళికి సరిరారు’’ శుక్రాచార్యుల వారి గొంతులో నుంచి ఆగ్రహజ్వాలలు.‘‘ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవ జాతిని అడుగంట చేసింది. అయిననూ నాకెందుకు. కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావల్సింది లోకళ్యాణమే’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు నారదుడు.
Comments
Please login to add a commentAdd a comment