మహబూబ్‌నగర్: తనకు ఎదురు తిరగడమేగాక కులంలో తక్కువ చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని కర్రతో చితకబాది అంతమొందించిన నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రమేశ్‌బాబు వెల్లడించారు. బాదేపల్లి పాతబజార్‌కు చెందిన మీనుగ బాలయ్య(30) నిందితుడు మీనుగ బాలస్వామి వరుసకు సోదరులు. అయితే బాలయ్య కొంతకాలంగా కోళ్లను దొంగిలించి అమ్ముకుని మద్యం తాగేవాడు.
దీంతో కోళ్ల యజమానులు మీనుగ బాలస్వామికి ఫిర్యాదు చేయడంతో పలుమార్లు తమ్ముడిని మందలించాడు. అయినా దొంగతనం మానకపోవడంతోపాటు తన కోళ్లను సైతం దొంగిలించాడు. తన కోళ్లను ఎందుకు దొంగిలించావని, కోళ్ల దొంగతనం ఆపాలని హెచ్చరించగా ఎదురుతిరిగాడు. తనకు బాహాటంగా ఎదురుతిరగడంతో కులంలో పెద్దరికంగా వ్యవహరిస్తున్న తన పలుకుబడికి విలువ లేకుండా పోతుందని, బాలస్వామి బాలయ్యను అంతమొందిస్తే కులంలో తనకు అందరూ భయపడతారని భావించాడు.
ఈ నెల 14న రాత్రి తన గుడిసె వద్దకు వచ్చిన బాలయ్యతో గొడవపడి కర్రతో తీవ్రంగా చితకబాదాడు. గాయపడిన బాలయ్య తన ఇంటికి వెళ్లి మరుసటిరోజు మృతిచెందాడు. బాలయ్యను తాను కొట్టిన విషయం ఎవరికీ చెప్పవద్దని అతని భార్య మీనుగ నాగలక్ష్మిని సైతం బెదిరించాడు. దీంతో నాగలక్ష్మి పోలీసులకు తన భర్త అనారోగ్యంతో మృతిచెందాడని తెలిపింది. అయితే డాక్టర్లు పోస్టుమార్టం సమయంలో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడగా.. బాలయ్య భార్యతో ఫిర్యాదు తీసుకుని హత్య కేసుగా నమోదు చేశారు.
తనపై హత్య కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితుడు బాలస్వామి గురువారం మధ్యవర్తి ద్వారా నేరం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుడు గతంలో నాగసాల వద్ద జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన కర్రను స్వాధీనపర్చుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు చంద్రమోహన్, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment