పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా హిందూపురాన్ని పట్టించుకోని బాలయ్య
సినిమా షూటింగులతో బిజీ
అప్పుడప్పుడూ కనిపిస్తూ వెంటనే మాయం
ఎన్నికలు రావడంతో నేడు ఎంట్రీ
ఆయన కుటుంబం మొత్తం ఇక్కడే మకాం
ప్రజలపై లేని ప్రేమ ఒలకపోస్తూ మళ్లీ కుచ్చుటోపీ పెట్టే యత్నం
నమ్మని జనం.. గుణపాఠం చెప్పేందుకు సిద్ధం!
ఉంటే సినిమా షూటింగులో.. అది లేదంటే హైదరాబాద్‌లో ఉంటారాయన. తనను నమ్మి గెలిపించిన ప్రజలు అప్పుడప్పుడూ ఆయనకు గుర్తొస్తుంటారు. అలా యాదికొచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి చుట్టపుచూపుగా వస్తుంటారు. స్థానికుల అవస్థలు పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోతుంటారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో నియోజకవర్గంలో వాలిపోయారు. వెంటే కుటుంబ సభ్యులను తెచ్చుకున్నారు. ప్రచారం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వారంతా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయకుండానే కాలక్షేపం చేసి.. నేడు మరోసారి గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మళ్లీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు యత్నిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పదేళ్లుగా హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడూ పట్టుమని పదిరోజులు కూడా స్థానికంగా ఉన్న దాఖలాలు లేవు. ఓవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ‘గడప గడపకూ’ అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తుంటే.. బాలయ్య మాత్రం నిత్యం షూటింగులతో బిజీగా ఉండేవారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో ‘పురం’పై వాలిపోయారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర, కూతురు బ్రాహ్మణి ఇలా మొత్తం హిందూపురం చేరారు.
పీఏలదే పెత్తనం
బాలకృష్ణ లేకపోవడంతో ఆయన పీఏలే పెత్తనం చెలాయించేవారు. అధికారం మాటున యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు. తమ నాయకుడికే పట్టనప్పుడు తమకేం సంబంధం అన్నట్లు ప్రజలకు అంటీముట్టనట్లు వ్యవహరించేవారు. ఒక వైపు అప్పుడప్పుడు వచ్చి పోయే ఎమ్మెల్యే, మరో వైపు తమ వ్యాపకాల్లో మునిగితేలే ఆయన పీఏలు.. ఇలా ఎవరికి వారు బిజీబిజీగా ఉండే నేపథ్యంలో స్థానిక ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విసిగి పోయారు.
బావ బాటలో బామ్మర్ది..
తన సొంత బావ చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధికి ఒక్క పునాది రాయి కూడా బాలకృష్ణ వేయలేదు. కానీ, నేడు బావ కుటిల సూత్రాలు పాటించేందుకు సిద్ధమయ్యారు. 2014లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక సంతలో పశువులను కొన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగా.. ఆయనను ఆదర్శంగా తీసుకున్న బాలయ్య నేడు ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోరేటు నిర్ణయించి తమ వైపు తిప్పుకున్నారు.
వ్యతిరేకతను గ్రహించి ప్రలోభాలు..
గత పదేళ్లూ బాలకృష్ణ నిర్లక్ష్యపు తీరుతో విసిగిపోయిన స్థానికులు ఈ ఎన్నికల్లో మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకే సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన బాలకృష్ణ ప్రలోభాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఇప్పటికే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కొన్న ఆయన.. అంతటితో ఆగక ప్రజలకు చీరలు, డబ్బు పంచడం తదితర అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
తామెందుకు ఎమ్మెల్యేలు కాకూడదు!
బాలకృష్ణ వైఖరిపై అక్కడి ప్రజలే కాదు... టీడీపీ నాయకులు కూడా విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ నందమూరి కుటుంబాన్ని ఆదరించింది చాలు.. వారిని ఇలాగే గెలిపిస్తూ వెళితే తమకు అవకాశం రాదు అన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ టీడీపీ నేతతో పాటు ఆ పార్టీకే చెందిన మరో ముఖ్యనాయకుడు కిందిస్థాయి కార్యకర్తల వద్ద ఈ విషయంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిని ఆదరిస్తున్నాం కదా అని అలుసైపోయాం, ఒక్కసారి ఓడిస్తే వాళ్లు వేరే నియోజకవర్గం చూసుకుంటారు అంటూ మాట్లాడుకున్నట్లు ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ నాయకుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment