
సృష్టిలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసినా, ఒక నిర్మాణం కనిపించినా విశ్వకర్మ సృష్టి అంటుంటాం. వేదవిదులు ఆయనను సకల జగత్ సృష్టికర్త అంటారు. పౌరాణికులు మాత్రం సకల లోకాలనూ నిర్మించే దేవశిల్పి అంటారు. ఋగ్వేదంలో సృష్టి సూక్తాలు పేరిట కనిపించే నాలుగు సూక్తాలలో విశ్వకర్మ సూక్తం ఒకటి. ఈ సూక్తమే ఆయనను సకలలోక అధిష్ఠాత అని పిలిచింది. వేదదేవతలలో ఒకడిగా పరిగణించబడిన ఈ స్వామి పురాణాలలో పంచముఖుడిగా దర్శనమిస్తాడు. ఆయన ఐదుముఖాల నుండి ఐదుగురు మహర్షులు ఆవిర్భవించారు. వారే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞలు. ఈ ఐదుగురికి ఐదు రకాలైన శిల్పకార్యాలను ఉపదేశించి సృష్టిని వృద్ధి చేయమని ఆదేశించాడు. విశ్వకర్మ శిల్పాలు, ఆలయాలు దేశమంతా ఉన్నా అక్కడక్కడా అరుదైన విగ్రహాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వెలసిన లేపాక్షి ఆలయంలో నిలుచున్న భంగిమలో ఉన్న విశ్వకర్మ శిల్పం స్తంభంపై చెక్కి ఉంది.
ఐదు ముఖాలతో, పది చేతులతో దర్శనమిస్తాడు విశ్వకర్మ. నిజహస్తాలలో అభయ–వరదముద్రలతో, పరహస్తాలలో శంఖం, చక్రం, విల్లు, బాణం, త్రిశూలం, డమరుకం, టంకం (సుత్తి), నాగం దర్శన మిస్తాడు. కాగా కేరళ రాష్ట్రంలోని కాన్యంగాడులో పరశివ విశ్వకర్మ ఆలయం అతి పురాతనమైనది. విశ్వకర్మ దర్శనంతో సకల బంధనాలనుండీ విడివడతారనీ, ఈయన వా(క్ప)చస్పతి కనుక విద్య చక్కటి విద్య, సకలైశ్వర్యాలు కలుగుతాయని, ఇహంలో సుఖం, పరంలో మోక్షం లభిస్తాయని పురాణ వచనం.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment