మొబైల్స్‌తో కేన్సర్ ముప్పు!
కొత్త పరిశోధన
మన దేశంలో టాయిలెట్ల కంటే మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మొబైల్స్ ద్వారా వెలువడే రేడియేషన్ కారణంగా ముప్పు తప్పదనే హెచ్చరికలు, అబ్బెబ్బే.. అలాంటివేం పట్టించుకోనక్కర్లేదంటూ మొబైల్ కంపెనీల ప్రచారాలు కూడా తెలిసినవే. అయితే, మొబైల్ ఫోన్లను అతిగా వాడితే కేన్సర్ ముప్పు తప్పదని ఉక్రెయిన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ ఫోన్ల ద్వారా వెలువడే రేడియేషన్ వల్ల శరీరంలో అసమతుల్యతలు ఏర్పడతాయని, ఫలితంగా పార్కిన్సన్స్, అల్జిమర్స్ వంటి వ్యాధులే కాకుండా, కేన్సర్ సోకే అవకాశాలూ ఉన్నాయని ఉక్రెయిన్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ పరిశోధకుడు డాక్టర్ ఇగర్ యాక్మెన్కో చెబుతున్నారు. మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని, దానివల్ల తలెత్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా మనుషుల్లో డీఎన్‌ఏ దెబ్బతింటుందని ఆయన వివరిస్తున్నారు. రోజుకు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సేపు వరుసగా ఐదేళ్లు మొబైల్ వాడినట్లయితే, ఇలాంటి అనర్థాలను ఎదుర్కోక తప్పదని తమ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు.