
కూల్‌డ్రింక్స్‌తో డయాబెటిస్ ముప్పు
కొత్త పరిశోధన
వేడి వాతావరణంలో చల్లచల్లగా తీపితీపిగా దాహార్తిని చల్లార్చే కూల్‌డ్రింక్స్‌ను పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడతారు. అయితే, తరచు కూల్‌డ్రింక్స్ తాగేవారికి డయాబెటిస్ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కనీసం ఒక కూల్‌డ్రింక్ అయినా తాగే అలవాటు ఉన్న వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువగా ఉంటాయని తమ అధ్యయనంలో తేలినట్లు కేంబ్రిడ్జి వర్సిటీ నిపుణులు చెబుతున్నారు.
కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు కారణంగానే బ్రిటన్‌లో ప్రతిఏటా కొత్తగా 8 వేలకు పైగా డయాబెటిస్ కేసులు నమోదవుతున్నాయని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 32,500 మందిపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా తరచుగా కూల్‌డ్రింక్స్ తాగేవారు డయాబెటిస్‌కు లోనవుతున్నారనే నిర్ధారణకు వచ్చామని చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌లో మోతాదుకు మించి చక్కెర ఉండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.