రూ. 3 లక్షల కోట్లు | Rs. 3 lakh crore | Sakshi
Sakshi News home page

రూ. 3 లక్షల కోట్లు

Published Fri, Feb 28 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

రూ. 3 లక్షల కోట్లు

రూ. 3 లక్షల కోట్లు

బెట్టింగ్ ద్వారా ఏటా భారత్‌లో చేతులు మారుతున్న మొత్తం

‘కొన్ని దశాబ్దాలుగా బెట్టింగ్ స్పోర్ట్స్‌లో భాగమైపోయింది. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, .. వీటిని పూర్తిగా నిరోధించలేం.. బెట్టింగ్‌కు ఆంక్షలతో కూడిన చట్టబద్ధత కల్పించడం ఒక్కటే దీనికి పరిష్కారం.’ ఇదీ బెట్టింగ్‌పై జస్టిస్ ముకుల్ ముద్గల్ అభిప్రాయం.. ఐపీఎల్‌లో అవినీతిపై ఆయన ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో బెట్టింగ్‌కు చట్టబద్ధత తీసుకురావాలని సూచించారు. అయితే బెట్టింగ్‌కు చట్టబద్ధత అవసరమా ? ఇది సాధ్యమా కాదా ? అనే సంగతి కాసేపు పక్కన పెడితే కోట్ల రూపాయల సక్రమ, అక్రమ ధనం మాత్రం చేతులు మారుతోంది.
 
రూ. 3,00,000 కోట్లు... అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు... రెండు, మూడు పెద్ద రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌కు ఈ మొత్తం సమానం. అయితే ఇంత పెద్ద మొత్తం భారత్‌లో కేవలం బెట్టింగ్ ద్వారా చేతులు మారుతోంది... ఆశ్చర్యంగా అనిపించినా, నమ్మలేకపోయినా... ఇది నిజం. పోలీసులు బుకీలపై, బెట్టింగ్ రాయుళ్లపై ఎంతగా నిఘా పెట్టినా దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌చేసినా, బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ షరా మామూలే.

ఐపీఎల్ ద్వారా ఎక్కువ
 
టి20 క్రికెట్ మరీ ముఖ్యంగా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చినప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్ చేస్తున్నారు. ఇది ఆందోళనకర పరిణామం. గత సీజన్ ఐపీఎల్‌లో సుమారు రూ.40 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగినట్లు అంచనా. ప్రతి ఏటా ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ 25 శాతం వరకూ పెరుగుతోంది.
 
బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పిస్తే...?
 
ఇండియాలో బెట్టింగ్‌కు చట్టబద్ధత లేదు కానీ.. ఇంగ్లండ్ లాంటి కొన్ని పాశ్చాత్య దేశాల్లో బెట్టింగ్ లీగలే. మన దగ్గర కూడా లీగల్ చేయాలనే డిమాండ్ అడపాదడపా వినిపిస్తోంది. ‘బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం పన్నుల రూపంలో కేంద్రానికి వస్తుంది. ఏడాదికి మూడు లక్షలకు పైగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్ చట్టబద్ధత ద్వారా ప్రభుత్వానికి యేటా రూ. 1,00,000 కోట్లు (లక్ష కోట్ల రూపాయలు) పన్ను రూపంలో వస్తుంది. ఇలా ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రం క్రీడాభివృద్ధికో లేదంటే సంక్షేమ పథకాలకో వినియోగించవచ్చు’  పలువురు మాజీ క్రికెటర్లు తరచూ చేస్తున్న సూచన ఇది. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర క్రీడా శాఖకు ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా వచ్చే లాభాలను వివరించినట్లు సమాచారం.
 
మరింత పెరిగే అవకాశం
 
ఒకవేళ బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే... ఇందులో పందేల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బెట్టింగ్ నేరం కాబట్టి... చాటుగా భయపడుతూ పందేలు కాస్తున్నారు. అదే లీగల్ అయితే ఈ మొత్తం రెండు మూడు రెట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతానికైతే బెట్టింగ్‌కు చట్టబద్దత కల్పించే అవకాశాలు చాలా తక్కువే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement