
ఆ లెక్కన అతడే ఆదికవి!
గ్రంథం చెక్క
ఫారసీలో రూద్కీ తొలుతటికవి. అతనికి ముందు కవితా రచన చేసిన వాళ్లు లేరని కాదు.
కాని, అంతటి శ్రేష్ఠమైన కవిత అల్లిన వాళ్ళు తమ కవితనంతటిని సంకలనం చేసుకున్నవాళ్లు లేరు. ఆ లెక్కన అతడే ఆదికవి అని అందరూ అంగీకరించారు.
రూద్కీ పుట్టంధుడు. భాషా సాహిత్యాల్లోనే కాక బహుశాస్త్రాల్లో పండితుడు. సరస మధుర కవిత, కమ్మని గాత్రం, చతుర వచోవైఖరి, సమయస్ఫూర్తిలాంటి స్వాభావిక గుణాల వలన సారస్వత పోషకులైన సామానీ ప్రభువుల ఆస్థానంలో శతాధికసంఖ్యలో గల కవులకు సరదారు కాగలిగాడు.
ఆ ప్రభువుల అనుగ్రహం వలన అతడనుభవించిన వైభవాన్ని ఆ తరువాతి కవులు అసూయ వ్యక్తమయ్యే పదజాలంతో ప్రస్తావించారు. అతని సవారీ ఎక్కడికి కదిలినా రెండు వందలమంది బంగారు పట్టాల బానిసలుండేవారట వెంట. అతని వస్తు సామగ్రిని మోయడానికి నాలుగు వందల ఒంటెలట! తన నూరేళ్ల జీవితంలో ఆ మహాకవి వ్రాసిన కవితలు అన్నీయిన్నీ కాదట. పదమూడు తడవలు లెక్కిస్తే పద్యపంక్తుల సంఖ్య లక్షదాక వచ్చిందట!
ఇంకా జాగ్రత్తగా లెక్కిస్తే ఎక్కువే కావచ్చునంటాడు రషీద్.
‘అట’ అని ఎందుకంటున్నానంటే కవుల చరిత్రలో కనబడు పంక్తులు తప్ప ఆ మహాకవి కవిత మనదాకా మిగులలేదు.
రూద్కీ కవితాశక్తి ఎంతటి తాసీర్ కలదో అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నవాడు కనుక సుల్తాన్ సామానీ అతని చేత పనికిమాలిన ప్రశంస కావ్యాలు వ్రాయించే కంటే ప్రబంధరచన చేయిస్తే మంచిదనుకున్నాడు. నలభై వేల దిరహాలు బహూకరించి ‘కలీల వదమ్నా’ అనే కావ్యాన్ని అరబీ లోంచి ఫారసీకి అనువదింపజేశాడు.
- డా. ఎస్.సదాశివ ‘ఫారసీ కవుల ప్రసక్తి’ నుంచి...