బెయిల్‌పై విడుదలైన ఇంజినీర్‌ రషీద్.. మోదీపై పోరాటం | Engineer Rashid walks out of jail vows to fight Modi Naya Kashmir narrative' | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై విడుదలైన ఇంజినీర్‌ రషీద్.. మోదీపై పోరాటం

Published Wed, Sep 11 2024 8:37 PM | Last Updated on Wed, Sep 11 2024 8:40 PM

Engineer Rashid walks out of jail vows to fight Modi Naya Kashmir narrative'

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్‌ బుధవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.  ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ కోర్టు రషీద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. త్వరలో జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్‌ 2 వరకు బెయిల్‌ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు జైలు నుంచి బయటకు వచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..  ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కట్టు కథకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశారు. తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ‘అయిదున్నర సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత.. నన్ను నేను బలంగా భావిస్తున్నాను. అలాగే నా నియోజకవర్గ ప్రజల గురించి గర్వపడుతున్నాను.

నా ప్రజలను ఎప్పుడూ నిరాశపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్‌లో ఘోరంగా విఫలమైన మోదీ 'నయా కాశ్మీర్' కథనంపై పోరాడతాను. ఆగస్ట్ 5, 2019న ఆయన ఏం  చేసినా (ఆర్టికల్‌ 370 రద్దు) ప్రజలు తిరస్కరించారు’ అని రషీద్‌ పేర్కొన్నారు.

మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినదాని కన్నా తన పోరాటం పెద్దదని రషీద్‌ తెలిపారు. ‘ఆయన (ఒమర్‌ అబ్దుల్లా) పోరాటం కుర్చీ కోసం. నా పోరాటం ప్రజల కోసమని అన్నారు. బీజేపీ తనపై అణచివేత వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. తాను బీజేపీ బాధితుడినని,  చివరి శ్వాస వరకు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు.

కాగా 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఆయనను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. 2019 నుంచి రషీద్‌ జైలులోనే ఉన్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన రషీద్‌.. ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఎంపీగా గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement