
ఓ వారం హాలిడేస్!
మొన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు హాలిడేస్ వచ్చేశాయ్! హీరో సాయిధరమ్ తేజ్ (తేజు)కి కూడా దర్శకుడు బీవీయస్ రవి వారం రోజులు హాలిడేస్ ఇచ్చారు. తేజూ ఏం ఎగ్జామ్స్ రాశాడనుకుంటున్నారా? ‘జవాన్’ క్వార్టర్లీ ఎగ్జామ్స్. దర్శకుడి టీచింగ్స్, హీరో ఎగ్జామ్స్.
అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? తేజు, మెహరీన్ కౌర్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సినిమా ఓ స్కూల్ అనుకుంటే... దర్శకుడు టీచర్, నటీనటులు స్టూడెంట్సే కదా! శనివారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ (క్వార్టర్లీ ఎగ్జామ్స్) పూర్తయింది.
ఫిల్మ్ నగర్‌లో ‘జవాన్’ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో 20 శాతం టాకీ పార్టు చేశారు. ఈ స్కూల్‌కి పక్క ఊరి నుంచి ఓ స్టూడెంట్ వస్తున్నాడండోయ్. అతడే ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నకుమార్. ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నారాయన. వారం రోజుల తర్వాత ‘జవాన్’ స్కూల్ (సెకండ్ షెడ్యూల్) ఓపెన్ చేస్తారు. ఈ చిత్రానికి కెమెరా: గుహన్, సంగీతం: తమన్.