గింజగింజకు గిట్టుబాటు | sakshi chit chat with malleshwari | Sakshi
Sakshi News home page

గింజగింజకు గిట్టుబాటు

Published Mon, Jan 19 2015 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

గింజగింజకు గిట్టుబాటు

గింజగింజకు గిట్టుబాటు

ఇది మల్లేశ్వరి కృషి ఫలితం
‘నేనొక్కదాన్నే ఏం చేయగలను?’ అని మల్లేశ్వరి అనుకుని ఉంటే ఇప్పుడా ఊరికి ధాన్యం కొనుగోలు కేంద్రమే వచ్చి ఉండేది కాదు. ‘ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు లేదే...’ అని బాధపడుతూ దళారులు చెప్పిన ధరకే ధాన్యం అప్పగిస్తుంటే నేటికీ ఆమె వంటి జీవితాలు ఎదుగుబొదుగులేకుండా ఉండేవేమో. కానీ మల్లేశ్వరి తాను పడుతున్న కష్టానికి ప్రతిఫలం రావాలని, తనతో పాటు అందరికి ప్రయోజనం కలగాలని పట్టుబట్టి తమ గ్రామంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం) కేంద్రాన్ని ఏర్పాటు చేయించుకుంది.

పెద్దగా చదువు లేకపోయినా, సామాజిక స్పృహతో ఇంతటి మార్పునకు కీలకభూమిక పోషించిన ఉప్పులేటి మల్లేశ్వరిని దళారులతో తలపడి, సొంత ఊళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించుకునేలా ప్రేరేపించిన పరిస్థితులేమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
 
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఆకెనపల్లి గ్రామం మాది. ఉన్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాళ్లం. వ్యవసాయం లేనప్పుడు నేను కూలిపనులకు, నా భర్త లారీ డ్రైవర్ పనికి వెళ్లేవాళ్లం. అయితే ఏడాదంతా మేము కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోయేసరికి ఒక్కోసారి ఏడుపొచ్చేది. దళారులు, షావుకార్లు ఎంత రేటు చెబితే అంతే ఉండేది. క్వింటాల్‌కు 450 లేక 500 రూపాయలు ఇచ్చేవాళ్లు. శ్రమకు తగ్గ ఫలితం రాకపోయేది. ఒకసారి తెగించి ధాన్యం బస్తాలను గోదావరిఖనిలో ఉన్న రైస్‌మిల్లుకు తీసుకెళ్ళిన. అక్కడ క్వింటాల్‌కు 700 ఇచ్చిండ్రు. అప్పుడర్థమైంది... మధ్య దళారులు మమ్ములను ముంచుతున్నరని.

ఏం చేయాలని బాగా ఆలోచించిన. 2006లో నా భర్త డ్రైవర్‌గా జగిత్యాల సమీపంలోని కొడిమ్యాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రని తెలుసుకున్నడు. వెంటనే ఆ కేంద్రాన్ని చూసినం. ఇలాంటి కేంద్రాన్నే నేనెందుకు నడపకూడదని అనుకుని ఎవరికీ తెలవకుండా అప్పటి మా ప్రాంత ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు దరఖాస్తు చేసుకున్న. ఆయన కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం నడుపుడు కష్టమైతదన్నడు.

పంట కోసం కష్టపడుతున్నం...కనీసం గిట్టుబాటు ధర లేకపోతే ఎలా అని ఆయననే ప్రశ్నించిన. మంచి ఆలోచన అంటూ ఆయన ప్రోత్సహించి కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చిండు. ఆనాడు 13 మహిళా స్వశక్తి సంఘాలకు చెందిన 140 మంది సభ్యులు కలిసి సంతోషిమాత గ్రామైక్య సంఘాన్ని స్థాపించాము. నేడు 22 సంఘాలతో 230 మంది మహిళలతో ఖరీఫ్, రబీ సీజన్‌లో ధాన్యాన్ని మా కేంద్రం కొనుగోలు చేస్తోంది.
 
ఇక్కడ మహిళలే హమాలీలు
ఆకెనపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రంలో పురుషులే హమాలీలుగా ఉండేవారు. వారు అప్పుడప్పుడు రేట్ల విషయంలో తమ జులుంను ప్రదర్శించేవారు. ఇలాగైతే బాగాలేదని భావించి 2010 సంవత్సరం తర్వాత గ్రామైక్య సమావేశం నిర్వహించి సంఘాలలో పేద మహిళలను హమాలీలుగా చేర్చుకునేందుకు నిర్ణయించాము. మొత్తం 44 మంది మహిళలు ముందుకు రాగా వారిని మూడు బ్యాచ్‌లుగా విభజించి ధాన్యాన్ని సంచులలో నింపడం నుంచి లారీలోకి బస్తాలను ఎక్కించే వరకు వివిధ పనులు చేయిస్తున్నాం.

మహిళలు కావడంతో ఒక్క బస్తాలో 40 కిలోలే నింపుతున్నాం. ఇందుకుగాను ఒక్కొక్కరికి రోజుకు ప్రభుత్వం నుంచి క్వింటాల్‌కు 10 రైతు నుంచి 13 రూపాయల చెల్లింపు జరుగుతోంది. అలాగే సంఘాలలో చదువుకున్న మరో ఐదుగురు మహిళలకు కేంద్రం నడిచినన్ని రోజులు రోజుకు 200 చొప్పున చెల్లిస్తూ వారితో కేంద్రం పుస్తకాల నిర్వహణ, రైతుల పాస్‌పుస్తకాల సేకరణ, నెంబర్ల కేటాయింపు, తేమ శాతం లెక్కింపు తదితర పనులు చేయిస్తున్నాం.
 
కమీషన్ డబ్బులతో ఆదా
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తే గతంలో దానిని ఎప్పటికప్పుడు పంచుకునేవాళ్ళం. దీనివల్ల సంఘానికి పెద్దగా డబ్బు జమ అయినట్టు కనిపించేది కాదు. కానీ 2012 నుంచి కమీషన్ డబ్బులను జమచేయడం మొదలుపెట్టాం. గడిచిన ఈ రెండేళ్ళలో సుమారు 6 లక్షల వరకు జమ చేసి సంఘంలోని సభ్యురాళ్ళు ఎవరికైనా అవసరముంటే వారికి తక్కువ వడ్డీకి అందజేస్తున్నాము.
 
ఎంతో మార్పు వచ్చింది
2006 సంవత్సరానికి పూర్వం, ఆ తర్వాత మా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కొనుగోలు కేంద్రం ద్వారా ఎంతో మార్పు వచ్చింది. ఆ రోజుల్లో పంట కోసం తెచ్చిన అప్పుల బాధకు దళారులకు ఎంతకో అంత రేటుకు ధాన్యం అమ్మేవాళ్ళం. ధాన్యం తడిగా ఉంటే తక్కువ డబ్బులు ఇచ్చి మరింత నష్టపరిచేవారు. కానీ నేడు ధాన్యం ఏ రకంగా ఉన్నా సన్న బియ్యానికి క్వింటాల్‌కు 1400, దొడ్డు రకానికి 1360 చెల్లిస్తున్నాం. ఇప్పుడు రైతులందరు చాలా సంతోషంగా ఉన్నారు.
 - పందిళ్ళ శ్యాంసుందర్, సాక్షి, గోదావరిఖని

కెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సభ్యురాళ్లు ఆర్ధికంగా ఎదగడమే కాక తమ పిల్లల చదువులకు కూడా ఆసరాగా ఉంటున్నారు.

 - మల్లేశ్వరి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement