
ఒంటరిగా జీవన పోరాటం చేస్తున్న ఆ యువతిని ఆదుకోడానికి ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రెహానాకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు సాక్షి పాఠకులు కనుమూరు హరిచంద్రారెడ్డి. ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష అందజేసి, స్నేహితుల ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. మంచంలో ఉన్న భర్తకు తల్లిగా సపర్యలు చేస్తూ, కాలం చేసిన మామకు.. తనే కొడుకై తల కొరివి పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించింది రెహానా.
ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులను, బంధువులను వదిలేసి వచ్చి మతాంతర వివాహం చేసుకున్న యువతి ఆమె. భర్త అనారోగ్యంతో శల్య స్థితిలో మంచంలో ఉన్నాడు. మామ మరణించడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అయిన వారెవరూ ముందుకు రాలేదు. దీంతో రెహానానే హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానం వరకూ వెళ్లి అక్కడ, ఆ ధర్మం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించింది. దీనిపై సాక్షి ‘ఫ్యామిలీ’ అక్టోబర్ 24న ‘అంతిమ సంస్కారం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనాన్ని చూసి పాఠకులు కొందరు స్పందించారు. వారిలో ఒకరు గూడూరు తూర్పువీధి ప్రాంతానికి చెందిన కనుమూరు హరిచంద్రారెడ్డి. ‘‘ఈ కథనం నా మనసును కదలించింది’’ అంటూ రెహానా సంస్కారాన్ని ఆయన అభినందించారు. ఆమె భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మంచంలోనే ఉన్నాడని చెప్పడంతో అతనికి అవసరమైన సహాయం చేస్తామనీ, రెహానాను తమ ట్రస్ట్ ద్వారా మరింత ఆదుకునే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.
శ్రీనివాసులు స్నేహితుడైన శ్రీనాథ్ కూడా స్పందించి ‘హెల్ప్ టు శ్రీను’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, అందులో అతని స్నేహితుల నంబర్లను అనుసంధానం చేశారు. దీంతో అతని మిత్రులైన ఎస్వీ సుధాకర్ రూ.20 వేలు, ఉమాశంకర్‌రాజు, బిల్డర్ చంద్రతో పాటు మరికొందరు కలిసి రూ.1,05,000 శ్రీనివాసులు అకౌంట్‌లో జమ చేశారు.
– సాక్షి ప్రతినిధి, గూడూరు
Comments
Please login to add a commentAdd a comment