పగిలిన గతం
అందం ఒక అద్దాల మేడ అయితే...
గత జన్మలో విసిరిన రాయి
ఈ అద్దాల మేడను పగలగొడితే...
మనసు ముక్కలవుతుంది.
పొగిలిన మనసు...
పగలిన అద్దం.. మళ్లీ అతుక్కుంటాయా?
‘‘హరిణీ నాన్నగారు చూడు నీకోసం ఏం తెచ్చారో..’’ సంబరంగా చెప్పింది కాత్యాయని కూతురుతో. పడుకుని ఉన్న హరిణి లేచి తల్లి వంక చూసింది. తల్లి చేతిలో కొత్త చీర.. ‘‘డాడీ ఆఫీసు పనిమీద ఊరెళ్లారు కదరా! అక్కడ నుంచి మనకోసం బట్టలు తెచ్చారు. లేచి ఈ చీరకట్టుకొని తయారవ్వు. అలా బయటకు వెళ్దాం..’’ కూతురుని హుషారుపరుస్తూ ఆమె చేతిలో చీరపెట్టి తనూ రెడీ అవడానికి వెళ్లింది కాత్యాయని.భళ్లుమని ఏదో గ్లాస్ పగిలిన శబ్దం రావడంతో పరిగెత్తుకు వచ్చింది కంగారుగా! ‘‘హరిణీ ఏంటే నువ్వు చేసిన పని. బంగారం లాంటి అద్దం పగలగొట్టావ్’’ కంగారుగా అడిగింది కాత్యాయని. ‘‘ఈ మొహం చూడు, అద్దంలో ఎలా ఉందో’’ ఏడుస్తూ మంచమ్మీద కూలబడింది హరిణి. కూతురు ప్రవర్తనకి ఏం చేయాలో అర్థంకాలేదామెకు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, అమ్మాయి నల్లగా ఉందంటూ పెళ్లి వారు కారణం చూపుతున్నారు. హరిణి చామనఛాయే కానీ కళగా ఉంటుంది. ఏడాది క్రితం టైఫాయిడ్ వచ్చి జుట్టు బాగా రాలిపోయింది. అస్తమానూ ఏదో పోగొట్టు కున్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటుంది. సమయానికి తినదు. మనిషి బాగా పీక్కు పోయినట్టయ్యింది. కూతురుని ఏమీ అనలేక∙కోపాన్ని దిగమింగుకుంది కాత్యాయని.
‘... నన్నిలా చావనీయ్’
హరిణీ.. బాగా లేటయిపోయింది. కాస్త తిందువుగానీ లే..! ప్లేట్‌లో అన్నం కలుపుకొచ్చి కూతురుని లేపింది కాత్యాయని. ‘నాకొద్దు..’ అంది హరిణి లేవకుండానే!తిండి సరిగ్గా తినక ఇలా పడి ఉంటే ఎలాగే! ఆ కళ్లు చూడు ఎలా గుంటలు పడ్డాయో! కళ్లకింద అంతా నలుపు వచ్చేసింది. తల్లిమాటలకు అంతెత్తున లేచింది హరిణి. ‘‘నేను బాగాలేను కదా! నేను కురూపిని కదా. నన్ను ఇలా చావనీయ్’’ విసురుగా ప్లేట్‌ను తోసేయడంతో గదంతా అన్నం మెతుకులు పడ్డాయి. రోజూ ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. హరిణి ప్రవర్తన కాత్యాయనిని భయపెడుతుంది.
వయసు పాతిక.. లేదు పోలిక!
‘‘డాక్టర్.. మా హరిణి. ఎలా ఉందో చూశారుగా! వయసు పాతికేళ్లు. కానీ, మరో పదేళ్లు పైబడినదానిలా తయారైంది. తను అందంగా లేనని ఇంటికే పరిమితం అయ్యింది. తనలో తను కుమిలిపోతోంది. దేని మీదా ఆసక్తి చూపడం లేదు. తన గురించి బెంగగా ఉంది..’’ కృష్ణారావు చెప్పాడు డాక్టర్‌కి. కృష్ణారావు ఆఫీసు పని మీద ఊరెళ్లినప్పుడు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలో ‘గత జన్మ ప్రభావం ఈ జన్మ మీద ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన థెరపీలు ఏమున్నాయి? ఎలా సమస్య నుంచి బయటపడచ్చు అనేది తెలుసుకున్నాడు. అందంగా లేనని బాధపడుతూ ఇంటికే పరిమితమైపోయిన కూతురుని థెరపీకి తీసుకెళ్లాలనుకున్నాడు.
థెరపీ మొదలయ్యింది
ధాన్యముద్రలో ఉన్న హరిణికి ఓ కొత్త ప్రపంచం చూస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రపంచం తనలోనే ఉందని తను తనలోకే ప్రయాణిస్తుందని.. తన ప్రయాణాన్ని అర్థం చేసుకుంటూ వెళుతోందని గ్రహిస్తోంది ఆమె మస్కిష్తం. కౌన్సెలర్ సూచనలు మొదలయ్యాయి....‘‘హరిణీ... ఈ సమయం నుంచి మీ బాల్యం వరకు మీ మనసుకు బాధను కలిగించిన, అత్యంత సంతోషాన్ని కలిగించిన విషయాలపై దృష్టి నిలపండి. ఏ సంఘటన మిమ్మల్ని అతిగా కలచివేసిందో దర్శించండి.. ’’ అని చెప్పడంతో హరిణి తన అంతర్‌నేత్రంతో అంతటినీ సమీక్షించుకుంటుంది. తన కాలేజీ రోజులు, స్కూల్, బాల్యంలో స్నేహితులతో ఆడుకున్న విషయాలను ఆనందంగా ఉన్న సంఘటనలను దర్శిస్తోంది. అటు నుంచి తల్లి గర్భంలో ఉన్న స్థితిని, ఆ తర్వాత గతజన్మ ప్రయాణాన్నీ కొనసాగిస్తోంది. ఆ ప్రయాణంలో... ఒక చోట ఆగిపోయింది హరిణి. అంతులేని దుఃఖ సముద్రమేదో ఆమెను కుదిపేసినట్టు వణికిపోతోంది.‘‘చెల్లీ వద్దు.. చచ్చిపోవద్దు...’’ అని ఏడుస్తోంది.‘‘ఏమైంది హరిణీ! ఎవరామె, ఎందుకు మీకు అంత దుఃఖం ’అన్నారు కౌన్సెలర్. దుఃఖంతోనే హరిణి చెప్పడం మొదలుపెట్టింది.
కదిలించిన గతం
‘‘నాతోడ పుట్టిన చెల్లెలు. తనకి మచ్చలు వచ్చాయి. జుట్టు తెల్లబడింది. నేను నవ్వుతున్నాను. తను ఏడుస్తోంది. చెల్లెలికి అమ్మనాన్న కొత్త డ్రెస్ తెచ్చారు. ‘దాని మొహానికి కొత్త డ్రెస్ అవసరమా?’ అని నేను ఎగతాళి చేశాను. కొన్నాళ్లకు చెల్లి పెళ్లి ఖాయం అయింది. తను చాలా సంతోషంగా ఉంది. కానీ, తను అందంగా లేదని ఆ పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. చెల్లి ఆత్మహత్య చేసుకుంది..’’ హరిణి చెబుతూ ఏడుస్తోంది. ఏడుస్తూ చెబుతోంది. హరిణి దుఃఖం ఆగేంతవరకు ఎదురుచూసిన కౌన్సెలర్ తన సూచనలు ప్రారంభించారు. ‘‘మీ చెల్లిలి ఆ స్థితికి మీరు కారణమయ్యారా!’’ అని అడిగారు. ‘‘కాదు... కానీ, తనను బాధించినవారిలో నేనూ ఉన్నాను. తనని ఎగతాళి చేశాను. మనోవేదనతో కుమిలిపోయే తనకు ఆసరా ఇవ్వకపోగా నా ప్రవర్తనతో బాధించాను...’ దుఃఖం ఉపశమిస్తుండగా చెప్పింది హరిణి.
‘హరిణీ.. మీ మనసు చాలా అందమైనది.
మీ చెల్లి మరణానికి మీరు కారణం కాకపోయినా ఎప్పుడో తనను ఎగతాళి చేశాననే అపరాధనా భావం మిమ్మల్ని తొలుస్తోంది. ఆమె మరణంతో ‘శారీరక అందం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదా?’ అనే సంశయం అప్పుడు మీలో పడింది. దీనిని తెలుసుకోవడాకే మీరు ఛాయ తక్కువగా పుట్టి 23 ఏళ్లు చాలా ఆనందంగా జీవించారు. కానీ, ఎప్పుడైతే మీరు అందంగా లేరని పెళ్లిచూపుల పేరుతో వచ్చినవారు అన్నారో అప్పుడు మీకు గత జన్మ తాలూకు శేషం బాధించడం మొదలుపెట్టింది. దీంతో, మెల్ల మెల్లగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అంటే, అప్పుడు మీ చెల్లెలు అనుభవించిన స్థితిని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. దీనిని గట్టెక్కి ఈ జీవితం అందమైనది అని నిరూపించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ చెల్లెలిని ఎగతాళి చేసినందుకు ఆమెను క్షమించమని అడగండి’’ అన్నారు. కౌన్సిలర్ సూచనలతో పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కyì గేసుకోవడం మొదలుపెట్టింది హరిణి. నిదానించిన మస్కిస్తం తాలూకు ప్రశాంతత ఆమె మొహంలో కనిపిస్తోంది. ‘‘హరిణీ.. ఇప్పుడు గతం నుంచి వర్తమానంలోకి రండి. ఇక్కడ నుంచి మరో పదేళ్ల తర్వాత మీ జీవితాన్ని దర్శించండి. ఆ జీవితం ఎలా ఉందో చెబుతూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. గతం నుంచి వర్తమానంలో తనను తాను చూసుకుంటోంది హరిణి. ఎంతో అందంగా ఉన్న తన జీవితం ఎలా కృంగిపోయిందో అర్థం చేసుకుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంది. అటు నుంచి కౌన్సెలర్ సూచనలను అనుసరిస్తూ భవిష్యత్తును దర్శించింది. తల్లీతండ్రి, భర్త, బిడ్డలు కుటుంబంతో తన జీవితం ఎంతో కళవంతంగా ఉండటం చూసి అమిత ఆనందాన్ని పొందింది. తేలికపడిన మనసుతో మేల్కొంది.
చీకటి నుంచి వెలుతురులోకి..
కౌన్సిలర్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ రోజువారీ దినచర్యను మార్చుకుంది. తనకు తానే చీకటి ప్రపంచాన్ని ఎలా సృష్టించుకుందో.. అక్కడ నుంచే వెలుతురులోకి రావడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు కలలను నిజం చేస్తూ తన భవిష్యత్తును అందంగా మలుచుకుంది. డాక్టర్ దీపక్‌చోప్రా ఇండియన్ ఎయిమ్స్‌లో ఎం.డిగా చేశారు. అమెరికాలో ఉంటున్న ఈ ఆల్టర్‌నేట్ మెడిసిన్ అడ్వకేట్, రచయిత, వక్త.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. సౌందర్యం అంటే ఏమిటి, వయసు పైబడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మనసును అందంగా ఉంచుకోవడం ఎలా..అనే విషయాల పై ‘ఏజ్‌లెస్ బాడీ, టైమ్‌లెస్ మైండ్’ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. 1993లో వచ్చిన ఈ పుస్తకం 4 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి.
గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని.
– నిర్మల చిల్కమర్రి