last birth
-
గత జన్మ బంధం
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటారు. అలా తెలుగు సినిమాలో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి చూస్తే అద్భుతం అనిపించే గోల్డ్ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇవి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... గోదావరి నదీ తీరాన ఉన్న ఒక ప్రాంతానికి భార్య రాధతో కలిసి విహారయాత్రకు వచ్చాడు గోపీ. ఆ దంపతులిద్దరికీ ఇది మొదటి విహారయాత్ర. ఇద్దరికీ ఇటు చుట్టుపక్కలంతా పడవల్లో, లాంచీల్లో తిరగడం కొత్తగా ఉంది. తిరిగి తిరిగి అలిసిపోయి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగారు ఇద్దరూ. ఆ ప్రదేశానికి రాగానే గోపీని ఎక్కడెక్కడివో ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘‘ఏమైందండీ..’’ అని రాధ ఎంత అడుగుతున్నా పట్టించుకోకుండా చుట్టూ దేనికోసమో గాలిస్తూ తిరుగుతున్నాడు. అప్పుడతనికి కనిపించింది.. గౌరి. ‘ఎలా ఉండే గౌరి ఎలా మారిపోయింది?’ అనుకున్నాడు. గతం గుర్తొచ్చింది గోపీకి. గతమంటే గడిచిన కాలంలోని జీవితం కాదు. గడిచిన జీవితం. గత జన్మ. ‘‘గౌరీ నేనొచ్చాను చూడు.. గోపీని వచ్చాను చూడు..’’ అంటూ గౌరీని పలకరించాడు గోపీ. గౌరీ చివరిశ్వాసకు దగ్గర్లో ఉంది. గోపీని చూస్తూ చూస్తూ ఆమె ఆ తుదిశ్వాస విడిచింది. ‘‘ఎవరండీ ఈవిడ?’’ అడిగింది రాధ, గోపీకి దగ్గరగా వచ్చి కూర్చొని. గోపీ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక జన్మకాలం క్రితం. గోదావరి నదీ తీరం. గోపీ అనాథ. నదిమీద చిన్న పడవ నడుపుకుంటూ బతుకుతున్నాడు. ‘‘గోదారే మా తల్లి. నన్ను చేతులమీద మోసుకొచ్చి కాపాడుతుంది.’’ అంటాడు. గోదారి చుట్టూనే అతని జీవితం. అతణ్ని మావా.. మావా.. అనుకుంటూ తిరిగే ఓ స్నేహితురాలు గౌరీ ఉండనే ఉంది.రాధ జమీందారు కూతురు. కాలేజీ చదువులకు ఆమె వెళ్లాలంటే నది దాటే వెళ్లాలి. అందుకు గోపీ ఉండాలి. గోపీకి రాధ దేవత లాగా. రోజూ ఆమెకు ఒక పువ్వు ఇస్తాడు. ఆమె నవ్వితే ఆ శబ్దాన్ని వింటూ కూర్చుంటాడు. పల్లె పదాలతో పాటలు నేర్పించమని ఆమె అడిగితే పాడి నేర్పిస్తాడు. ఏం చేసినా రాధంటే ఇష్టంతోనే చేస్తాడు గోపీ. గౌరీకేమో గోపీ అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకునేవాడు గోపీనే అవుతాడని ఎదురుచూస్తూ ఉంటుంది గౌరీ. ‘‘నేను చస్తే నీ చేతుల్లోనే చస్తా..’’ అని శపథం చేసి మరీ చెబుతుంది. ‘‘ఓసి పోయే! నువ్వు నా చేతుల్లో చచ్చేదేంటీ.. అయినా నీకు నాకు ఏంటీ..’’ అంటాడు గోపీ. ‘‘మావా! సత్య ప్రమాణంగా చెప్తున్నా.. ఆ గోదావరి సాక్షిగా చెప్తున్నా.. నేను చస్తే నీ చేతుల్లోనే చస్తా..’’ అని మళ్లీ అదే మాటను గట్టిగా నొక్కి చెబుతుంది గౌరీ. గౌరీ, గోపీల కథతో సంబంధం లేకుండా రాధ.. గోపీని ఇష్టపడటం మొదలుపెట్టింది. ‘‘గోపీ.. ఎందుకురా నేనంటే నీకు అంత ఇదీ..’’ అని అడిగింది రాధ. ఆరోజు ఇటు చుట్టుపక్కలంతా పెద్ద ఎత్తున వర్షం. కాలేజీ నుంచి ఇంటికెళ్లే దారిలో రాధ చిక్కుకుపోయింది. ‘‘ఎందుకు అంటే.. ఎందుకు అంటే..’’ ఆలోచిస్తున్నాడు గోపీ. ‘‘ఎందుకంటే పోయిన జన్మలో నువ్వు నాకు రుణపడి ఉన్నావురా! అందుకు.’’ అంది రాధ. ‘‘నిజమా అమ్మగారూ!?’’ అన్నాడు గోపీ. ‘‘నిజమే! ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’’ అంది రాధ.రాధ గోపీతో ఈ మాటన్న రెండో రోజే ఆమెకు పక్క ఊరి జమీందారు కొడుకుతో పెళ్లి కుదిరింది. వారం తిరిగేలోపే పెళ్లి. గోపీ ఆ పెళ్లిలో దగ్గరుండి అన్ని పనులూ చూసుకున్నాడు. జమీందారు కోరికమేరకు అందరికోసం గోపీ ఒక పాట కూడా పాడాడు. రాధ ఇప్పుడు ఒక ఇంటి కోడలు. ఊరొదిలి వెళ్లిపోతోంది. ‘’అమ్మాయి గారూ! మళ్లా ఎప్పుడొస్తారు?’’ అడిగాడు గోపీ. ‘‘నా చేతుల్లో ఏముందిరా!’’ భారంగా సమాధానమిచ్చింది రాధ. ‘‘అవున్లెండి! పెళ్లయ్యాక అంతా బాబు గారి ఇష్టం.’’ అంటూ రాధ భర్త దగ్గరికెళ్లి అడిగాడు గోపీ – ‘‘బాబు గారూ! మా అమ్మాయి గారిని మళ్లా మాకెప్పుడు చూపిస్తారు?’’ ‘‘అరే! ఎప్పుడో ఏమిటోయ్!! రెండు నెల్లో సంవత్సరాదికి ఇక్కడే ఉంటాంగా!’’ ‘‘బాబు గారూ! నా పడవ మీదే రావాలి.’’ అన్నాడు గోపీ. ‘‘నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనీయదు గోపీ..’’ అంది రాధ, ముందునుంచీ మాట్లాడుతూ వచ్చినంత భారంగానే. రాధ వెళ్లిపోయాక గోపీ ఒంటరైపోయాడు. గౌరీ అన్ని సమయాల్లో అతని వెన్నంటే ఉన్నా ఒంటరైపోయాడు. గౌరీకి మాత్రం ఎప్పట్లానే గోపీ తప్ప ఇంకో ప్రపంచం లేదు. రోజులు గడుస్తున్నాయి. గౌరీ, గోపీల ప్రపంచాల్లో ఊహించని మార్పులు వచ్చేస్తున్నాయి. గౌరీకి రోజురోజుకు దగ్గరవుతున్నాడు గోపీ. సంవత్సరాది వచ్చింది. రాధను పడవ ఎక్కించి ఊరికి తీసుకురావడానికి బయలుదేరాడు గోపీ. ‘‘నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనీయదు గోపీ..’’ అని రాధ చెప్పినమాటలు అతనికి ఇంకా గుర్తున్నాయి. రాధ వచ్చింది. ఒడ్డు దగ్గర గుర్రపు బండి దిగి నిలబడింది. రాధ ఒక్కతే వచ్చింది. కూడా భర్త లేడు. ఎప్పటికీ తిరిగిరాలేని ప్రపంచానికి వెళ్లిపోయాడతను. రాధను చూడటంతోనే‘‘అమ్మాయి గారూ! ఏంటీ అన్యాయం.. ఏంటీ ఘోరం..’’ అంటూ నేలకూలిపోయాడు గోపీ. రోజులు గడుస్తున్నాయి. రాధకి ఇలా జరిగినప్పట్నుంచీ మనిషి మనిషిలా లేడు గోపీ. ‘‘నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు?’’ అని అడిగిన గౌరీకి కూడా ‘‘చేస్కోను.’’ అని సమాధానం ఇచ్చేంతలా అతడు బాధ నుంచి బయటపడటం లేదు. రాధని కలవనిదే ఉండలేడు గోపీ. ఈ పరిస్థితుల్లో ఆమె ధైర్యం అతనొక్కడే. కానీ ప్రపంచం వాళ్ల బంధం మీద నిందలేసింది. గోపీ తానింక ఇలాంటి ప్రపంచంలో బతకనని వెళ్లిపోతున్నాడు. రాధ ఈ విషయం తెలుసుకొని అతణ్ని వెంటాడుతూ వెళ్లింది. ‘‘మీరెందుకొచ్చారమ్మాయి గారు! ఈ పాడులోకం అనుకుంటున్నదే నిజమవుద్ది.’’ అన్నాడు గోపీ, రాధను చూడటంతోనే. ‘‘కానీ అదే నిజం కానీరా.. ఈ అబద్ధాలతో బతకడం కన్నా, ఆ నిజంలో చావడమే మేలు..’’ అంది రాధ. గోపీ పడవ తీశాడు. నది విజృంభిస్తోంది. భారీ వర్షం. ఆ గోదారిలోనే కలిసిపోయారు ఇద్దరూ. అప్పట్నుంచీ గోపీ చేతుల్లోనే చావాలని గౌరీ ఎదురుచూస్తూ ఆ తీరం దగ్గరే గడుపుతూ వచ్చింది. అలాగే రాధపై తాను వేసిన నింద ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉండింది. -
కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ?
ఇప్పటిదాకా ఉన్న అన్ని రూల్సూ బ్రేక్ అయిపోతున్నాయా? జన్మకు సార్థకత ఉంటుందనేది ఇప్పటి దాకా రూల్. కాదు బిలీఫ్.. నమ్మకం. అంటే ఈ లైఫ్‌లో బాగా జీవిస్తే మరో లైఫ్‌లో మంచి జన్మ దొరుకుతుందని. అంతకంటే బాగా జీవిస్తే అసలు జన్మే ఉండదని. దాన్నే ‘మోక్షం’ అంటారు. వీటన్నిటినీ తిరగరాస్తున్న కొత్త ఆలోచన ఇది. ఈ జన్మ మన పూర్వజన్మ కోరిక. ఎక్కడ పుట్టాలి? ఎవర్ని చేసుకోవాలి? ఎవర్ని కనాలి? ఎలా అస్తమించాలి? ఈ మొత్తం ప్రాసెస్ ఒక పాఠం. కాదు.. కాదు.. ఎన్నో పాఠాల... ఒక పుస్తకం. అంటే.. ఈ జీవితాన్ని మనం ఎంచుకున్నది నేర్చుకోడానికి. కష్టాన్ని కౌగలించుకోడానికి. ఛాలెంజ్‌ని అర్థం చేసుకోడానికి. మర్మాన్ని విడమర్చుకోడానికి. మనం ఇలా, ఇక్కడ ఉన్నామంటే అదొక ఆక్సిడెంట్ కాదు. లైఫ్ ఈజ్ ఎ సోల్ ప్లాన్. అదొక ప్రణాళిక. కమాన్. లెటజ్ లివ్. లెటజ్ లెర్న్. లివ్ హ్యాపీ. డోన్ట్ వర్రీ. కోరికలు గుర్రాలైతే ఆత్మలు సవారీ చేస్తాయి. కాదా మరి? ‘‘హలో.. శేఖర్! కరెక్ట్ టైమ్‌కి ఫోన్ చేశావురా, ఆఫీసుకు స్టార్ట్ అవుతున్నా. ఈ రోజు ఆఫీసులో ప్రెజెంటేషన్ ఫైల్ అంతా రెడీ! ఈ సారి ఎలాగైనా ప్రమోషన్ నాదేరా, ఇది జరిగి తీరుతుంది చూడు. మనం ఎదిగితేనే కదా, పిల్లలక్కూడా మంచి లైఫ్‌ని ఇవ్వగలం..’’ ఫ్రెండ్ శేఖర్‌తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు వెంకట్ కృష్ణ. భార్య లక్ష్మి చూసి చూసి ‘‘ఏమండీ, అత్తయ్య ఫోన్ చేశారు. ఓసారి వెళ్లి వాళ్లను చూసి... ’’ ఫోన్ మాట్లాడుతున్న వెంకట్ ఆమె మాటలను చేత్తోనే వారించాడు ... తర్వాత అంటూ! ‘ఫ్రెండ్స్‌తో అయితే గంటలు గంటలు టైముంటుంది. ఇంటి విషయం ఏదైనా చెబితే మాత్రం అడ్డుపడుతున్నట్టు ఉంటుంది’ మనసులోనే గొణుక్కుంటూ పిల్లలను స్కూల్‌కి రెడీ చేసింది. భార్య మొహం ముడుచుకుని ఉండటం చూసిన వెంకట్æ‘‘ఏంటిది, ఆఫీసుకు వెళుతున్నప్పుడు కాస్త నవ్వు మొహం పెట్టుకోవాలనీ ఉండదా నీకు’’ విసుగ్గా అన్నాడు వెంకట్. ‘‘అది కాదండీ, పాపం అత్తయ్య మామయ్య ఆ ఊళ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో. పొద్దున్నే ఫోన్ చేశారు అత్తయ్య. వాళ్లకసలే ఒంట్లో బాగుండదు. అక్కడే సౌకర్యాలు ఉండవు. ఇక్కడకు తీసుకువద్దామంటే మీరు వినిపించుకోరు. వాళ్లు లేని లోటు ఉన్నప్పుడు తెలియదండి. మా అమ్మానాన్నంటే నా చిన్నప్పుడే చనిపోయారు. పెళ్లి చూపులప్పుడు అత్తయ్య నన్ను చూసి ‘మహలక్ష్మిలా ఉన్నావురా! ఈ రోజు నుంచి అమ్మ లేదని బాధపడకు. నేనున్నాను’ అన్నారు. ఎంత సంతోషమేసిందో. కానీ, కూతురిలా ఆమెను చూసుకోలేకపోతున్నాను. ఈ వయసులో మనం కాకపోతే వారిని ఇంకెవరు చూసుకుంటారు...’ చెబుతూనే ఉన్న లక్ష్మి మాటలకు అడ్డుపడుతూ ‘‘ఆపుతావా! నీ సెంటిమెంట్ల గోల. వాళ్లు ఊర్లో ఉంటేనే సంతోషంగా ఉంటారు. అక్కడైతేనే అందరూ ఉంటారు. ఇక్కడుంటే అస్తమానూ నసగా ఉంటుంది. పైగా పెద్ద ఇల్లు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. అవన్నీ తట్టుకోగలమా!’’ సలహాలు ఇవ్వడం మానుకొని నీ పని చూసుకో టిఫిన్ బాక్స్ తీసుకొని హడావిడిగా వెళ్లిపోయాడు వెంకట్. భవిష్యత్తు ఏమిటి? ‘‘ఈ ప్రకారంగా.. ఇప్పుటి యూత్‌ని అట్రాక్ట్ చేస్తే బిజినెస్ డబల్ కాదు త్రిబుల్ అవ్వడం గ్యారెంటీ సార్! ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, యూత్ డే.. మన గిఫ్ట్ కంపెనీకి వీళ్లు మంచి మార్కెట్.. ’’ మీటింగ్ హాల్లో వెంకట్‌కృష్ణ తన ప్రెజెంటేషన్ పూర్తి చేయగానే అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. అందరివైపు గర్వంగా చూసిన వెంకట్ బాస్ ముఖంలో ఏ భావం కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. బాస్ శంకర్రావు మౌనంగా ఉండటంతో మిగతా అందరి నోళ్లు మూతపడ్డాయి. ఏడుపదుల వయసు దాటిన శంకర్రావ్ సీరియస్‌గా ‘‘వెంకట్.. నీ ప్రెజెంటేషన్‌లో ఓ లోపం ఉంది. అదేంటో నీకు తెలుసా! ఫ్యామిలీ మిస్ అవడం. యూత్ బిజినెస్.. గురించి నువ్వు చెప్పింది ఈ కొద్ది రోజుల వరకే. నాకు నా కంపెనీ భవిష్యత్తు కావాలి. తల్లిదండ్రులు, పిల్లలు, నానమ్మ తాతయ్యలు.. కుటుంబంలోని ఈ రిలేషన్స్ గురించి నీ ప్రెజెంటేషన్‌లో లేదు. మనం చేసే పనిలో మనదేశపు విలువలు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. మన దేశపు ప్రాచీన సంపదైన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం, ఆత్మీయ అనుబంధాలలోని గొప్పదనం కోసం జర్మనీ, రష్యా, ఈజిప్ట్, టిబెటన్.. వంటì ఎన్నో దేశాలు మన వైపు చూస్తున్నాయి. పరిశోధనలు చేస్తున్నాయి. వాళ్లు మన నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం మన మూలాలు మర్చిపోతే ఎలా?! ఇలాగైతే ముందుతరాలకు ఏం మిగులుస్తాం మరోసారి ట్రై చేయి. ఈ సెషన్ వేస్ట్’’ అంటూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు శంకర్రావు. థెరపీతో ఆత్మ చైతన్య వృద్ధి నేను పై చదువులకు పట్నం వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఆరోగ్యం బాగోలేదు. బెంగుళూరులో టాప్ టెన్ కంపెనీలో మంచి పోస్ట్‌కి సెలక్ట్ అయ్యాను. కానీ, ఆ సమయంలో నాన్నకు హార్ట్ ఆపరేషన్. నాతో చదువుకున్నవాళ్లు నాకన్నా మంచి హోదాలో ఉన్నారిప్పుడు. ఈ రోజు ఉదయం ఆఫీసులో ప్రెజెంటేషన్‌కి వెళుతుంటే అమ్మ ఏదో ప్రాబ్లమ్ అంటూ ఫోన్. ఇరవై ఏళ్లుగా నా ప్రతీ ఎదుగుదలకు ఏదో విధంగా అమ్మనాన్నలు అడ్డుపడుతూనే ఉంటున్నారు. నేను నా ఉన్నతి గురించి ఆలోచిస్తున్నాను. నా భార్య, నా బాస్ తల్లిదండ్రులు వారి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. నాకిది చాలా చిరాకుగా ఉంటోంది..’ అన్నాడు వెంకట్. ‘‘మీ తల్లిదండ్రులు మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనేది మీ భావన. మీ జీవితంలో ఎందుకు వృద్ధి లేదో మీరే చూడండి’’ అన్నారు కౌన్సెలర్. థెరపీ మొదలయ్యింది. కళ్లు మూసుకొని ధ్యానముద్రలో కూర్చుకున్న వెంకట్‌కి మనోనేత్రంలో తన గత జీవితం 70 ఎమ్.ఎమ్ సినిమా దృశ్యంలా ఆవిషృతమైంది. ప్రస్తుతం నుంచి వెనక్కి ఆ ప్రయాణం సాగుతోంది. పెళ్లి, ఉద్యోగం, కాలేజీ రోజులు, బాల్యం.. అమ్మ గర్భంలో ఉన్న స్థితి.. అన్నీ దర్శిస్తున్నాడు. అక్కడ్నుంచి ఇంకా వెనక్కి వెళుతున్నాడు. టైమ్ మిషన్‌లో కాలాన్ని వెనక్కి తిప్పినట్టు సూక్ష్మ కాంతిగోళం నుంచి గత జన్మలోకి ప్రవేశించాడు. ఆ గత జన్మ గురించి వెంకట్ చెప్పడం మొదలు పెట్టాడు. ‘ఉద్యోగం కోసం విదేశాలలో నేను, తల్లిదండ్రులు ఊళ్లో. వృద్ధాప్యంలో వారు పడుతున్న అవస్థలను చూస్తున్నాను. తల్లిదండ్రి చనిపోయినప్పుడు కూడా నేను వారి దగ్గర లేను. చివరకు వారిని మట్టిచేసేటప్పుడు కూడా! వారికోసం దేశాలు దాటుకొని వచ్చేసరికి అంతా అయిపోయింది. ఎంతో ప్రేమగా జీవితమంతా కళ్లలో పెట్టుకుని నా కోసమే అన్నట్టు బతికిన నా తల్లిదండ్రులకు నేను ప్రేమను ఇవ్వలేకపోయాను. ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ అనంతమైన ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మళ్లీ జన్మ ఉంటే ఈ తల్లిదండ్రులకే పుట్టి, వాళ్లను ప్రేమగా చూసుకుంటాను. ఆనందాన్ని ఇస్తాను’ అనుకున్నాను. తల్లిదండ్రులే వంతెన లక్ష్మీ! నా ఫ్రెండ్ శేఖర్ ద్వారా గతజన్మ ప్రతిగమన చికిత్స తీసుకున్నాను. ఎందుకోసమైతే ఈ జన్మ తీసుకున్నానో ఆ విషయమే మర్చిపోయాను. నా ఎదుగుదలకు నా తల్లిదండ్రి అడ్డు అనుకున్నాను. కానీ, వాళ్లే నా జీవితానికి వంతెన అని గుర్తించలేకపోయాను. చేసిన తప్పునే మళ్లీ మళ్ళీ చేస్తున్నాను. ఇక అలా చేయను. తప్పు దిద్దుకొని మన పిల్లలకు ఓ మంచి కానుక ఇస్తాను. అదే తాతయ్యను నానమ్మను. అంటూ ఊరుకు ప్రయాణమయ్యాడు వెంకట్. తల్లీదండ్రి, భార్య, పిల్లలతో తన జీవితం నిండుగా ఉన్న ఆనందాన్ని పొందుతున్నాడు వెంకట్. ఆ సంతోషం, తృప్తి వెంకట్ పనిచేసే చోటా వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల్లోనూ తను ఏ ఉన్నతిని ఆశించాడో దానిని చేరుకున్నాడు. ఆత్మ వికాసం రంగులరాట్నంతో పోల్చవచ్చు. ఊర్ధ్వ్యలోకాలలో అంటే రాట్నం పై స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మ జన్మ ఎంపిక ఉంటుంది. కిందకు వస్తున్న కొద్దీ పుట్టుకకు సంబంధించిన పాఠాన్ని నిర్ధారించుకుంటుంది. జన్మ తీసుకున్న తర్వాత తిరిగి పైకి వెళ్లడానికి అంటే వృద్ధి సాధించడానికి నిరంతర సాధన చేస్తుంటుంది. ఆత్మచైతన్యం చేసే సాహసోపేతమైన నిర్ణయాలన్నీ జ్ఞానం కోసమే. నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడుగ్గా... ఎలా పుట్టాలన్నది కూడా ఆత్మచైతన్యం నిర్ణయించుకున్నదాన్ని బట్టే ఉంటుంది. అవ్యాజమైన ప్రేమను పంచడానికే ఆత్మ జన్మలు తీసుకుంటుంది. మానసిక, శారీరక వికలాంగులుగా జన్మ తీసుకునే చైతన్యాలు ఆ కుటుంబాలలో ప్రేమను నేర్పడానికే! నేర్చుకోవడానికే ప్రయాణం ప్రతి ఒక్క ఆత్మచైతన్యం తను ఎందుకు జన్మ తీసుకోవాలో ముందు నిర్ణయించుకుంటుంది. అందుకు ఎలాంటి పాఠం నేర్చుకోవాలి, ఎలాంటి సవాళ్లను అధిగమించాలి, ఏ ప్రదేశంలో, ఏ కుటుంబంలో పుట్టాలి? .. అనేది ఈ ప్రణాళికలో భాగం. కానీ, ఒక్కసారి తల్లి గర్భంలో చేరిపోయాక ‘మాయ’ అనేది ఇనుప తెరలా అడ్డుపడిపోతుంది. అప్పుడు మరపు వచ్చేస్తుంది. దాంతో నేర్చుకోవాల్సిన పాఠాలను మధ్యలోనే ఆపేస్తాం. దీంతో ఆత్మ చైతన్యం వృద్ధి పొందదు. ఎరుకతో గ్రహించేలా ఉన్నతికి సాయం చేసేదే గత జన్మ ప్రతిగమన చికిత్స. – డాక్టర్ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ ఆత్మ ప్రణాళికలో 7 సిద్ధాంతాలు 1. ఆత్మ చైతన్యం పొందడం 2. స్వీయ స్వేచ్ఛతో బుద్ధిని వికసింపజేసుకోవడం. 3. పునర్జన్మ ద్వారా పై లోకాలలో ఉండే ఏకత్వస్థితిని భూమండలంలో పొందగలగడం. 4. కర్త, క్రియలు కర్మకారణ శక్తికి దారి తీయడం. 5. ప్రతిజన్మలోనూ మంచి చెడులను తెలుసుకుంటూ పురోగమనిస్తూ ఉండటం. 6. పురోగమనాన్ని ఎరుకతో వేగవంతం చేసుకోవడం. అంటే, త్వరితంగా పాఠాలు నేర్చొకొని ముందుకు సాగడం. 7. మనమంతా విశ్వలోకం నుంచి వచ్చిన జీవాత్మలం. ఏకత్వంలోని ప్రేమతత్త్వాన్ని నింపుకొని చివరకు తిరిగి అక్కడకే చేరుకోవడం. – నిర్మల చిల్కమర్రి -
పగిలిన గతం
అందం ఒక అద్దాల మేడ అయితే... గత జన్మలో విసిరిన రాయి ఈ అద్దాల మేడను పగలగొడితే... మనసు ముక్కలవుతుంది. పొగిలిన మనసు... పగలిన అద్దం.. మళ్లీ అతుక్కుంటాయా? ‘‘హరిణీ నాన్నగారు చూడు నీకోసం ఏం తెచ్చారో..’’ సంబరంగా చెప్పింది కాత్యాయని కూతురుతో. పడుకుని ఉన్న హరిణి లేచి తల్లి వంక చూసింది. తల్లి చేతిలో కొత్త చీర.. ‘‘డాడీ ఆఫీసు పనిమీద ఊరెళ్లారు కదరా! అక్కడ నుంచి మనకోసం బట్టలు తెచ్చారు. లేచి ఈ చీరకట్టుకొని తయారవ్వు. అలా బయటకు వెళ్దాం..’’ కూతురుని హుషారుపరుస్తూ ఆమె చేతిలో చీరపెట్టి తనూ రెడీ అవడానికి వెళ్లింది కాత్యాయని.భళ్లుమని ఏదో గ్లాస్ పగిలిన శబ్దం రావడంతో పరిగెత్తుకు వచ్చింది కంగారుగా! ‘‘హరిణీ ఏంటే నువ్వు చేసిన పని. బంగారం లాంటి అద్దం పగలగొట్టావ్’’ కంగారుగా అడిగింది కాత్యాయని. ‘‘ఈ మొహం చూడు, అద్దంలో ఎలా ఉందో’’ ఏడుస్తూ మంచమ్మీద కూలబడింది హరిణి. కూతురు ప్రవర్తనకి ఏం చేయాలో అర్థంకాలేదామెకు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, అమ్మాయి నల్లగా ఉందంటూ పెళ్లి వారు కారణం చూపుతున్నారు. హరిణి చామనఛాయే కానీ కళగా ఉంటుంది. ఏడాది క్రితం టైఫాయిడ్ వచ్చి జుట్టు బాగా రాలిపోయింది. అస్తమానూ ఏదో పోగొట్టు కున్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటుంది. సమయానికి తినదు. మనిషి బాగా పీక్కు పోయినట్టయ్యింది. కూతురుని ఏమీ అనలేక∙కోపాన్ని దిగమింగుకుంది కాత్యాయని. ‘... నన్నిలా చావనీయ్’ హరిణీ.. బాగా లేటయిపోయింది. కాస్త తిందువుగానీ లే..! ప్లేట్లో అన్నం కలుపుకొచ్చి కూతురుని లేపింది కాత్యాయని. ‘నాకొద్దు..’ అంది హరిణి లేవకుండానే!తిండి సరిగ్గా తినక ఇలా పడి ఉంటే ఎలాగే! ఆ కళ్లు చూడు ఎలా గుంటలు పడ్డాయో! కళ్లకింద అంతా నలుపు వచ్చేసింది. తల్లిమాటలకు అంతెత్తున లేచింది హరిణి. ‘‘నేను బాగాలేను కదా! నేను కురూపిని కదా. నన్ను ఇలా చావనీయ్’’ విసురుగా ప్లేట్‌ను తోసేయడంతో గదంతా అన్నం మెతుకులు పడ్డాయి. రోజూ ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. హరిణి ప్రవర్తన కాత్యాయనిని భయపెడుతుంది. వయసు పాతిక.. లేదు పోలిక! ‘‘డాక్టర్.. మా హరిణి. ఎలా ఉందో చూశారుగా! వయసు పాతికేళ్లు. కానీ, మరో పదేళ్లు పైబడినదానిలా తయారైంది. తను అందంగా లేనని ఇంటికే పరిమితం అయ్యింది. తనలో తను కుమిలిపోతోంది. దేని మీదా ఆసక్తి చూపడం లేదు. తన గురించి బెంగగా ఉంది..’’ కృష్ణారావు చెప్పాడు డాక్టర్‌కి. కృష్ణారావు ఆఫీసు పని మీద ఊరెళ్లినప్పుడు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలో ‘గత జన్మ ప్రభావం ఈ జన్మ మీద ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన థెరపీలు ఏమున్నాయి? ఎలా సమస్య నుంచి బయటపడచ్చు అనేది తెలుసుకున్నాడు. అందంగా లేనని బాధపడుతూ ఇంటికే పరిమితమైపోయిన కూతురుని థెరపీకి తీసుకెళ్లాలనుకున్నాడు. థెరపీ మొదలయ్యింది ధాన్యముద్రలో ఉన్న హరిణికి ఓ కొత్త ప్రపంచం చూస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రపంచం తనలోనే ఉందని తను తనలోకే ప్రయాణిస్తుందని.. తన ప్రయాణాన్ని అర్థం చేసుకుంటూ వెళుతోందని గ్రహిస్తోంది ఆమె మస్కిష్తం. కౌన్సెలర్ సూచనలు మొదలయ్యాయి....‘‘హరిణీ... ఈ సమయం నుంచి మీ బాల్యం వరకు మీ మనసుకు బాధను కలిగించిన, అత్యంత సంతోషాన్ని కలిగించిన విషయాలపై దృష్టి నిలపండి. ఏ సంఘటన మిమ్మల్ని అతిగా కలచివేసిందో దర్శించండి.. ’’ అని చెప్పడంతో హరిణి తన అంతర్నేత్రంతో అంతటినీ సమీక్షించుకుంటుంది. తన కాలేజీ రోజులు, స్కూల్, బాల్యంలో స్నేహితులతో ఆడుకున్న విషయాలను ఆనందంగా ఉన్న సంఘటనలను దర్శిస్తోంది. అటు నుంచి తల్లి గర్భంలో ఉన్న స్థితిని, ఆ తర్వాత గతజన్మ ప్రయాణాన్నీ కొనసాగిస్తోంది. ఆ ప్రయాణంలో... ఒక చోట ఆగిపోయింది హరిణి. అంతులేని దుఃఖ సముద్రమేదో ఆమెను కుదిపేసినట్టు వణికిపోతోంది.‘‘చెల్లీ వద్దు.. చచ్చిపోవద్దు...’’ అని ఏడుస్తోంది.‘‘ఏమైంది హరిణీ! ఎవరామె, ఎందుకు మీకు అంత దుఃఖం ’అన్నారు కౌన్సెలర్. దుఃఖంతోనే హరిణి చెప్పడం మొదలుపెట్టింది. కదిలించిన గతం ‘‘నాతోడ పుట్టిన చెల్లెలు. తనకి మచ్చలు వచ్చాయి. జుట్టు తెల్లబడింది. నేను నవ్వుతున్నాను. తను ఏడుస్తోంది. చెల్లెలికి అమ్మనాన్న కొత్త డ్రెస్ తెచ్చారు. ‘దాని మొహానికి కొత్త డ్రెస్ అవసరమా?’ అని నేను ఎగతాళి చేశాను. కొన్నాళ్లకు చెల్లి పెళ్లి ఖాయం అయింది. తను చాలా సంతోషంగా ఉంది. కానీ, తను అందంగా లేదని ఆ పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. చెల్లి ఆత్మహత్య చేసుకుంది..’’ హరిణి చెబుతూ ఏడుస్తోంది. ఏడుస్తూ చెబుతోంది. హరిణి దుఃఖం ఆగేంతవరకు ఎదురుచూసిన కౌన్సెలర్ తన సూచనలు ప్రారంభించారు. ‘‘మీ చెల్లిలి ఆ స్థితికి మీరు కారణమయ్యారా!’’ అని అడిగారు. ‘‘కాదు... కానీ, తనను బాధించినవారిలో నేనూ ఉన్నాను. తనని ఎగతాళి చేశాను. మనోవేదనతో కుమిలిపోయే తనకు ఆసరా ఇవ్వకపోగా నా ప్రవర్తనతో బాధించాను...’ దుఃఖం ఉపశమిస్తుండగా చెప్పింది హరిణి. ‘హరిణీ.. మీ మనసు చాలా అందమైనది. మీ చెల్లి మరణానికి మీరు కారణం కాకపోయినా ఎప్పుడో తనను ఎగతాళి చేశాననే అపరాధనా భావం మిమ్మల్ని తొలుస్తోంది. ఆమె మరణంతో ‘శారీరక అందం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదా?’ అనే సంశయం అప్పుడు మీలో పడింది. దీనిని తెలుసుకోవడాకే మీరు ఛాయ తక్కువగా పుట్టి 23 ఏళ్లు చాలా ఆనందంగా జీవించారు. కానీ, ఎప్పుడైతే మీరు అందంగా లేరని పెళ్లిచూపుల పేరుతో వచ్చినవారు అన్నారో అప్పుడు మీకు గత జన్మ తాలూకు శేషం బాధించడం మొదలుపెట్టింది. దీంతో, మెల్ల మెల్లగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అంటే, అప్పుడు మీ చెల్లెలు అనుభవించిన స్థితిని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. దీనిని గట్టెక్కి ఈ జీవితం అందమైనది అని నిరూపించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ చెల్లెలిని ఎగతాళి చేసినందుకు ఆమెను క్షమించమని అడగండి’’ అన్నారు. కౌన్సిలర్ సూచనలతో పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కyì గేసుకోవడం మొదలుపెట్టింది హరిణి. నిదానించిన మస్కిస్తం తాలూకు ప్రశాంతత ఆమె మొహంలో కనిపిస్తోంది. ‘‘హరిణీ.. ఇప్పుడు గతం నుంచి వర్తమానంలోకి రండి. ఇక్కడ నుంచి మరో పదేళ్ల తర్వాత మీ జీవితాన్ని దర్శించండి. ఆ జీవితం ఎలా ఉందో చెబుతూ ఉండండి..’ అన్నారు కౌన్సెలర్. గతం నుంచి వర్తమానంలో తనను తాను చూసుకుంటోంది హరిణి. ఎంతో అందంగా ఉన్న తన జీవితం ఎలా కృంగిపోయిందో అర్థం చేసుకుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంది. అటు నుంచి కౌన్సెలర్ సూచనలను అనుసరిస్తూ భవిష్యత్తును దర్శించింది. తల్లీతండ్రి, భర్త, బిడ్డలు కుటుంబంతో తన జీవితం ఎంతో కళవంతంగా ఉండటం చూసి అమిత ఆనందాన్ని పొందింది. తేలికపడిన మనసుతో మేల్కొంది. చీకటి నుంచి వెలుతురులోకి.. కౌన్సిలర్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ రోజువారీ దినచర్యను మార్చుకుంది. తనకు తానే చీకటి ప్రపంచాన్ని ఎలా సృష్టించుకుందో.. అక్కడ నుంచే వెలుతురులోకి రావడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు కలలను నిజం చేస్తూ తన భవిష్యత్తును అందంగా మలుచుకుంది. డాక్టర్ దీపక్చోప్రా ఇండియన్ ఎయిమ్స్‌లో ఎం.డిగా చేశారు. అమెరికాలో ఉంటున్న ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ అడ్వకేట్, రచయిత, వక్త.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. సౌందర్యం అంటే ఏమిటి, వయసు పైబడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మనసును అందంగా ఉంచుకోవడం ఎలా..అనే విషయాల పై ‘ఏజ్‌లెస్ బాడీ, టైమ్‌లెస్ మైండ్’ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. 1993లో వచ్చిన ఈ పుస్తకం 4 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి. గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని. – నిర్మల చిల్కమర్రి