కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ? | Life is good in life, well-being in this life... | Sakshi
Sakshi News home page

కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ?

Published Mon, Feb 6 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ?

కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ?

ఇప్పటిదాకా ఉన్న అన్ని రూల్సూ బ్రేక్‌ అయిపోతున్నాయా?
జన్మకు సార్థకత ఉంటుందనేది ఇప్పటి దాకా రూల్‌.
కాదు బిలీఫ్‌.. నమ్మకం.
అంటే ఈ లైఫ్‌లో బాగా జీవిస్తే మరో లైఫ్‌లో మంచి జన్మ దొరుకుతుందని.
అంతకంటే బాగా జీవిస్తే అసలు జన్మే ఉండదని.
దాన్నే ‘మోక్షం’ అంటారు.
వీటన్నిటినీ తిరగరాస్తున్న కొత్త ఆలోచన ఇది.
ఈ జన్మ మన పూర్వజన్మ కోరిక.
ఎక్కడ పుట్టాలి? ఎవర్ని చేసుకోవాలి?
ఎవర్ని కనాలి? ఎలా అస్తమించాలి?
ఈ మొత్తం ప్రాసెస్‌ ఒక పాఠం.
కాదు.. కాదు.. ఎన్నో పాఠాల... ఒక పుస్తకం.
అంటే.. ఈ జీవితాన్ని మనం ఎంచుకున్నది నేర్చుకోడానికి.
కష్టాన్ని కౌగలించుకోడానికి.
 ఛాలెంజ్‌ని అర్థం చేసుకోడానికి.
మర్మాన్ని విడమర్చుకోడానికి.
మనం ఇలా, ఇక్కడ ఉన్నామంటే అదొక ఆక్సిడెంట్‌ కాదు.
లైఫ్‌ ఈజ్‌ ఎ సోల్‌ ప్లాన్‌.
అదొక ప్రణాళిక.
కమాన్‌. లెటజ్‌ లివ్‌. లెటజ్‌ లెర్న్‌.  
లివ్‌ హ్యాపీ. డోన్ట్‌ వర్రీ.
కోరికలు గుర్రాలైతే ఆత్మలు సవారీ చేస్తాయి.
కాదా మరి?


‘‘హలో.. శేఖర్‌! కరెక్ట్‌ టైమ్‌కి ఫోన్‌ చేశావురా, ఆఫీసుకు స్టార్ట్‌ అవుతున్నా. ఈ రోజు ఆఫీసులో ప్రెజెంటేషన్‌ ఫైల్‌ అంతా రెడీ! ఈ సారి ఎలాగైనా ప్రమోషన్‌ నాదేరా,  ఇది జరిగి తీరుతుంది చూడు. మనం ఎదిగితేనే కదా, పిల్లలక్కూడా మంచి లైఫ్‌ని ఇవ్వగలం..’’ ఫ్రెండ్‌ శేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు వెంకట్‌ కృష్ణ. భార్య లక్ష్మి చూసి చూసి ‘‘ఏమండీ, అత్తయ్య ఫోన్‌ చేశారు. ఓసారి వెళ్లి వాళ్లను చూసి... ’’ ఫోన్‌ మాట్లాడుతున్న వెంకట్‌ ఆమె మాటలను చేత్తోనే వారించాడు ... తర్వాత అంటూ!

‘ఫ్రెండ్స్‌తో అయితే గంటలు గంటలు టైముంటుంది. ఇంటి విషయం ఏదైనా చెబితే మాత్రం అడ్డుపడుతున్నట్టు ఉంటుంది’ మనసులోనే గొణుక్కుంటూ పిల్లలను స్కూల్‌కి రెడీ చేసింది. భార్య మొహం ముడుచుకుని ఉండటం చూసిన వెంకట్‌æ‘‘ఏంటిది, ఆఫీసుకు వెళుతున్నప్పుడు కాస్త నవ్వు మొహం పెట్టుకోవాలనీ ఉండదా నీకు’’ విసుగ్గా అన్నాడు వెంకట్‌. ‘‘అది కాదండీ, పాపం అత్తయ్య మామయ్య ఆ ఊళ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో. పొద్దున్నే ఫోన్‌ చేశారు అత్తయ్య. వాళ్లకసలే ఒంట్లో బాగుండదు. అక్కడే సౌకర్యాలు ఉండవు. ఇక్కడకు తీసుకువద్దామంటే మీరు వినిపించుకోరు. వాళ్లు లేని లోటు ఉన్నప్పుడు తెలియదండి.  మా అమ్మానాన్నంటే నా చిన్నప్పుడే చనిపోయారు. పెళ్లి చూపులప్పుడు అత్తయ్య నన్ను చూసి ‘మహలక్ష్మిలా ఉన్నావురా! ఈ రోజు నుంచి అమ్మ లేదని బాధపడకు. నేనున్నాను’ అన్నారు. ఎంత సంతోషమేసిందో. కానీ, కూతురిలా ఆమెను చూసుకోలేకపోతున్నాను. ఈ వయసులో మనం కాకపోతే వారిని ఇంకెవరు చూసుకుంటారు...’ చెబుతూనే ఉన్న లక్ష్మి మాటలకు అడ్డుపడుతూ ‘‘ఆపుతావా! నీ సెంటిమెంట్ల గోల. వాళ్లు ఊర్లో ఉంటేనే సంతోషంగా ఉంటారు. అక్కడైతేనే అందరూ ఉంటారు. ఇక్కడుంటే అస్తమానూ నసగా ఉంటుంది. పైగా పెద్ద ఇల్లు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. అవన్నీ తట్టుకోగలమా!’’ సలహాలు ఇవ్వడం మానుకొని నీ పని చూసుకో టిఫిన్‌ బాక్స్‌ తీసుకొని హడావిడిగా వెళ్లిపోయాడు వెంకట్‌.

భవిష్యత్తు ఏమిటి?
‘‘ఈ ప్రకారంగా.. ఇప్పుటి యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తే బిజినెస్‌ డబల్‌ కాదు త్రిబుల్‌ అవ్వడం గ్యారెంటీ సార్‌! ఫ్రెండ్‌షిప్‌ డే, లవర్స్‌ డే, యూత్‌ డే..  మన గిఫ్ట్‌ కంపెనీకి వీళ్లు మంచి మార్కెట్‌.. ’’ మీటింగ్‌ హాల్‌లో వెంకట్‌కృష్ణ తన ప్రెజెంటేషన్‌ పూర్తి చేయగానే అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. అందరివైపు గర్వంగా చూసిన వెంకట్‌ బాస్‌ ముఖంలో ఏ భావం కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. బాస్‌ శంకర్రావు మౌనంగా ఉండటంతో మిగతా అందరి నోళ్లు మూతపడ్డాయి. ఏడుపదుల వయసు దాటిన శంకర్రావ్‌ సీరియస్‌గా ‘‘వెంకట్‌.. నీ ప్రెజెంటేషన్‌లో ఓ లోపం ఉంది. అదేంటో నీకు తెలుసా! ఫ్యామిలీ మిస్‌ అవడం. యూత్‌ బిజినెస్‌.. గురించి నువ్వు చెప్పింది ఈ కొద్ది రోజుల వరకే. నాకు నా కంపెనీ భవిష్యత్తు కావాలి. తల్లిదండ్రులు, పిల్లలు, నానమ్మ తాతయ్యలు.. కుటుంబంలోని ఈ రిలేషన్స్‌ గురించి నీ ప్రెజెంటేషన్‌లో లేదు. మనం చేసే పనిలో మనదేశపు విలువలు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. మన దేశపు ప్రాచీన సంపదైన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం, ఆత్మీయ అనుబంధాలలోని గొప్పదనం కోసం జర్మనీ, రష్యా, ఈజిప్ట్, టిబెటన్‌.. వంటì  ఎన్నో దేశాలు మన వైపు చూస్తున్నాయి. పరిశోధనలు చేస్తున్నాయి. వాళ్లు మన నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం మన మూలాలు మర్చిపోతే ఎలా?! ఇలాగైతే ముందుతరాలకు ఏం మిగులుస్తాం మరోసారి ట్రై చేయి. ఈ సెషన్‌ వేస్ట్‌’’ అంటూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు శంకర్రావు.

థెరపీతో ఆత్మ చైతన్య వృద్ధి
నేను పై చదువులకు పట్నం వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఆరోగ్యం బాగోలేదు. బెంగుళూరులో టాప్‌ టెన్‌ కంపెనీలో మంచి పోస్ట్‌కి సెలక్ట్‌ అయ్యాను. కానీ, ఆ సమయంలో నాన్నకు హార్ట్‌ ఆపరేషన్‌. నాతో చదువుకున్నవాళ్లు నాకన్నా మంచి హోదాలో ఉన్నారిప్పుడు. ఈ రోజు ఉదయం ఆఫీసులో ప్రెజెంటేషన్‌కి వెళుతుంటే అమ్మ ఏదో ప్రాబ్లమ్‌ అంటూ ఫోన్‌. ఇరవై ఏళ్లుగా నా ప్రతీ ఎదుగుదలకు ఏదో విధంగా అమ్మనాన్నలు అడ్డుపడుతూనే ఉంటున్నారు. నేను నా ఉన్నతి గురించి ఆలోచిస్తున్నాను. నా భార్య, నా బాస్‌ తల్లిదండ్రులు వారి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. నాకిది చాలా చిరాకుగా ఉంటోంది..’ అన్నాడు వెంకట్‌.
‘‘మీ తల్లిదండ్రులు మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనేది మీ భావన. మీ జీవితంలో ఎందుకు వృద్ధి లేదో మీరే చూడండి’’ అన్నారు కౌన్సెలర్‌.

థెరపీ మొదలయ్యింది. కళ్లు మూసుకొని ధ్యానముద్రలో కూర్చుకున్న వెంకట్‌కి మనోనేత్రంలో తన గత జీవితం 70 ఎమ్‌.ఎమ్‌ సినిమా దృశ్యంలా ఆవిషృతమైంది. ప్రస్తుతం నుంచి వెనక్కి ఆ ప్రయాణం సాగుతోంది. పెళ్లి, ఉద్యోగం, కాలేజీ రోజులు, బాల్యం.. అమ్మ గర్భంలో ఉన్న స్థితి.. అన్నీ దర్శిస్తున్నాడు. అక్కడ్నుంచి ఇంకా వెనక్కి వెళుతున్నాడు. టైమ్‌ మిషన్‌లో కాలాన్ని వెనక్కి తిప్పినట్టు సూక్ష్మ కాంతిగోళం నుంచి గత జన్మలోకి ప్రవేశించాడు.

 ఆ గత జన్మ గురించి వెంకట్‌ చెప్పడం మొదలు పెట్టాడు. ‘ఉద్యోగం కోసం విదేశాలలో నేను, తల్లిదండ్రులు ఊళ్లో. వృద్ధాప్యంలో వారు పడుతున్న అవస్థలను చూస్తున్నాను. తల్లిదండ్రి చనిపోయినప్పుడు కూడా నేను వారి దగ్గర లేను. చివరకు వారిని మట్టిచేసేటప్పుడు కూడా! వారికోసం దేశాలు దాటుకొని వచ్చేసరికి అంతా అయిపోయింది. ఎంతో ప్రేమగా జీవితమంతా కళ్లలో పెట్టుకుని నా కోసమే అన్నట్టు బతికిన నా తల్లిదండ్రులకు నేను ప్రేమను ఇవ్వలేకపోయాను. ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ అనంతమైన ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మళ్లీ జన్మ ఉంటే ఈ తల్లిదండ్రులకే పుట్టి, వాళ్లను ప్రేమగా చూసుకుంటాను. ఆనందాన్ని ఇస్తాను’ అనుకున్నాను.

తల్లిదండ్రులే వంతెన
లక్ష్మీ! నా ఫ్రెండ్‌ శేఖర్‌ ద్వారా గతజన్మ ప్రతిగమన చికిత్స తీసుకున్నాను. ఎందుకోసమైతే ఈ జన్మ తీసుకున్నానో ఆ విషయమే మర్చిపోయాను.  నా ఎదుగుదలకు నా తల్లిదండ్రి అడ్డు అనుకున్నాను. కానీ, వాళ్లే నా జీవితానికి వంతెన అని గుర్తించలేకపోయాను. చేసిన తప్పునే మళ్లీ మళ్ళీ చేస్తున్నాను. ఇక అలా చేయను. తప్పు దిద్దుకొని మన పిల్లలకు ఓ మంచి కానుక ఇస్తాను. అదే తాతయ్యను నానమ్మను. అంటూ ఊరుకు ప్రయాణమయ్యాడు వెంకట్‌. తల్లీదండ్రి, భార్య, పిల్లలతో తన జీవితం నిండుగా ఉన్న ఆనందాన్ని పొందుతున్నాడు వెంకట్‌. ఆ సంతోషం, తృప్తి వెంకట్‌ పనిచేసే చోటా వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల్లోనూ తను ఏ ఉన్నతిని ఆశించాడో దానిని చేరుకున్నాడు.


ఆత్మ వికాసం రంగులరాట్నంతో పోల్చవచ్చు. ఊర్ధ్వ్యలోకాలలో అంటే రాట్నం పై స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మ జన్మ ఎంపిక ఉంటుంది. కిందకు వస్తున్న కొద్దీ పుట్టుకకు సంబంధించిన పాఠాన్ని నిర్ధారించుకుంటుంది. జన్మ తీసుకున్న తర్వాత తిరిగి పైకి వెళ్లడానికి అంటే వృద్ధి సాధించడానికి నిరంతర సాధన చేస్తుంటుంది. ఆత్మచైతన్యం చేసే సాహసోపేతమైన నిర్ణయాలన్నీ జ్ఞానం కోసమే. నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడుగ్గా... ఎలా పుట్టాలన్నది కూడా ఆత్మచైతన్యం నిర్ణయించుకున్నదాన్ని బట్టే ఉంటుంది. అవ్యాజమైన ప్రేమను పంచడానికే ఆత్మ జన్మలు తీసుకుంటుంది. మానసిక, శారీరక వికలాంగులుగా జన్మ తీసుకునే చైతన్యాలు ఆ కుటుంబాలలో ప్రేమను నేర్పడానికే!

నేర్చుకోవడానికే ప్రయాణం
ప్రతి ఒక్క ఆత్మచైతన్యం తను ఎందుకు జన్మ తీసుకోవాలో ముందు నిర్ణయించుకుంటుంది. అందుకు ఎలాంటి పాఠం నేర్చుకోవాలి, ఎలాంటి సవాళ్లను అధిగమించాలి, ఏ ప్రదేశంలో, ఏ కుటుంబంలో పుట్టాలి? .. అనేది ఈ ప్రణాళికలో భాగం. కానీ, ఒక్కసారి తల్లి గర్భంలో చేరిపోయాక ‘మాయ’ అనేది ఇనుప తెరలా అడ్డుపడిపోతుంది. అప్పుడు మరపు వచ్చేస్తుంది. దాంతో నేర్చుకోవాల్సిన పాఠాలను మధ్యలోనే ఆపేస్తాం. దీంతో ఆత్మ చైతన్యం వృద్ధి పొందదు. ఎరుకతో గ్రహించేలా ఉన్నతికి సాయం చేసేదే గత జన్మ ప్రతిగమన చికిత్స. – డాక్టర్‌ న్యూటన్, పాస్ట్‌లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపిస్ట్, లైఫ్‌ రీసెర్చ్‌ అకాడమీ, హైదరాబాద్‌

ఆత్మ ప్రణాళికలో 7 సిద్ధాంతాలు
1.    ఆత్మ చైతన్యం పొందడం
2.    స్వీయ స్వేచ్ఛతో బుద్ధిని వికసింపజేసుకోవడం.
3.    పునర్జన్మ ద్వారా పై లోకాలలో ఉండే ఏకత్వస్థితిని భూమండలంలో పొందగలగడం.
4.    కర్త, క్రియలు కర్మకారణ శక్తికి దారి తీయడం.  
5.    ప్రతిజన్మలోనూ మంచి చెడులను తెలుసుకుంటూ పురోగమనిస్తూ ఉండటం.  
6.    పురోగమనాన్ని ఎరుకతో వేగవంతం చేసుకోవడం. అంటే, త్వరితంగా పాఠాలు నేర్చొకొని ముందుకు సాగడం.  
7.    మనమంతా విశ్వలోకం నుంచి వచ్చిన జీవాత్మలం. ఏకత్వంలోని ప్రేమతత్త్వాన్ని నింపుకొని చివరకు తిరిగి అక్కడకే చేరుకోవడం.
– నిర్మల చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement