గత జన్మ బంధం | Seen is ours tittle is yours | Sakshi
Sakshi News home page

గత జన్మ బంధం

Published Sun, May 27 2018 12:02 AM | Last Updated on Sun, May 27 2018 12:02 AM

Seen is ours tittle is  yours - Sakshi

‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అంటారు. అలా తెలుగు సినిమాలో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి చూస్తే అద్భుతం అనిపించే గోల్డ్‌ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇవి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...

గోదావరి నదీ తీరాన ఉన్న ఒక ప్రాంతానికి భార్య రాధతో కలిసి విహారయాత్రకు వచ్చాడు గోపీ. ఆ దంపతులిద్దరికీ ఇది మొదటి విహారయాత్ర. ఇద్దరికీ ఇటు చుట్టుపక్కలంతా పడవల్లో, లాంచీల్లో తిరగడం కొత్తగా ఉంది. తిరిగి తిరిగి అలిసిపోయి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగారు ఇద్దరూ. ఆ ప్రదేశానికి రాగానే గోపీని ఎక్కడెక్కడివో ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘‘ఏమైందండీ..’’ అని రాధ ఎంత అడుగుతున్నా పట్టించుకోకుండా చుట్టూ దేనికోసమో గాలిస్తూ తిరుగుతున్నాడు. అప్పుడతనికి కనిపించింది.. గౌరి. ‘ఎలా ఉండే గౌరి ఎలా మారిపోయింది?’ అనుకున్నాడు. గతం గుర్తొచ్చింది గోపీకి. గతమంటే గడిచిన కాలంలోని జీవితం కాదు. గడిచిన జీవితం. గత జన్మ. ‘‘గౌరీ నేనొచ్చాను చూడు.. గోపీని వచ్చాను చూడు..’’ అంటూ గౌరీని పలకరించాడు గోపీ. గౌరీ చివరిశ్వాసకు దగ్గర్లో ఉంది. గోపీని చూస్తూ చూస్తూ ఆమె ఆ తుదిశ్వాస విడిచింది. ‘‘ఎవరండీ ఈవిడ?’’ అడిగింది రాధ, గోపీకి దగ్గరగా వచ్చి కూర్చొని. గోపీ కథ చెప్పడం మొదలుపెట్టాడు. 

ఒక జన్మకాలం క్రితం. గోదావరి నదీ తీరం. గోపీ అనాథ. నదిమీద చిన్న పడవ నడుపుకుంటూ బతుకుతున్నాడు. ‘‘గోదారే మా తల్లి. నన్ను చేతులమీద మోసుకొచ్చి కాపాడుతుంది.’’ అంటాడు. గోదారి చుట్టూనే అతని జీవితం. అతణ్ని మావా.. మావా.. అనుకుంటూ తిరిగే ఓ స్నేహితురాలు గౌరీ ఉండనే ఉంది.రాధ జమీందారు కూతురు. కాలేజీ చదువులకు ఆమె వెళ్లాలంటే నది దాటే వెళ్లాలి. అందుకు గోపీ ఉండాలి. గోపీకి రాధ దేవత లాగా. రోజూ ఆమెకు ఒక పువ్వు ఇస్తాడు. ఆమె నవ్వితే ఆ శబ్దాన్ని వింటూ కూర్చుంటాడు. పల్లె పదాలతో పాటలు నేర్పించమని ఆమె అడిగితే పాడి నేర్పిస్తాడు. ఏం చేసినా రాధంటే ఇష్టంతోనే చేస్తాడు గోపీ. గౌరీకేమో గోపీ అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకునేవాడు గోపీనే అవుతాడని ఎదురుచూస్తూ ఉంటుంది గౌరీ. ‘‘నేను చస్తే నీ చేతుల్లోనే చస్తా..’’ అని శపథం చేసి మరీ చెబుతుంది.  ‘‘ఓసి పోయే! నువ్వు నా చేతుల్లో చచ్చేదేంటీ.. అయినా నీకు నాకు ఏంటీ..’’ అంటాడు గోపీ. ‘‘మావా! సత్య ప్రమాణంగా చెప్తున్నా.. ఆ గోదావరి సాక్షిగా చెప్తున్నా.. నేను చస్తే నీ చేతుల్లోనే చస్తా..’’ అని మళ్లీ అదే మాటను గట్టిగా నొక్కి చెబుతుంది గౌరీ. 

 గౌరీ, గోపీల కథతో సంబంధం లేకుండా రాధ.. గోపీని ఇష్టపడటం మొదలుపెట్టింది. ‘‘గోపీ.. ఎందుకురా నేనంటే నీకు అంత ఇదీ..’’ అని అడిగింది రాధ. ఆరోజు ఇటు చుట్టుపక్కలంతా పెద్ద ఎత్తున వర్షం. కాలేజీ నుంచి ఇంటికెళ్లే దారిలో రాధ చిక్కుకుపోయింది. ‘‘ఎందుకు అంటే.. ఎందుకు అంటే..’’ ఆలోచిస్తున్నాడు గోపీ. ‘‘ఎందుకంటే పోయిన జన్మలో నువ్వు నాకు రుణపడి ఉన్నావురా! అందుకు.’’ అంది రాధ. 
‘‘నిజమా అమ్మగారూ!?’’ అన్నాడు గోపీ. ‘‘నిజమే! ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’’ అంది రాధ.రాధ గోపీతో ఈ మాటన్న రెండో రోజే ఆమెకు పక్క ఊరి జమీందారు కొడుకుతో పెళ్లి కుదిరింది. వారం తిరిగేలోపే పెళ్లి. గోపీ ఆ పెళ్లిలో దగ్గరుండి అన్ని పనులూ చూసుకున్నాడు. జమీందారు కోరికమేరకు అందరికోసం గోపీ ఒక పాట కూడా పాడాడు. రాధ ఇప్పుడు ఒక ఇంటి కోడలు. ఊరొదిలి వెళ్లిపోతోంది. ‘’అమ్మాయి గారూ! మళ్లా ఎప్పుడొస్తారు?’’ అడిగాడు గోపీ. ‘‘నా చేతుల్లో ఏముందిరా!’’ భారంగా సమాధానమిచ్చింది రాధ. ‘‘అవున్లెండి! పెళ్లయ్యాక అంతా బాబు గారి ఇష్టం.’’ అంటూ రాధ భర్త దగ్గరికెళ్లి అడిగాడు గోపీ – ‘‘బాబు గారూ! మా అమ్మాయి గారిని మళ్లా మాకెప్పుడు చూపిస్తారు?’’ ‘‘అరే! ఎప్పుడో ఏమిటోయ్‌!! రెండు నెల్లో సంవత్సరాదికి ఇక్కడే ఉంటాంగా!’’ ‘‘బాబు గారూ! నా పడవ మీదే రావాలి.’’ అన్నాడు గోపీ. 

‘‘నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనీయదు గోపీ..’’ అంది రాధ, ముందునుంచీ మాట్లాడుతూ వచ్చినంత భారంగానే. రాధ వెళ్లిపోయాక గోపీ ఒంటరైపోయాడు. గౌరీ అన్ని సమయాల్లో అతని వెన్నంటే ఉన్నా ఒంటరైపోయాడు. గౌరీకి మాత్రం ఎప్పట్లానే గోపీ తప్ప ఇంకో ప్రపంచం లేదు. రోజులు గడుస్తున్నాయి. గౌరీ, గోపీల ప్రపంచాల్లో ఊహించని మార్పులు వచ్చేస్తున్నాయి. గౌరీకి రోజురోజుకు దగ్గరవుతున్నాడు గోపీ. సంవత్సరాది వచ్చింది. రాధను పడవ ఎక్కించి ఊరికి తీసుకురావడానికి బయలుదేరాడు గోపీ. ‘‘నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనీయదు గోపీ..’’ అని రాధ చెప్పినమాటలు అతనికి ఇంకా గుర్తున్నాయి. రాధ వచ్చింది. ఒడ్డు దగ్గర గుర్రపు బండి దిగి నిలబడింది. రాధ ఒక్కతే వచ్చింది. కూడా భర్త లేడు. ఎప్పటికీ తిరిగిరాలేని ప్రపంచానికి వెళ్లిపోయాడతను. రాధను చూడటంతోనే‘‘అమ్మాయి గారూ! ఏంటీ అన్యాయం.. ఏంటీ ఘోరం..’’ అంటూ నేలకూలిపోయాడు గోపీ. రోజులు గడుస్తున్నాయి. రాధకి ఇలా జరిగినప్పట్నుంచీ మనిషి మనిషిలా లేడు గోపీ. ‘‘నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు?’’ అని అడిగిన గౌరీకి కూడా ‘‘చేస్కోను.’’ అని సమాధానం ఇచ్చేంతలా అతడు బాధ నుంచి బయటపడటం లేదు. రాధని కలవనిదే ఉండలేడు గోపీ. ఈ పరిస్థితుల్లో ఆమె ధైర్యం అతనొక్కడే. కానీ ప్రపంచం వాళ్ల బంధం మీద నిందలేసింది. గోపీ తానింక ఇలాంటి ప్రపంచంలో బతకనని వెళ్లిపోతున్నాడు. రాధ ఈ విషయం తెలుసుకొని అతణ్ని వెంటాడుతూ వెళ్లింది. ‘‘మీరెందుకొచ్చారమ్మాయి గారు! ఈ పాడులోకం అనుకుంటున్నదే నిజమవుద్ది.’’ అన్నాడు గోపీ, రాధను చూడటంతోనే. ‘‘కానీ అదే నిజం కానీరా.. ఈ అబద్ధాలతో బతకడం కన్నా, ఆ నిజంలో చావడమే మేలు..’’ అంది రాధ. గోపీ పడవ తీశాడు. నది విజృంభిస్తోంది. భారీ వర్షం. ఆ గోదారిలోనే కలిసిపోయారు ఇద్దరూ.  అప్పట్నుంచీ గోపీ చేతుల్లోనే చావాలని గౌరీ ఎదురుచూస్తూ ఆ తీరం దగ్గరే గడుపుతూ వచ్చింది. అలాగే రాధపై తాను వేసిన నింద ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉండింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement