అడివంట
చెట్టూ పుట్టా కొండాకోనా ఆకూ అలమూ చేపాచెలమ ఇదండీ.. అడివంట అడవి వంట!
వెదురు కొమ్ముల కూర
ఏజన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో నివసించే గిరిజనులు వెదురు కొమ్ములు, వెదురు బియ్యం వండుకొని తింటారు. అదేవిధంగా అడవులలో ఉండే భారీ వృక్షాలకు పట్టిన గండు చీమలు గూళ్ళను దులిపి వాటిలోని గుడ్లను సేకరిస్తారు. వాటి చూర్ణంతో చారు కాసుకుంటారు. వెదురు కొమ్ములు, చీమల గూళ్ళు వర్షాకాలంలోనే దొరుకుతాయి.. ఈ కాలంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర, ఎర్ర చీమల చారు తప్పకుండా ఉంటాయి. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు ఉంటాయి. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు తింటారు. వెదురు కొమ్మే కదా అడవుల్లో అధికంగా దొరుకుతుందనుకుంటే పొరపాటే. ఆ కొమ్ముల కోసం గిరిజన మహిళలు అనేక ఇబ్బందులు పడతారు. వెదురు కూపులో(కొండ తుడుము) ఉండే కొమ్ములను కోయడం కోసం చేతులు పెడుతున్నప్పుడు పొదల్లో విష సర్పాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వెదురు ముళ్లు కళ్లకు, చేతులకు విపరీతంగా గుచ్చుకుంటాయి.
యారీ:
అడవి నుండి సేకరించిన వెదురు కొమ్ముల తొక్కలు తీసి, ఆ కొమ్ములను ఒక ప్లేట్లో సన్నగా తరగాలి. అనంతరం పొయ్యిమీద దాక (గిన్నె) పెట్టి దాంట్లో నీళ్ళు పోసి, కొమ్ముల తరుగును వేసి ఉడకపెట్టాలి. కొద్దిసేపటి తర్వాత పొంగు వస్తుంది. ఆ సమయంలో పచ్చిమిరపకాయ కోసి అందులో వెయ్యాలి. అలాగే ఉప్పు కూడా వేసి కొంతసేపు ఉడికిన తర్వాత ఆ కూరను ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టాలి. ఈ వెదురు కొమ్ముల కూరలో గుప్పెడు చింతచిగురు లేదా గోంగూర వేసుకుంటే అమోఘమైన రుచి. ఈ వెదురు కొమ్ముల కూరలో కారం వెయ్యకూడదు. వేస్తే కూర చేదుగా ఉంటుంది.
- కోడూరి ఆనంద్, సాక్షి, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి
బొంగు చికెన్
కావలసినవి:
చికెన్ - అరకిలో, నిమ్మకాయలు - 2 పచ్చి వెదురు బొంగు - 1, ఉల్లిపాయలు - పావుకిలో
పచ్చిమిర్చి - 5-6; పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి - సరిపడినంత, అల్లం, వెల్లుల్లి పేస్టు - కొంచెం, పచ్చి అడ్డాకులు - 2
తయారీ
కోడి మాంసాన్ని ముందుగా శుభ్రపరిచి, నిమ్మకాయ రసం పిండాలి. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి కలిపి నానబెట్టాలి.ఆ తర్వాత వెదురుబొంగును శుభ్రం చేసి అందులోకి ఈ చికెన్‌ను దట్టించాలి. బొంగుకు ఒక వైపు పచ్చి అడ్డాకులతో మూసివేయాలి. అడ్డాకులతో మూసిన భాగాన్ని కింద వైపు ఉండేలా ఈ బొంగును నిప్పుల పొయ్యిలో ఉంచాలి. ఇలా దాదాపు అరగంట పాటు నిప్పుల మధ్య ఉంచితే సరిపోతుంది.దీనిని నిప్పుల నుంచి బయటకు తీసి చల్లారేదాకా ఉంచితే రుచికరమైన బేంబూ చికెన్ రడీ!
- బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం సంజీవరావు, డుంబ్రిగుడ
విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో బేంబూ చికెన్‌కు ప్రసిద్ధి. మన్యంలో మాత్రమే లభించే ఈ చికెన్‌కు చాలా డిమాండ్ ఉంది. రుచికరమైన ఈ బేంబూ (వెదురు బొంగు) చికెన్‌ను పర్యాటకులు లొట్టలేసుకుని తింటారు. గిరిజన పండగలు, పబ్బాల్లోనూ, ప్రభుత్వం నిర్వహించే గిరిజన ఉత్సవ్‌ల్లోనూ, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విదేశీయులకు స్పెషల్ ఐటం ఈ బేంబూ చికెన్! ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ ఈ చికెన్‌నే తినాలనుకుంటారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు, అనంతగిరి, చాపరాయి పర్యాటక ప్రదేశాల్లో బేంబూ చికెన్ అందుబాటులో ఉంటుంది. కొంతమంది గిరిజనలకే ఈ చికెన్ తయారీ సాధ్యం..
పనస కాయ ముక్కలు ఎండు చేపల కూర
కావాల్సినవి:
పనసకాయ - కేజీ ముక్కలు; ఉప్పు - తగినంత ఎండు చేపలు - పావు కేజీ, ఉల్లిపాయలు - 2; ఇప్పనూనె - గరిటెడు
ఎండుమిర్చి - 5, పసుపు - కొద్దిగా (ఒక టీస్పూన్)
తయారీ:
ముందుగా పనసకాయపై పొట్టును తొలగించాలి. పనస ముక్కలను చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలను నీటితో శుభ్రం చేయాలి. కట్టెల పోరుు్యపై గంజు(గిన్నె)ను పెట్టుకోవాలి. గిన్నెబాగా వేడి అయిన తర్వాత ఇప్పనూనె పోయాలి. నూనె వేడి అయ్యాక అందులో రోట్లో మెత్తగా దంచిన ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పనస ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత పసుపు వేసి మరికొంత సేపు వేగనివ్వాలి. చేపలను నీటితో శుభ్రం చేసి పనస ముక్కల్లో వేసి బాగా కలియబెట్టాలి. కూరంతా ఉడికేంతసేపు గిన్నెపై నీళ్ల ఆవిరి పెట్టాలి. పనస ముక్కలు బాగా ఉడికే వరకు సన్నని మంట ఉండాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దించి.. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
నోట్: గొత్తికోయలు వంటకాలలో కారం వాడరు. కొన్ని వంటకాలలో మాత్రమే అప్పటికప్పుడు ఎండుమిర్చిని నానబెట్టి రోట్లో మెత్తగా నూరి వాడుకుంటారు.
- అలువాల శ్రీనివాస్, సాక్షి, ఏటూరు నాగారం, వరంగల్
ఘార్కంగ్ (మినప గారెలు)
పండగైనా, ఇంటికి అతిధులు వచ్చినా మినప గారెలు (ఘార్కంగ్) లేనిదే ఇక్కడి గిరిజనులు భోజనాలు పెట్టరు. పెళ్లికి ముందు- తర్వాత చే సే పూజలలో మినపగారెలను అడవితల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు.
కావల్సినవి
మినపగుళ్లు - అర కేజీ, వెల్లుల్లి - 10-20 పచ్చిమిర్చి - 6-7 (లేకపోతే ఎండుకారం) ఉప్పు - తగినంత, పసుపు - కొద్దిగా
జీలకర్ర - కొద్దిగా (టీ స్పూన్ కరివేపాకు - 3 రెమ్మలు, ఉల్లిపాయ - 2
తయారీ:
ముందుగా మినప పప్పును గంట-రెండు గంటల ముందు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.తర్వాత నీళ్లు వడకట్టి అందులో పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి.. వేయాలి. రోబేకల్ (రుబ్బు రోలు)లో పిండిని కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చేతితో అదిమి వడలుగా చేయాలి. తర్వాత వీటిని రొట్టెలు కాల్చే పెనంపై వేసి, కొద్ది కొద్దిగా నూనె చుక్కలు వేస్తూ గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి.
- ఆత్రం జగదీష్, సాక్షి, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్
కుండ చికెన్
కావల్సినవి చికెన్ - అర కేజీ పచ్చిమిరపకాయలు - 10-14 కొత్తిమీర - గుప్పెడు పుదీనా - గుప్పెడు పసుపు - అర టీ స్పూన్ టొమాటోలు - 2 ఉప్పు - తగినంత
తయారీ చికెన్‌ను శుభ్రం చేసి ఉంచాలి. పచ్చిమిరపకాయలను సన్నగా, నిలువుగా కట్ చేయాలి. ఇందులో కొత్తిమీర, పసుపు, ఉప్పు, చికెన్, తరిగిన టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఇలా కలిపిన చికెన్ మిశ్రమాన్ని కుండలో పెట్టి, పైన మట్టి మూకుడుపెట్టాలి. ఈ కుండను నిప్పుల పొయ్యి మీద పెట్టి, చికెన్‌ను ఉడికించాలి. 5 నిమిషాలకు ఒకసారి లోపలి మిశ్రమం కదిలేలా కుండను కదపాలి. పావు గంట ఉడికాక దించి, టేస్ట్ చేయడమే!
నోట్: కుండకు-మూతకు మధ్య గోధుమపిండి ముద్ద అదిమితే ఆవిరి బయటకు వెళ్లకుండా చికెన్ ఇంకా బాగా ఉడుకుతుంది.
బంజారా మటన్
కావల్సినవి మటన్ - అర కేజీ గరం మసాలా (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క) - పొడి చేయాలి. కారం - 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు - 2
టొమాటోలు - 2 (సన్నగా తరిగి మెత్తగా గుజ్జు చేయాలి) ఉప్పు - తగినంత కొత్తిమీర - చిన్న కట్ట నూనె - 3 టేబుల్ స్పూన్లు పసుపు - అర టీ స్పూన్ అల్లం ముద్ద - టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్
తయారీ
మటన్‌ని శుభ్రం చేసి పక్కనుంచాలి. మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి, నూనె పోయాలి. అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. దీంట్లో పసుపు, టొమాటో గుజ్జు, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడికాక ఇందులో సిద్ధంగా ఉంచుకున్న మటన్ ముక్కలు వేసి కలపాలి. 3 నిమిషాల తర్వాత గ్లాసు నీళ్లు పోసి కలపాలి. ముక్క ఉడికేదాక మంట ఉంచాలి. నీళ్లు తగ్గితే మరికాస్త కలుపుకోవాలి. ముక్క పూర్తిగా ఉడికాక దించుకోవాలి.
బొంగు చికెన్
Published Fri, Jul 8 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement
Advertisement