సంపూర్ణం | sakshi food special | Sakshi
Sakshi News home page

సంపూర్ణం

Published Fri, Oct 7 2016 10:23 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

సంపూర్ణం - Sakshi

సంపూర్ణం

పండుగ స్టార్ట్ అవ్వాలంటే... స్వీట్ చిన్నముక్కైనా పడాలి.
పండగ కంప్లీట్ అవ్వాలంటే మాత్రం పూర్ణం పడాల్సిందే.
ఈ దసరాను పరిపూర్ణం, సంపూర్ణం చేసే పూర్ణాలివి!
వెయ్యండి.  పండుగను ఎంజాయ్ చెయ్యండి.

 
 
పెసర పూర్ణాలు

కావలసినవి: పెసర పప్పు - అర కేజీ బెల్లం తురుము లేదా పంచదార - అర కేజీ  ఏలకుల పొడి - టీ స్పూను  మినప్పప్పు - అర కేజీ (తగినన్ని నీళ్లు జత చేసి సుమారు మూడు గంటలు నానబెట్టాలి  బియ్యప్పిండి -  100 గ్రా.  బియ్యపురవ్వ - 50 గ్రా.  ఉప్పు - కొద్దిగా  నూనె - డీప్ ఫ్రైకి తగినంత
 
తయారి
పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి రెండు విజిల్స్ రాగానే దించి, మెత్తగా మెదపాలి.  బెల్లం తురుము, ఏలకులపొడి జత చేసి బాగా కలిపి (మిశ్రమం గట్టిగా ఉండాలి). చల్లారాక  చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. మినప్పప్పులో నీళ్లు వంపి, మిక్సర్‌లో వేసి మెత్తగా అయ్యేవరకు గ్రైండ్ చేయాలి.   బియ్యప్పిండి, బియ్యపురవ్వ, ఉప్పు జత చేసి దోసెల పిండిలాగ కలిపి, సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పెసర పూర్ణం ఉండలను ఒక్కొక్కటిగా మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బాగా వేగిన తరవాత పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
 
పూర్ణం బూరెలు

కావలసినవి: మినప్పప్పు - పావు కేజీ బియ్యం - 100 గ్రా.; ఉప్పు - చిటికెడు పూర్ణాల కోసం: సెనగ పప్పు - పావు కేజీ బెల్లం తురుము - పావు కేజీ పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు ఏలకుల పొడి - టీ స్పూను
 నూనె - వేయించడానికి తగినంత
 
తయారి
సెనగపప్పును శుభ్రంగా కడిగి, మూడు గంటలసేపు నానబెట్టాలి. మినప్పప్పు, బియ్యం కడిగి 5 గంటలు నానిన తర్వాత నీళ్లు ఒంపేసి దోసెల పిండిలా రుబ్బుకోవాలి.    మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు జత చేయాలి.   సెనగపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉడికించి తీయాలి.  నీళ్లు పూర్తిగా ఇగిరిపోయేవరకు స్టౌ మీద ఉంచాలి.  బెల్లం తురుము జత చేసి మరోమారు కలిపి ఉడికించాలి. మిశ్రమంలో తడిపోయే వరకు ఉడికించి, దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి. కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు (పూర్ణాలు) చేసి పక్కన ఉంచాలి.    బాణలిలో నూనె కాగాక పూర్ణాలను మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి.
 
 
చిలగడ దుంప పూర్ణాలు

కావలసినవి: చిలగడ దుంపలు - 2  బెల్లం తరుగు - పావు కేజీ; నూనె - వేయించ డానికి తగినంత; ఏలకుల పొడి - అర టీ స్పూను, బియ్యం - పావు కేజీ; మినప్పప్పు - 150 గ్రా. నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
 
తయారి

బియ్యం, మినప్పప్పు మిశ్రమానికి తగినన్ని నీళ్లు జత చేసి, ఐదారు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బాలి.  చిటికెడు ఉప్పు జత చేయాలి.  చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి, సన్నగా తురమాలి.  స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక చిలగడదుంప తురుము వేసి, పచ్చి వాసన పోయేవరకు అంటే బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.    ఏలకుల పొడి, బెల్లం తురుము జత చేసి, చిక్కగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి. బాగా చల్లారాక చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె కాగాక ఈ ఉండలను బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి.   బాగా వేగాక పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
 
కేసరి పూర్ణాలు

కావలసినవి: మినప్పప్పు - అర కేజీ  బియ్యప్పిండి - పావు కేజీ  రవ్వకేసరి కోసం: బొంబాయి రవ్వ - అర కేజీ (నూనె లేకుండా వేయించాలి)  పంచదార - కేజీ; నెయ్యి - పావు కేజీ జీడిపప్పు - 100 గ్రా.; కిస్‌మిస్ - 100 గ్రా  నీళ్లు - లీటరు కంటె తక్కువ; నూనె - వేయించడానికి సరిపడా ఏలకుల పొడి - 2 టీ స్పూన్లు; కేసరి రంగు - చిటికెడు
 
తయారి
మినప్పప్పును సుమారు ఐదు గంటలు నానబెట్టి, నీరు ఒంపేసి గ్రైండర్‌లో వేసి, బజ్జీల పిండిలా రుబ్బుకోవాలి.  బియ్యప్పిండి, చిటికెడు ఉప్పు జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి.  ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, పంచదార వేసి బాగా కలిపి, మరుగుతున్న నీటిలో వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి. మధ్యమధ్యలో నెయ్యి వేస్తూ ఉడికించాలి.    జీడిపప్పులు, కిస్‌మిస్, ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి. అర టీ స్పూను కేసరి రంగును  నీళ్లలో వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కేసరిలో వేసి కలిపి, కేసరి ఉడికి, గట్టిపడగానే దించేయాలి. చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో ఉండను తీసుకుని మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
 
 కొబ్బరి బూరెలు
కావలసినవి బియ్యం - పావు కేజీ  బెల్లం తరుగు - అర కేజీ నీళ్లు - కప్పున్నర క్యారట్ తురుము - కప్పు నెయ్యి - కప్ప  పచ్చి కొబ్బరి తురుము - కప్పు ఏలకుల పొడి - టీ స్పూను నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 
 తయారి బాణలిలో నెయ్యి కరిగాక క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. సుమారు గంటసేపు బియ్యం నానబెట్టి, నీళ్లు ఒంపేసి పొడి వస్త్రం మీద ఆరబోయాలి.  తడి పూర్తిగా పోయాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. పిండిని జల్లించి, మెత్తటి పిండిని పక్కన ఉంచుకోవాలి.    మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి ఉండ పాకం వచ్చేవరకు ఉడికించి దించేయాలి. దీంట్లో బియ్యప్పిండి, క్యారట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.  మరోమారు స్టౌ మీద ఉంచి ఐదు నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి.  చిన్న చిన్న ఉండలు చేసి, చేతితో వడల మాదిరి ఒత్తి, బాణలిలో నూనె కాగాక వేసి, రెండు పక్కలా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకుని, చల్లారాక తినాలి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement