రుచిక్కుళ్ళు | sakshi food special | Sakshi
Sakshi News home page

రుచిక్కుళ్ళు

Published Fri, Dec 2 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

రుచిక్కుళ్ళు

రుచిక్కుళ్ళు

చక చకా మార్కెట్‌కు వెళ్లి... చిక చికా వచ్చేయండి!
‘నోరు తిరగట్లేదు... ఏంటీ చక చక... చిక చికా’ అనుకుంటున్నారా!
అదేనండీ... చిక్కుళ్ళతో వచ్చేయండి.
చిక్కుడు వండాలంటే నోరు తిరగనక్కర్లేదు. చేయి తిరగనక్కర్లేదు! చాలా ఈజీ!
చలికాలం... చిక్కుళ్ళ సీజన్!  చీప్ అండ్ బెస్ట్!
చిక్కుళ్ళు తెచ్చేయండి... చిక్కులు లేకుండా వండేయండి.
చిక్కగా, చక్కగా... ఎంజాయ్ చేయండి.

ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్...
అంతా... గాడ్స్ ఓన్ ప్యాకేజీ
చిక్కుళ్ళు!

చిక్కుడుకాయ మెంతికూర
కావల్సినవి:  చిక్కుడుకాయ - పావుకేజీ, మెంతికూర - పెద్ద కట్ట (2 కప్పులు), ఉల్లిపాయ - 1 , పచ్చి మిర్చి - 2, అల్లం,వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, నూనె - టేబుల్ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్, ఎండుమిర్చి - 2 (మధ్యకు విరవాలి), పసుపు - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత, కారం - పావు టీ స్పూన్

తయారీ:  చిక్కుడు కాయలను, మెంతికూరను శుభ్రం చేసి, సిద్ధంగా ఉంచుకోవాలి.  పొయ్యి మీద కడాయి పెట్టి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  అల్లం - వెల్లుల్లి పేస్ట్, చిక్కుడు కాయల ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, పసుపు, అర కప్పు నీళ్లు పోసి, పైన మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మంట తగ్గించి, నీళ్లన్నీ తగ్గేంత వరకు ఉంచాలి. దీంట్లో మెంతి ఆకులు, కారం వేసి కలపాలి. కూర పొడిగా అయ్యేంత వరకు ఉంచి దించాలి.

చిక్కుడుకాయ కుడుములు
కావల్సినవి:  చిక్కుడుకాయలు - పావుకేజీ, పచ్చి మిర్చి - 4 , ఉల్లిపాయలు - 2 , బియ్యప్పిండి - కప్పు (తగినంత), కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి తరుగు - టీ స్పూన్, నూనె - టీ స్పూన్

తయారీ:   చిక్కుడు కాయ నార తీసి, ముక్కలు చేయాలి. గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, చిక్కుడు కాయ వేసి ఉడికించి, పక్క నుంచాలి.పచ్చిమిర్చి, ఉప్పు కలిపి ముద్దగా నూరాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ఉడికించిన చిక్కుడు కాయ రుబ్బుకోవాలి.  గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుడు కాయ ముద్ద, బియ్యప్పిండి, ఉప్పు, కొత్తిమీర, వేసి బాగా కలపాలి.

చిన్న చిన్న ఉండలు తీసుకొని, అదిమి, ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి, దాంట్లో ఈ మిశ్రమాన్ని ఉంచాలి.  పాత్ర అడుగున కొద్దిగా నీళ్లు పోసి, పైన సిద్ధంగా ఉంచిన ఇడ్లీ ప్లేట్ పెట్టి, మూత ఉంచాలి. పొయ్యి మీద 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికించే ముందు మిశ్రమం పైన జీడిపప్పులు అలంకరించవచ్చు.  ఉడికిన చిక్కుడు కుడుములను టొమాటో పచ్చడి, కెచప్‌తో వడ్డించాలి.

చిక్కుడుకాయ గుడ్డుకూర
కావల్సినవి: చిక్కుడు కాయలు - పావు కేజీ, ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి), టొమాటో - 1 (సన్నగా తరగాలి), మునక్కాడ - 1 (మూడు అంగుళాల పొడవున కట్ చేసుకోవాలి), పచ్చి మిర్చి - 2 (అంగుళం సైజు ముక్కలుగా కట్ చేయాలి), జీలకర్ర - అర టీ స్పూన్, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్, కారం - టీ స్పూన్ (తగినంత), పసుపు - పావు టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూన్ + టీ స్పూన్, ఉడికించిన గుడ్లు - 3, కొత్తిమీర తరుగు - టీ స్పూన్

తయారీ:  చిక్కుడుకాయ రెండు వైపులా తొడిమ, నార తీసి, 2 అంగుళాల పొడవున కట్ చేసుకోవాలి.  ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, మునక్కాడలు సిద్ధంగా ఉంచాలి.  మందపాటి గిన్నె లేదా కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో చిటికెడు ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి, ఉడికించిన గుడ్లు వేసి 2-3 నిమిషాలు సన్నని మంట మీద వేయించి, తీసి పక్కనుంచాలి. అదే గిన్నెలో మిగిలిన నూనె కూడా వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, మునక్కాయలు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగాక అల్లం - వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరో 2-3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.  దీంట్లో కారం, ధనియాలపొడి, పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.  4 నిమిషాల తర్వాత  టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. టొమాటో ముక్క ఉడికి, కూర చిక్కబడేంతవరకు ఆగి, వేయించిన గుడ్లు వేసి కలిపి దించాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవచ్చు.

చిక్కుడుకాయ పలావ్
కావల్సినవి: చిక్కుడు గింజలు - పావు కేజీ, బాస్మతి బియ్యం - 2 కప్పులు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, యాలకులు - 6, లవంగాలు - 4, సాజీరా - అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు - 3, దాల్చిన చెక్క - చిన్న ముక్క, పుదీనా ఆకులు - కప్పు, మెంతి ఆకులు - అర కప్పు , ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, పచ్చి మిర్చి - 6 (సన్నగా చీల్చాలి), నీళ్లు - 4 కప్పులు, కొత్తిమీర - అలంకరణకు తగినంత

తయారీ:  చిక్కుడు గింజలలో నీళ్లు పోసి, ఉడికించి, వార్చి పక్కనుంచాలి. (చిక్కుళ్లు పై పొర వచ్చేలా ఉడికించాలి.)  బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంటపాటు నాననివ్వాలి.  మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి - అన్నీ కట్ చేసి సిద్ధంగా ఉంచాలి.  పొయ్యి మీద గిన్నె పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. దీంట్లో సాజీర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీంట్లో పుదీనా, మెంతి ఆకులు వేసి కలపాలి.   ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం - వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి కలపాలి.  దీంట్లో ఉడికించిన బీన్స్ వేయాలి. ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. నీళ్లనీ పూర్తిగా ఇంకిపోయి అన్నం ఉడికాక మంట తగ్గించాలి. మరో 5 నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. దీనిని ఏదైనా నచ్చిన గ్రేవీతో లేదా రైతాతో వడ్డించాలి.

చిక్కుడుకాయ బెల్లంకూర
కావల్సినవి: చిక్కుడు కాయ - పావు కేజీ, బెల్లం లేదా పంచదార - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి - 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు - 8 (కచ్చాపచ్చాగా దంచాలి), కరివేపాకు - 2 రెమ్మలు, జీలకర్ర - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, కారం - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, జీలకర్ర పొడి - పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత

తయారీ:  చిక్కుడుకాయలను శుభ్రం చేసి, ముక్కలు చేయాలి.  గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి, చిక్కుడుకాయలను ఉడికించి దించాలి.బాణలిలో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి.  దీంట్లో ఉల్లిపాయలు వేసి వేగాక, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, బెల్లం లేదా పంచదార వేసి కలపాలి.  ఉడికిం చిన చిక్కుళ్ళు వేసి కలిపి, 10 నిమిషాల సేపు ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement