వ్యాధులతో ఫైట్‌మిన్లు
యుద్ధం గెలవాలంటే యోధులు కావాలి కదా!
ఏ, బీ, సీ, డీ... లాంటి యోధులు కావాలి.
మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి రకరకాల వ్యాధులు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు ప్రతినిత్యం దాడి చేస్తూనే ఉంటాయి.
ఇలాంటి చొరబాటుదారులను తిప్పికొట్టాలంటే...
ఇలాంటి శత్రుమూకలను తరిమి తరిమి కొట్టాలంటే...
ఇలాంటి దుండగుల ముఠాను మట్టుబెట్టాలంటే...
ఏ, బీ, సీ, డీ... లాంటి విటమిన్ల సైన్యం
మనకు ఎంతో అవసరం.
ఈ యుద్ధవీరులు ఎక్కడ దొరుకుతారు? వాళ్లను మన సైన్యంలో ఎలా చేర్చుకోవాలి? శరీరానికి రక్షణకవచంగా ఎలా వాడుకోవాలి? తెలిపేదే.. ఈ ‘ఫైట్‌మిన్లు’.
విటమిన్స్... ఇవి కార్బోహైడ్రేట్స్‌లాగ కేలరీలనివ్వవు. ప్రొటీన్స్‌లాగ కండబలాన్నీ ఇవ్వవు. అయినా మన ఆరోగ్యానికి ఇవి అత్యవసరం. ఇవి లేనిదే ప్రధాన పోషకాలైన ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ ఎంత పనిచేసినా నిరుపయోగమే. ఆరోగ్యం సజావుగా ఉండాలంటే ఇవి అత్యంత కీలకం. ఇంత కీలకమైన ఈ విటమిన్స్ మనకు అసరమయ్యేది మాత్రంచాలా తక్కువ మోతాదులోనే అయినా, పలురకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్లన్నింటినీ తీసుకోవాల్సిందే.
పధ్నాలుగు..
బతుకుబండిని ముందుకు లాగించే విటమిన్స్ మొత్తం పధ్నాలుగు. వీటిలో నీటిలో కరిగేవి, కొవ్వుల్లో కరిగేవి అని రెండు రకాలుగా ఉంటాయి. బీ1, బీ2, బీ6, బీ12, విటమిన్ సి, బయోటిన్, బి9 మొదలైనవి నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వుల్లాగ ఇవి శరీరంలో నిల్వ ఉండవు. ఎక్కువైనవి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వుల్లో కరుగుతాయి. కొవ్వుతో పాటే ఇవి శరీరంలో నిల్వ ఉంటాయి. ఈ విటమిన్లను మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
దేని పని దానిదే..
విటమిన్ల పని చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఒక విటమిన్ పనిని ఇంకో విటమిన్ చేయలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి డి విటమిన్ పుష్కలంగా ఉండి సి విటమిన్ లోపముంటే సి విటమిన్‌ను భర్తీ చేసుకోవాల్సిందే తప్ప దాన్ని డి విటమిన్ భర్తీ చేయలేదు.
తక్కువైనా ఎక్కువైనా..
విటమిన్లు తక్కువైతే ఎన్ని జబ్బులు వస్తాయో అవసరానికి మించి తీసుకున్న విటమిన్లూ అన్నే ప్రమాదాలను తెచ్చిపెడ్తాయి. అతిగా తీసుకున్నవి ఒకరకంగా శరీరానికి విషతుల్యాలే.
నీటిలో కరిగే విటమిన్లు..
విటమిన్ సి
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐరన్‌ను గ్రహించి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే స్కర్వీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ సి దొరుకు పదార్థాలు: జామ, నారింజ, ద్రాక్ష, మామిడి, బొప్పాయి వంటి పళ్లు, టొమాటా, బంగాళదుంపలు వంటి కాయగూరలు, పాలకూర వంటి ఆకుకూరలు.
విటమిన్ బి9
ఎర్రరక్తకణాల నిర్మాణానికి, ప్రొటీన్ల జీవక్రియకు, జీవకణాల వృద్ధికీ తోడ్పడుతుంది. గర్భిణులకు ఈ విటమిన్ అత్యవసరం. గర్భస్థ శిశువుల్లో వెన్నుపూస సరిగ్గా వృద్ధి చెందని ‘స్పైనా బైఫిడా’ వ్యాధి రిస్క్‌ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది బి6, బి12 విటమిన్లతో కలిసి గుండెజబ్బులు, పక్షవాతం బారిన పడకుండా చూస్తుంది. బీ9 లోపం ఉన్నవారు మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే ఎర్రరక్తకణాలు ఎన్‌లార్జ్ అయ్యే వ్యాధికి లోనవుతారు.బి9 దొరికే పదార్థాలు: లివర్, చిక్కుళ్లు, ఆకు కూరలు, పుల్లటి పళ్లు, సోయాబీన్స్, పొద్దు తిరుగుడు గింజలు, మొక్కజొన్నలు, పచ్చి బఠాణీలు.
విటమిన్ బి1
కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ఆల్కహాల్ రక్తంలో కలిసేలా దోహదపడుతుంది. బి1 లోపం ఉన్నవాళ్లు బెరిబెరి, గుండెజబ్బులు, నాడీ సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే విటమిన్ బి1 మోతాదుకు మించి తీసుకుంటే తలనొప్పి, నిద్రలేమి, నీరసం, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. విటమిన్‌బి1 దొరికే పదార్థాలు: పాల ఉత్పత్తులు, పొట్టు ధాన్యాలు, లివర్, పంది మాంసం, ఎండిన చిక్కుళ్లు, నట్స్, బఠాణీలు.
విటమిన్ బి2
ఆహారపదార్థాల్లోని కొవ్వులు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ నుంచి శక్తి లాగేది విటమిన్ బి2నే. ఇది తక్కువైతే చర్మ వ్యాధులు వస్తాయి. ప్రత్యేకించి మూతి చుట్టూ ఉన్న చర్మానికి. అయితే విటమిన్ బి2 మోతాదు ఎక్కువైతే నష్టం జరిగినట్లు దాఖలాల్లేవు.
బి2 దొరికే పదార్థాలు: పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చికెన్, చేపలు, పాలకూర, పుట్టగొడుగులు, పొట్టు ధాన్యాలు.
విటమిన్ బి6
ప్రొటీన్‌ను కరిగించి, హెమోగ్లోబిన్ జీవక్రియను పెంచుతుంది. శక్తిని ఉత్పత్తి చేయడంలో, మెదడు సక్రమంగా పనిచేయడంలోనూ సాయపడుతుంది. జీర్ణాశయంలోని బ్యాక్టీరియా ద్వారా బి6 తయారవుతుంది. ఇది తక్కువైతే మాత్రం చర్మ సమస్యలు, నాడీ సమస్యలు తలెత్తుతాయి. మోతాదుకి మించి బి6ని తీసుకుంటే నరాలు క్షీణించే ప్రమాదం ఉంది.
బి6 దొరుకు పదార్థాలు: పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు,లివర్, పందిమాంసం, సోయాబీన్స్, ఓట్స్, పొట్టు ధాన్యాల ఉత్పత్తులు, పొద్దు తిరుగుడుపువ్వు గింజలు, బంగాళదుంపలు, అరటి పళ్లు.
విటమిన్ బి12
ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, కణాల జీవక్రియకు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో విటమిన్ బి12 కీలకంగా పనిచేస్తుంది. అయితే, కొంతమంది బి12 విటమిన్‌ను గ్రహించలేరు. అలాగే శాకాహారులకు కూడా ఇది తగినంత అందదు. అలాంటివారు బి12 సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.బి12 దొరుకు పదార్థాలు: మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు.
విటమిన్ బి3
చర్మ పోషణలో పాత్ర వహిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. సాధారణంగా బి3 లోపం ఏర్పడదు. మోతాదు మించితే మాత్రం లివర్ సమస్యలు తలెత్తుతాయి.బి3 దొరుకు పదార్థాలు: చికెన్, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం, చేపలు, పల్లీలు, పొట్టు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పుట్ట గొడుగులు.
విటమిన్ బి5
కొవ్వులు, కార్బోహైడ్రేట్ మెటబాలిజం చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీనికికి నిర్దిష్టమైన మోతాదేమీ సూచించలేదు. మోతాదు ఎక్కువైతే దుష్ఫలితాలు సంభవించిన దాఖలాలూ లేవు. బి5 దొరుకు పదార్థాలు: మాంసం, లివర్, పాల ఉత్పత్తులు, పల్లీలు, బాదంపప్పు, చిరుధాన్యాలు.
కొవ్వుల్లో కరిగే విటమిన్లు
విటమిన్ ఎ
చక్కటి కంటి చూపు, ఎముకల వృద్ధికి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రోగనిరోధక శక్తి మెరుగుదలకు ‘ఎ’ విటమిన్ అత్యంత అవసరం. దీని లోపం వల్ల రేచీకటి వస్తుంది. మోతాదు మించితే కాలేయ సమస్యలు, ఎముకలు దెబ్బతినడం, వైకల్యంతో ఉన్న పిల్లలు పుట్టడం వంటి ప్రమాదాలున్నాయి. విటమిన్ ఎ దొరుకు పదార్థాలు: పాలకూర, క్యారెట్స్, మామిడిపళ్లు, టొమాటా.. వంటి ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉన్న అన్ని ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటుంది. అలాగే లివర్, చేపలు, పాల ఉత్పత్తుల్లో కూడా లభ్యమవుతుంది.
విటమిన్ డి
ఎముకల వృద్ధికి అత్యంత అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్‌లు మోతాదు మించకుండా నియంత్రిస్తుంది. ఇది లోపిస్తే పిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్లల్లో ఎముకలు మెత్తబడే ఆస్టియోమలేషియా జబ్బుల వస్తాయి. మోతాదు మించితే వికారం, తలనొప్పి, రక్తపోటు, కిడ్నీసమస్యలు తలెత్తుతాయి.విటమిన్ డి దొరుకు పదార్థాలు: పాల ఉత్పత్తులు, గుడ్డులోని పచ్చసొన, ఫిష్‌లివర్ ఆయిల్, చిరుధాన్యాలు.
విటమిన్ ఇ
ఎర్ర రక్తకణాల రక్షణలో, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా ఉండడంలోనూ విటిమిన్ ఇ సహాయం చాలా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. విటమిన్ ఇ లోపం చాలా అరుదు. మోతాదు ఎక్కువైతే అధిక రక్తస్రావానికి, జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తుంది.
విటమిన్ ఇ దొరుకు పదార్థాలు: వెజిటేబుల్ ఆయిల్స్, కాయగూరలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తులు, నట్స్, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, పల్లీలు.
విటమిన్ కె
రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది. నవజాత శిశువుల్లో, జీవక్రియ మందగించిన వాళ్లలో దీని డెఫిషియెన్సీ కనపడుతుంది. విటమిన్ డిలోపం చిన్న దెబ్బకే తీవ్ర గాయాలవడం, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ కె దొరుకు పదార్థాలు: ఆకు కూరలు, పంది మాంసం, మాంసం, లివర్, బ్రకోలి, సోయా బీన్స్, ఆకు కూరలు. ఇన్‌పుట్స్: సుజాత స్టీఫెన్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ మధురిమ సిన్హా, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
సి విటమిన్
విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలు తిన్న వారికి క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని, అదే సమయంలో అధికమొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల డయేరియా, కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదమూ ఉంటుందని కొన్ని అధ్యయానాలు చెప్తున్నాయి
డి విటమిన్
ఒక్క డి విటమిన్ తప్ప ఇంకే విటమిన్ శరీరంలో తయారు కాదు. చర్మం మీద సూర్యరశ్మి పడడం వల్ల డి విటమిన్ తయారవుతుంది. జీర్ణాశయంలోని బాక్టీరియా వల్ల కూడా కొన్ని విటమిన్స్ తయారవుతాయి. కానీ చాలా వరకు విటమిన్స్‌ను ఆహారం ద్వారా బయట నుంచే పొందాల్సిందే.