కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. ఈమధ్య గుండెజబ్బులు చిన్న వయసులోనే వస్తున్నాయని చదివాక ఆందోళనగా ఎక్కువైంది. దయచేసి నివారణకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయండి. - రవి, నల్లగొండ
గుండెజబ్బుల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
కుటుంబ చరిత్రలో కొలెస్ట్రాల్ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకంటూ ఉండాలి. అలాగే శాకాహారం (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం, కొవ్వులను పూర్తిగా తగ్గించడం వంటి ఆహార నియమాలు పాటిస్తూ, అవసరాన్ని బట్టి కొలెస్ట్రాల్ నియంత్రణకు మందులు తీసుకుంటూ గుండెజబ్బులను నివారించుకోవచ్చు గుండెపోటుకు ప్రధాన కారణం డయాబెటిస్. అందుకే ఆ సమస్య ఉన్నవారు డయాబెటిస్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ కనీసం మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ, వారు సూచించిన విధంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే ఈ వ్యాయామాలు గుండెకు భారంగా పరిణమించకుండా చూసుకోవాలి పొగాకు, దాని సంబంధించిన వస్తువులను పూర్తిగా మానేయాలి.
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 62. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువసార్లు వస్తుంటుంది. డాక్టర్లు పరీక్ష చేసి షుగరు వ్యాధి లేదన్నారు. కానీ ప్రోస్టేట్ గ్రంధి వాచడం వల్ల ఈ సమస్య కలిగిందన్నారు. ఇది తగ్గడానికి మందులు తెలియజేయ ప్రార్థన. - కె. వీరభద్రరావు, విశాఖపట్నం
ప్రోస్టేట్ గ్లాండ్‌ను ఆయుర్వేద పరిభాషలో ‘పౌరుషగ్రంధి’ అంటారు. ఇది కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఇది కొద్దిగా పరిమాణం పెరగడం సహజం. దానివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్రం మాటిమాటికీ వస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ గ్రంధికి ఇన్ఫెక్షనూ సోకవచ్చు. కొందరిలో ఈ వాపు క్యాన్సరుగా పరిణమించవచ్చు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ దిగువ సూచించిన మందుల్ని రెండు నెలల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి.
సప్తవింశతి గుగ్గులు (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2
చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2
చందనాసవ (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి.
నా వయసు 23. తరచూ తలలో పేలు బాధిస్తున్నాయి. దీనికి మందు చెప్పండి.
- రాధాబాయి, నకిరేకల్లు
శిరోజాలలో మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే తలకు పేలుపట్టే పరిస్థితి రాదు. ప్రతి రాత్రి ‘నింబతైలం’ (వేపనూనె) తలకు రాసుకుని, మరుసటిదినం కుంకుడుకాయ చూర్ణంతో తలస్నానం చేయండి. సీతాఫలాల్లోని గింజల్ని ఎండబెట్టి, పొడిచేసి, ఆ చూర్ణాన్ని నీళ్లలో ముద్దగా చేసి రోజు విడిచి రోజు శిరోజాలకు పట్టించండి. పది రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ‘కుమార్యాసవ’ ద్రావకాన్ని ఉదయం, రాత్రి నాలుగేసి చెంచాలు... సమానంగా నీళ్లు కలిపి ఒక నెలపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్