మెటల్‌ కృష్ణ | sakshi interview with posani krishna murali | Sakshi
Sakshi News home page

మెటల్‌ కృష్ణ

Published Sat, Sep 16 2017 11:55 PM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

మెటల్‌ కృష్ణ - Sakshi

మెటల్‌ కృష్ణ

నెత్తి కొట్టుకోడానికి ఏ రాయి అయితేనేం? అలా అనుకోకండి. చాలా తేడా ఉంది. మెత్తటి రాయితో విషయం అర్థమౌతుంది. మెటల్‌ రాయితో జీవితం మొత్తం సెట్‌ అవుతుంది. పోసాని మాటలు మెటల్‌ రాళ్ల కంటే ఎక్కువ. మెటల్‌ బులెట్‌లు అనుకోండి! రక్తం చూసే, ప్రాణం తీసే బులెట్‌లు కావు. లైఫ్‌ని చక్కదిద్దే స్వాభిమానపు బులెట్‌లు! ఎక్కడా తగ్గొద్దంటాడు. ఇంకొకరి కోసం అసలు తగ్గొద్దంటాడు. తెగింపు లేకుంటే ఆలోచనలు తెగవంటాడు. ఈ సండే మీ కోసం... పోసాని కృష్ణ మురళి పాఠాలు.

► ‘వెన్నుపోటు పొడిచేవాళ్లు ఎక్కువయ్యారు. అవకాశాలు రానివ్వడంలేదు’ అని ఓ ఫంక్షన్‌లో అలీగారు అంటే, ‘అవును. వెన్నుపోటు పొడిచేవాళ్లు కొనసాగు తున్నారు’ అన్నారు. మిమ్మల్ని ఎవరైనా?
నన్నా? ఛాన్సే లేదు. ఎవరైనా నన్ను వెన్నుపోటు పొడవాలంటే నేను వెన్ను చూపించాలి కదా. చూపించను. పోసానిని ఎవరూ ఏమీ చేయలేరు.

►మీరెవరి విషయంలో అయినా అలా చేశారా?
నాకవసరం లేదు. అవతలివాళ్లది లాక్కునే అలవాటు లేదు. నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా అంతే.

►మరి సేవా కార్యక్రమాల్లాంటివి?
మాటిస్తే వెనక్కి తీసుకోకూడదు. చెక్కు ఇస్తే బౌన్స్‌ అవ్వకూడదు. ఇది నా పాలసీ. టీవీల్లో చాలామంది చెబుతుంటారు. ‘ఇతనికి 5 లక్షలు ఇస్తున్నా’ అని. ఇవ్వరు. చెక్కు ఇస్తే బౌన్స్‌ అవుతుంది. అలాంటివి చాలా చూశా. నాకు 10 రూపాయలు వస్తే 2 రూపాయలే ఇస్తాను. బాగా డబ్బులు వచ్చినప్పుడు నాకు మంచి జరుగుతుందని ఇతరులకు సాయం చేస్తాను. 15 మందికి గుండె ఆపరేషన్లు చేయించా. అందరూ బతికారు. ఫస్ట్‌ ఆపరేషన్‌కి మాత్రం వేరేవాళ్ల సాయం తీసుకున్నా. మిగతాదంతా సొంత డబ్బే. ఇప్పుడు ‘బతుకు జట్కాబండి’ ప్రోగ్రామ్‌ చేస్తున్నా కదా. ఆ షోకి వచ్చిన ఫ్యామిలీస్‌కి సంబంధించిన ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నా.

► మీలో గొప్ప రైటర్‌ ఉన్నారు. 150 íసినిమాల వరకూ రైటర్‌గా చేశారు. ఇప్పుడా రైటర్‌ని ఎందుకు పక్కన పెట్టేశారు?
పక్కన పెట్టలేదు. మత్తుమందు ఇచ్చా (నవ్వుతూ). పరుచూరి బ్రదర్స్‌ దగ్గర రైటర్‌గా చేసినప్పుడు కొంతమంది రైటర్స్‌ జీవితం నన్ను ఆలోచనలో పడేసింది. ఆత్రేయగారు గొప్ప రచయిత. జీవితం చివర్లో ‘నేను రాస్తాను.. అవకాశం ఇవ్వండి’ అని అడిగే పరిస్థితిలో ఆయన ఉండటం బాధ అనిపించింది. ‘నాలుగైదు వేలు ఇచ్చినా పర్లేదు. ఒక స్క్రిప్ట్‌ ఇవ్వండి’ అనేవారు.

పరుచూరి వెంకటేశ్వరరావుగారితో ‘సార్‌ .. ఆత్రేయగారు వస్తున్నారు. మీతో స్క్రిప్ట్‌ గురించి చెప్పమన్నారు’ అంటే, ‘‘ఆయన చాలా పెద్ద రైటర్‌. ఆయన్ని అసిస్టెంట్‌గా పెట్టుకుంటే మనల్ని హీనంగా మాట్లాడతారు. ఏమీ చేయించకుండా... ‘ఇదిగో ఈ నాలుగువేలు ఉంచండి’ అంటే ఆయన్ను తక్కువ చేసినట్లవుతుంది. అందుకే ఎవరైనా ఆత్రేయగారికి సన్మానం చేస్తే, ఆ సందర్భంలో విలువైన బహుమతులు ఇవ్వాలి తప్ప, విడిగా డబ్బులివ్వడం బాగుండదు’’ అన్నారు.

అలాగే, మద్దిపట్ల సూరిగారు అని ఇంకో రైటర్‌ వచ్చేవారు. చాలా సఫర్‌ అవుతుంటే ‘ప్రాణ మిత్రుడు’ అనే సినిమాకి మూడు వేలు ఇచ్చి, ఒక వెర్షన్‌ రాయమన్నారు. కానీ, ఒక్క ముక్క కూడా వాడలేదు. పని చేయించుకోకుండా డబ్బులిస్తే వాళ్లను అవమానపరిచినట్లు కాబట్టి, అలా చేసేవారు. ఇవన్నీ చూశాక మనం దయనీయ స్థితిలో ఉండకూడదనుకున్నా. 100కి పైగా సినిమాలు రాసేశాను. ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నా.

► మరి.. డైరెక్షన్‌కి ఎందుకు రూట్‌ మార్చారు?
రైటర్‌గా సినిమాలు ఉన్నప్పుడే డైరెక్టర్‌ కావాలనిపించి, ‘శ్రావణమాసం’ తీశా. పెద్ద ఫ్లాప్‌. 70 లక్షలు పోయాయి. కో–డైరెక్టర్‌ మాట నమ్మి, ఆ సినిమా చేశాను. నిజానికి నేను రెండు కథలు చెప్పా. ‘శ్రావణమాసం’, ‘ఆపరేషన్‌ దుర్యోధన’. మాస్‌ సినిమా ఎందుకు? ఈ కథ తీయమన్నాడు తను. ఆ డెసిషన్‌ రాంగ్‌. సినిమా ఫ్లాప్‌ అయినా ఫైనాన్స్‌ చేసినవాళ్లకు వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇచ్చేశా.

‘ఎందుకయ్యా ఈయనకు డైరెక్షన్‌. పెద్దోడైపోదామనా?’ అనే ఫీలింగ్‌ చాలామందికి ఉంటుంది కదా. అందుకే హిట్‌ సినిమా తీయాలనుకున్నా. మల్లికార్జునరావు మళ్లీ ఫైనాన్స్‌ చేస్తానన్నారు. కోటీ 30 లక్షలవుతుందంటే ఇచ్చారు. పెద్ద హిట్‌. అదే ‘ఆపరేషన్‌ దుర్యోధన’. 10 కోట్లు మిగిలాయి. ఆయన ఏం కావాలని అడిగితే, ‘70 లక్షలు పోయాయి. అవి ఇవ్వండి చాలు’ అన్నా. 65 ఇచ్చి, ఓ కారు పంపిస్తే.. ‘కారు వద్దు’ అని పంపించేశా. తర్వాత చేసిన ప్రతి సినిమాకీ ఒక పెద్ద డైరెక్టర్‌ ఎంత సంపాదిస్తాడో అంత సంపాదించాను.

►  వేరే డైరెక్టర్లతో సినిమాలు చేసేటప్పుడు డైలాగ్స్, డైరెక్షన్లలో ఇన్‌వాల్వ్‌ అవుతారా?
మురళీగారు.. ‘ఆ డైలాగ్‌ కొంచెం చూస్తారా’ అంటే అప్పుడు చూస్తా. ఒకవేళ నాకు డైలాగ్‌ నచ్చకపోతే చెప్పనంటా. అది ఎంత పెద్ద డైరెక్టర్‌ అయినా, నిర్మాత అయినా. ఆ డైలాగ్‌లో ఆడవాళ్లను తిట్టాలనుకోండి... నిజంగా అవసరం అనిపిస్తేనే తిడతా. మగవాళ్లనైనా అంతే. ఆ డైలాగ్‌ వద్దంటే చెప్పాల్సిందే అన్నవాళ్లు లేరు. తీసేస్తారు. డైరెక్షన్‌ జోలికి వెళ్లను. నాకు నచ్చకపోతే సినిమాలు చేయను. పూరి జగన్నాథ్‌గారు నాకు పెద్ద పెద్ద వేషాలు ఇచ్చారు. ఆ సినిమాలకు నాకు పేరు వచ్చింది.

‘పైసా వసూల్‌’కి 14 రోజుల వేషం ఒకటి చెప్పారు. కాకపోతే నైట్‌ 7 నుంచి మార్నింగ్‌ 4 వరకు షూటింగ్‌ అన్నారు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ కూడా నైట్‌ షూట్స్‌ కారణంగానే వదులు కున్నా. రాత్రిపూట షూటింగ్‌ చేయనంటున్నది అహంకారంతో కాదు. నాకు నా ఫ్యామిలీ, హెల్త్‌ ముఖ్యం. రెండూ లేనప్పుడు ఎన్ని డబ్బులొచ్చి మాత్రం ఏం ప్రయోజనం? నా ఫీలింగ్‌ని డైరెక్టర్లందరూ అర్థం చేసుకున్నారు. నైట్‌ చేయడం వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ, ఒక లక్షకి ఒక నెల, రెండు లక్షలకు రెండు నెలల ఆరోగ్యం పోతుంది. రాత్రి 7, 8 గంటలు నిద్రపోవడం నా అలవాటు.

► కొంచెం దూకుడుగా ఉంటారు.. దురుసుగా మాట్లాడతారు కాబట్టి శత్రువుల లిస్ట్‌ చెప్పమంటే వేళ్ల మీద లెక్కపెట్టలేరేమో...
ఒక్క శత్రువు కూడా లేడు. నా గురువులతో పని చేశా. నా శిష్యులతోనూ చేస్తున్నా. అది నా అదృష్టం. మా గురువులకి నేను ఒక్కణ్ణే ప్రియమైన శిష్యుణ్ణి. ప్రియమైన శత్రువుని. చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చా. ‘పోసాని మంచోడు కాదు. వీణ్ని తీసేయాలి’ అని ఒక్కరు కూడా అనలేదు. మీరు వ్యక్తిగతంగా ఎవర్నైనా అడగండి. ‘వాడి లెక్క వాడికి ఇస్తే గొడవలు ఉండవు’ అంటారు. కొంతమంది రైటర్స్‌ని తర్వాత రావయ్యా అనేవాళ్లు. వెళ్తే రిలీజ్‌ ముందు కలవమనేవాళ్లు. ఆ తర్వాత రిలీజ్‌ హడావిడిలో ఉన్నా.. ఇప్పుడు కాదు అనేవాళ్లు. సినిమా పోతే.. ‘ఇంకేం ఇస్తాం..’ అనేవాళ్లు. ఇలా డబ్బులు పోగొట్టుకున్న రైటర్లు చాలామంది ఉన్నారు. నాకెవరూ డబ్బులు ఎగ్గొట్టలేదు. అలాగే, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ల దగ్గర నేను ముక్కుపిండి డబ్బులు తీసుకోలేదు.

► ముక్కుసూటిగా వ్యవహరిస్తే తొక్కేస్తారని భయపడి సర్దుకుపోయేవాళ్లే ఎక్కువ. బహుశా మీరు ఇండస్ట్రీకి వచ్చేనాటికే ఫైనాన్షియల్లీ ఫుల్‌ సౌండేమో?
కష్టాల్లో ఉన్నప్పుడే ఇక్కడికొచ్చా. కానీ, కష్టాలు తెలియకుండా పెరిగా. మా చిన్నప్పుడు మా నాన్నగారికి 1200 జీతం వచ్చేది. అప్పట్లోనే మంచి బట్టలు, లెదర్‌ చెప్పులు. అప్పుడు హైదరాబాద్‌ అంటే గన్నవరం నుంచి ఫ్లయిట్‌లోనే. టిక్కెట్‌ కాస్ట్‌ 225 నుంచి 240 రూపాయలు. హైదరాబాద్‌ టు మా కాకాని వెళ్లడానికి ఫ్లయిట్‌లో గన్నవరం వెళ్లి, అట్నుంచి మా ఊరు వెళ్లేవాణ్ణి. మాకు రెండు మూడెకరాలు పొలం ఉండేది. మా పూర్వీకులకు గొల్లపూడిలో ఐదెకరాల్లో పోసాని నరసింహ చౌదరి హై స్కూల్‌ అని ఓ స్కూల్‌ ఉండేది. మా పెదనాన్నది ఆ స్కూల్‌. ఆయనకు పిల్లలు లేరు. సడన్‌గా చనిపోయారు. బంధువులందరూ ఆయన ఆస్తి కొట్టేస్తే అసలైన వారసులం ఉన్నాం కాబట్టి, గొడవ అవుతుందనుకున్నారు.

మా నాన్నని పిలిచి, అందరం పంచుకుందాం అన్నారు. మొత్తం 80 కోట్లు ఆస్తి. పంచుకోవడానికి ఒప్పుకోకపోతే ఆస్తంతా మాదే. కానీ, నాన్న ఓకే అన్నారు. మీరెలాగూ ఈ ఊరు రారు కదా..  రెండు లక్షల 10వేలు ఇస్తాం అన్నారు. అలాగే ఇవ్వండి అన్నారు. మిగతాది 70, 80 మంది పంచుకున్నారు. అయినా మేం కంఫర్ట్‌. మా ఆస్తులను నాన్నగారు పేకాటలో పోగొట్టేశారు. అమ్మకి ఏమీ తెలియదు. తెలుసుకుని అడిగితే, అవమానం ఫీలై, ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే నాకు డిగ్రీ అయిపోయింది.

► ఆ తర్వాత మీ లైఫ్‌ జర్నీ గురించి?
హైదరాబాద్‌ వచ్చేశా. నా సర్టిఫికెట్స్‌ చూసి, ఓ చిట్‌ఫండ్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఇచ్చారు. జాబ్‌లో జాయిన్‌ అయిన నెలకే లంచాలు తీసుకుంటున్నాడని ఆధారాలు చూపించి, మేనేజర్‌ను డిస్మిస్‌ చేయించా. అప్పటినుంచి సెంట్రల్‌ ఆఫీసులో ఉండే మేనేజర్లు కొంతమంది పగబట్టారు. కొత్త మేనేజర్‌ వచ్చాడు. ఆ కుర్రాడితో జాగ్రత్త అని ముందే ఆయనకు చెప్పారు. ఏజెంట్స్‌ ద్వారా చిట్టీలైతే కంపెనీ కమీషన్‌ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, నేను వెళ్లి ఇంటింటికీ తిరిగి, చిట్టీలు వేయించేవాణ్ణి.

ఆయన వచ్చీ రాగానే, ‘నాకు తెలియకుండా బయటకు వెళ్లడానికి వీల్లేదు’ అన్నాడు. నాకేమో పేరు రావాలని ఉండేది. ఏజెంట్స్‌తోపాటే నేనూ వర్క్‌ చేసేవాణ్ణి. ఎండీ ‘కమీషన్‌ వద్దా?’ అంటే జీతం ఇస్తున్నారుగా అనేవాణ్ణి. అప్పటి నుంచే లంచాలకు అలవాటు పడితే ఓ 500 కోట్లు సంపాదించేవాణ్ణి. ‘సార్‌ నేను ఇక్కడ కూర్చోలేను. బయటికి వెళ్లి చిట్టీలు తీసుకొస్తా. తీసుకురాలేకపోతే నన్ను తీసేయండి’ అన్నా. వద్దన్నాడు. ‘సన్నాసి’ అని తిట్టా. మేనేజర్‌ని తిడితే ఊరుకుంటారా? సెంట్రల్‌ ఆఫీస్‌ నుంచి ‘రౌడీయిజమ్‌ చేస్తున్నావా?’ అని ఫోన్‌. వాడే సన్నాసి అనుకుంటే నువ్వింకా పెద్ద సన్నాసివి అన్నా. ఎండీగారికి నేనంటే ఇష్టం.

కానీ, పైవాళ్లను తిట్టినందుకు ఖమ్మంకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అక్కడ ఉండలేక జాబ్‌ మానేసి,  మద్రాసు వెళ్లా. అక్కడ కూడా ఇవే కష్టాలు. కానీ, నో కాంప్రమైజ్‌. తెలుగు ఇండస్ట్రీకి రావడం నా అదృష్టం. నేను ఎవర్నైనా గుర్తు పెట్టుకోవాలంటే అది పరుచూరి బ్రదర్స్‌నే. ౖడైరెక్టర్లలో వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, సురేందర్‌ రెడ్డి వంటి వాళ్లు మంచి పాత్ర లిచ్చారు. ఇప్పుడు నా మేనల్లుడు కొరటాల శివ నాకు మహేశ్‌బాబు సినిమాలో మంచి వేష ఇచ్చారు. ఇంతదాకా వచ్చానంటే టాలెంట్‌తోనే వచ్చా. లక్‌తో కాదు. రాసి పైకి వచ్చా.. చేసి (యాక్టింగ్‌– డైరెక్షన్‌) పైకి వచ్చా.

► ఫ్లాష్‌బ్యాక్‌లో మీ రాజకీయ జీవితం గురించి?
నాగార్జున యూనివర్సిటీలో జనరల్‌ సెక్రటరీగా ఎక్కువ మెజార్టీతో గెలిచాను. 1983లో తెలుగు దేశం ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆఫర్‌ చేసింది. అప్పటికి మా నాన్న చనిపోయారు. ఆ బాధలో ఉన్నాను. వేరే దేని మీదా దృష్టి లేదు. నాకప్పుడు ఎమ్మెల్యే అంటే గన్‌మేన్‌ ఉంటాడు. డబ్బులు కాజేయచ్చని తెలీదు. తెలిసినా ఒప్పుకునే వాణ్ణి కాదు. ప్రజారాజ్యం పార్టీకి చిలకలూరి పేట నియోజక వర్గం నుంచి పోటీ చేశా. ప్రత్యర్థులు కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లే అన్నారు మీరు డబ్బు ఖర్చుపెట్టకపోతే ఓడిపోతారని. నేను ఖర్చుపెట్టనన్నా. మందు తాగించాలన్నారు. నేను తాగను.. మిమ్మల్ని తాగించనన్నా. నేను చెడిపోతే చిలకలూరిపేట మొత్తం తినేస్తా. కావాలంటే ఓడించండి. చెడగొట్టద్దు అన్నా. జెండాలు నావే. జీపులు నావే. అందరికీ పెట్టించిన భోజనాల ఖర్చూ నాదే. చిరంజీవిగారిని ఒక్క పైసా అడగలేదు.

► మీ అబ్బాయిలను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా?
ఒకడు రైటర్‌. ఒకడు డైరెక్టర్‌. ఆల్రెడీ కొరటాల శివ దగ్గర ఒక అబ్బాయి చేరాడు. నేను నా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటా. ‘కథ చెబుతా విను నాన్నా’ అని మా అబ్బాయి అంటే, వాడి కాళ్లు నొక్కుతూ వింటా.

► ‘మెంటల్‌ కృష్ణ’ టైటిల్‌తో సినిమా తీశారు. కొందరు మిమ్మల్ని అలానే అంటారు?
అవును. నిజంగా నేను మెంటల్‌ కృష్ణ అయితే, నా భార్య, పిల్లలు నన్ను వదిలి వెళ్లిపోయేవాళ్లు. నిక్కచ్చిగా మాట్లాడతాను కాబట్టి, మెంటల్‌ కృష్ణ అంటారేమో!

► నిర్మాతలు అన్నం పెట్టే అక్షయపాత్రలు
నిర్మాతలంటే నాకు గౌరవం. వాళ్లు అన్నం పెట్టే అక్షయపాత్రల్లాంటి వాళ్లు. అందులో రామానాయుడుగారు ఒకరు. ఆయన బేనర్‌లో ఎన్నో మంచి సినిమా లకు రాశాను. నేటి తరం విషయాని కొస్తే... సురేశ్‌బాబు, ‘దిల్‌’రాజు లాంటి పదిమంది నిర్మాతలు ఉంటే చాలు.. కళ ఉన్నంత కాలం ఇండస్ట్రీ ఉంటుంది.

► నా సపోర్ట్‌ వైయస్సార్‌సీపీకే
నాకు తెలిసిన, నేను చూసిన రాజకీయ వ్యవస్థలో ఆత్మాభిమానం ఒక్క పర్సంట్‌ కూడా చంపుకోకుండా, ఆత్మగౌరవాన్ని ఒక్క పర్సంట్‌ కూడా పోగొట్టుకోకుండా ఎవరికీ తలవొంచకుండా బతికిన రాజకీయ నాయకుడు వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిగారు. ఆయనంటే నాకెంతో గౌరవం, ప్రేమ. అదే ప్రేమ ఆయన కుమారుడు జగన్‌గారి మీద ఉంది. అందుకే నా సపోర్ట్‌ వైయస్సార్‌సీపీకే.

►  ఫైనల్లీ.. ఎంత సంపాదించారేంటి?
నేను, నా భార్య, మా ఇద్దరు కొడుకులు. లగ్జరీగా బతికేంత. ‘అంతా వైట్‌మనీ’. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి, నేను, మా ఆవిడ విడిగా ఉండాలన్నది మా ప్లాన్‌. అప్పుడు మా ఖర్చులకు నెలకి 7 లక్షలు కావాలి. అంత ఎందుకు అంటే? నెలలో రెండుసార్లు విదేశాలు వెళ్లి, ఓ పది రోజులుండాలి. ఫ్లయిట్‌లో బిజినెస్‌ క్లాస్‌. విదేశాల్లో ఫైవ్‌స్టార్‌ హోటల్‌. నా పిల్లలకు రెండేసి కోట్ల రూపాయలతో చెరో ఇల్లు, నెలకి తలా రెండు లక్షల రూపాయలు వచ్చేట్లు ఏర్పాటు చేస్తాను. వాళ్లు జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు. నాకు, నా భార్యకు ఇప్పటికి నెలకు 5 లక్షలు వచ్చేలా ప్లాన్‌ చేశా. ఇంకో మూడు లక్షలు.. అంతే. అది కూడా ఫుల్‌ఫిల్‌ చేసుకుంటే, భవిష్యత్తులో మేం అనుకున్నట్లు బతికేస్తాం.

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement