D.G. Bhavani
-
మెటల్ కృష్ణ
నెత్తి కొట్టుకోడానికి ఏ రాయి అయితేనేం? అలా అనుకోకండి. చాలా తేడా ఉంది. మెత్తటి రాయితో విషయం అర్థమౌతుంది. మెటల్ రాయితో జీవితం మొత్తం సెట్ అవుతుంది. పోసాని మాటలు మెటల్ రాళ్ల కంటే ఎక్కువ. మెటల్ బులెట్లు అనుకోండి! రక్తం చూసే, ప్రాణం తీసే బులెట్లు కావు. లైఫ్‌ని చక్కదిద్దే స్వాభిమానపు బులెట్లు! ఎక్కడా తగ్గొద్దంటాడు. ఇంకొకరి కోసం అసలు తగ్గొద్దంటాడు. తెగింపు లేకుంటే ఆలోచనలు తెగవంటాడు. ఈ సండే మీ కోసం... పోసాని కృష్ణ మురళి పాఠాలు. ► ‘వెన్నుపోటు పొడిచేవాళ్లు ఎక్కువయ్యారు. అవకాశాలు రానివ్వడంలేదు’ అని ఓ ఫంక్షన్లో అలీగారు అంటే, ‘అవును. వెన్నుపోటు పొడిచేవాళ్లు కొనసాగు తున్నారు’ అన్నారు. మిమ్మల్ని ఎవరైనా? నన్నా? ఛాన్సే లేదు. ఎవరైనా నన్ను వెన్నుపోటు పొడవాలంటే నేను వెన్ను చూపించాలి కదా. చూపించను. పోసానిని ఎవరూ ఏమీ చేయలేరు. ►మీరెవరి విషయంలో అయినా అలా చేశారా? నాకవసరం లేదు. అవతలివాళ్లది లాక్కునే అలవాటు లేదు. నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా అంతే. ►మరి సేవా కార్యక్రమాల్లాంటివి? మాటిస్తే వెనక్కి తీసుకోకూడదు. చెక్కు ఇస్తే బౌన్స్ అవ్వకూడదు. ఇది నా పాలసీ. టీవీల్లో చాలామంది చెబుతుంటారు. ‘ఇతనికి 5 లక్షలు ఇస్తున్నా’ అని. ఇవ్వరు. చెక్కు ఇస్తే బౌన్స్ అవుతుంది. అలాంటివి చాలా చూశా. నాకు 10 రూపాయలు వస్తే 2 రూపాయలే ఇస్తాను. బాగా డబ్బులు వచ్చినప్పుడు నాకు మంచి జరుగుతుందని ఇతరులకు సాయం చేస్తాను. 15 మందికి గుండె ఆపరేషన్లు చేయించా. అందరూ బతికారు. ఫస్ట్ ఆపరేషన్‌కి మాత్రం వేరేవాళ్ల సాయం తీసుకున్నా. మిగతాదంతా సొంత డబ్బే. ఇప్పుడు ‘బతుకు జట్కాబండి’ ప్రోగ్రామ్ చేస్తున్నా కదా. ఆ షోకి వచ్చిన ఫ్యామిలీస్‌కి సంబంధించిన ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నా. ► మీలో గొప్ప రైటర్ ఉన్నారు. 150 íసినిమాల వరకూ రైటర్‌గా చేశారు. ఇప్పుడా రైటర్ని ఎందుకు పక్కన పెట్టేశారు? పక్కన పెట్టలేదు. మత్తుమందు ఇచ్చా (నవ్వుతూ). పరుచూరి బ్రదర్స్ దగ్గర రైటర్‌గా చేసినప్పుడు కొంతమంది రైటర్స్ జీవితం నన్ను ఆలోచనలో పడేసింది. ఆత్రేయగారు గొప్ప రచయిత. జీవితం చివర్లో ‘నేను రాస్తాను.. అవకాశం ఇవ్వండి’ అని అడిగే పరిస్థితిలో ఆయన ఉండటం బాధ అనిపించింది. ‘నాలుగైదు వేలు ఇచ్చినా పర్లేదు. ఒక స్క్రిప్ట్ ఇవ్వండి’ అనేవారు. పరుచూరి వెంకటేశ్వరరావుగారితో ‘సార్ .. ఆత్రేయగారు వస్తున్నారు. మీతో స్క్రిప్ట్ గురించి చెప్పమన్నారు’ అంటే, ‘‘ఆయన చాలా పెద్ద రైటర్. ఆయన్ని అసిస్టెంట్‌గా పెట్టుకుంటే మనల్ని హీనంగా మాట్లాడతారు. ఏమీ చేయించకుండా... ‘ఇదిగో ఈ నాలుగువేలు ఉంచండి’ అంటే ఆయన్ను తక్కువ చేసినట్లవుతుంది. అందుకే ఎవరైనా ఆత్రేయగారికి సన్మానం చేస్తే, ఆ సందర్భంలో విలువైన బహుమతులు ఇవ్వాలి తప్ప, విడిగా డబ్బులివ్వడం బాగుండదు’’ అన్నారు. అలాగే, మద్దిపట్ల సూరిగారు అని ఇంకో రైటర్ వచ్చేవారు. చాలా సఫర్ అవుతుంటే ‘ప్రాణ మిత్రుడు’ అనే సినిమాకి మూడు వేలు ఇచ్చి, ఒక వెర్షన్ రాయమన్నారు. కానీ, ఒక్క ముక్క కూడా వాడలేదు. పని చేయించుకోకుండా డబ్బులిస్తే వాళ్లను అవమానపరిచినట్లు కాబట్టి, అలా చేసేవారు. ఇవన్నీ చూశాక మనం దయనీయ స్థితిలో ఉండకూడదనుకున్నా. 100కి పైగా సినిమాలు రాసేశాను. ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నా. ► మరి.. డైరెక్షన్‌కి ఎందుకు రూట్ మార్చారు? రైటర్‌గా సినిమాలు ఉన్నప్పుడే డైరెక్టర్ కావాలనిపించి, ‘శ్రావణమాసం’ తీశా. పెద్ద ఫ్లాప్. 70 లక్షలు పోయాయి. కో–డైరెక్టర్ మాట నమ్మి, ఆ సినిమా చేశాను. నిజానికి నేను రెండు కథలు చెప్పా. ‘శ్రావణమాసం’, ‘ఆపరేషన్ దుర్యోధన’. మాస్ సినిమా ఎందుకు? ఈ కథ తీయమన్నాడు తను. ఆ డెసిషన్ రాంగ్. సినిమా ఫ్లాప్ అయినా ఫైనాన్స్ చేసినవాళ్లకు వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇచ్చేశా. ‘ఎందుకయ్యా ఈయనకు డైరెక్షన్. పెద్దోడైపోదామనా?’ అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది కదా. అందుకే హిట్ సినిమా తీయాలనుకున్నా. మల్లికార్జునరావు మళ్లీ ఫైనాన్స్ చేస్తానన్నారు. కోటీ 30 లక్షలవుతుందంటే ఇచ్చారు. పెద్ద హిట్. అదే ‘ఆపరేషన్ దుర్యోధన’. 10 కోట్లు మిగిలాయి. ఆయన ఏం కావాలని అడిగితే, ‘70 లక్షలు పోయాయి. అవి ఇవ్వండి చాలు’ అన్నా. 65 ఇచ్చి, ఓ కారు పంపిస్తే.. ‘కారు వద్దు’ అని పంపించేశా. తర్వాత చేసిన ప్రతి సినిమాకీ ఒక పెద్ద డైరెక్టర్ ఎంత సంపాదిస్తాడో అంత సంపాదించాను. ► వేరే డైరెక్టర్లతో సినిమాలు చేసేటప్పుడు డైలాగ్స్, డైరెక్షన్లలో ఇన్వాల్వ్ అవుతారా? మురళీగారు.. ‘ఆ డైలాగ్ కొంచెం చూస్తారా’ అంటే అప్పుడు చూస్తా. ఒకవేళ నాకు డైలాగ్ నచ్చకపోతే చెప్పనంటా. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, నిర్మాత అయినా. ఆ డైలాగ్‌లో ఆడవాళ్లను తిట్టాలనుకోండి... నిజంగా అవసరం అనిపిస్తేనే తిడతా. మగవాళ్లనైనా అంతే. ఆ డైలాగ్ వద్దంటే చెప్పాల్సిందే అన్నవాళ్లు లేరు. తీసేస్తారు. డైరెక్షన్ జోలికి వెళ్లను. నాకు నచ్చకపోతే సినిమాలు చేయను. పూరి జగన్నాథ్‌గారు నాకు పెద్ద పెద్ద వేషాలు ఇచ్చారు. ఆ సినిమాలకు నాకు పేరు వచ్చింది. ‘పైసా వసూల్’కి 14 రోజుల వేషం ఒకటి చెప్పారు. కాకపోతే నైట్ 7 నుంచి మార్నింగ్ 4 వరకు షూటింగ్ అన్నారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కూడా నైట్ షూట్స్ కారణంగానే వదులు కున్నా. రాత్రిపూట షూటింగ్ చేయనంటున్నది అహంకారంతో కాదు. నాకు నా ఫ్యామిలీ, హెల్త్ ముఖ్యం. రెండూ లేనప్పుడు ఎన్ని డబ్బులొచ్చి మాత్రం ఏం ప్రయోజనం? నా ఫీలింగ్‌ని డైరెక్టర్లందరూ అర్థం చేసుకున్నారు. నైట్ చేయడం వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ, ఒక లక్షకి ఒక నెల, రెండు లక్షలకు రెండు నెలల ఆరోగ్యం పోతుంది. రాత్రి 7, 8 గంటలు నిద్రపోవడం నా అలవాటు. ► కొంచెం దూకుడుగా ఉంటారు.. దురుసుగా మాట్లాడతారు కాబట్టి శత్రువుల లిస్ట్ చెప్పమంటే వేళ్ల మీద లెక్కపెట్టలేరేమో... ఒక్క శత్రువు కూడా లేడు. నా గురువులతో పని చేశా. నా శిష్యులతోనూ చేస్తున్నా. అది నా అదృష్టం. మా గురువులకి నేను ఒక్కణ్ణే ప్రియమైన శిష్యుణ్ణి. ప్రియమైన శత్రువుని. చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చా. ‘పోసాని మంచోడు కాదు. వీణ్ని తీసేయాలి’ అని ఒక్కరు కూడా అనలేదు. మీరు వ్యక్తిగతంగా ఎవర్నైనా అడగండి. ‘వాడి లెక్క వాడికి ఇస్తే గొడవలు ఉండవు’ అంటారు. కొంతమంది రైటర్స్‌ని తర్వాత రావయ్యా అనేవాళ్లు. వెళ్తే రిలీజ్ ముందు కలవమనేవాళ్లు. ఆ తర్వాత రిలీజ్ హడావిడిలో ఉన్నా.. ఇప్పుడు కాదు అనేవాళ్లు. సినిమా పోతే.. ‘ఇంకేం ఇస్తాం..’ అనేవాళ్లు. ఇలా డబ్బులు పోగొట్టుకున్న రైటర్లు చాలామంది ఉన్నారు. నాకెవరూ డబ్బులు ఎగ్గొట్టలేదు. అలాగే, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ల దగ్గర నేను ముక్కుపిండి డబ్బులు తీసుకోలేదు. ► ముక్కుసూటిగా వ్యవహరిస్తే తొక్కేస్తారని భయపడి సర్దుకుపోయేవాళ్లే ఎక్కువ. బహుశా మీరు ఇండస్ట్రీకి వచ్చేనాటికే ఫైనాన్షియల్లీ ఫుల్ సౌండేమో? కష్టాల్లో ఉన్నప్పుడే ఇక్కడికొచ్చా. కానీ, కష్టాలు తెలియకుండా పెరిగా. మా చిన్నప్పుడు మా నాన్నగారికి 1200 జీతం వచ్చేది. అప్పట్లోనే మంచి బట్టలు, లెదర్ చెప్పులు. అప్పుడు హైదరాబాద్ అంటే గన్నవరం నుంచి ఫ్లయిట్లోనే. టిక్కెట్ కాస్ట్ 225 నుంచి 240 రూపాయలు. హైదరాబాద్ టు మా కాకాని వెళ్లడానికి ఫ్లయిట్లో గన్నవరం వెళ్లి, అట్నుంచి మా ఊరు వెళ్లేవాణ్ణి. మాకు రెండు మూడెకరాలు పొలం ఉండేది. మా పూర్వీకులకు గొల్లపూడిలో ఐదెకరాల్లో పోసాని నరసింహ చౌదరి హై స్కూల్ అని ఓ స్కూల్ ఉండేది. మా పెదనాన్నది ఆ స్కూల్. ఆయనకు పిల్లలు లేరు. సడన్‌గా చనిపోయారు. బంధువులందరూ ఆయన ఆస్తి కొట్టేస్తే అసలైన వారసులం ఉన్నాం కాబట్టి, గొడవ అవుతుందనుకున్నారు. మా నాన్నని పిలిచి, అందరం పంచుకుందాం అన్నారు. మొత్తం 80 కోట్లు ఆస్తి. పంచుకోవడానికి ఒప్పుకోకపోతే ఆస్తంతా మాదే. కానీ, నాన్న ఓకే అన్నారు. మీరెలాగూ ఈ ఊరు రారు కదా.. రెండు లక్షల 10వేలు ఇస్తాం అన్నారు. అలాగే ఇవ్వండి అన్నారు. మిగతాది 70, 80 మంది పంచుకున్నారు. అయినా మేం కంఫర్ట్. మా ఆస్తులను నాన్నగారు పేకాటలో పోగొట్టేశారు. అమ్మకి ఏమీ తెలియదు. తెలుసుకుని అడిగితే, అవమానం ఫీలై, ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే నాకు డిగ్రీ అయిపోయింది. ► ఆ తర్వాత మీ లైఫ్ జర్నీ గురించి? హైదరాబాద్ వచ్చేశా. నా సర్టిఫికెట్స్ చూసి, ఓ చిట్‌ఫండ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఇచ్చారు. జాబ్‌లో జాయిన్ అయిన నెలకే లంచాలు తీసుకుంటున్నాడని ఆధారాలు చూపించి, మేనేజర్‌ను డిస్మిస్ చేయించా. అప్పటినుంచి సెంట్రల్ ఆఫీసులో ఉండే మేనేజర్లు కొంతమంది పగబట్టారు. కొత్త మేనేజర్ వచ్చాడు. ఆ కుర్రాడితో జాగ్రత్త అని ముందే ఆయనకు చెప్పారు. ఏజెంట్స్ ద్వారా చిట్టీలైతే కంపెనీ కమీషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, నేను వెళ్లి ఇంటింటికీ తిరిగి, చిట్టీలు వేయించేవాణ్ణి. ఆయన వచ్చీ రాగానే, ‘నాకు తెలియకుండా బయటకు వెళ్లడానికి వీల్లేదు’ అన్నాడు. నాకేమో పేరు రావాలని ఉండేది. ఏజెంట్స్తోపాటే నేనూ వర్క్ చేసేవాణ్ణి. ఎండీ ‘కమీషన్ వద్దా?’ అంటే జీతం ఇస్తున్నారుగా అనేవాణ్ణి. అప్పటి నుంచే లంచాలకు అలవాటు పడితే ఓ 500 కోట్లు సంపాదించేవాణ్ణి. ‘సార్ నేను ఇక్కడ కూర్చోలేను. బయటికి వెళ్లి చిట్టీలు తీసుకొస్తా. తీసుకురాలేకపోతే నన్ను తీసేయండి’ అన్నా. వద్దన్నాడు. ‘సన్నాసి’ అని తిట్టా. మేనేజర్ని తిడితే ఊరుకుంటారా? సెంట్రల్ ఆఫీస్ నుంచి ‘రౌడీయిజమ్ చేస్తున్నావా?’ అని ఫోన్. వాడే సన్నాసి అనుకుంటే నువ్వింకా పెద్ద సన్నాసివి అన్నా. ఎండీగారికి నేనంటే ఇష్టం. కానీ, పైవాళ్లను తిట్టినందుకు ఖమ్మంకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉండలేక జాబ్ మానేసి, మద్రాసు వెళ్లా. అక్కడ కూడా ఇవే కష్టాలు. కానీ, నో కాంప్రమైజ్. తెలుగు ఇండస్ట్రీకి రావడం నా అదృష్టం. నేను ఎవర్నైనా గుర్తు పెట్టుకోవాలంటే అది పరుచూరి బ్రదర్స్‌నే. ౖడైరెక్టర్లలో వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి వంటి వాళ్లు మంచి పాత్ర లిచ్చారు. ఇప్పుడు నా మేనల్లుడు కొరటాల శివ నాకు మహేశ్‌బాబు సినిమాలో మంచి వేష ఇచ్చారు. ఇంతదాకా వచ్చానంటే టాలెంట్‌తోనే వచ్చా. లక్‌తో కాదు. రాసి పైకి వచ్చా.. చేసి (యాక్టింగ్– డైరెక్షన్) పైకి వచ్చా. ► ఫ్లాష్‌బ్యాక్‌లో మీ రాజకీయ జీవితం గురించి? నాగార్జున యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీగా ఎక్కువ మెజార్టీతో గెలిచాను. 1983లో తెలుగు దేశం ఎమ్మెల్యే టిక్కెట్ ఆఫర్ చేసింది. అప్పటికి మా నాన్న చనిపోయారు. ఆ బాధలో ఉన్నాను. వేరే దేని మీదా దృష్టి లేదు. నాకప్పుడు ఎమ్మెల్యే అంటే గన్‌మేన్ ఉంటాడు. డబ్బులు కాజేయచ్చని తెలీదు. తెలిసినా ఒప్పుకునే వాణ్ణి కాదు. ప్రజారాజ్యం పార్టీకి చిలకలూరి పేట నియోజక వర్గం నుంచి పోటీ చేశా. ప్రత్యర్థులు కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లే అన్నారు మీరు డబ్బు ఖర్చుపెట్టకపోతే ఓడిపోతారని. నేను ఖర్చుపెట్టనన్నా. మందు తాగించాలన్నారు. నేను తాగను.. మిమ్మల్ని తాగించనన్నా. నేను చెడిపోతే చిలకలూరిపేట మొత్తం తినేస్తా. కావాలంటే ఓడించండి. చెడగొట్టద్దు అన్నా. జెండాలు నావే. జీపులు నావే. అందరికీ పెట్టించిన భోజనాల ఖర్చూ నాదే. చిరంజీవిగారిని ఒక్క పైసా అడగలేదు. ► మీ అబ్బాయిలను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? ఒకడు రైటర్. ఒకడు డైరెక్టర్. ఆల్రెడీ కొరటాల శివ దగ్గర ఒక అబ్బాయి చేరాడు. నేను నా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటా. ‘కథ చెబుతా విను నాన్నా’ అని మా అబ్బాయి అంటే, వాడి కాళ్లు నొక్కుతూ వింటా. ► ‘మెంటల్ కృష్ణ’ టైటిల్‌తో సినిమా తీశారు. కొందరు మిమ్మల్ని అలానే అంటారు? అవును. నిజంగా నేను మెంటల్ కృష్ణ అయితే, నా భార్య, పిల్లలు నన్ను వదిలి వెళ్లిపోయేవాళ్లు. నిక్కచ్చిగా మాట్లాడతాను కాబట్టి, మెంటల్ కృష్ణ అంటారేమో! ► నిర్మాతలు అన్నం పెట్టే అక్షయపాత్రలు నిర్మాతలంటే నాకు గౌరవం. వాళ్లు అన్నం పెట్టే అక్షయపాత్రల్లాంటి వాళ్లు. అందులో రామానాయుడుగారు ఒకరు. ఆయన బేనర్లో ఎన్నో మంచి సినిమా లకు రాశాను. నేటి తరం విషయాని కొస్తే... సురేశ్‌బాబు, ‘దిల్’రాజు లాంటి పదిమంది నిర్మాతలు ఉంటే చాలు.. కళ ఉన్నంత కాలం ఇండస్ట్రీ ఉంటుంది. ► నా సపోర్ట్ వైయస్సార్సీపీకే నాకు తెలిసిన, నేను చూసిన రాజకీయ వ్యవస్థలో ఆత్మాభిమానం ఒక్క పర్సంట్ కూడా చంపుకోకుండా, ఆత్మగౌరవాన్ని ఒక్క పర్సంట్ కూడా పోగొట్టుకోకుండా ఎవరికీ తలవొంచకుండా బతికిన రాజకీయ నాయకుడు వై.యస్. రాజశేఖర్ రెడ్డిగారు. ఆయనంటే నాకెంతో గౌరవం, ప్రేమ. అదే ప్రేమ ఆయన కుమారుడు జగన్‌గారి మీద ఉంది. అందుకే నా సపోర్ట్ వైయస్సార్సీపీకే. ► ఫైనల్లీ.. ఎంత సంపాదించారేంటి? నేను, నా భార్య, మా ఇద్దరు కొడుకులు. లగ్జరీగా బతికేంత. ‘అంతా వైట్‌మనీ’. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి, నేను, మా ఆవిడ విడిగా ఉండాలన్నది మా ప్లాన్. అప్పుడు మా ఖర్చులకు నెలకి 7 లక్షలు కావాలి. అంత ఎందుకు అంటే? నెలలో రెండుసార్లు విదేశాలు వెళ్లి, ఓ పది రోజులుండాలి. ఫ్లయిట్లో బిజినెస్ క్లాస్. విదేశాల్లో ఫైవ్‌స్టార్ హోటల్. నా పిల్లలకు రెండేసి కోట్ల రూపాయలతో చెరో ఇల్లు, నెలకి తలా రెండు లక్షల రూపాయలు వచ్చేట్లు ఏర్పాటు చేస్తాను. వాళ్లు జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు. నాకు, నా భార్యకు ఇప్పటికి నెలకు 5 లక్షలు వచ్చేలా ప్లాన్ చేశా. ఇంకో మూడు లక్షలు.. అంతే. అది కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటే, భవిష్యత్తులో మేం అనుకున్నట్లు బతికేస్తాం. – డి.జి. భవాని -
రమ్యకృష్ణ విషయంలో అస్సలు వంక పెట్టడానికి లేదు!
పరికిణీలూ పూలజడలూ... పట్టుచీరలూ ఏడువారాల నగలూ... ముంగిట్లో ముత్యాల ముగ్గులూ... పెరట్లో ధాన్యాల రాశులూ... అరిసెలూ సున్నుండలూ కజ్జికాయలూ... ఓర చూపులూ దోర నవ్వులూ చిలిపి ముద్దులూ.. ఆక్రోశాలూ.. ఉక్రోషాలూ.. తగాదాలూ తప్పిదాలూ... కృష్ణవంశీ సినిమా అంటే ఇవన్నీ ఉండాల్సిందే! పండగకు అమ్మమ్మగారి ఊరెళ్లినట్టుగా... ఇంట్లో ఐదు రోజుల పెళ్లి జరిగినట్టుగా... కృష్ణవంశీ సినిమా చూస్తుంటే ఏదో సంబరం..! ఇక్కడ సక్సెస్‌లూ, ఫెయిల్యూర్లూ పక్కన పెట్టండి. మన మూలాల్ని మనకు గుర్తు చేయడమే కృష్ణవంశీ చేసే పని. గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ... తను మాత్రం బ్యాడ్ హజ్బెండ్‌ని, బ్యాడ్ ఫాదర్‌ని అని చెబుతున్నారు. ఆయన తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ కబుర్లతో పాటు కెరీర్ అచ్చట్లు... ఫ్యామిలీ ముచ్చట్లు మనసు విప్పి ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్నే అటూ ఇటూ మార్చి ‘గోవిందుడు ఆందరివాడేలే’గా తీశారని కామెంట్... కృష్ణవంశీ: ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుంటే తప్పేంటి? ఇవాళ్టి రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలో ఎవరూ ఎవర్నీ కలుపుకొని పోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. అందుకే ఇలాంటి సినిమాల అవసరం ఉంది. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, బాంబులు విసరడాలు.. ఇంకెంత కాలం చెప్పండి? మన సెన్సిబిల్టీకి తగ్గ సినిమా తీయాలని ఇది తీశాను. అది నచ్చింది కాబట్టే, ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ సినిమాలంటే ఒక మనవడో, మనవరాలో కుటుంబాన్ని కలపడానికి ట్రై చేయడం.. ఇదేనా.. వేరే కథలు రావా? వాస్తవానికి అప్పటి ‘దేవుడు చేసిన మనుషులు’, ఆత్మబంధువు’, ‘సంబరాల రాంబాబు’, ‘వారసుడొచ్చాడు’... ఇవన్నీ కూడా ఎవరో ఒకరు కుటుంబాన్ని కలిపే కథలే కదా. అన్ని కథలనూ అందరూ ఇష్టపడి చూశారుగా. ఇన్ని సినిమాలున్నప్పుడు మళ్లీ అవే చేయడం ఎందుకు? మన కథలన్నీ రామాయణ, భారతాల నుంచే పుడుతున్నాయి. ఎవరేం చేసినా, వాటి చుట్టూనే తిరగాలి. తప్పదు. అయినా నేనేం ఇది కొత్త కథ అనడం లేదు. కాకపోతే.. ‘గోవిందుడు..’ సినిమా కథ వేరు.. ఆ కథలు వేరు. అచ్చ తెలుగు సంప్రదాయాలతో సినిమా తీశారు సరే.. మరి హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో మందు కొట్టించే సన్నివేశం చేయడం అవసరమా? సమాజంలో ఎవరూ చేయడంలేదా. ఉన్నదే చూపించా. ఏం మగవాళ్లు మందు తాగొచ్చు కానీ, ఆడవాళ్లు తాగకూడదా? మగ, ఆడ సమానం అని హక్కులు మాట్లాడుతుంటారు కదా. మగవాళ్లు పెట్టిన ఆంక్షల ప్రకారం స్త్రీ బతకాలా? సినిమా గురించి పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఆడవాళ్లు మందు తాగడాన్ని మీరు హర్షిస్తారా? తప్పకుండా.. ఎందుకంటే అలవాట్లనేవి వారి వ్యక్తిగతం. పురుషాధిక్య ప్రపంచంలో ఆలోచనలన్నీ పురుషుడి పక్షానే ఉంటున్నాయి. నా దృష్టిలో స్త్రీ అంటే ఏంటో చెప్పనా.. ‘స్త్రీలు నాకన్నా తక్కువ అని నేననుకోను.. నాకన్నా పై మెట్టు మీద ఉన్న జాతికి చెందినవారు’ అనుకుంటాను. పదిమందికి నష్టం కలిగించని దేన్నయినా నేను ఆమోదిస్తాను. ‘‘కృష్ణవంశీతో ఇప్పుడు సినిమా అంటే నటన నేర్పిస్తాడు.. నేను అందుకు రెడీగా లేను’’ అని చిరంజీవిగారు బహిరంగంగా పేర్కొనడం పట్ల మీ ఫీలింగ్? అది ఆయన గొప్పతనం. ఆయనకు తెలియని యాక్టింగా? ది బెస్ట్ నుంచి ది వరస్ట్ అనదగ్గ దర్శకులందరితోనూ ఆయన చేశారు. ఆయన డైనమిజమ్, లైవ్లీనెస్, ఎమోషన్ అన్నీ ఇష్టం. గత తరానికి మహానటుడు ఎన్టీఆర్ ఓ నిఘంటువు అయితే.. ఈ తరానికి చిరంజీవి టెక్ట్స్‌బుక్. ఆయన నా గురించి అలా అన్నారంటే అదంతా ఆయన అభిమానం. ఈ చిత్ర ఆడియో వేడుకలో మీరు ఎమోషనల్ అయ్యారేం? మూడేళ్లుగా ఎదురైన అనుభవాలు, చూసిన పరిస్థితులు, నాతో కొందరు ప్రవర్తించిన విధానం, సినిమాలను సరిగ్గా తీయలేకపోయినందుకు పడిన బాధ.. ఇలా కొన్ని కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో సడన్‌గా అన్నయ్య (చిరంజీవి)లాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, చరణ్ లాంటి హీరో... నన్ను నమ్మి కథ పూర్తిగా వినకుండానే ‘సినిమా చేసేస్తాం’ అన్నారు. అప్పుడు భావోద్వేగానికి గురవడం సహజం కదా! ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలకు అతీతంగా స్పందించడం మీకు అలవాటై ఉంటుంది. అలాంటిది ఏవో కొన్ని సినిమాలు ఆడకపోతే ఎమోషనల్ కావడమా? ‘సిందూరం’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పక్కనపెడదాం. వంద శాతం క్రియేటివ్ శాటిస్ఫేక్షన్ ఉన్న చిత్రం అది. కానీ, గత రెండు, మూడేళ్లల్లో నేను తీసిన సినిమాల్లో నేననుకున్నది తెరపై పూర్తిగా తీయలేకపోయాను. నేననుకున్నది స్క్రీన్ మీద పెట్టలేకపోయాను. దానికి రకరకాల కారణాలున్నాయి. ‘పైసా’ని తీసుకుందాం. మూడు నెలల్లో పూర్తి చేసిన ఆ చిత్రం విడుదలకు రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. నేననుకున్నది తీయలేకపోవడానికి కారణం.. నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. జనరల్‌గా ‘మేం అనుకున్నది తీయలేకపోయాం’ అని అప్‌కమింగ్ డెరైక్టర్లు అంటుంటారు. మీలాంటి దర్శకులు ఇలా అనడమా? నాలాంటి దర్శకులకే ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే, నేను రెగ్యులర్ సక్సెస్ఫుల్ ఫార్ములాలో సినిమాలు తీసే డెరైక్టర్ని కాదు. ఓ కొత్త జానర్లో తీస్తాను. సో.. నిర్మాతను, ఆరిస్టులను కన్విన్స్ చేయడం కష్టం. ఇప్పుడు ‘గోవిందుడు..’ సక్సెస్ అయ్యింది కాబట్టి, తర్వాత కూడా మళ్లీ అలాంటి సినిమానే చేద్దాం అంటారు. కానీ, నేనందుకు విరుద్ధం. వాళ్ల మైండ్‌సెట్‌ని దీన్నుంచి నా జానర్లోకి తీసుకెళ్లడానికి కష్టం అవుతుంది. కొత్త జానర్లో సినిమాలు చేసే హీరోలు లేరంటారా? ఇండియాలో ఆమిర్‌ఖాన్ తప్ప ఎవరున్నారు. ఒక్క ఆమిర్‌ఖాన్ ఎంతమందిని శాటిస్ఫై చేస్తాడు. అయినా హీరోలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, వాళ్లు కనెక్ట్ కాని కథలో ఎలా ఇమిడిపోగలుగుతారు? ఆమిర్ఖాన్నే తీసుకుందాం. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ‘లగాన్’ చిత్రం తీసిన దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ‘స్వదేశ్’ కథతో ఆమిర్‌ఖాన్‌ని కలిస్తే, ‘నాకు కనెక్ట్ కావడం లేదు’ అని సింపుల్‌గా చెప్పేశాడు. ‘రోబో’ కథను షారుక్ ఖాన్‌కి శంకర్ చెబితే, ‘నా వల్ల కాదు’ అన్నాడు. డెరైక్టర్లను హీరోలు నమ్మకపోవడం ఎక్కువయ్యిందంటారా? అంత ఆలోచించలేదు నేను. ఏ హీరో అయినా కథకు కనెక్ట్ కాకపోతే, పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? కనెక్ట్ కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. పోనీ.. డెరైక్టర్ చెప్పిందల్లా చేసుకుపోవడానికి ఆ హీరో ‘రోబో’ ఏం కాదు కదా! గత ఐదేళ్లనే తీసుకుందాం.. హీరో పేరు మీదే 50, 60 కోట్లూ బిజినెస్ అవుతోంది. అన్నీ హీరో పేరు మీదే ఆధారపడుతున్నప్పుడు అతను జాగ్రత్తపడటంలో తప్పేంటి? గుళ్లో రాముడి విగ్రహం ఉందనుకోండి.. రాముడి గురించి ఆలోచిస్తారు తప్ప, దాన్ని చెక్కినవాడి గురించి మీరు ఆలోచిస్తారా? అంటే.. హీరో వర్షిప్ అనేది కరెక్టేనంటారా? ప్రపంచంలో ఏ భాషకు చెందిన పరిశ్రమను తీసుకున్నా.. హీరో వర్షిప్ కచ్చితంగా ఉంది. హాలీవుడ్ సినిమా ‘రాంబో’ని తీసుకుందాం. ఆ చిత్రదర్శకుడు ఎవరు అంటే ఎవరూ చెప్పలేరు? హీరో ఎవరు అంటే.. టకీమని చెప్పేస్తారు. సో.. ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా హీరోను అప్రోచ్ కావాల్సిందేనా.. హీరోలు తమంతట తాము రారా? అలా ఎందుకు ఎదురుచూడాలి? ఇప్పుడు నేనెవర్నీ నాకు అవకాశం ఇవ్వండని అడగను. కానీ, నా దగ్గరున్న కథకు ఏ హీరో యాప్ట్ అనిపిస్తే.. వాళ్లను అడుగుతాను. నేను అడగకుండా వాళ్లంతట వాళ్లు ఎందుకు వచ్చి అడగాలి? అసలు ఎవరైనా ఎందుకు అడుగుతారు? మీ సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ వస్తోంది? అనుకోకుండా వచ్చిన గ్యాప్ అది. ఇక ఆ దశ అయిపోయింది. గ్యాప్ లేకుండా చేస్తా. ఆ దశ పోయిందని బలంగా నమ్ముతున్నారా? ‘మురారి’ తీశాను. సంకల్పం అనేది ఆ చిత్రంలోని ప్రధానాంశం. నిజంగా కూడా నాది అదే మైండ్ సెట్. నేను అయిపోయానని ప్రపంచం ముద్ర వేసినప్పుడు నేనే తిరిగొచ్చాను. నేనే చిరంజీవిగారిని, చరణ్‌ని కలిసి, కన్విన్స్ చేశాను. ‘మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి’ అని ‘గోవిందుడు..’లో చెప్పాను. నిజజీవితానికి కూడా అదే వర్తిస్తుంది. నేను ఇంట్లో కూచుంటే ఎవరు పిలుస్తారు. మన ప్రయత్నం ఉంటేనే ఎదుటివాళ్లకి ‘ఇతని దగ్గర ఏదో ఉంది’ అనిపిస్తుంది. మీరెప్పుడూ ఎవరి దగ్గరా అవకాశాలు అడిగినట్లు లేరే? అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడగాలి. అందుకే అన్నయ్యను కలిశాను. ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్నుంచి అన్నయ్య ఇంటి తలుపులు నా కోసం తెరిచి ఉన్నాయి. అందుకే వెళ్లి కలిశాను. ఎక్కాల్సిన గడపే ఎక్కా! ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు? నిర్మాణం నా వల్ల కాదు. నేను డబ్బు మనిషిని కాదు కాబట్టి, నిర్మాణం నాకు సూట్ కాదు. కొంతమంది దర్శకులతో పోల్చితే దర్శకుడిగా కూడా మీ సంపాదన తక్కువేనేమో? నాకు సరిపోయేంత డబ్బు ఉంది. ఒకవేళ అది సరిపోదు.. ఇంకా ఎక్కువ కావాలంటే మా ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది (నవ్వుతూ). మనిషికి సరిపోయేంత డబ్బు అంటే... ఎంత? ఒక మంచి ఇల్లు, ఏసీ రూము, తిరగడానికి కారు, అందులో పుష్కలంగా పెట్రోల్ పోయించగలిగే కెపాసిటీ, ఏడాదిలో రెండు సార్లు విహార యాత్రకు వెళ్లడానికి కావాల్సిన డబ్బు, రెండు పూటలా తిండి, తాగడానికి మందు, పీల్చడానికి సిగరెట్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, కట్టుకోవడానికి సెల్‌ఫోన్ బిల్లు, మన మీద ఆధారపడే మన కుటుంబ సభ్యులను సౌకర్యంగా ఉంచగలిగే స్తోమత... ఇంతకు మించి ఏం ఉన్నా... వాడు ఆ ఇంటికి వాచ్‌మేన్ కిందే లెక్క. పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత, దాన్ని మెయిన్టైన్ చేయడానికి పనిమనుషులను పెట్టుకోవాలి. వాళ్లు పనులు చేసుకుని బయటికెళుతుంటే.. ఇంట్లోంచి ఏమైనా తీసుకెళ్లిపోతారేమో అని టెన్షన్.. లోపలి నుంచి ఎవరైనా బయటికొస్తే టెన్షన్.. ఇక సుఖం ఏం ఉంటుంది. భక్తి బాటలో వెళుతున్నట్లున్నారు. వయసు తెచ్చిన మార్పా? వయసా? నాకు వయసు పైబడిందని అనుకోవడం లేదు. అయినా మనకు పదేళ్ల వయసులో కరెక్ట్ అనిపించినది తర్వాత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల వయసులో చేసినది ముప్ఫయ్ ఏళ్లల్లో తప్పనిపించొచ్చు. అనుభవం నేర్పే పాఠాల దారిలోనే మనసు వెళుతుంది. ఇలాంటి మార్పుని ‘మాట మార్చడం’ అంటారేమో? నేను మాట మార్చలేదు. నా విధానం మారిందని చెబుతున్నా. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనుక్కుంటాం. ఓ ఏడాది తర్వాత అది పాతదైపోతుంది. దాన్ని మార్చేసి, కొత్త చొక్కా కొనుక్కుంటాం కదా. ఇదే బాగుంది కదా అని వేసుకోం కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుందాం. వాటికి ఒకటి, రెండేళ్లప్పుడు నిద్రపోవడాన్ని ‘తాచ్’ అనేవాడు. ఇప్పుడా మాటను మేం సరదాగా అంటే, నవ్వేస్తాడు. ఇప్పుడు నిద్ర అంటాడు. ఇంకొన్నాళ్ల తర్వాత స్లీప్ అంటాడేమో. అంటే.. మాట మార్చాడని అనలేం కదా! ఎప్పుడూ ఒకే మాట మాట్లాడం కదా. జ్ఞానం పెరిగేకొద్దీమాట తీరు మారుతుంది. కానీ, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా మాట మార్చితే అది తప్పు. మీ సినిమాల్లో మన అరిసెలు, సున్నుండలు అన్నీ చూపిస్తారు. పర్సనల్‌గా మీకెలాంటి ఫుడ్ ఇష్టం? నాకు సున్నుండలు ఇష్టం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారింట్లో పులిహోర ఇష్టం. రమ్యకృష్ణ చైనీస్ వంటకాలు తిందామంటుంది. సో.. దాన్నీ ఇష్టపడతాను. నాకు పప్పుచారు, ఆవకాయ ఇష్టం. అవి ఉంటే ఇష్టంగా తింటాను. అవి లేకపోతే నాకేదైనా ఒకటే! మన సంస్కృతి, సంప్రదాయాలపై మీరు విపరీతమైన అభిమానం చూపిస్తారు.. ఎందుకని? మన నేటివిటీ మీద మనకే ప్రేమ లేకపోతే వేరేవాళ్లకి ఎందుకుంటుంది? మన మూలాలను వెతుక్కోవాల్సి వస్తోంది. అవి గుర్తు చేయడం కోసమే సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు భాష చచ్చిపోతోందని కొంతమంది ఆంగ్లంలో బాధపడిపోతుంటారు. దానివల్ల లాభమేంటి? ఆరోగ్యం విషయంలో మీరెంత శ్రద్ధగా ఉంటారు? నాకు శ్రద్ధ లేదు. మా ఇద్దరికీ కలిపి రమ్యకు ఉంది. ఆరు నెలలకోసారి జనరల్ చెకప్స్ అంటూ చంపేస్తుంది. ఏం టెస్టులు అని విసుక్కుంటే గొడవ చేసేస్తుంది. నాకు సంబంధించి చాలా విషయాలు తనే చూసుకుంటుంది. అంత జాగ్రత్తగా ఉండే రమ్యగారు మిమ్మల్ని సిగరెట్లు మానేయమని ఎప్పుడూ అనలేదా? ఎందుకు చెప్పదు. ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తుంది. నా బాధ్యత నేను చేయాలి కదా... (నవ్వు) మీరు తీసే సినిమాల్లో అందమైన కుటుంబాలు ఉంటాయి.. మరి.. మీ తోడబుట్టినవాళ్ల గురించి? ఓ తమ్ముడు చనిపోయాడు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అందరూ హ్యాపీ. నేను ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. యాక్చువల్‌గా చాలా బ్యాడ్ ఫ్యామిలీ మేన్‌ని. ఉన్నమాట చెప్పాలంటే.. నాకు సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి ఉండదు. అదేంటి.. మీరు కానిది మీరు తెరపై ఎలా ఆవిష్కరించగలుగుతున్నారు? హ్యుమన్ ఎమోషన్స్ అనేది బయటికి చెప్పలేను కానీ.. లోపల ఉందేమో.. నేను కానిది తీస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు. నేనేం రాక్షసుణ్ణి కాదు. పక్కా ఎమోషనల్ పర్సన్‌ను. ఫైనల్‌గా.. మీ తదుపరి చిత్రం గురించి? ఏమీ నిర్ణయించుకోలేదు. ఓ రెండు నెలలు పూర్తిగా రిలాక్స్ అయ్యి, తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. - డి.జి. భవాని మీరు చాలా సింపుల్‌గా కనిపిస్తారు.. బ్రాండెడ్ దుస్తులు వాడరా? నా డ్రెస్సులన్నీ మా ఆవిడే కొంటుంది. నన్ను ఆవిడెలా చూడాలనుకుంటుందో అలాంటి బట్టలు కొంటుంది. వాటిలో నాకు సౌకర్యవంతంగా ఉన్నవాటిని తొడుక్కుంటా. రమ్యకృష్ణగారి కోసం మీరేమీ షాపింగ్ చేయరా? లేదు. రమ్యకు నేను ఇచ్చిన అతి విలువైన బహుమతులు రెండున్నాయి. అవి ‘కృష్ణవంశీ, బేబో’. మా అబ్బాయి పేరు ఋత్విక్. మేం ముద్దుగా బేబో అని పిలుస్తాం. అసలు మొగుడుగా నువ్వు నాకేమీ ఇవ్వవా? అని రమ్య అడిగితే, ‘కృష్ణవంశీ’ని ఇచ్చాను కదా అంటుంటాను. రమ్య చాలా గ్రేట్. సింపుల్ పర్సన్. బేబో ఏం చదువుతున్నాడు? నాలుగో తరగతి. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని చూశాడా? వాడికి రామ్‌చరణ్ అంటే ఇష్టం. ‘మగధీర’ను లెక్కలేనన్ని సార్లు చూశాడు. ఆ డీవీడీ అరిగిపోయింది కూడా. ‘గోవిందుడు..’ చూశాడు. వాడికి బాగా నచ్చింది. భర్తగా, తండ్రిగా మీరెంతవరకు బెస్ట్? నేను చాలా బ్యాడ్ హజ్బండ్ని.. బ్యాడ్ ఫాదర్‌ని. మరి.. మిమ్మల్నెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణగారు మీరు ‘బ్యాడ్’ అంటే భరిస్తారా? ఒకవేళ అందుకే ఇష్టపడిందేమో (నవ్వుతూ). నేను బ్యాడ్ కాబట్టే, తను బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్‌గా ఉంటుందేమో. కుటుంబాన్ని చూసుకునే విషయంలో రమ్య చాలా చాలా బెస్ట్. అస్సలు వంక పెట్టడానికి లేదు. రమ్యకృష్ణ, బేబో చెన్నయ్‌లో ఉంటున్నట్లున్నారు? నేను కూడా చెన్నయ్‌లోనే ఉంటున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికొస్తున్నాను. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళుతుంటారా? తప్పనిసరిగా వెళతాం. అది కూడా రమ్యే ప్లాన్ చేస్తుంది. ఫలానా చోటకి వెళతాం అని చెబుతుంది. ఇక, టికెట్లు బుక్ చేయడానికి, సూట్‌కేసులు మోయడానికి నేను రెడీ అయిపోతా (నవ్వుతూ). -
ఆ వేషం ఇవ్వకపోతే సత్యాగ్రహం చేస్తానన్నాను!
నవరస నటనా సార్వభౌముడంటే కైకాల సత్యనారాయణే! నో సెకండ్ థాట్! వందలాది సినిమాలు... వందలాది పాత్రలు.. ఏం చేసినా... ఆయన ముద్ర మాత్రం సుస్పష్టం. కైకాలను గురువుగా భావించే నటుల్లో ముందు వరుసలో నిలిచే వ్యక్తి గిరిబాబు. తెలుగు తెరపై ఈయనదొక సెపరేట్ హిస్టరీ. నేడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు... ఈ సందర్భంగా సమ్‌థింగ్ స్పెషల్ చేయాలనిపించింది. కైకాలను గిరిబాబుతో ఇంటర్వ్యూ చేయిస్తే? ఇద్దరూ గుడ్ అన్నారు... ఓకే అన్నారు. గురుశిష్యులు మాట్లాడుకున్నట్టుగా... స్నేహితులు మనసు విప్పి ఎన్నో అనుభూతులు పంచుకున్నట్టుగా... సీనియర్ నటులు తమ అనుభవాల చిట్టా విప్పినట్టుగా... వీరిద్దరి సంభాషణ సాగింది. గిరిబాబు: గురువుగారూ... నమస్కారం. మామూలుగా మనల్ని రిపోర్టర్లు ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పుడు ‘సాక్షి’ పేపర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నన్ను రిపోర్టర్ని చేసింది. చాలా సంతోషంగా ఉందండీ... కైకాల: సంతోషం గిరిబాబు. నిన్నందరూ ‘ఎన్సైక్లోపీడియా’ అంటారు. అందుకే, నీతో నన్ను ఇంటర్వ్యూ చేయించాలనుకుంటున్నానని భవానీ చెప్పగానే ఓకే అనేశాను. మనం ఈ మధ్య కలుసుకుని కూడా చాలా రోజులైంది. గిరిబాబు: అవునవును... మీరు, నేను, నాగేశ్వరరావుగారు వారానికి రెండు, మూడుసార్లయినా కలుసుకునేవాళ్లం. గుమ్మడిగారి ఇల్లే మనకు మీటింగ్ ప్లేస్. అప్పుడప్పుడూ నాగేశ్వరరావుగారింటికి వెళ్లేవాళ్లం. గుమ్మడిగారు పోయాక మన మీటింగులు తగ్గాయి. నాగేశ్వరరావుగారు దూరమైన తర్వాత సాంతం మానేశాం. గిరిబాబు: మీ గురించి నాకు తెలిసినా.. మిగతావాళ్లకి తెలియాలని అడుగుతున్నా.. మీరెంతవరకు చదువుకున్నారు? పెద్దయ్యాక ఏమవ్వాలనుకునేవారు? కైకాల: ఇప్పుడు ‘ఏయన్నార్ కాలేజ్’ అంటున్నారు కదా.. అప్పట్లో ‘ది గుడివాడ కాలేజ్’ అనేవారు. అందులోనే ఇంటర్, బీఏ చదివా. నాకు డాక్టర్ కావాలని ఉండేది. అందుకే ముందు బీఎస్సీలో చేరాను. బీఎస్సీ అంటే ప్రతిరోజూ రికార్డులు రాయాల్సి ఉంటుంది. కానీ, నాకేమో నాటకాల పిచ్చి. ఇలా రికార్డుల మీద రికార్డులు రాస్తూ కూర్చుంటే, ఇక నాటకాలకు సమయం ఉండదనుకున్నా. అందుకే, మా ప్రిన్సిపాల్ త్యాగరాజుగారిని అడిగి, ‘బీఏ - ఎకనామిక్స్’లో చేరా. గిరిబాబు: మీరేమో మంచి అందగాడు.. స్పోర్ట్స్‌లో ఛాంపియన్. మరి, మీరెవరితోనైనా ప్రేమలో పడ్డారా? కైకాల: చాలామంది అమ్మాయిలకు నేనంటే ఇష్టం. కానీ, నా మనసు మాత్రం కుసుమ దగ్గరే. మా ఇద్దరికీ ఓ లెక్చరర్ మధ్యవర్తి. నేను, కుసుమ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇంట్లోవాళ్లకీ, వాళ్ల ఇంట్లోవాళ్లకీ నచ్చలేదు. పెద్దవాళ్ల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే సంసారం సజావుగా ఉండదని పెళ్లి నిర్ణయాన్ని విరమించుకున్నాం. గిరిబాబు: అలా ట్రాజెడీగా మీ ప్రేమకథ ముగిసిందన్నమాట. పోతే అందరూ మిమ్మల్ని అందగాడు అనడం వల్ల నాటకాలు వేసి, సినిమాల్లోకి రావాలనుకున్నారా? కైకాల: నాకు నాటకాలంటే ఇష్టం ఉండేది. నేను నైన్త్ ఫారమ్‌లో ఉన్నప్పుడు మా గుడివాడలో ‘ప్రేమలీల’ అనే నాటకంలో నటించా. గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పట్నుంచీ నటన మీద ఆసక్తి బాగా పెరిగిపోయింది. 1953 నుంచి 55 వరకు బీఏ చేస్తున్నప్పుడు మేం కొంతమంది కలిసి ఓ నాటక సమాజం ఆరంభించి, నాటకాలు వేసేవాళ్లం. హీరో వేషాలతో రెండేళ్లు నేను ‘బెస్ట్ యాక్టర్’ని. నాటకాల్లో నన్ను చూసి, ‘రామారావుగారి తమ్ముడు’ అని విజిల్స్ వేసేవాళ్లు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలు వేస్తూనే, మాకున్న కలప వ్యాపారం చూసుకునేవాణ్ణి. ఇలా సాగుతుండగా కేయం. ధర్ అని మద్రాసులో ఎల్వీ ప్రసాద్‌గారి కంపెనీలో కళా దర్శకుడు తోట దగ్గర అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా ఉండేవారు. ఆయన దగ్గరకెళ్లి ‘‘నాటకాల్లో మంచి పేరుంది. సినిమాలకు పనికొస్తానా’’ అనడిగా. పనికొస్తావన్నారు. గిరిబాబు: సరే.. మద్రాస్ ఎప్పుడెళ్లారు? కైకాల: రాజమండ్రిలో మాకు హోల్‌సేల్ డిపో ఉండేది. ఓ రెండు నెలలు ఆ వ్యాపారం చూసుకున్నాను. ఇంటికెళ్లి చాలా కాలమైంది కదా అని మా గుడివాడ వెళ్లాను. అప్పుడు కేయం ధర్గారు ‘‘ఎల్వీ ప్రసాద్‌గారు కొత్తవారితో ‘కొడుకులు కోడళ్లు’ సినిమా తీస్తున్నారు. మద్రాస్ రావాలి’’ అంటూ కబురు పెట్టారు. 1956 సెప్టెంబర్ 26న గుడివాడలో బయలుదేరి 27న మద్రాసులో అడుగుపెట్టాను. అప్పుడు తెలిసింది కష్టాలంటే ఎలా ఉంటాయో. ఎల్వీ ప్రసాద్ గారు నెల రోజులు ఆగాలన్నారు. ఈలోగా తినడం, తిరగడం.. రాత్రి నిద్రపోవడం విసుగొచ్చేసింది. ‘‘ఏమిట్రా ఈ ఖర్మ.. ’’ అంటూ ఓ రోజు దుఃఖం పట్టలేక ఏడ్చాను కూడా. సూర్యనారాయణగారని మా బంధువు సౌండ్ ఇంజినీర్‌గా చేసేవారు. ఆయన ద్వారా బి.ఏ. సుబ్బారావు గారినీ, సుబ్బారావు గారి సలహా మీద ఎల్వీ ప్రసాద్ గారినీ, ప్రసాద్ గారు పంపడంతో కేవీ రెడ్డిగార్ని కలిశాను. కేవీ రెడ్డి బృందం టెస్టులు చేసి, ‘పెళ్లి నాటి ప్రమాణాలు’ సినిమా కోసం నన్ను సెలక్ట్ చేశారు. తీరా చివరకు, ‘‘సత్యనారాయణా.. ఏమీ అనుకోకు. కొన్ని కారణాల వల్ల ఆర్. నాగేశ్వరరావును తీసుకున్నాం. నీకు నేనే పెద్ద వేషం ఇస్తా’’ అని కేవీ రెడ్డి మాటిచ్చారు. నన్ను రోజూ కలవమన్నారు. ఈలోపు పి. పుల్లయ్యగారు, డీఎల్‌గారు.. ఇలా అందరికీ నా గురించి చెప్పారు. కానీ, నాకా సంగతి తెలియదు. అవకాశం కోసం నేను డీఎల్గారిని కలిశాను. కేవీ రెడ్డిగారు చెప్పింది నా గురించే అని డీఎల్ గారికి అర్థమైంది. ‘‘నువ్విప్పటి వరకూ ఎక్కడా చిన్న వేషాలు వేయలేదంటే నీకు హీరోగా అవకాశం ఇస్తా’’ అన్నారు. అదే ‘సిపాయి కూతురు’. నెలకు మూడు వందలు జీతం. మూడేళ్లు అగ్రిమెంట్. బయటి సినిమాలు చేయాలంటే, అనుమతి తీసుకోవాలి. చివరికి ‘సిపాయి కూతురు’ విడుదలైంది, ఫ్లాపైంది. గిరిబాబు: ‘సిపాయి కూతురు’ టైమ్‌లోనే విఠలాచార్య మీకు అవకాశమివ్వబోయారు కదా. ఆయన్ని కలిశారా? కైకాల: అప్పుడు మోడ్రన్ థియేటర్స్ వారు ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమా ప్లాన్ చేశారు. ఎస్.డి. లాల్ దర్శకుడు. ఆ సినిమాలో ముగ్గురు హీరోలు. ఒక కుర్రాడిగా నా పేరు సూచించారు విఠలాచార్యగారు. కానీ, డిస్ట్రిబ్యూటర్ పూర్ణా పిక్చర్స్ కామరాజుగారు నన్ను తీసేయమన్నారు. అయినా సరే, విఠలాచార్యగారు మొండిగా ‘రెండు రోజులు డెరైక్ట్ చేసి, ఆ రషెస్ అందరికీ చూపిస్తా, నచ్చితేనే తీసుకోండి. లేకపోతే ఆ రెండు రోజుల ఖర్చు నేనే భరిస్తా’ అని చెప్పారు. అందుకే మొదటి రెండు రోజులు ఆయనే డెరైక్ట్ చేశారు. ఫస్ట్ సినిమాయేమో ఫెయిల్. రెండో అవకాశం ఇలా. ఇక, ఏ మొహం పెట్టుకుని ఊరెళ్లాలి.? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆ సాయంత్రం రషెస్ చూసి, నా నటన నచ్చిన మోడ్రన్ థియేటర్స్ అధినేత సుందరంగారు ‘‘నేను ఈ అబ్బాయిని తీసుకుంటున్నా’’ అని, 25 వేలు చెక్ ఇచ్చారు. ఆ విధంగా విఠలాచార్యగారు నాకు హెల్ప్ చేశారు. సినిమాలపరంగా కన్నతండ్రి డీఎల్గారైతే, పెంచిన తండ్రి విఠలాచార్యగారనే చెప్పాలి. గిరిబాబు: ఆర్. నాగేశ్వరరావుగారు చనిపోయాక విలన్‌గా రాజనాల నంబర్ వన్. ఆయనను మీరు అధిగమించారు కదా. రాజనాల మీతో ఎలా ప్రవర్తించేవారు? కైకాల: నన్ను సబార్డినేట్‌లా చూసేవారు. ఎక్కడికెళ్లినా నన్ను, కాంతారావుగారిని సెకండ్రీగా చూసేవారు. ఇలా ఉండగా విఠలాచార్యగారు ‘ఇక్కడ హీరోల మధ్య బాగా పోటీ ఉంది. మీకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి, మీరు పైకి రావడం కష్టం. విలన్ అంటారా ఒక్క రాజనాల మాత్రమే ఉన్నాడు. అందుకని మీరు విలన్‌గా చేయండి. నేను మీకు మొదటి అవకాశం ఇస్తాను’ అన్నారు. అన్నట్లుగానే ‘కనకదుర్గ పూజా మహిమ’లో విలన్ వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనే ‘అగ్గిపిడుగు’ తీశారు. అందులో రామారావుగారు డ్యుయల్ రోల్. ఇందులో నేను రాజనాల సహచరుడిగా చేశా. నాకు చాలా పేరొచ్చింది. ఆ తర్వాత రామారావుగారి సినిమాలన్నీటికీ నన్ను విలన్‌గా బుక్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా రాజనాలను దాటి ముందుకు దూసుకెళ్లిపోయాను. గిరిబాబు: విలన్‌గా నంబర్ వన్‌గా ఉన్నప్పుడే ‘రాముడు-భీముడు’లో రామారావుగారికి డూప్‌గా చేశారు కదా.. ఎవరి బలవంతం మీదైనా అలా చేయాల్సి వచ్చిందా? కైకాల: ‘అగ్గిపిడుగు’కి కెమెరామేన్ రవికాంత్ నగాయిచ్ గారు. నేను రామారావుగారి పోలికలతో ఉంటాను కాబట్టి, డ్యుయల్ రోల్ షాట్స్‌లో నన్ను డూప్‌గా వేయమని అడిగారు. నేను ఓకే అన్నాను. ఇక, ‘రాముడు-భీముడు’ విషయానికొస్తే.. స్వయంగా రామారావుగారే నాకు కబురు పంపారు. ‘‘బ్రదర్.. ఒకే ఒక్క కాల్షీట్ ఉంది. రామానాయుడుగారు రిలీజ్ కూడా ప్లాన్ చేసేశారు. మీరు చేస్తే బాగుంటుంది’’ అన్నారు. అలా డూప్‌గా చేశాను. ఆ తర్వాత విఠలాచార్యగారు తీసిన ‘మంగమ్మ శపథం’లో కూడా నేను రామారావుగారికి డూప్‌గా చేశాను. గిరిబాబు: హీరోలందరికీ మీరు ఎదురులేని విలన్. ఆ తర్వాత మీ కొడుకులుగా మాలాంటివాళ్లు వచ్చాం. ఇక, నేను పరిచయమైన ‘జగమే మాయ’లో నేను వేసిన పాత్రకు ముందు మిమ్మల్ని అనుకున్నారట? కైకాల: అవును. అప్పుడు నేను ఫుల్ బిజీ. నెల రోజుల డేట్స్ కావాలన్నారు. ‘‘చేసే పొజిషన్లో లేనండీ’’ అని చెబితే, ‘‘అయితే కొత్తవాళ్లతో చేయిస్తాను’’ అని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారన్నారు. నేను ‘ఓకే’ అన్నా. గిరిబాబు: ఆ విధంగా మీరు మానుకోవడంవల్ల ఆ సినిమాలో చేసే అదృష్టం నాకు దక్కింది. ‘జగమే మాయ’ షూటింగ్ అప్పుడు నేను, మురళీమోహన్ క్రాంతికుమార్ ఆఫీసులో కూర్చునేవాళ్లం. అప్పుడు మీరు మాకు ‘‘ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే నటనే కాదు, మంచి ప్రవర్తన కూడా ముఖ్యం. అప్పుడే పది కాలాల పాటు ఉంటారు’’ అని హితబోధ చేశారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు అదే సలహా పాటిస్తున్నాం. మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాం. కైకాల: అవును.. ఆ సంఘటను నాకూ గుర్తుంది. గిరిబాబు: మంచి విలన్‌గా క్షణం తీరిక లేని మీకు ‘ఉమ్మడి కుటుంబం’, ‘శారద’ చిత్రాల్లో పాజిటివ్ కేరక్టర్స్ ఆఫర్ చేసినప్పుడు చేయాలని ఎందుకనిపించింది? కైకాల: వాస్తవానికి ఆ పాత్రలకు నన్నడగలేదు. నా అంతట నేనే ప్రాథేయపడి చేశా. ‘ఉమ్మడి కుటుంబం’ అనే సినిమా తీస్తున్నా అని, ఆ కథ చెప్పారు రామారావుగారు. నేను వ్యవసాయదారుడి పాత్ర చేస్తానన్నాను. విలన్‌గా చేసి, అంత పాజిటివ్ కేరక్టరా అన్నారు. ‘‘ఆ వేషం ఇవ్వకపోతే ... సత్యాగ్రహం చేస్తా’’ అని సరదాగా అన్నాను. ఫైనల్‌గా నాకే ఇచ్చారు. సినిమాకి అది కీలకమైన పాత్ర. సినిమా పూర్తయ్యింది. ఫస్ట్ కాపీ వచ్చింది. డ్రైవర్ని పంపించి, రామారావుగారు నన్ను వెంటనే రమ్మన్నారు. ఏమంటారో అని నేను బిక్కు బిక్కుమంటూ వెళ్లాను. వెళ్లగానే నన్ను అమాంతం కౌగలించుకున్నారు. ‘‘అయామ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచ్యులేట్ యు. నేను కూడా అలా చేయలేకపోయేవాణ్ణేమో. అంత సహజంగా ఉంది’’ అని చెప్పారు. అది చూసి, ‘శారద’లో పాజిటివ్ కేరక్టర్ ఇచ్చారు. గిరిబాబు: రామారావుగారు ‘దానవీర శూరకర్ణ’, కృష్ణగారు ‘కురుక్షేత్రం’ చిత్రాలను పోటాపోటీగా తీశారు. ఆ రెండు సినిమాల్లోనూ మీరున్నారు. అదెలా జరిగింది? కైకాల: ‘దానవీర..’కన్నా ముందే నన్ను ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా బుక్ చేశారు. రామారావుగారు ‘దానవీర..’లో భీముడి పాత్రకు అడిగేటప్పుడు, ‘‘మీరు ‘కురుక్షేత్రం’లో చేయడానికి వీల్లేదు’’ అన్నారు. ‘‘ఒకవేళ ‘కురుక్షేత్రం’కన్నా ముందు మీరడిగి ఉంటే, ఆ సినిమా వదులుకునేవాణ్ణి. ఇప్పుడెలా కుదురుతుంది? అడ్వాన్స్ కూడా తీసుకున్నా. పైగా, దుర్యోధనుడి పాత్ర చేయాలని నాకూ ఉంటుంది కదా’’ అని రామారావుగారితో అన్నా. దాంతో ‘‘ఇక్కడ భీముడు, అక్కడ దుర్యోధనుడు... రెండు సినిమాలూ చేసుకోండి’’ అన్నారు నవ్వుతూ. గిరిబాబు: ‘యమగోల’, ‘యముడికి మొగుడు’, ‘యమలీల’ తదితర చిత్రాల్లో మీ యముడి పాత్రపోషణ అద్భుతం. ఇప్పుడు కూడా ఆ పాత్ర చేయడానికి మీరు సిద్ధమేనా? కైకాల: ఇటీవల ‘బలుపు’లో యముడి పాత్ర చేశాను. అప్పుడే కొంచెం ఇబ్బందిపడ్డాను. యముడిగా చేసీ చేసీ అలసిపోయాను. ఇక ఆ పాత్ర చేయలేను. గిరిబాబు: మీరు చాలామంది దర్శకులతో పనిచేశారు. నా అదృష్టం కొద్దీ నేను కూడా మిమ్మల్ని డెరైక్ట్ చేయగలిగాను. నా డెరైక్షన్ మీకెలా అనిపించింది? కైకాల: నీలో మంచి దర్శకుడు ఉన్నాడు. కథను ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకుల్ని రంజింపజేయొచ్చో ఆ పట్టులన్నీ నీకు బాగా తెలుసు. అయితే డెరైక్షన్‌తో పాటు ప్రొడక్షన్లో కూడా వేలుపెట్టడం వల్ల నీకు ఏకాగ్రత కుదర్లేదు. లేకపోతే దర్శకుడిగా నువ్వు ఎక్కడో ఉండేవాడివి. గిరిబాబు: ఇప్పుడు మనం సినిమాలు నిర్మించే పరిస్థితి ఉందా? కైకాల: అప్పట్లో మనం ఓ సినిమా చేశామంటే.. ‘‘మన కారణంగా నిర్మాత నష్టపోకూడదు.. దర్శకుడికి తగిన సహకారం అందించాలి’’ అనుకొనేవాళ్లం. కానీ, ఇప్పుడు నిర్మాత డబ్బులిచ్చి, చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు. అప్పట్లో రామారావుగారు కథ విన్న తర్వాత, వేరే ఏ విషయంలోనూ వేలు పెట్టేవారు కాదు. దర్శక, నిర్మాతలు ఎలా అంటే అలా చేసేవారు. ఈ కాలంలో అలాంటివాళ్లు ఉన్నారా? అందుకే, ఇప్పుడు సినిమా నిర్మాణం మన వల్ల కాదు. ఈ పరిస్థితులు మన మనస్తత్వాలకు సరిపడవు. గిరిబాబు: 1950 నుంచి 1970 వరకు స్వర్ణయుగం అనాలి. ఆ కాలంలోలాగా మంచి పాటలతో వచ్చిన ఉత్తమ చిత్రాలు ఇప్పుడు వస్తాయని ఎదురు చూడొచ్చా? కైకాల: అస్సలు ఎదురు చూడకూడదు. ఇప్పుడు అంతా స్పీడ్. అందుకని అలనాటి ఆణిముత్యాలు వచ్చే అవకాశం లేదు. కొత్త సినిమాలు ఎప్పుడైనా టీవీలో చూడ్డం తప్ప... థియేటర్‌కి వెళ్లి చూడటం లేదు. ఏమైనా ఆ స్వర్ణయుగాన్ని ఇప్పుడు కాదు.. భవిష్యత్తులో కూడా చూడలేం. సమన్వయ సాక్షి: డి.జి. భవాని గిరిబాబు: పాజిటివ్, నెగటివ్ పాత్రలు చేసి ‘నవరస నటనాసార్వభౌమ’ అనిపించుకున్న మీకు, ప్రభుత్వపరంగా రావాల్సిన ‘పద్మ’ పురస్కారం రాలేదు. ఎస్వీఆర్, సావిత్రి, గుమ్మడిగార్లకు కూడా రాలేదు. అది దారుణం అనిపిస్తుంది. కైకాల: కారణాలు నీకు తెలుసు. ఇక నేనేం చెప్పను? గిరిబాబు: అప్పట్లో బ్యాక్‌గ్రౌండ్ లేని మనలాంటివారికి అవకాశం ఇచ్చారు. సక్సెస్ అయ్యాం. ఇవాళ కూడా అందగాళ్లు, ప్రతిభావంతులున్నా, అవకాశాలు రావడం లేదు. దానికి కారణం మనమూ, మన వారసులేనా? కైకాల: నన్నడిగితే కేవలం వారసత్వ జాడ్యం వల్లే... గాడ్‌ఫాదర్స్ లేని వారికి అవకాశాలు రావడం లేదు. ఇవాళ బయటివాళ్లు ఎంతమంది వస్తున్నారో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. ఇవాళ ఓ పౌరాణిక చిత్రం తీశారనుకోండి.. ఆ భారీ డైలాగులు చెప్పే శక్తి ఎవరికైనా ఉందా? ఇదివరకు రామారావుగారు, నాగేశ్వరరావుగారు 2 లక్షలు పారితోషికం తీసుకోవడానికి రెండేళ్లు పట్టేది. ఇప్పుడు రెండు సినిమాలకే కోట్లు తీసుకుంటున్నారు. గిరిబాబు: మీ సమకాలీనులు, తర్వాత నాలాంటివాళ్లు మా వారసులను తెచ్చాం. మీరెందుకు మీ వారసులను తీసుకురాలేదు? కైకాల: మా ఇద్దరబ్బాయిలకూ ఆసక్తి లేదు. కొంచెమైనా ఆసక్తి ఉండి ఉంటే.. నేను ప్రోత్సహించేవాణ్ణి. మా రెండోవాడు విలన్‌గా చేస్తానని కొంత ఆసక్తి చూపించాడు. ఈలోపు మా తమ్ముడితో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇద్దరబ్బాయిలు వ్యాపారంలో బిజీగా ఉన్నారు. -
‘పులుసు’ పేరుతెచ్చింది కానీ...
ఫేమస్ బాలీవుడ్ సింగర్ కమ్ హీరో కిశోర్‌కుమార్ పక్కన కథానాయికగా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? క్లాసూ మాసూ, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా చేయగల గ్లామరస్ యాక్ట్రెస్ గుర్తున్నారా? సరే... ఇవన్నీ ఎందుకు... ‘పులుసు’ గుర్తుందా? అరె.. ఆమెను ఎలా మర్చిపోతాం. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా వచ్చి ఇప్పటికి 30 ఏళ్లయ్యింది. అందులో ‘చేపల పులుసు’తో మగాళ్ళను పడేస్తూ వై. విజయ వేసిన వ్యాంప్ వేషం ఇప్పటికీ ఆమెకో బ్రాండ్ ఇమేజ్. ఓ పాత్ర పేరుతో ఓ ఆర్టిస్టు ఇన్నేళ్లు గుర్తుండిపోవడమంటే చాలా లక్కీ. హీరోయిన్గా ఎదగాల్సిన ఆమెకేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయారు. అసలేం జరిగింది? ఫుల్ డీటైల్స్ వై. విజయనే అడిగేద్దాం! ఎన్నేళ్లయ్యిందండీ.. మిమ్మల్ని చూసి... అవునవును. నన్ను కలిసిన చాలామంది ఇదే మాట అంటుంటారు. అందరికీ దూరంగా ఉండాలని నాకూ లేదు. అంతేకాదు, సినిమాలు కూడా చేయాలనే ఉంది. మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. హెల్త్ బాగున్నంత కాలం యాక్టింగ్ మానే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వృత్తిపరంగా ఏమీ లేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం బిజీగా ఉన్నాను. ఈ మధ్యనే అమ్మమ్మగా ప్రమోషన్ వచ్చింది. నా ఒక్కగానొక్క కూతురు అనూష్యకు కొడుకు పుట్టాడు. ఆ హడావిడిలో ఉన్నాను. వాడి ఆలనా పాలనా చూసుకోవడంతో టైమ్ అస్సలు ఉండడం లేదు. మీ అమ్మాయిని హీరోయిన్ చేయాలనుకోలేదా? తనకు ఇంట్రస్ట్ ఉండుంటే కచ్చితంగా చేసేవాళ్లం కానీ, బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది, స్థిరపడింది. మీ శ్రీవారి గురించి చెప్పండి. మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా? మావారి పేరు అమలనాథన్. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంలాంటిదన్నమాట. ఆయన మా ఫ్యామిలీకి ముందునుంచీ తెలుసు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్న మా పెద్దలు మా పెళ్లి కుదిర్చేశారు. 1985 జనవరి 27న మా పెళ్లయ్యింది. ఆయన కాలేజ్ కరస్పాండెంట్‌గా పని చేసేవారు. రిటైరయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. యాక్టింగ్ విషయంలో మీవారి నుంచి అభ్యంతరాలేవీ ఎదురు కాలేదా? అస్సల్లేదు. నటన వేరు, జీవితం వేరనే సంగతి ఆయనకు తెలుసు. ఇప్పటికీ మీపై ‘పులుసు’ బ్రాండ్ పోలేదు... అవును. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాలోని ఆ పాత్ర నా జీవితాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకు పెళ్లి కుదిరింది. ఆయనకు నా పాత్ర గురించి చెప్పి ఓకే అన్నాకనే నేను ఓకే చెప్పాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘పులుసు’ అనే పిలుస్తుంటారు. ఓ పాత్ర పేరుతో గుర్తున్నందుకు ఆనందమే కానీ, వాటిని మా నిజజీవితానికి ఆపాదించినప్పుడే బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. కరెక్టే.. మీ మీద ఉన్న ‘వ్యాంప్’ ముద్ర కారణంగా మీ గురించి వేరే రకంగానే అనుకునే అవకాశం ఉంది... అది తప్పంటాను. ఎందుకంటే, సినిమా కోసం మేం ఏం చేసినా అది నటనే అవుతుంది. వ్యాంప్ పాత్రలు చేస్తే.. నిజంగా కూడా అలానే ఉంటామనుకుంటే పొరపాటు! నా జీవితం, జీవన విధానం నా సహనటీనటులకు బాగా తెలుసు. కానీ, ప్రేక్షకులకు తెలియదు కాబట్టి, వాళ్లు వేరేలా అనుకుంటారు. అందుకే అంటున్నా... నటీనటులు చేసే పాత్రలను బట్టి వారిని అంచనా వేయొద్దు. వాస్తవానికి హీరోయిన్‌కి ఉండాల్సిన అందచందాలు మీకున్నప్పటికీ ఎందుకు రాణించలేదంటారు? ఎవరూ మిమ్మల్ని తొక్కయ్యలేదుగా? లేదు, ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు. నాకు మొదట్లో సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదు. అనుకోకుండా అవకాశం రావడంతో వచ్చేశాను. హీరోయిన్‌గానే చేయాలనే పట్టుదల ఉండేది కాదు. ఒకవేళ అది బలంగా ఉండి ఉంటే, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేదాన్నేమో! ఆ యావ లేకపోవడంతో, వచ్చిన ప్రతి పాత్ర చేశాను. దాంతో ముందు హీరోయిన్గా తీసుకున్నవాళ్లు, తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. బరువు పెరగడమూ మైనస్ అనొచ్చా? మొదట్లో సన్నగానే ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. బొద్దుగా ఉండటం మా ఫ్యామిలీ జీన్స్‌లోనే ఉంది. మా అమ్మ బొద్దుగానే ఉండేది. అసలు మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది? మద్రాసులో వెంపటి చినసత్యంగారి దగ్గర డాన్స్ నేర్చుకునేదాన్ని. ‘నిండు హృదయాలు’ అనే సినిమాలో అడుక్కుంటూ, డాన్స్ చేసే కేరక్టర్ ఒకటి ఉందని, డాన్స్ తెలిసినవాళ్లు కావాలని మా డాన్స్ స్కూల్‌కి వచ్చారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. అక్కడ నన్ను ఎంపిక చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్, జమున హీరో హీరోయిన్లు! ఆ తర్వాత ‘శ్రీకృష్ణ సత్య’లో మీకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? వాస్తవానికి డాన్స్ స్కూల్లో పురందేశ్వరి, నేను స్నేహితులం. అందుకని, నాకు ఎన్టీఆర్‌గారి కుటుంబంతో ముందే పరిచయం ఉంది. ‘నిండు హృదయాలు’ తర్వాత ‘డబ్బుకు లోకం దాసోహం’ సినిమాలో ఎన్టీఆర్‌గారికి చెల్లెలిగా చేశా. ఆ తర్వాత ఆయన చేసిన ‘శ్రీకృష్ణ సత్య’లో జాంబవతి పాత్ర చేశా. ఆ పాత్ర ఒప్పుకున్న తర్వాత, ఓరోజు ఎన్టీఆర్‌గారు ‘అమ్మాయి.. నా పక్కన మరీ చిన్నపిల్లలా ఉంటావు. కాస్తంత బరువు పెరుగు’ అన్నారు. దాంతో నెయ్యి, పండ్లు తిని, ఐదు కిలోలు బరువు పెరిగాను. మరి.. హీరోయిన్గా ఎప్పుడు అవకాశం వచ్చింది? ‘తల్లిదండ్రులు’ సినిమాకి పదహారేళ్లమ్మాయి కావాలంటూ ఓ పేపర్ యాడ్ ఇచ్చారు. దాదాపు రెండువేల ఫొటోలు వచ్చాయట! మా డాన్స్ స్కూల్‌కి కూడా ఆ చిత్ర నిర్మాత వచ్చారు. నాకప్పుడు పద్నాలుగేళ్లుంటాయి. ఆ రెండువేల ఫొటోలను కూడా పరిశీలించిన తర్వాత, నేను ఆ పాత్రకి కరెక్ట్ అని తీసుకున్నారు. అందులో శోభన్‌బాబుగారు హీరో. మరి తమిళ సినిమాలలో అవకాశం ఎలా వచ్చింది? 1975లో తొలి నృత్యప్రదర్శన ఇచ్చాక, మా ఊరు (కడప) వెళ్లిపోదానుకున్నాను. కానీ, కె.బాలచందర్‌గారు ‘మన్మథలీలై’ సినిమాకి అడిగారు. కమల్‌హాసన్ హీరో. మంచి అవకాశం కదా అని చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. శివాజీగణేశన్గారు, రజనీకాంత్‌గారు.. ఇలా ప్రముఖ హీరోల సరసన సినిమాలు చేశాను. హీరోయిన్గా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక్క తమిళంలోనే 300 సినిమాలు చేశాను. హిందీలోనూ నటించా. కిశోర్ కుమార్ బాలీవుడ్లో ఫేమస్. ఆయన సరసన ‘చల్తీ కా నామ్ జిందగీ’లో ఎలా అవకాశం వచ్చింది? ఆ చిత్రంలో కథానాయిక తమిళమ్మాయి. అందుకని కిశోర్కుమార్గారు హీరోయిన్ని సెలక్ట్ చేయడానికి మద్రాసు వచ్చారు. అప్పటికి నేను బాలచందర్‌గారి సినిమాల్లో యాక్ట్ చేసి, బాగా పాపులర్ అయ్యాను. దాంతో, మేనేజర్ ద్వారా సంప్రదించారు. తర్వాత కిశోర్కుమార్గారు మా ఇంటికొచ్చి, నన్ను ఎంపిక చేశారు. అలాగే ‘మిస్ పమేలా’ అనే ఇంగ్లిష్ సినిమాలోనూ యాక్ట్ చేశాను. తమిళంలో బిజీ అవ్వడంవల్లే కొన్నేళ్లు తెలుగుకు దూరమయ్యారేమో? 1976 నుంచి 1984 వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. తమిళంలో నేను చేసిన భారతీరాజాగారి ‘మన్వాసనై’ తెలుగులో ‘మంగమ్మగారి మనవడు’గా రీమేక్ అయ్యింది. ‘మన్వాసనై’లో నాది వ్యాంప్ తరహా పాత్ర. భారతీరాజాగారు అడిగినప్పుడు సంశయించాను. కానీ, పాత్రను పాత్రగా చూడమని ఆయన అనడంతో చేశా. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో, ‘మంగమ్మగారి మనవడు’కి కూడా అడిగారు. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నేను చేసినది వ్యాంప్ తరహా పాత్రే అయినా.. జుగుప్సాకరంగా ఉండదు. ఆ పాత్ర తర్వాత ఏ దర్శకులైనా ‘గ్లామరస్’గా కనిపించాలని ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయా? నా అదృష్టమో ఏమో కానీ నాకలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. గ్లామరస్ రోల్ అనుకోండి. ‘స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకోవాలి’ అని చెప్పేవారు. అంతకు మించి ఏ ఒత్తిడీ చేయలేదు. అత్త పాత్రలు చేయడం వల్ల మీ మీద ‘గయ్యాళి’ ముద్ర కూడా ఉంది! ఈ మాట నాతో చాలామంది అన్నారు. మామూలుగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ఎవరైనా పలకరిస్తుంటారు కదా. అప్పుడు నా మాట తీరు చూసి, ‘ఇంత సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ, మిమ్మల్ని గయ్యాళి అనుకున్నాం’ అనేవాళ్లు. బయటి ప్రపంచంలో సినిమా తారల గురించి ఏవేవో అనుకుంటారు. కానీ, వాళ్లతో మాట్లాడినప్పుడే వాళ్లేంటో తెలుస్తుంది. సినిమా పరిశ్రమ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మీరు మద్రాసు నుంచి షిఫ్ట్ అవ్వకపోవడానికి కారణం? అప్పుడు నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే, మా అమ్మాయి మద్రాసులో చదువుకుంటోంది. మా ఆయన వ్యాపారం తంజావూరులో. అలా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్‌కు మారలేకపోయాం. మరి.. మీ ఆర్థిక పరిస్థితి సంగతేంటి? వై. విజయ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుందేమో? అని కొంతమంది సందేహిస్తుంటారు. కానీ, నేను ఫైనాన్షియల్‌గా మంచి స్థితిలో ఉన్నాను. అప్పట్లో కొంతమంది తారలు ఆర్థికంగా సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంవల్ల, ఇబ్బందులపాలైన సంగతి తెలిసిందే. మనం అలా కాకూడదని నేను, నా భర్త అనుకున్నాం. సినిమాలు శాశ్వతం కాదు. బిజినెస్ కూడా అంతే. అందుకే, బాగా సంపాదిస్తున్నప్పుడే భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తే మంచిదనుకున్నాం. కల్యాణ మండపం, ఓ కాంప్లెక్స్ కట్టాం. వాటి ద్వారా మంచి ఆదాయమే వస్తోంది. మీ వారు ఏం వ్యాపారం చేసేవారు? మాకు పాప పుట్టిన తర్వాత నేను సినిమాల్లో బాగా బిజీ అయ్యాను. మా పాపను బయటివాళ్లు పెంచడం మాకిష్టం లేదు. అందుకని, మావారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్లో డీలర్షిప్ తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేశారు. మీ అల్లుడు సినిమా పరిశ్రమకు చెందినవారేనా? కాదు. రాయ్ ఆంటోని (అల్లుడి పేరు) యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో ఉన్నారు. అమ్మాయి, అల్లుడు అక్కడే ఉంటారు. ఈ మధ్య బాబు పుట్టాడు కాబట్టి, ప్రస్తుతం ఇక్కడకి వచ్చింది. వచ్చే నెల అమెరికా వెళ్లిపోతుంది. మేం చెన్నయ్‌లోని మహాలింగపురంలో ఉంటాం. సో.. హ్యాపీ లైఫ్ అన్నమాట? కచ్చితంగా! నా జీవితం మొత్తం ఆల్మోస్ట్ హ్యాపీగానే గడిచింది! జీవితంపట్ల ఎలాంటి నిరాశా నిస్పృహలు, పెద్దగా ఆశలు లేవు. అయితే త్వరలో తీరిక దొరకనుంది కాబట్టి మంచి పాత్రలు వస్తే చేయాలని ఉంది! - డి.జి. భవాని మీ కుటుంబ నేపథ్యం? మాది కడప. మా నాన్నగారు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా చేసేవారు. మాది అప్పర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. అమ్మానాన్నలకు మేం పది మంది. ఆరుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. నేను ఐదోదాన్ని. నా సిస్టర్, బ్రదర్స్ అందరూ చక్కగా సెటిలయ్యారు. వై.రాజా అని నా బ్రదర్ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఈ రంగంలో ఉన్నది నేను, నా బ్రదరే! -
రిలేషణం: మమ్మల్ని అన్‌లక్కీ బ్యాచ్ అనేవాళ్లు
దక్షిణాది సినిమా సంగీత ప్రపంచంలో మేరునగధీరుడు ఇళయరాజా. సినిమా పాటపై ఆయన సంతకం ప్రత్యేకమైనది. 37ఏళ్లుగా అవిశ్రాంతంగా స్వరాలందిస్తున్న ఇళయరాజా ఈ జనరేషన్‌కీ ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టరే. ఆయన తమ్ముడైన గంగై అమరన్ మంచి రచయిత, స్వరకర్త, దర్శకుడు. తెలుగులో ‘స్వరకల్పన’ చిత్రానికి సంగీతదర్శకత్వం చేసిన గంగై అమరన్ తన అన్నయ్య గురించి చెప్పిన కబుర్లు... మేం నలుగురు అన్నదమ్ములం. ఇద్దరు అక్కలు. నేను చిన్నవాణ్ణి. పెద్దన్నయ్య పావలర్ వరదరాజన్, రెండో అన్నయ్య ఆర్డీ భాస్కర్, మూడో అన్నయ్య ఇళయరాజా. నేను రాజా అన్నయ్యకన్నా ఐదేళ్లు చిన్న. తమిళనాడు మధురై జిల్లాలోని పణ్ణైపురం మా సొంతఊరు. మా వరదరాజన్ అన్నయ్య కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. రాజకీయ సభల్లో ప్రచార గీతాలు ఆలపించేవారు. ఆయన పాటలంటే చాలు జనాలు విపరీతంగా గుమిగూడేవారు. ఆయన ప్రభావంతోనే రాజా అన్నయ్యలో, నాలో సంగీతం పట్ల మక్కువ, మమకారం మొదలయ్యాయి. అప్పట్లో నేను పాటలు రాసేవాణ్ణి. ఆ పాటకు రాజా అన్నయ్య బాణీ కట్టేవారు. వేదికలపై ఆ పాటలు పాడేవాళ్లం. చిన్న వయసులో అందరు అన్నదమ్ములూ ఎలా ఉండేవాళ్లో మేమూ అంతే. కానీ ఆటలు తక్కువ. పాటలతోనే జీవితం సాగింది. ఇక, సినిమాల్లో ప్రయత్నిస్తే బాగుంటుందని భాస్కర్ అన్నయ్య, రాజా అన్నయ్య చెన్నయ్ రెలైక్కారు. నేను మాత్రం మా ఊళ్లోనే ఉండిపోయాను. తర్వాత... నేనూ చెన్నయ్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. చెన్నయ్‌లోని మైలాపూర్‌లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు మా అన్నయ్యలు. హోటల్ ఖర్చులు భరించలేని నేపథ్యంలో వాళ్లకి వండిపెట్టడానికి నేను చెన్నయ్ వెళ్లాను. నాకు తెలిసిన వంటలేవో చేసేవాణ్ణి. దాంతో పాటు పాటలు కూడా రాసుకునేవాణ్ణి. ముగ్గురం అవకాశాల కోసం ఎక్కని మెట్టు లేదు. లాభం లేదని నిరుత్సాహపడుతున్న సమయంలో ఓ చాన్స్ వచ్చేది. దానికి మధ్యలోనే బ్రేక్ పడేది. అలాంటివి బోల్డన్ని జరిగాయి. దాంతో మా మీద ‘అన్‌లక్కీ బ్యాచ్’ అనే ముద్ర వేశారు. పైగా ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్‌లాంటి సంగీతదర్శకులు ఏలుతున్న రోజులు కావడంతో కొత్తవాళ్లని తీసుకోవడానికి నిర్మాతలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. ఇలా మేం ముగ్గురం మద్రాసులో అవకాశాల కోసం కష్టపడుతున్న విషయం తెలుసుకుని మా అమ్మగారు చిన్నత్తాయమ్మాళ్ కూడా వచ్చేశారు. నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అప్పట్నుంచీ తల్లీతండ్రీ అన్నీ తానై మా అమ్మ మమ్మల్ని పెంచింది. ఆత్మవిశ్వాసమే రాజా అన్నయ్య ఆయుధం అనిపిస్తుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా పట్టించుకునేవారు కాదు. చివరికి ఆయన స్నేహితుడు ఆర్. సెల్వరాజ్ ద్వారా నిర్మాత పంజు అరుణాచలంతో మాకు పరిచయం ఏర్పడింది. ‘అణ్ణక్కిళి’ అనే చిత్రానికి అవకాశం ఇచ్చారు అరుణాచలంగారు. నేను పాటలు రాసిన తర్వాత రాజా అన్నయ్య బాణీలు సమకూర్చేవారు. ఆ సినిమా విజయం సాధించడంతో మా దశ తిరిగింది. ఆ తర్వాత మా విజయవంతమైన ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. పాటలపై మమకారం ఏర్పడటానికి కారణమైన మా అన్నయ్య వరదరాజన్ మా వైభవాన్ని చూడలేదనే కొరత ఉంది. అలాగే మా భాస్కర్ అన్నయ్యని కూడా ఆ దేవుడు త్వరగానే తీసుకెళ్లిపోవడం ఎప్పటికీ బాధగా ఉంటుంది. సంగీత దర్శకుడైన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మ్యూజిక్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని రాజా అన్నయ్య శిక్షణ తీసుకున్నారు. నేనెక్కడా సంగీతం నేర్చుకోలేదు. దానికి కారణం మా అన్నయ్య నేర్చుకుంటే నేనూ నేర్చుకున్నట్లే కదా. పాటలు రాయడంతో పాటు 200 సినిమాలకు నేనూ సంగీతం సమకూర్చాను. అన్నయ్య స్థాయికి కాకపోయినా, ఆ అన్నకు తమ్ముడిగా నేనూ ప్రతిభావంతుణ్ణే అనిపించుకోవడం ఆనందంగా ఉంది. ఒక్కోసారి మనవళ్లు, మనవరాళ్ల పేర్లయినా అన్నయ్యకు తెలుసా? అనిపించేది. సంగీతం తప్ప అన్నయ్యకు మరో ప్రపంచం తెలియదు. అయితే ఇప్పుడు ఫర్వాలేదు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మామూలుగా రాజా అన్నయ్య చాలా తక్కువ మాట్లాడతారు. ఎవరి దగ్గర్నుంచీ ప్రశంసలు ఎదురు చూడరు. నిరాడంబరంగా ఉంటారు. నేనేదైనా గొప్పగా చేసినప్పుడు ప్రశంసించరు. ఆయన మౌనమే ప్రశంసలు కింద లెక్క. తప్పు చేస్తే మాత్రం తిడతారు. అందుకే కనీసం తిట్టడం కోసమైనా మనతో మాట్లాడుతున్నారు కదా ఆనందపడిపోతుంటాను. అలా రాజా అన్నయ్య నాకు అక్షింతలు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అక్షింతలే నాకు ఆశీర్వాదాలు. - డి.జి. భవాని