ఆ వేషం ఇవ్వకపోతే సత్యాగ్రహం చేస్తానన్నాను! | interview with kaikala satyanarayana , Giri Babu | Sakshi
Sakshi News home page

ఆ వేషం ఇవ్వకపోతే సత్యాగ్రహం చేస్తానన్నాను!

Published Thu, Jul 24 2014 11:25 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

interview with kaikala satyanarayana , Giri Babu

నవరస నటనా సార్వభౌముడంటే
 కైకాల సత్యనారాయణే!
 నో సెకండ్ థాట్!
 వందలాది సినిమాలు... వందలాది పాత్రలు..
 ఏం చేసినా... ఆయన ముద్ర మాత్రం సుస్పష్టం.
 కైకాలను గురువుగా భావించే నటుల్లో  
 ముందు వరుసలో నిలిచే వ్యక్తి గిరిబాబు.
 తెలుగు తెరపై ఈయనదొక సెపరేట్ హిస్టరీ.
 నేడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు...
 ఈ సందర్భంగా సమ్‌థింగ్ స్పెషల్
 చేయాలనిపించింది.
 కైకాలను గిరిబాబుతో ఇంటర్వ్యూ చేయిస్తే?
 ఇద్దరూ గుడ్ అన్నారు... ఓకే అన్నారు.
 గురుశిష్యులు మాట్లాడుకున్నట్టుగా...
 స్నేహితులు మనసు విప్పి ఎన్నో అనుభూతులు పంచుకున్నట్టుగా...
 సీనియర్ నటులు తమ అనుభవాల చిట్టా విప్పినట్టుగా... వీరిద్దరి సంభాషణ సాగింది.

 
గిరిబాబు: గురువుగారూ... నమస్కారం. మామూలుగా మనల్ని రిపోర్టర్లు ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పుడు ‘సాక్షి’ పేపర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నన్ను రిపోర్టర్‌ని చేసింది. చాలా సంతోషంగా ఉందండీ...
కైకాల: సంతోషం గిరిబాబు. నిన్నందరూ ‘ఎన్‌సైక్లోపీడియా’ అంటారు. అందుకే, నీతో నన్ను ఇంటర్వ్యూ చేయించాలనుకుంటున్నానని భవానీ చెప్పగానే ఓకే అనేశాను. మనం ఈ మధ్య కలుసుకుని కూడా చాలా రోజులైంది.
గిరిబాబు: అవునవును... మీరు, నేను, నాగేశ్వరరావుగారు వారానికి రెండు, మూడుసార్లయినా కలుసుకునేవాళ్లం. గుమ్మడిగారి ఇల్లే మనకు మీటింగ్ ప్లేస్. అప్పుడప్పుడూ నాగేశ్వరరావుగారింటికి వెళ్లేవాళ్లం. గుమ్మడిగారు పోయాక మన మీటింగులు తగ్గాయి. నాగేశ్వరరావుగారు దూరమైన తర్వాత సాంతం మానేశాం.
 
గిరిబాబు: మీ గురించి నాకు తెలిసినా.. మిగతావాళ్లకి తెలియాలని అడుగుతున్నా..  మీరెంతవరకు చదువుకున్నారు? పెద్దయ్యాక ఏమవ్వాలనుకునేవారు?
కైకాల: ఇప్పుడు ‘ఏయన్నార్ కాలేజ్’ అంటున్నారు కదా.. అప్పట్లో ‘ది గుడివాడ కాలేజ్’ అనేవారు. అందులోనే ఇంటర్, బీఏ చదివా. నాకు డాక్టర్ కావాలని ఉండేది. అందుకే ముందు బీఎస్సీలో చేరాను. బీఎస్సీ అంటే ప్రతిరోజూ రికార్డులు రాయాల్సి ఉంటుంది. కానీ, నాకేమో నాటకాల పిచ్చి. ఇలా రికార్డుల మీద రికార్డులు రాస్తూ కూర్చుంటే, ఇక నాటకాలకు సమయం ఉండదనుకున్నా. అందుకే, మా ప్రిన్సిపాల్ త్యాగరాజుగారిని అడిగి, ‘బీఏ - ఎకనామిక్స్’లో చేరా.
 
గిరిబాబు: మీరేమో మంచి అందగాడు.. స్పోర్ట్స్‌లో ఛాంపియన్. మరి, మీరెవరితోనైనా ప్రేమలో పడ్డారా?
కైకాల: చాలామంది అమ్మాయిలకు నేనంటే ఇష్టం. కానీ, నా మనసు మాత్రం కుసుమ దగ్గరే. మా ఇద్దరికీ ఓ లెక్చరర్ మధ్యవర్తి. నేను, కుసుమ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇంట్లోవాళ్లకీ, వాళ్ల ఇంట్లోవాళ్లకీ నచ్చలేదు. పెద్దవాళ్ల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే సంసారం సజావుగా ఉండదని పెళ్లి నిర్ణయాన్ని విరమించుకున్నాం.
 
గిరిబాబు: అలా ట్రాజెడీగా మీ ప్రేమకథ ముగిసిందన్నమాట. పోతే అందరూ మిమ్మల్ని అందగాడు అనడం వల్ల నాటకాలు వేసి, సినిమాల్లోకి రావాలనుకున్నారా?
కైకాల: నాకు నాటకాలంటే ఇష్టం ఉండేది. నేను నైన్త్ ఫారమ్‌లో ఉన్నప్పుడు మా గుడివాడలో ‘ప్రేమలీల’ అనే నాటకంలో నటించా. గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పట్నుంచీ నటన మీద ఆసక్తి బాగా పెరిగిపోయింది. 1953 నుంచి 55 వరకు బీఏ చేస్తున్నప్పుడు మేం కొంతమంది కలిసి ఓ నాటక సమాజం ఆరంభించి, నాటకాలు వేసేవాళ్లం. హీరో వేషాలతో రెండేళ్లు నేను ‘బెస్ట్ యాక్టర్’ని. నాటకాల్లో నన్ను చూసి, ‘రామారావుగారి తమ్ముడు’ అని విజిల్స్ వేసేవాళ్లు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలు వేస్తూనే, మాకున్న కలప వ్యాపారం చూసుకునేవాణ్ణి. ఇలా సాగుతుండగా కేయం. ధర్ అని మద్రాసులో ఎల్వీ ప్రసాద్‌గారి కంపెనీలో కళా దర్శకుడు తోట దగ్గర అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా ఉండేవారు. ఆయన దగ్గరకెళ్లి ‘‘నాటకాల్లో మంచి పేరుంది. సినిమాలకు పనికొస్తానా’’ అనడిగా. పనికొస్తావన్నారు.

గిరిబాబు: సరే.. మద్రాస్ ఎప్పుడెళ్లారు?
కైకాల: రాజమండ్రిలో మాకు హోల్‌సేల్ డిపో ఉండేది. ఓ రెండు నెలలు ఆ వ్యాపారం చూసుకున్నాను. ఇంటికెళ్లి చాలా కాలమైంది కదా అని మా గుడివాడ వెళ్లాను. అప్పుడు కేయం ధర్‌గారు ‘‘ఎల్వీ ప్రసాద్‌గారు కొత్తవారితో ‘కొడుకులు కోడళ్లు’ సినిమా తీస్తున్నారు. మద్రాస్ రావాలి’’ అంటూ కబురు పెట్టారు. 1956 సెప్టెంబర్ 26న గుడివాడలో బయలుదేరి 27న మద్రాసులో అడుగుపెట్టాను. అప్పుడు తెలిసింది కష్టాలంటే ఎలా ఉంటాయో. ఎల్వీ ప్రసాద్ గారు నెల రోజులు ఆగాలన్నారు. ఈలోగా తినడం, తిరగడం.. రాత్రి నిద్రపోవడం విసుగొచ్చేసింది. ‘‘ఏమిట్రా ఈ ఖర్మ.. ’’ అంటూ ఓ రోజు దుఃఖం పట్టలేక ఏడ్చాను కూడా. సూర్యనారాయణగారని మా బంధువు సౌండ్ ఇంజినీర్‌గా చేసేవారు. ఆయన ద్వారా బి.ఏ. సుబ్బారావు గారినీ, సుబ్బారావు గారి సలహా మీద ఎల్వీ ప్రసాద్ గారినీ, ప్రసాద్ గారు పంపడంతో కేవీ రెడ్డిగార్ని కలిశాను. కేవీ రెడ్డి బృందం టెస్టులు చేసి, ‘పెళ్లి నాటి ప్రమాణాలు’ సినిమా కోసం నన్ను సెలక్ట్ చేశారు. తీరా చివరకు, ‘‘సత్యనారాయణా.. ఏమీ అనుకోకు. కొన్ని కారణాల వల్ల ఆర్. నాగేశ్వరరావును తీసుకున్నాం. నీకు నేనే పెద్ద వేషం ఇస్తా’’ అని కేవీ రెడ్డి మాటిచ్చారు. నన్ను రోజూ కలవమన్నారు. ఈలోపు పి. పుల్లయ్యగారు, డీఎల్‌గారు.. ఇలా అందరికీ నా గురించి చెప్పారు. కానీ, నాకా సంగతి తెలియదు. అవకాశం కోసం నేను డీఎల్‌గారిని కలిశాను. కేవీ రెడ్డిగారు చెప్పింది నా గురించే అని డీఎల్ గారికి అర్థమైంది. ‘‘నువ్విప్పటి వరకూ ఎక్కడా చిన్న వేషాలు వేయలేదంటే నీకు హీరోగా అవకాశం ఇస్తా’’ అన్నారు. అదే ‘సిపాయి కూతురు’. నెలకు మూడు వందలు జీతం. మూడేళ్లు అగ్రిమెంట్. బయటి సినిమాలు చేయాలంటే, అనుమతి తీసుకోవాలి. చివరికి ‘సిపాయి కూతురు’ విడుదలైంది, ఫ్లాపైంది.
 
గిరిబాబు: ‘సిపాయి కూతురు’ టైమ్‌లోనే విఠలాచార్య మీకు అవకాశమివ్వబోయారు కదా. ఆయన్ని కలిశారా?
కైకాల: అప్పుడు మోడ్రన్ థియేటర్స్ వారు ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమా ప్లాన్ చేశారు. ఎస్.డి. లాల్ దర్శకుడు. ఆ సినిమాలో ముగ్గురు హీరోలు. ఒక కుర్రాడిగా నా పేరు సూచించారు విఠలాచార్యగారు. కానీ, డిస్ట్రిబ్యూటర్ పూర్ణా పిక్చర్స్ కామరాజుగారు నన్ను తీసేయమన్నారు. అయినా సరే, విఠలాచార్యగారు మొండిగా ‘రెండు రోజులు డెరైక్ట్ చేసి, ఆ రషెస్ అందరికీ చూపిస్తా, నచ్చితేనే తీసుకోండి. లేకపోతే ఆ రెండు రోజుల ఖర్చు నేనే భరిస్తా’ అని చెప్పారు. అందుకే మొదటి రెండు రోజులు ఆయనే డెరైక్ట్ చేశారు. ఫస్ట్ సినిమాయేమో ఫెయిల్. రెండో అవకాశం ఇలా. ఇక, ఏ మొహం పెట్టుకుని ఊరెళ్లాలి.? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.  ఆ సాయంత్రం రషెస్ చూసి, నా నటన నచ్చిన మోడ్రన్ థియేటర్స్ అధినేత సుందరంగారు ‘‘నేను ఈ అబ్బాయిని తీసుకుంటున్నా’’ అని, 25 వేలు చెక్ ఇచ్చారు. ఆ  విధంగా విఠలాచార్యగారు నాకు హెల్ప్ చేశారు. సినిమాలపరంగా కన్నతండ్రి డీఎల్‌గారైతే, పెంచిన తండ్రి విఠలాచార్యగారనే చెప్పాలి.
 
గిరిబాబు: ఆర్. నాగేశ్వరరావుగారు చనిపోయాక విలన్‌గా రాజనాల నంబర్ వన్. ఆయనను మీరు అధిగమించారు కదా. రాజనాల మీతో ఎలా ప్రవర్తించేవారు?
కైకాల: నన్ను సబార్డినేట్‌లా చూసేవారు. ఎక్కడికెళ్లినా నన్ను, కాంతారావుగారిని సెకండ్రీగా చూసేవారు. ఇలా ఉండగా విఠలాచార్యగారు ‘ఇక్కడ హీరోల మధ్య బాగా పోటీ ఉంది. మీకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి, మీరు పైకి రావడం కష్టం. విలన్ అంటారా ఒక్క రాజనాల మాత్రమే ఉన్నాడు. అందుకని మీరు విలన్‌గా చేయండి. నేను మీకు మొదటి అవకాశం ఇస్తాను’ అన్నారు. అన్నట్లుగానే ‘కనకదుర్గ పూజా మహిమ’లో విలన్ వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనే ‘అగ్గిపిడుగు’ తీశారు. అందులో రామారావుగారు డ్యుయల్ రోల్. ఇందులో నేను రాజనాల సహచరుడిగా చేశా. నాకు చాలా పేరొచ్చింది. ఆ తర్వాత రామారావుగారి  సినిమాలన్నీటికీ నన్ను విలన్‌గా బుక్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా రాజనాలను దాటి ముందుకు దూసుకెళ్లిపోయాను.
 
గిరిబాబు: విలన్‌గా నంబర్ వన్‌గా ఉన్నప్పుడే ‘రాముడు-భీముడు’లో రామారావుగారికి డూప్‌గా చేశారు కదా.. ఎవరి బలవంతం మీదైనా అలా చేయాల్సి వచ్చిందా?
కైకాల: ‘అగ్గిపిడుగు’కి కెమెరామేన్ రవికాంత్ నగాయిచ్ గారు. నేను రామారావుగారి పోలికలతో ఉంటాను కాబట్టి, డ్యుయల్ రోల్ షాట్స్‌లో నన్ను డూప్‌గా వేయమని అడిగారు. నేను ఓకే అన్నాను. ఇక, ‘రాముడు-భీముడు’ విషయానికొస్తే.. స్వయంగా రామారావుగారే నాకు కబురు పంపారు. ‘‘బ్రదర్.. ఒకే ఒక్క కాల్షీట్ ఉంది. రామానాయుడుగారు రిలీజ్ కూడా ప్లాన్ చేసేశారు. మీరు చేస్తే బాగుంటుంది’’ అన్నారు. అలా డూప్‌గా చేశాను. ఆ తర్వాత విఠలాచార్యగారు తీసిన ‘మంగమ్మ శపథం’లో కూడా నేను రామారావుగారికి డూప్‌గా చేశాను.
 
గిరిబాబు:
హీరోలందరికీ మీరు ఎదురులేని విలన్. ఆ తర్వాత మీ కొడుకులుగా మాలాంటివాళ్లు వచ్చాం. ఇక, నేను పరిచయమైన ‘జగమే మాయ’లో నేను వేసిన పాత్రకు ముందు మిమ్మల్ని అనుకున్నారట?
కైకాల: అవును. అప్పుడు నేను ఫుల్ బిజీ. నెల రోజుల డేట్స్ కావాలన్నారు. ‘‘చేసే పొజిషన్‌లో లేనండీ’’ అని చెబితే, ‘‘అయితే కొత్తవాళ్లతో చేయిస్తాను’’ అని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారన్నారు. నేను ‘ఓకే’ అన్నా.
 
గిరిబాబు: ఆ విధంగా మీరు మానుకోవడంవల్ల ఆ సినిమాలో చేసే అదృష్టం నాకు దక్కింది. ‘జగమే మాయ’ షూటింగ్ అప్పుడు నేను, మురళీమోహన్ క్రాంతికుమార్ ఆఫీసులో కూర్చునేవాళ్లం. అప్పుడు మీరు మాకు ‘‘ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే నటనే కాదు, మంచి ప్రవర్తన కూడా ముఖ్యం. అప్పుడే పది కాలాల పాటు ఉంటారు’’ అని హితబోధ చేశారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు అదే సలహా పాటిస్తున్నాం. మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాం.
కైకాల: అవును.. ఆ సంఘటను నాకూ గుర్తుంది.
 
గిరిబాబు: మంచి విలన్‌గా క్షణం తీరిక లేని మీకు ‘ఉమ్మడి కుటుంబం’, ‘శారద’ చిత్రాల్లో పాజిటివ్ కేరక్టర్స్ ఆఫర్ చేసినప్పుడు చేయాలని ఎందుకనిపించింది?
కైకాల: వాస్తవానికి ఆ పాత్రలకు నన్నడగలేదు. నా అంతట నేనే ప్రాథేయపడి చేశా. ‘ఉమ్మడి కుటుంబం’ అనే సినిమా తీస్తున్నా అని, ఆ కథ చెప్పారు రామారావుగారు. నేను వ్యవసాయదారుడి పాత్ర చేస్తానన్నాను. విలన్‌గా చేసి, అంత పాజిటివ్ కేరక్టరా అన్నారు. ‘‘ఆ వేషం ఇవ్వకపోతే ... సత్యాగ్రహం చేస్తా’’ అని సరదాగా అన్నాను. ఫైనల్‌గా నాకే ఇచ్చారు. సినిమాకి అది కీలకమైన పాత్ర. సినిమా పూర్తయ్యింది. ఫస్ట్ కాపీ వచ్చింది. డ్రైవర్‌ని పంపించి, రామారావుగారు నన్ను వెంటనే రమ్మన్నారు. ఏమంటారో అని నేను బిక్కు బిక్కుమంటూ వెళ్లాను. వెళ్లగానే నన్ను అమాంతం కౌగలించుకున్నారు. ‘‘అయామ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచ్యులేట్ యు. నేను కూడా అలా చేయలేకపోయేవాణ్ణేమో. అంత సహజంగా ఉంది’’ అని చెప్పారు. అది చూసి, ‘శారద’లో పాజిటివ్ కేరక్టర్ ఇచ్చారు.
 
గిరిబాబు: రామారావుగారు ‘దానవీర శూరకర్ణ’,  కృష్ణగారు ‘కురుక్షేత్రం’ చిత్రాలను పోటాపోటీగా తీశారు. ఆ రెండు సినిమాల్లోనూ మీరున్నారు. అదెలా జరిగింది?
కైకాల: ‘దానవీర..’కన్నా ముందే నన్ను ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా బుక్ చేశారు. రామారావుగారు ‘దానవీర..’లో భీముడి పాత్రకు అడిగేటప్పుడు, ‘‘మీరు ‘కురుక్షేత్రం’లో చేయడానికి వీల్లేదు’’ అన్నారు. ‘‘ఒకవేళ ‘కురుక్షేత్రం’కన్నా ముందు మీరడిగి ఉంటే, ఆ సినిమా వదులుకునేవాణ్ణి. ఇప్పుడెలా కుదురుతుంది? అడ్వాన్స్ కూడా తీసుకున్నా. పైగా, దుర్యోధనుడి పాత్ర చేయాలని నాకూ ఉంటుంది కదా’’ అని రామారావుగారితో అన్నా. దాంతో ‘‘ఇక్కడ భీముడు, అక్కడ దుర్యోధనుడు... రెండు సినిమాలూ చేసుకోండి’’ అన్నారు నవ్వుతూ.
 
గిరిబాబు: ‘యమగోల’, ‘యముడికి మొగుడు’, ‘యమలీల’ తదితర చిత్రాల్లో మీ యముడి పాత్రపోషణ అద్భుతం. ఇప్పుడు కూడా ఆ పాత్ర చేయడానికి మీరు సిద్ధమేనా?
కైకాల: ఇటీవల ‘బలుపు’లో యముడి పాత్ర చేశాను. అప్పుడే కొంచెం ఇబ్బందిపడ్డాను. యముడిగా చేసీ చేసీ అలసిపోయాను. ఇక ఆ పాత్ర చేయలేను.
 
గిరిబాబు: మీరు చాలామంది దర్శకులతో పనిచేశారు. నా అదృష్టం కొద్దీ నేను కూడా మిమ్మల్ని డెరైక్ట్ చేయగలిగాను. నా డెరైక్షన్ మీకెలా అనిపించింది?
కైకాల: నీలో మంచి దర్శకుడు ఉన్నాడు. కథను ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకుల్ని రంజింపజేయొచ్చో ఆ పట్టులన్నీ నీకు బాగా తెలుసు. అయితే డెరైక్షన్‌తో పాటు ప్రొడక్షన్‌లో కూడా వేలుపెట్టడం వల్ల నీకు ఏకాగ్రత కుదర్లేదు. లేకపోతే దర్శకుడిగా నువ్వు ఎక్కడో ఉండేవాడివి.
 
గిరిబాబు:
ఇప్పుడు మనం సినిమాలు నిర్మించే పరిస్థితి ఉందా?
కైకాల: అప్పట్లో మనం ఓ సినిమా చేశామంటే.. ‘‘మన కారణంగా నిర్మాత నష్టపోకూడదు.. దర్శకుడికి తగిన సహకారం అందించాలి’’  అనుకొనేవాళ్లం. కానీ, ఇప్పుడు నిర్మాత డబ్బులిచ్చి, చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు. అప్పట్లో రామారావుగారు కథ విన్న తర్వాత, వేరే ఏ విషయంలోనూ వేలు పెట్టేవారు కాదు. దర్శక, నిర్మాతలు ఎలా అంటే అలా చేసేవారు. ఈ కాలంలో అలాంటివాళ్లు ఉన్నారా? అందుకే, ఇప్పుడు సినిమా నిర్మాణం మన వల్ల కాదు. ఈ పరిస్థితులు మన మనస్తత్వాలకు సరిపడవు.
 
గిరిబాబు:
1950 నుంచి 1970 వరకు స్వర్ణయుగం అనాలి. ఆ కాలంలోలాగా మంచి పాటలతో వచ్చిన ఉత్తమ చిత్రాలు ఇప్పుడు వస్తాయని ఎదురు చూడొచ్చా?
కైకాల: అస్సలు ఎదురు చూడకూడదు. ఇప్పుడు అంతా స్పీడ్. అందుకని అలనాటి ఆణిముత్యాలు వచ్చే అవకాశం లేదు. కొత్త సినిమాలు ఎప్పుడైనా టీవీలో చూడ్డం తప్ప... థియేటర్‌కి వెళ్లి చూడటం లేదు. ఏమైనా ఆ స్వర్ణయుగాన్ని ఇప్పుడు కాదు.. భవిష్యత్తులో కూడా చూడలేం.
 సమన్వయ సాక్షి: డి.జి. భవాని
 
గిరిబాబు: పాజిటివ్, నెగటివ్ పాత్రలు చేసి ‘నవరస నటనాసార్వభౌమ’ అనిపించుకున్న మీకు, ప్రభుత్వపరంగా  రావాల్సిన ‘పద్మ’ పురస్కారం రాలేదు. ఎస్వీఆర్, సావిత్రి, గుమ్మడిగార్లకు కూడా రాలేదు. అది దారుణం అనిపిస్తుంది.
 కైకాల: కారణాలు నీకు తెలుసు. ఇక నేనేం చెప్పను?

గిరిబాబు: అప్పట్లో బ్యాక్‌గ్రౌండ్ లేని మనలాంటివారికి అవకాశం ఇచ్చారు. సక్సెస్ అయ్యాం. ఇవాళ కూడా అందగాళ్లు, ప్రతిభావంతులున్నా, అవకాశాలు రావడం లేదు. దానికి కారణం మనమూ, మన వారసులేనా?
 కైకాల: నన్నడిగితే కేవలం వారసత్వ జాడ్యం వల్లే... గాడ్‌ఫాదర్స్ లేని వారికి అవకాశాలు రావడం లేదు. ఇవాళ బయటివాళ్లు ఎంతమంది వస్తున్నారో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. ఇవాళ ఓ పౌరాణిక చిత్రం తీశారనుకోండి.. ఆ భారీ డైలాగులు చెప్పే శక్తి ఎవరికైనా ఉందా? ఇదివరకు రామారావుగారు, నాగేశ్వరరావుగారు 2 లక్షలు పారితోషికం తీసుకోవడానికి రెండేళ్లు పట్టేది. ఇప్పుడు రెండు సినిమాలకే కోట్లు తీసుకుంటున్నారు.
 
గిరిబాబు: మీ సమకాలీనులు, తర్వాత నాలాంటివాళ్లు మా వారసులను తెచ్చాం. మీరెందుకు మీ వారసులను తీసుకురాలేదు?
 కైకాల: మా ఇద్దరబ్బాయిలకూ ఆసక్తి లేదు. కొంచెమైనా ఆసక్తి ఉండి ఉంటే.. నేను ప్రోత్సహించేవాణ్ణి. మా రెండోవాడు విలన్‌గా చేస్తానని కొంత ఆసక్తి చూపించాడు. ఈలోపు మా తమ్ముడితో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇద్దరబ్బాయిలు వ్యాపారంలో బిజీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement