పరికిణీలూ పూలజడలూ... పట్టుచీరలూ ఏడువారాల నగలూ...
ముంగిట్లో ముత్యాల ముగ్గులూ... పెరట్లో ధాన్యాల రాశులూ...
అరిసెలూ సున్నుండలూ కజ్జికాయలూ...
ఓర చూపులూ దోర నవ్వులూ చిలిపి ముద్దులూ.. ఆక్రోశాలూ.. ఉక్రోషాలూ.. తగాదాలూ తప్పిదాలూ...
కృష్ణవంశీ సినిమా అంటే ఇవన్నీ ఉండాల్సిందే!
పండగకు అమ్మమ్మగారి ఊరెళ్లినట్టుగా... ఇంట్లో ఐదు రోజుల పెళ్లి జరిగినట్టుగా...
కృష్ణవంశీ సినిమా చూస్తుంటే ఏదో సంబరం..!
ఇక్కడ సక్సెస్‌లూ, ఫెయిల్యూర్‌లూ పక్కన పెట్టండి. మన మూలాల్ని మనకు గుర్తు చేయడమే కృష్ణవంశీ చేసే పని.
గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ... తను మాత్రం బ్యాడ్ హజ్బెండ్‌ని, బ్యాడ్ ఫాదర్‌ని అని చెబుతున్నారు.
ఆయన తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ కబుర్లతో పాటు
కెరీర్ అచ్చట్లు... ఫ్యామిలీ ముచ్చట్లు మనసు విప్పి ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు.
‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్నే అటూ ఇటూ మార్చి ‘గోవిందుడు ఆందరివాడేలే’గా తీశారని కామెంట్...
కృష్ణవంశీ: ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుంటే తప్పేంటి? ఇవాళ్టి రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలో ఎవరూ ఎవర్నీ కలుపుకొని పోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. అందుకే ఇలాంటి సినిమాల అవసరం ఉంది. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, బాంబులు విసరడాలు.. ఇంకెంత కాలం చెప్పండి? మన సెన్సిబిల్టీకి తగ్గ సినిమా తీయాలని ఇది తీశాను. అది నచ్చింది కాబట్టే, ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.
ఫ్యామిలీ సినిమాలంటే ఒక మనవడో, మనవరాలో కుటుంబాన్ని కలపడానికి ట్రై చేయడం.. ఇదేనా.. వేరే కథలు రావా?
వాస్తవానికి అప్పటి ‘దేవుడు చేసిన మనుషులు’, ఆత్మబంధువు’, ‘సంబరాల రాంబాబు’, ‘వారసుడొచ్చాడు’... ఇవన్నీ కూడా ఎవరో ఒకరు కుటుంబాన్ని కలిపే కథలే కదా. అన్ని కథలనూ అందరూ ఇష్టపడి చూశారుగా.
ఇన్ని సినిమాలున్నప్పుడు మళ్లీ అవే చేయడం ఎందుకు?
మన కథలన్నీ రామాయణ, భారతాల నుంచే పుడుతున్నాయి. ఎవరేం చేసినా, వాటి చుట్టూనే తిరగాలి. తప్పదు. అయినా నేనేం ఇది కొత్త కథ అనడం లేదు. కాకపోతే.. ‘గోవిందుడు..’ సినిమా కథ వేరు.. ఆ కథలు వేరు.
అచ్చ తెలుగు సంప్రదాయాలతో సినిమా తీశారు సరే.. మరి హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో మందు కొట్టించే సన్నివేశం చేయడం అవసరమా?
సమాజంలో ఎవరూ చేయడంలేదా. ఉన్నదే చూపించా. ఏం మగవాళ్లు మందు తాగొచ్చు కానీ, ఆడవాళ్లు తాగకూడదా? మగ, ఆడ సమానం అని హక్కులు మాట్లాడుతుంటారు కదా. మగవాళ్లు పెట్టిన ఆంక్షల ప్రకారం స్త్రీ బతకాలా?
సినిమా గురించి పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఆడవాళ్లు మందు తాగడాన్ని మీరు హర్షిస్తారా?
తప్పకుండా.. ఎందుకంటే అలవాట్లనేవి వారి వ్యక్తిగతం. పురుషాధిక్య ప్రపంచంలో ఆలోచనలన్నీ పురుషుడి పక్షానే ఉంటున్నాయి. నా దృష్టిలో స్త్రీ అంటే ఏంటో చెప్పనా.. ‘స్త్రీలు నాకన్నా తక్కువ అని నేననుకోను.. నాకన్నా పై మెట్టు మీద ఉన్న జాతికి చెందినవారు’ అనుకుంటాను. పదిమందికి నష్టం కలిగించని దేన్నయినా నేను ఆమోదిస్తాను.
‘‘కృష్ణవంశీతో ఇప్పుడు సినిమా అంటే నటన నేర్పిస్తాడు.. నేను అందుకు రెడీగా లేను’’ అని చిరంజీవిగారు బహిరంగంగా పేర్కొనడం పట్ల మీ ఫీలింగ్?
అది ఆయన గొప్పతనం. ఆయనకు తెలియని యాక్టింగా? ది బెస్ట్ నుంచి ది వరస్ట్ అనదగ్గ దర్శకులందరితోనూ ఆయన చేశారు. ఆయన డైనమిజమ్, లైవ్లీనెస్, ఎమోషన్ అన్నీ ఇష్టం. గత తరానికి మహానటుడు ఎన్టీఆర్ ఓ నిఘంటువు అయితే.. ఈ తరానికి చిరంజీవి టెక్ట్స్‌బుక్. ఆయన నా గురించి అలా అన్నారంటే అదంతా ఆయన అభిమానం.
ఈ చిత్ర ఆడియో వేడుకలో మీరు ఎమోషనల్ అయ్యారేం?
మూడేళ్లుగా ఎదురైన అనుభవాలు, చూసిన పరిస్థితులు, నాతో కొందరు ప్రవర్తించిన విధానం, సినిమాలను సరిగ్గా తీయలేకపోయినందుకు పడిన బాధ.. ఇలా కొన్ని కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో సడన్‌గా అన్నయ్య (చిరంజీవి)లాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, చరణ్ లాంటి హీరో... నన్ను నమ్మి కథ పూర్తిగా వినకుండానే ‘సినిమా చేసేస్తాం’ అన్నారు. అప్పుడు భావోద్వేగానికి గురవడం సహజం కదా!
ఇన్నేళ్ల కెరీర్‌లో జయాపజయాలకు అతీతంగా స్పందించడం మీకు అలవాటై ఉంటుంది. అలాంటిది ఏవో కొన్ని సినిమాలు ఆడకపోతే ఎమోషనల్ కావడమా?
‘సిందూరం’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పక్కనపెడదాం. వంద శాతం క్రియేటివ్ శాటిస్‌ఫేక్షన్ ఉన్న చిత్రం అది. కానీ, గత రెండు, మూడేళ్లల్లో నేను తీసిన సినిమాల్లో నేననుకున్నది తెరపై పూర్తిగా తీయలేకపోయాను. నేననుకున్నది స్క్రీన్ మీద పెట్టలేకపోయాను. దానికి రకరకాల కారణాలున్నాయి. ‘పైసా’ని తీసుకుందాం. మూడు నెలల్లో పూర్తి చేసిన ఆ చిత్రం విడుదలకు రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. నేననుకున్నది తీయలేకపోవడానికి కారణం.. నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి.
జనరల్‌గా ‘మేం అనుకున్నది తీయలేకపోయాం’ అని అప్‌కమింగ్ డెరైక్టర్లు అంటుంటారు. మీలాంటి దర్శకులు ఇలా అనడమా?
నాలాంటి దర్శకులకే ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే, నేను రెగ్యులర్ సక్సెస్‌ఫుల్ ఫార్ములాలో సినిమాలు తీసే డెరైక్టర్‌ని కాదు. ఓ కొత్త జానర్‌లో తీస్తాను. సో.. నిర్మాతను, ఆరిస్టులను కన్విన్స్ చేయడం కష్టం. ఇప్పుడు ‘గోవిందుడు..’ సక్సెస్ అయ్యింది కాబట్టి, తర్వాత కూడా మళ్లీ అలాంటి సినిమానే చేద్దాం అంటారు. కానీ, నేనందుకు విరుద్ధం. వాళ్ల మైండ్‌సెట్‌ని దీన్నుంచి నా జానర్‌లోకి తీసుకెళ్లడానికి కష్టం అవుతుంది.
కొత్త జానర్‌లో సినిమాలు చేసే హీరోలు లేరంటారా?
ఇండియాలో ఆమిర్‌ఖాన్ తప్ప ఎవరున్నారు. ఒక్క ఆమిర్‌ఖాన్ ఎంతమందిని శాటిస్‌ఫై చేస్తాడు. అయినా హీరోలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, వాళ్లు కనెక్ట్ కాని కథలో ఎలా ఇమిడిపోగలుగుతారు? ఆమిర్‌ఖాన్‌నే తీసుకుందాం. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ‘లగాన్’ చిత్రం తీసిన దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ‘స్వదేశ్’ కథతో ఆమిర్‌ఖాన్‌ని కలిస్తే, ‘నాకు కనెక్ట్ కావడం లేదు’ అని సింపుల్‌గా చెప్పేశాడు. ‘రోబో’ కథను షారుక్ ఖాన్‌కి శంకర్ చెబితే, ‘నా వల్ల కాదు’ అన్నాడు.
డెరైక్టర్లను హీరోలు నమ్మకపోవడం ఎక్కువయ్యిందంటారా?
అంత ఆలోచించలేదు నేను. ఏ హీరో అయినా కథకు కనెక్ట్ కాకపోతే, పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? కనెక్ట్ కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. పోనీ.. డెరైక్టర్ చెప్పిందల్లా చేసుకుపోవడానికి ఆ హీరో ‘రోబో’ ఏం కాదు కదా! గత ఐదేళ్లనే తీసుకుందాం.. హీరో పేరు మీదే 50, 60 కోట్లూ బిజినెస్ అవుతోంది. అన్నీ హీరో పేరు మీదే ఆధారపడుతున్నప్పుడు అతను జాగ్రత్తపడటంలో తప్పేంటి? గుళ్లో రాముడి విగ్రహం ఉందనుకోండి.. రాముడి గురించి ఆలోచిస్తారు తప్ప, దాన్ని చెక్కినవాడి గురించి మీరు ఆలోచిస్తారా?
అంటే.. హీరో వర్షిప్ అనేది కరెక్టేనంటారా?
ప్రపంచంలో ఏ భాషకు చెందిన పరిశ్రమను తీసుకున్నా.. హీరో వర్షిప్ కచ్చితంగా ఉంది. హాలీవుడ్ సినిమా ‘రాంబో’ని తీసుకుందాం. ఆ చిత్రదర్శకుడు ఎవరు అంటే ఎవరూ చెప్పలేరు? హీరో ఎవరు అంటే.. టకీమని చెప్పేస్తారు.
సో.. ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా హీరోను అప్రోచ్ కావాల్సిందేనా.. హీరోలు తమంతట తాము రారా?
అలా ఎందుకు ఎదురుచూడాలి? ఇప్పుడు నేనెవర్నీ నాకు అవకాశం ఇవ్వండని అడగను. కానీ, నా దగ్గరున్న కథకు ఏ హీరో యాప్ట్ అనిపిస్తే.. వాళ్లను అడుగుతాను. నేను అడగకుండా వాళ్లంతట వాళ్లు ఎందుకు వచ్చి అడగాలి? అసలు ఎవరైనా ఎందుకు అడుగుతారు?
మీ సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ వస్తోంది?
అనుకోకుండా వచ్చిన గ్యాప్ అది. ఇక ఆ దశ అయిపోయింది. గ్యాప్ లేకుండా చేస్తా.
ఆ దశ పోయిందని బలంగా నమ్ముతున్నారా?
‘మురారి’ తీశాను. సంకల్పం అనేది ఆ చిత్రంలోని ప్రధానాంశం. నిజంగా కూడా నాది అదే మైండ్ సెట్. నేను అయిపోయానని ప్రపంచం ముద్ర వేసినప్పుడు నేనే తిరిగొచ్చాను. నేనే చిరంజీవిగారిని, చరణ్‌ని కలిసి, కన్విన్స్ చేశాను. ‘మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి’ అని ‘గోవిందుడు..’లో చెప్పాను. నిజజీవితానికి కూడా అదే వర్తిస్తుంది. నేను ఇంట్లో కూచుంటే ఎవరు పిలుస్తారు. మన ప్రయత్నం ఉంటేనే ఎదుటివాళ్లకి ‘ఇతని దగ్గర ఏదో ఉంది’ అనిపిస్తుంది.
మీరెప్పుడూ ఎవరి దగ్గరా అవకాశాలు అడిగినట్లు లేరే?
అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడగాలి. అందుకే అన్నయ్యను కలిశాను. ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్నుంచి అన్నయ్య ఇంటి తలుపులు నా కోసం తెరిచి ఉన్నాయి. అందుకే వెళ్లి కలిశాను. ఎక్కాల్సిన గడపే ఎక్కా!
ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు?
నిర్మాణం నా వల్ల కాదు. నేను డబ్బు మనిషిని కాదు కాబట్టి, నిర్మాణం నాకు సూట్ కాదు.
కొంతమంది దర్శకులతో పోల్చితే దర్శకుడిగా కూడా మీ సంపాదన తక్కువేనేమో?
నాకు సరిపోయేంత డబ్బు ఉంది. ఒకవేళ అది సరిపోదు.. ఇంకా ఎక్కువ కావాలంటే మా ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది (నవ్వుతూ).
మనిషికి సరిపోయేంత డబ్బు అంటే... ఎంత?
ఒక మంచి ఇల్లు, ఏసీ రూము, తిరగడానికి కారు, అందులో పుష్కలంగా పెట్రోల్ పోయించగలిగే కెపాసిటీ, ఏడాదిలో రెండు సార్లు విహార యాత్రకు వెళ్లడానికి కావాల్సిన డబ్బు, రెండు పూటలా తిండి, తాగడానికి మందు, పీల్చడానికి సిగరెట్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, కట్టుకోవడానికి సెల్‌ఫోన్ బిల్లు, మన మీద ఆధారపడే మన కుటుంబ సభ్యులను సౌకర్యంగా ఉంచగలిగే స్తోమత... ఇంతకు మించి ఏం ఉన్నా... వాడు ఆ ఇంటికి వాచ్‌మేన్ కిందే లెక్క. పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత, దాన్ని మెయిన్‌టైన్ చేయడానికి పనిమనుషులను పెట్టుకోవాలి. వాళ్లు పనులు చేసుకుని బయటికెళుతుంటే.. ఇంట్లోంచి ఏమైనా తీసుకెళ్లిపోతారేమో అని టెన్షన్.. లోపలి నుంచి ఎవరైనా బయటికొస్తే టెన్షన్.. ఇక సుఖం ఏం ఉంటుంది.
భక్తి బాటలో వెళుతున్నట్లున్నారు. వయసు తెచ్చిన మార్పా?
వయసా? నాకు వయసు పైబడిందని అనుకోవడం లేదు. అయినా మనకు పదేళ్ల వయసులో కరెక్ట్ అనిపించినది తర్వాత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల వయసులో చేసినది ముప్ఫయ్ ఏళ్లల్లో తప్పనిపించొచ్చు. అనుభవం నేర్పే పాఠాల దారిలోనే మనసు వెళుతుంది.
ఇలాంటి మార్పుని ‘మాట మార్చడం’ అంటారేమో?
నేను మాట మార్చలేదు. నా విధానం మారిందని చెబుతున్నా. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనుక్కుంటాం. ఓ ఏడాది తర్వాత అది పాతదైపోతుంది. దాన్ని మార్చేసి, కొత్త చొక్కా కొనుక్కుంటాం కదా. ఇదే బాగుంది కదా అని వేసుకోం కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుందాం. వాటికి ఒకటి, రెండేళ్లప్పుడు నిద్రపోవడాన్ని ‘తాచ్’ అనేవాడు. ఇప్పుడా మాటను మేం సరదాగా అంటే, నవ్వేస్తాడు. ఇప్పుడు నిద్ర అంటాడు. ఇంకొన్నాళ్ల తర్వాత స్లీప్ అంటాడేమో. అంటే.. మాట మార్చాడని అనలేం కదా! ఎప్పుడూ ఒకే మాట మాట్లాడం కదా. జ్ఞానం పెరిగేకొద్దీమాట తీరు మారుతుంది. కానీ, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా మాట మార్చితే అది తప్పు.
మీ సినిమాల్లో మన అరిసెలు, సున్నుండలు అన్నీ చూపిస్తారు. పర్సనల్‌గా మీకెలాంటి ఫుడ్ ఇష్టం?
నాకు సున్నుండలు ఇష్టం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారింట్లో పులిహోర ఇష్టం. రమ్యకృష్ణ చైనీస్ వంటకాలు తిందామంటుంది. సో.. దాన్నీ ఇష్టపడతాను. నాకు పప్పుచారు, ఆవకాయ ఇష్టం. అవి ఉంటే ఇష్టంగా తింటాను. అవి లేకపోతే నాకేదైనా ఒకటే!
మన సంస్కృతి, సంప్రదాయాలపై మీరు విపరీతమైన అభిమానం చూపిస్తారు.. ఎందుకని?
మన నేటివిటీ మీద మనకే ప్రేమ లేకపోతే వేరేవాళ్లకి ఎందుకుంటుంది? మన మూలాలను వెతుక్కోవాల్సి వస్తోంది. అవి గుర్తు చేయడం కోసమే సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు భాష చచ్చిపోతోందని కొంతమంది ఆంగ్లంలో బాధపడిపోతుంటారు. దానివల్ల లాభమేంటి?
ఆరోగ్యం విషయంలో మీరెంత శ్రద్ధగా ఉంటారు?
నాకు శ్రద్ధ లేదు. మా ఇద్దరికీ కలిపి రమ్యకు ఉంది. ఆరు నెలలకోసారి జనరల్ చెకప్స్ అంటూ చంపేస్తుంది. ఏం టెస్టులు అని విసుక్కుంటే గొడవ చేసేస్తుంది. నాకు సంబంధించి చాలా విషయాలు తనే చూసుకుంటుంది.
అంత జాగ్రత్తగా ఉండే రమ్యగారు మిమ్మల్ని సిగరెట్లు మానేయమని ఎప్పుడూ అనలేదా?
ఎందుకు చెప్పదు. ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తుంది. నా బాధ్యత నేను చేయాలి కదా... (నవ్వు)
మీరు తీసే సినిమాల్లో అందమైన కుటుంబాలు ఉంటాయి.. మరి.. మీ తోడబుట్టినవాళ్ల గురించి?
ఓ తమ్ముడు చనిపోయాడు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అందరూ హ్యాపీ. నేను ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. యాక్చువల్‌గా చాలా బ్యాడ్ ఫ్యామిలీ మేన్‌ని. ఉన్నమాట చెప్పాలంటే.. నాకు సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి ఉండదు.
అదేంటి.. మీరు కానిది మీరు తెరపై ఎలా ఆవిష్కరించగలుగుతున్నారు?
హ్యుమన్ ఎమోషన్స్ అనేది బయటికి చెప్పలేను కానీ.. లోపల ఉందేమో.. నేను కానిది తీస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు. నేనేం రాక్షసుణ్ణి కాదు. పక్కా ఎమోషనల్ పర్సన్‌ను.
ఫైనల్‌గా.. మీ తదుపరి చిత్రం గురించి?
ఏమీ నిర్ణయించుకోలేదు. ఓ రెండు నెలలు పూర్తిగా రిలాక్స్ అయ్యి, తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా.
- డి.జి. భవాని
మీరు చాలా సింపుల్‌గా కనిపిస్తారు.. బ్రాండెడ్ దుస్తులు వాడరా?
నా డ్రెస్సులన్నీ మా ఆవిడే కొంటుంది. నన్ను ఆవిడెలా చూడాలనుకుంటుందో అలాంటి బట్టలు కొంటుంది. వాటిలో నాకు సౌకర్యవంతంగా ఉన్నవాటిని తొడుక్కుంటా.
రమ్యకృష్ణగారి కోసం మీరేమీ షాపింగ్ చేయరా?
లేదు. రమ్యకు నేను ఇచ్చిన అతి విలువైన బహుమతులు రెండున్నాయి. అవి ‘కృష్ణవంశీ, బేబో’. మా అబ్బాయి పేరు ఋత్విక్. మేం ముద్దుగా బేబో అని పిలుస్తాం. అసలు మొగుడుగా నువ్వు నాకేమీ ఇవ్వవా? అని రమ్య అడిగితే, ‘కృష్ణవంశీ’ని ఇచ్చాను కదా అంటుంటాను. రమ్య చాలా గ్రేట్. సింపుల్ పర్సన్.
బేబో ఏం చదువుతున్నాడు?
నాలుగో తరగతి.
‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని చూశాడా?
వాడికి రామ్‌చరణ్ అంటే ఇష్టం. ‘మగధీర’ను లెక్కలేనన్ని సార్లు చూశాడు. ఆ డీవీడీ అరిగిపోయింది కూడా. ‘గోవిందుడు..’ చూశాడు. వాడికి బాగా నచ్చింది.
భర్తగా, తండ్రిగా మీరెంతవరకు బెస్ట్?
నేను చాలా బ్యాడ్ హజ్బండ్‌ని.. బ్యాడ్ ఫాదర్‌ని.
మరి.. మిమ్మల్నెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణగారు మీరు ‘బ్యాడ్’ అంటే భరిస్తారా?
ఒకవేళ అందుకే ఇష్టపడిందేమో (నవ్వుతూ). నేను బ్యాడ్ కాబట్టే, తను బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్‌గా ఉంటుందేమో. కుటుంబాన్ని చూసుకునే విషయంలో రమ్య చాలా చాలా బెస్ట్. అస్సలు వంక పెట్టడానికి లేదు.
రమ్యకృష్ణ, బేబో చెన్నయ్‌లో ఉంటున్నట్లున్నారు?
నేను కూడా చెన్నయ్‌లోనే ఉంటున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికొస్తున్నాను.
ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళుతుంటారా?
తప్పనిసరిగా వెళతాం. అది కూడా రమ్యే ప్లాన్ చేస్తుంది. ఫలానా చోటకి వెళతాం అని చెబుతుంది. ఇక, టికెట్లు బుక్ చేయడానికి, సూట్‌కేసులు మోయడానికి నేను రెడీ అయిపోతా (నవ్వుతూ).
రమ్యకృష్ణ విషయంలో అస్సలు వంక పెట్టడానికి లేదు!
Published Thu, Oct 2 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement