రిలేషణం: మమ్మల్ని అన్‌లక్కీ బ్యాచ్ అనేవాళ్లు
దక్షిణాది సినిమా సంగీత ప్రపంచంలో మేరునగధీరుడు ఇళయరాజా. సినిమా పాటపై ఆయన సంతకం ప్రత్యేకమైనది. 37ఏళ్లుగా అవిశ్రాంతంగా స్వరాలందిస్తున్న ఇళయరాజా ఈ జనరేషన్‌కీ ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టరే. ఆయన తమ్ముడైన గంగై అమరన్ మంచి రచయిత, స్వరకర్త, దర్శకుడు. తెలుగులో ‘స్వరకల్పన’ చిత్రానికి సంగీతదర్శకత్వం చేసిన గంగై అమరన్ తన అన్నయ్య గురించి చెప్పిన కబుర్లు...
మేం నలుగురు అన్నదమ్ములం. ఇద్దరు అక్కలు. నేను చిన్నవాణ్ణి. పెద్దన్నయ్య పావలర్ వరదరాజన్, రెండో అన్నయ్య ఆర్డీ భాస్కర్, మూడో అన్నయ్య ఇళయరాజా. నేను రాజా అన్నయ్యకన్నా ఐదేళ్లు చిన్న. తమిళనాడు మధురై జిల్లాలోని పణ్ణైపురం మా సొంతఊరు. మా వరదరాజన్ అన్నయ్య కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. రాజకీయ సభల్లో ప్రచార గీతాలు ఆలపించేవారు. ఆయన పాటలంటే చాలు జనాలు విపరీతంగా గుమిగూడేవారు. ఆయన ప్రభావంతోనే రాజా అన్నయ్యలో, నాలో సంగీతం పట్ల మక్కువ, మమకారం మొదలయ్యాయి. అప్పట్లో నేను పాటలు రాసేవాణ్ణి. ఆ పాటకు రాజా అన్నయ్య బాణీ కట్టేవారు. వేదికలపై ఆ పాటలు పాడేవాళ్లం. చిన్న వయసులో అందరు అన్నదమ్ములూ ఎలా ఉండేవాళ్లో మేమూ అంతే. కానీ ఆటలు తక్కువ. పాటలతోనే జీవితం సాగింది. ఇక, సినిమాల్లో ప్రయత్నిస్తే బాగుంటుందని భాస్కర్ అన్నయ్య, రాజా అన్నయ్య చెన్నయ్ రెలైక్కారు. నేను మాత్రం మా ఊళ్లోనే ఉండిపోయాను. తర్వాత... నేనూ చెన్నయ్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది.
చెన్నయ్‌లోని మైలాపూర్‌లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు మా అన్నయ్యలు. హోటల్ ఖర్చులు భరించలేని నేపథ్యంలో వాళ్లకి వండిపెట్టడానికి నేను చెన్నయ్ వెళ్లాను. నాకు తెలిసిన వంటలేవో చేసేవాణ్ణి. దాంతో పాటు పాటలు కూడా రాసుకునేవాణ్ణి. ముగ్గురం అవకాశాల కోసం ఎక్కని మెట్టు లేదు. లాభం లేదని నిరుత్సాహపడుతున్న సమయంలో ఓ చాన్స్ వచ్చేది. దానికి మధ్యలోనే బ్రేక్ పడేది. అలాంటివి బోల్డన్ని జరిగాయి. దాంతో మా మీద ‘అన్‌లక్కీ బ్యాచ్’ అనే ముద్ర వేశారు. పైగా ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్‌లాంటి సంగీతదర్శకులు ఏలుతున్న రోజులు కావడంతో కొత్తవాళ్లని తీసుకోవడానికి నిర్మాతలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు.
ఇలా మేం ముగ్గురం మద్రాసులో అవకాశాల కోసం కష్టపడుతున్న విషయం తెలుసుకుని మా అమ్మగారు చిన్నత్తాయమ్మాళ్ కూడా వచ్చేశారు. నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అప్పట్నుంచీ తల్లీతండ్రీ అన్నీ తానై మా అమ్మ మమ్మల్ని పెంచింది.
ఆత్మవిశ్వాసమే రాజా అన్నయ్య ఆయుధం అనిపిస్తుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా పట్టించుకునేవారు కాదు. చివరికి ఆయన స్నేహితుడు ఆర్. సెల్వరాజ్ ద్వారా నిర్మాత పంజు అరుణాచలంతో మాకు పరిచయం ఏర్పడింది. ‘అణ్ణక్కిళి’ అనే చిత్రానికి అవకాశం ఇచ్చారు అరుణాచలంగారు. నేను పాటలు రాసిన తర్వాత రాజా అన్నయ్య బాణీలు సమకూర్చేవారు. ఆ సినిమా విజయం సాధించడంతో మా దశ తిరిగింది. ఆ తర్వాత మా విజయవంతమైన ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. పాటలపై మమకారం ఏర్పడటానికి కారణమైన మా అన్నయ్య వరదరాజన్ మా వైభవాన్ని చూడలేదనే కొరత ఉంది. అలాగే మా భాస్కర్ అన్నయ్యని కూడా ఆ దేవుడు త్వరగానే తీసుకెళ్లిపోవడం ఎప్పటికీ బాధగా ఉంటుంది.
సంగీత దర్శకుడైన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మ్యూజిక్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని రాజా అన్నయ్య శిక్షణ తీసుకున్నారు. నేనెక్కడా సంగీతం నేర్చుకోలేదు. దానికి కారణం మా అన్నయ్య నేర్చుకుంటే నేనూ నేర్చుకున్నట్లే కదా. పాటలు రాయడంతో పాటు 200 సినిమాలకు నేనూ సంగీతం సమకూర్చాను. అన్నయ్య స్థాయికి కాకపోయినా, ఆ అన్నకు తమ్ముడిగా నేనూ ప్రతిభావంతుణ్ణే అనిపించుకోవడం ఆనందంగా ఉంది.
ఒక్కోసారి మనవళ్లు, మనవరాళ్ల పేర్లయినా అన్నయ్యకు తెలుసా? అనిపించేది. సంగీతం తప్ప అన్నయ్యకు మరో ప్రపంచం తెలియదు. అయితే ఇప్పుడు ఫర్వాలేదు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మామూలుగా రాజా అన్నయ్య చాలా తక్కువ మాట్లాడతారు. ఎవరి దగ్గర్నుంచీ ప్రశంసలు ఎదురు చూడరు. నిరాడంబరంగా ఉంటారు. నేనేదైనా గొప్పగా చేసినప్పుడు ప్రశంసించరు. ఆయన మౌనమే ప్రశంసలు కింద లెక్క. తప్పు చేస్తే మాత్రం తిడతారు. అందుకే కనీసం తిట్టడం కోసమైనా మనతో మాట్లాడుతున్నారు కదా ఆనందపడిపోతుంటాను. అలా రాజా అన్నయ్య నాకు అక్షింతలు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అక్షింతలే నాకు ఆశీర్వాదాలు.
- డి.జి. భవాని