
నన్ను ఎవరైనా ఏమైనా అంటే ‘పోరా’ అంటా.
అంతకంటే ఎక్కువ చేస్తే పోరాడతా.
స్త్రీ అంటే ఆటబొమ్మ అయిపోయింది.
నిజజీవితంలో, సోషల్ మీడియాలో
ఎక్కడైనా సరే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా,
నిర్భీతిగా మహిళల వ్యక్తిత్వాన్ని
వలువల్లా ఒలుస్తున్నారు.
చిన్న పిల్లలనీ చూడరు.
ముసలివాళ్లనీ చూడరు.
వాయీ వరసా చూడరు.
ఉసురు తీసుకుంటున్నారు.
దీనికొక్కటే సమాధానం.
వీళ్లని ఉరి తీయాలి.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చివరిగా కనిపించిన చిత్రం ‘నాయుడమ్మ’ (2006). ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయి, సినిమాలకు దూరం అయ్యారు. ఇన్నేళ్లల్లో మళ్లీ ఆమెను సినిమాలు చేయమని ఇండస్ట్రీ నుంచి బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు విజయశాంతి తెర మీద కనిపించడానికి ఓకే అన్నారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమాలో కీలకంగా నిలిచే పాత్ర చేస్తున్నారు. సోమవారం విజయశాంతి బర్త్‌డే. ఈ సందర్భంగా నటిగా ఆమె కమ్‌బ్యాక్ గురించి స్పెషల్ ఇంటర్వ్యూ.
బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు?
సెలబ్రేషన్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఫ్యాన్స్, నన్ను అభిమానించే వాళ్లు విషెస్ పంపుతారు. నాకు మాత్రం సింపుల్‌గా ఉండటం ఇష్టం. మొదటినుంచీ అదే అలవాటు. ఈసారి బర్త్‌డే సోమవారం. అంటే శివుడి రోజు. నేను శివభక్తురాలిని. ఆ దేవుడే నన్ను మంచి స్థాయికి చేర్చాడని నమ్ముతాను.
టీనేజ్‌లోనే కెరీర్ స్టార్ట్ చేశారు. సపోర్ట్ లేకుండా ఇంతదాకా వచ్చిన మీ లైఫ్ జర్నీ గురించి?
లైఫ్ జర్నీ చాలా వండర్‌ఫుల్‌గా సాగింది. ఒక క్రమశిక్షణ పెట్టుకొని ట్రావెల్ చేశాను. చిన్న వయసులోనే మా అమ్మానాన్న పోయారు. నన్ను గైడ్ చేయడానికి ఎవరూ లేరు. అమ్మానాన్న చనిపోవడం నాకు పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటాను. పైగా ఒక్క సంవత్సరం గ్యాప్‌లోనే ఆరోగ్య సమస్యలతో ఇద్దరూ చనిపోయారు. వృత్తినే దైవంగా భావించాను. ప్రతి పాత్రకూ 100 శాతం న్యాయం చేయాలని చాలెంజ్‌గా తీసుకున్నాను. యాక్షన్, గ్లామర్, పెర్ఫార్మెన్స్.. మూడూ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేశాను.
ఒంటరిగా ఎలా కొనసాగాలనే భయం ఉండేదా?
నా జీవితంలో ఎప్పుడూ భయం లేదు. కానీ ఎలా హ్యాండిల్ చేయాలా? అని ఆలోచించేదాన్ని. చిన్న వయసులో హీరోయిన్ అయిపోయాను. నాకు నేనుగా మిలిటరీ క్రమశిక్షణ పెట్టుకున్నాను. పని తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అందుకే నన్ను ‘పని రాక్షసి’ అనేవారు. సంవత్సరానికి 17–18 సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. రోజుకి ఆరేడు షిఫ్ట్‌లు చేసేదాన్ని. భోజనానికి టైమ్ ఉండేది కాదు. నైట్ షూట్ అంటే నిద్ర మాత్రమే కాదు.. ఒక్కోసారి భోజనం కూడా త్యాగం చేయాల్సి వచ్చేది. తింటే నిద్ర వచ్చేస్తుందని భయం. అప్పట్లో నెలా నెలన్నరలో సినిమా పూర్తి చేసేవాళ్లం. మహా అయితే 2 నెలలు. ‘ప్రతిఘటన’ సినిమాని నెలలోనే పూర్తి చేశాం. నా కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘ప్రతిఘటన’ ఒకటి. అయితే దర్శకుడు టి. కృష్ణగారు ఆ సినిమాకి అడిగినప్పుడు డేట్స్ ఖాళీ లేవు. ఆయనేమో మా శాంతమ్మే చెయ్యాలి అన్నారు. ఇతర ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడి, ఆ సినిమాకి కష్టం మీద డేట్స్ ఇవ్వగలిగాను. అలాగే ‘పడమటి సంధ్యారాగం’ సినిమా కోసం నెల రోజులు అమెరికా వెళ్లాను. తిరిగొచ్చేసరికి 3, 4 సినిమా లు వెయిటింగ్.
ఇంత వర్క్ చేస్తున్నాం అని రిగ్రెట్ అయిన సందర్భాలేమైనా?
అస్సలు లేదు. అయితే రాత్రీ పగలూ, తిండీ నిద్రా.. ఇలా దేని గురించీ ఆలోచించకుండా పని చేయడంతో అప్పుడప్పుడూ హెల్త్ కొంత ఇబ్బంది పెట్టేది. కానీ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా అంటే ప్రొడ్యూసర్లు బాబోయ్ అనేవారు. ఇప్పుడు సిస్టమ్ వేరు అప్పటి సిస్టమ్ వేరు. అయితే కష్టం అనేది తెలిస్తేనే లైఫ్ వేల్యూ›తెలుస్తుంది. అందుకే ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ‘ఐయామ్ హ్యాపీ’.
మీ అమ్మానాన్న మీ సినిమా కెరీర్‌ను చూశారా?
కొంతవరకూ చూశారు. ‘ప్రతిఘటన’ వరకూ మా అమ్మ ఉన్నారు. ఆ సినిమాకి నంది అవార్డు తీసుకోవడం చూశారు. నాన్నగారు ‘నేటి భారతం’ వంటి నా హిట్ సినిమాలను చూశారు. ‘దేవాలయం’ సినిమా సమయానికి నాన్నగారు పోయారు.
యాక్షన్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సెట్‌లో గాయాలపాలై ఉంటారేమో?
చాలా దెబ్బలు తగిలాయి. చచ్చిపోయి బతకడం వరకూ జరిగింది. పంచభూతాలను దాటి వచ్చాను. గాలి, నీరు, నిప్పు, ఆకాశం.. ఇలా అన్ని గండాలను దాటాను. ఇంకేం బ్యాలెన్స్ లేదనుకుంటా. ఇంకా భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టే దేవుడు నన్నింకా ఉంచాడు. ఒకసారి ఏకంగా ఓ సినిమాకి మంటల్లో చిక్కుకున్నాను. అదే సినిమాకి నీళ్లలో కొట్టుకుపోయా కూడా. ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తెలిసిందే. నేను చిరంజీవిగారు, బాలకృష్ణగారు అందరం ఉన్నాం. అందులోంచి బయటపడ్డాం. ‘లేడీ బాస్’లో ట్రైన్‌కి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకీ యాక్షన్ సినిమాలు అనిపించేదా?
ఎప్పుడూ అనిపించలేదు. ఇంకా చాలెంజ్‌గా తీసుకున్నాను. హీరోయిన్ అంటే ఎప్పుడూ పాటలు, డ్యాన్స్, గ్లామరేనా? చెట్టు చుట్టూ తిరుగుతూ పాటలు పాడే క్యారెక్టర్సేనా? ఏదైనా కొత్తదనం ఉండాలి. హీరోలకంటే మనం ఏం తక్కువ? యాక్షన్ కూడా చేద్దాం అనుకున్నాను. ఏదీ ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు. సెట్లో చెప్పడం, చేయడం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. ఫైట్లు అన్నీ ఆన్ ది స్పాట్. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే నేను ఏదైనా చూడగానే చేయగలను. కాలు విరిగినా బాధపడలేదు. నిర్మాతలకు నష్టం కలగకూడదని ఆ గాయాలతోనే షాట్ పూర్తి చేసి వెళ్లిన రోజులున్నాయి. ఇంత కష్టపడ్డాను కాబట్టే ఆ దేవుడు నన్ను హైట్స్‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడంటే చాలావరకు కంఫర్ట్‌బుల్ లైఫ్. అప్పట్లో మాకు గ్రాఫిక్స్ లేవు. 30 అడుగుల ఎత్తులో నుంచి దూకాలంటే దూకడమే. ధైర్యం ఉంటే దూకమనేవారు. అయితే ఫోర్స్ చేసేవారు కాదు. ధైర్యం చేసి, నేనే చేసేదాన్ని.
అంత కష్టపడ్డారు కాబట్టే ‘లేడీ అమితాబ్’ అనే ట్యాగ్ వచ్చింది. ఏదైనా సందర్భంలో అమితాబ్ గారితో ఈ విషయం చెప్పారా?
రివల్యూషనరీ సినిమాలు, యాంగ్రీ యంగ్ ఉమెన్ అనిపించే క్యారెక్టర్స్ చేశాను. ఆయన నా ‘కర్తవ్యం’ హిందీ వెర్షన్ ‘తేజస్విని’ సినిమా ప్రివ్యూ చూడ్డానికి వచ్చారు. ఓ సినిమా ఓపెనింగ్ అప్పుడు బోనీ కపూర్‌గారు అమితాబ్‌గారితో విజయశాంతిని సౌత్‌లో ‘లేడీ అమితాబ్’ అంటారు అన్నారు. ‘తేజస్వినీ’ హిట్ అయిపోతే ఇక నన్ను ‘జెంట్ విజయశాంతి’ అంటారా? అన్నారు (నవ్వుతూ).
ఒకప్పుడు హీరోతో సమానంగా, ఒక్కోసారి వారికన్నా ఎక్కువే పారి తోషికం అందుకున్నారు, ఆ రికార్డ్‌ని సౌత్‌లో ఎవరూ బ్రేక్ చేయలేదు..
నాకు అలాంటి పాత్రలు ఇచ్చిన దర్శక–నిర్మాతలు, వాటికి న్యాయం చేయడానికి నేను పడ్డ కష్టం, ఆ సినిమాలను అంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులు... అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ఇస్తారు. కానీ హీరోలతో కలిసి చేసిన సినిమాలకి కూడా కొందరి హీరోల కంటే ఎక్కువే తీసుకున్నాను.
మనది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. హీరోలతో పాటు సమానంగా తీసుకుంటే తట్టుకోగలిగారా? వాళ్లకన్నా ఎక్కువ కావాలని డిమాండ్ చేసేవారా?
ఒక రేంజ్‌కి వచ్చాక మేం డిమాండ్ చేయొచ్చు, వాళ్లు కూడా ఇవ్వొచ్చు. స్టార్‌డమ్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ ఉంటుంది. నిర్మాతలు కూడా ‘మేం అంత ఇస్తాం.. ఇంత ఇస్తాం’ అని క్యూలో నిలబడేవాళ్లు. అందరికీ డేట్స్ ఇవ్వడానికి ఇబ్బంది అయ్యేది. ఇక హీరోలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకునేదాన్ని కాదు.
ఇప్పుడు ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా చేయడానికి ఎవరు ఒప్పించారు?
విజయశాంతిని ఎవరూ ఒప్పించరు. నా నిర్ణయం నేనే తీసుకుంటాను. ఎన్నికలు అయిపోయాయి. గెలుపోటములు అన్నది రాజకీయాల్లో సాధారణం. ఇప్పుడు చిన్న గ్యాప్ దొరికింది. మళ్లీ సినిమాలు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేనే ఆసక్తిగా లేను. ఎప్పటినుంచో అడుగుతున్నవాళ్లల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు. ఒక్కసారి కథ వినండి అన్నారు. విన్నాను, బాగా నచ్చింది. కమ్ బ్యాక్‌కి ఇది బెటర్‌గా ఉంటుంది. అన్నీ రాములమ్మలు అన్నీ కర్తవ్యాలు అంటే కుదరవు. అయితే ఉన్నదాంట్లో ఇది బావుంది అనుకున్నాను. ఒప్పుకున్నాను.
ఈ సినిమాలో మహేశ్‌బాబుతో మీది ఏ రిలేషన్ ?
రిలేషన్ ఏమీ ఉండదు. కానీ మా పాత్రలు రెండూ ప్యారలల్‌గా వెళ్తుంటాయి.
మీ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయా?
లేదు. విజయశాంతి నెగటివ్ షేడ్సా? నో. నేను పాజిటివ్ పర్సన్. చేసే పాత్రలూ అలానే ఉండాలని కోరుకుంటాను. ఇందులో నాది చాలా పాజిటివ్ పాత్ర. అందరికీ నచ్చుతుంది. నాకు డబ్బులు ముఖ్యం కాదు. స్క్రిప్ట్, డైరెక్టర్ అన్నీ కుదరాలి.
విజయశాంతి నెగటివ్ షేడ్సా అన్నారు? ఏం చేయరా?
నెగటివ్ ఎందుకు? ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే బెటర్ కదా.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్టిస్ట్‌గా ఇది చేయలేదు అని ఏదైనా అసంతృప్తి ఉందా?
ఏదీ లేదు. నా సైడ్ నుంచి హ్యాపీ. కొత్తకొత్త ఐడియాలతో దర్శకులు వచ్చినప్పుడు ఇంకా కొత్తగా చేయాలనుకుంటాను. అలాంటివి వస్తే కచ్చితంగా ఆడుకుంటాను (నవ్వుతూ). ఆ నమ్మకం నాకుంది.
అమ్మానాన్నల తర్వాత మీకు అండగా నిలిచిన వ్యక్తి ఎవరు?
నా భర్త శ్రీనివాస్ ప్రసాద్‌గారు.
అమ్మానాన్న ఉన్నప్పుడే ప్రసాద్‌గారిని కలిశారా?
లేదు. నా లైఫ్ పార్ట్‌నర్‌ని నేనే ఎన్నుకొన్నాను. పెద్దవాళ్లు ఉంటే వాళ్లు పెళ్లి చేయాలి. కానీ వాళ్లు లేరు. వాళ్లు చనిపోయిన రెండు మూడేళ్లకు పెళ్లి చేసుకున్నాను. దానికి ప్రత్యేకంగా ప్రిపరేషన్‌లు ఏం లేవు. అలా అనుకున్నాం.. ఇలా పెళ్లి చేసుకున్నాం. 30 ఏళ్లుగా హ్యాపీగా ఉన్నాం. ఇన్నేళ్లుగా నా వెనకే ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు.
ఈయన మనకు కరెక్టా? కాదా? అని ఎలా ఊహించగలిగారు?
అందుకే నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మంచి కెరీర్ ఇచ్చావు, మంచి భర్తను ఇచ్చావు అని. అన్నీ నాకు ఇచ్చాడు. దేవుడికి బాగా ఇష్టమైన కూతుర్ని అనుకుంటాను. లక్కీ ఉమెన్‌ను.
అప్పట్లో మీ ట్రాక్ స్పెషల్ కాబట్టి వేరే హీరోయిన్లతో పోటీ లేకపోవడం రిలీఫ్‌గా ఉండేదా?
నేను కేవలం గ్లామర్ పాత్రలే చేయలేదు కాబట్టి మీరన్నట్లు పోటీ ఉండేది కాదు. నటిగా నా సామర్థ్యం చూపించే సినిమాలు చేయాలనుకున్నా. గ్లామర్ నాకు నచ్చేదే కాదు. కొన్నిసార్లు గొడవలు కూడా పడేదాన్ని.. ఈ డ్రెస్సేంటి అని.
సెట్ నుంచి వెళ్లిపోయిన సినిమాలున్నాయా?
అలిగి కూర్చునేదాన్ని. నిర్మాతలు ‘అమ్మా చేయండి.. బావుంటుంది’ అనేవారు. ఏ బావుంటాయండీ. ఈ పిచ్చి బట్టలు.. గ్లామర్ అని విసుక్కున్నప్పటికీ చేసేదాన్ని.
హీరోకన్నా ఎక్కువ పారితోషికం అంటే.. అవకాశాలు తగ్గేలా చేయడానికి ట్రై చేయలేదా?
అప్పటికే చేయి దాటిపోయింది. నాకు స్టారడమ్ వచ్చేసింది. అలా వస్తుందని వాళ్లూ అనుకోలేదు.. నేనూ అనుకోలేదు (నవ్వుతూ). కళ్లు మూసి తెరిచేలోపు పెద్ద స్థాయికి వెళ్లిపోయాను. పైగా నేను ‘గివ్ అప్’ చేయను.
ఇక వరుసగా సినిమాలు చేస్తారా?
అన్నీ కుదిరాయి కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. మంచి పాత్రలొస్తే చూద్దాం.
అమ్మ, వదిన.. పాత్రలు చేస్తారా?
నో. చాన్సే లేదు. డిఫరెంట్ పాత్రలుంటే చేస్తా. అమ్మ అయినా ‘మదర్ ఇండియా’ లాంటి పాత్ర అయితే చేస్తా. విజయశాంతి అంటే ఆడియన్స్‌కి అంచనాలుంటాయి. మామూలు సినిమాలు చేస్తే ఎలా? కెపాసిటీ ఉండి చేయకపోవడం ఎందుకు?
స్త్రీ ఆత్మవిశ్వాసం కోల్పోవాలంటే ఆమె వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడతారు. ఇప్పుడు ఆ ధోరణి ఎక్కువ కావడం గమనించారా?
అవును. అలా మాట్లాడే కొంతమంది వల్ల సమాజం చాలా నాశనం అవుతోంది. 60 శాతం మంది బావుంటే 40 శాతం దారుణంగా ఉన్నారు. వాళ్లు చేసే కామెంట్స్ చాలా దరిద్రంగా ఉంటున్నాయి. ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. వేరే స్త్రీని అంటున్నాం అంటే వాళ్ల తల్లిని అంటున్నట్లే. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఉమెన్‌ను రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. నిన్ను కన్నది కూడా ఓ ఆడదే కదా. ఇవాళ జరుగుతున్నవి చూస్తుంటే నా ‘ప్రతిఘటన’ సినిమా గుర్తొస్తోంది. అందులోని ‘ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీత లోకంలో...’ పాట గుర్తొస్తోంది. ఏం చేస్తున్నారు? ఏం చేయదలచుకున్నారు? మంచి చేయండి. అది రాదా? నోరు మూసుకొని కూర్చోండి. నోటికొచ్చిన మాటలు అంటుంటే ఎవరు ఊరుకుంటారు? ప్రభుత్వాలు సోషల్ మీడియాకూ కొత్త చట్టం తీసుకురావాలి.
సమాజం ఎటు పోతోందో తెలియడంలేదు. మొన్నటికి మొన్న తొమ్మిది నెలల పసి పాపపై అత్యాచారం చేసి, ప్రాణాలు బలిగొన్నాడు...అభం శుభం తెలియని పసి పాపపై పైశాచికత్వమా?
ఆ సంఘటన వినగానే మనసు అదోలా అయిపోయింది. వీళ్లను ఏం చేస్తే ఆ పాప ఆత్మకు శాంతి లభిస్తుందా అనిపించింది. ఏం చేయక్కర్లేదు. నడిరోడ్డులో నిలబెట్టి కాల్చి పడేయాలి. ఉరి తీయాలి. ఎన్‌కౌంటర్ చేసి పడేయాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కేసులు పెట్టి, నెలలు, సంవత్సరాలు గడిచిపోతే విషయం ‘డైల్యూట్’ అయిపోతుంది. శిక్ష అనేది అప్పటికప్పుడు ఇచ్చేయాలి.
ప్రస్తుతం సోషల్ మీడియా రూపంలో విచ్చలవిడితనం పెరిగింది. హీరోయిన్ అంటే టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయి ఎలా పడితే అలా కామెంట్ చేస్తున్నారు..
అవును. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. అసహ్యం వేస్తోంది. సోషల్ మీడియా వల్ల కొంత వరకూ మంచి జరుగుతోంది, కానీ ఎక్కువ చెడే జరుగుతోంది. సినిమాలకు సెన్సార్ ఎలా అయితే ఉందో సోషల్ మీడియా కామెంట్స్‌కు ఏదైనా సెన్సార్ ఉండాలి. ఏదైనా కొత్త చట్టం ప్రభుత్వం తీసుకురావాలి. ఏదైనా అనేస్తారా? తప్పు కదా? అనేవాళ్లు వాళ్ల ఇంట్లో అమ్మాయిలను అంటారా? అనరు. అంటే.. మీ ఇంటి ఆడవాళ్లు గొప్ప, మిగతావాళ్లు చులకనా? సంబంధం లేని స్టోరీలు అల్లేస్తారు. శాడిజం అది. గవర్నమెంట్ ఆలోచించాలి. క్యారెక్టర్ తప్పుబట్టి మెంటల్‌గా వీక్ చేద్దామనుకుంటారు. కానీ ఎవరూ వీక్ అవ్వరు. రెండు రోజులు పట్టించుకుంటాం. మూడో రోజు నుంచి ‘పోరా’ అనుకుంటాం. అవసరమైతే పోరాడతాం.
మీ టైమ్‌లో సోషల్ మీడియా లేకపోవడం లక్కీ అనుకుంటున్నారా?
చాలా లక్కీ. మా అప్పుడు ఇంత నెగటివిటీ లేదు. ఇప్పుడు ఎవరికీ సేఫ్టీ లేదు. మహిళలకు గౌరవం తగ్గింది. ఇది మంచి పరిణామం కాదు.
ఫైనల్లీ పేరులో ‘విజయ’ ఉన్నట్లే జీవితం విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు రెండు మాటలు..
చిన్నప్పటి నుంచి శివభక్తురాలిని. నా లైఫ్‌ని డిజైన్ చేసింది ఆయనే. మనం బొమ్మలం మాత్రమే. ఆయన కీ ఇచ్చి ఆడిస్తుంటాడు. డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అన్నీ ఆయనే. బాధపెడతాడు, నవ్విస్తాడు. మంచివాళ్లతో, గొప్పవాళ్లతో సినిమాలు చేసే అవకాశం ఇచ్చాడు. ఆ దేవుడే మంచి కెరీర్ ఇచ్చాడు. నా కెరీర్‌లో ఫ్లాప్స్ తక్కువ. హైట్సే ఎక్కువ. అందుకే ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నా.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment