లవ్‌ఆల్‌ | sakshi special story on naina jaiswal | Sakshi
Sakshi News home page

లవ్‌ఆల్‌

Published Mon, Dec 10 2018 2:22 AM | Last Updated on Mon, Dec 10 2018 9:13 AM

sakshi special story on naina jaiswal - Sakshi

∙మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో గ్రామీణ మహిళలనుద్దేశించి ప్రసంగిస్తున్న నైనా జైస్వాల్‌

టేబుల్‌ టెన్నిస్‌ ఆటలో పాయింట్ల లెక్క ‘లవ్‌ ఆల్‌’తో మొదలవుతుంది. అంటే... ఇద్దరి స్కోరు సున్న–సున్న అన్నమాట. ప్రతిరోజూ జీవితాన్ని అలాగే మొదలు పెడితే ఎంత బావుణ్ణు? నిన్నటి దాకా సాధించినవి వెనకేసుకుంటూ రాకుండా... వదిలేసి వస్తే... ఇవాల్టి నుంచి కొత్త బిగినింగ్‌... లవ్‌ ఆల్‌ తో మొదలు పెడితే! ప్రతిరోజూ ఒక కొత్త మ్యాచ్‌ అయితే... ఫ్యూచర్‌ అంతా ఒక టోర్నమెంటయితే... అబ్బ! జీవితమే ఆడుతూ పాడుతూ నలుగురికి సాయం చేస్తూ... అందర్నీ ప్రేమిస్తూ... రేపటికి ముందడుగు వేయవచ్చు కదా!

నైనాజైస్వాల్‌లో కనిపించే గొప్ప గుణం ఇది.
ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. టెన్నిస్‌ టేబుల్‌ మీద బాల్‌తో పోటీ పడి చురుగ్గా కదులుతుంటే... చూపరుల కళ్లు చేపల్లా కదలాల్సిందే. అంతేకాదు, మెదడు రెండు పార్శా్వలూ చురుగ్గా ఉండాలంటే రెండు చేతులతోనూ పని చేయాలంటూ నైనా రెండు చేతులతో రాసి చూపిస్తుంది. రెండు సెకన్లతో ఎ నుంచి జడ్‌ వరకు టైప్‌ చేస్తుంది. ఎనిమిదేళ్లకు టెన్త్‌ క్లాస్, పదేళ్లకు 12వ తరగతి, పదమూడేళ్లకు డిగ్రీ పూర్తి చేసిన ఈ అమ్మాయి పీజీ పూర్తి చేసి ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డీ చేస్తోంది. మోటివేషనల్‌ స్పీకర్‌గా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది. బాలిక విద్య కోసం శ్రమిస్తోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న నైనా లక్ష్యం ‘2020 ఒలింపిక్స్‌లో మెడల్, సివిల్స్‌ క్వాలిఫై అయ్యి ఇండియాలో బాలికల పరిస్థితి మెరుగు పరచడానికి కృషి చేయడం.

ప్రస్తుతం నైనా జైస్వాల్‌ ‘అండర్‌ 21, టాప్‌ ఎయిట్‌’ కేటగిరీలో ఆరవ స్థానంలో ఉంది. పాటియాలాలోని నేషనల్‌ ఇండియన్‌ క్యాంపులో శిక్షణ తీసుకుంటోంది. ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉదయం ఐదున్నరకు డైలీ రొటీన్‌ మొదలతుంది. రెండు గంటల సేపు ఫిట్‌నెస్‌ ట్రైనింగ్, ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు టేబుల్‌ టెన్నిస్‌ ట్రైనింగ్‌తో బిజీగా ఉంది. ఇంత టైట్‌ షెడ్యూల్‌లో మిగిలే ఖాళీ టైమ్‌లో చదువుకోవడానికి సివిల్స్‌ స్టడీ మెటీరియల్‌ని వెంట తీసుకెళ్లింది. 21 ఏళ్లు వచ్చాక సివిల్స్‌ ఎగ్జామ్స్‌ రాయాలనేది తన టార్గెట్‌ కాబట్టి, ఇప్పటి నుంచి సబ్జెక్ట్‌కు టచ్‌లో ఉంటే అప్పుడు ఆందోళన ఉండదని చెప్తోందామె. ‘ఒలింపిక్స్‌ లక్ష్యం తన కోసం దేశం కోసం. సివిల్స్‌ మాత్రం మహిళల కోసం’ అంటోంది. ‘పిహెచ్‌డి మరో ఏడాదిలో పూర్తవుతుంది. తర్వాత సివిల్స్‌ ప్రిపరేషన్‌ టైమ్‌ పెంచుతాను’ అని కూడా చెప్తోంది నైనా. ఆమె తన సివిల్స్‌ లక్ష్యాన్ని మహిళలకు అంకితం చేయడానికి వెనుక బలమైన కారణమే ఉంది.

డబ్బు పెళ్లి కోసమేనా?
‘‘రెండేళ్ల కిందట ఒక పాలిటెక్నిక్‌ కాలేజ్‌  ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. ఎంట్రన్స్‌ పరీక్షలో టాప్‌ వచ్చిన విద్యార్థిని నాతో కలిసి డిన్నర్‌ చేయవచ్చని ప్రకటించారు. వేలమంది అమ్మాయిలు పరీక్ష రాశారు. వాళ్లలో కొంతమంది నన్ను చూడటానికే ఈ పరీక్ష రాశామని చెప్పారు. ఎక్కువ మంది ఆర్థిక కారణాల వల్ల ఇతర చదువులకు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. వాళ్లలో చాలా మందికి మంచి నాలెడ్జ్‌ ఉంది. కానీ ఆర్థిక కారణాలే పెద్ద అడ్డంకి అవుతోంది. మహిళల చదువుకి ఇన్ని అడ్డంకులా? నిజంగా డబ్బులేకనే తల్లిదండ్రులు చదివించలేకపోతున్నారా? అని లోతుగా అధ్యయనం చేస్తే... డబ్బును అమ్మాయిల పెళ్లి కోసం దాచి చదువుకు ఖర్చు చేయడం లేదని తెలిసి ఆశ్చర్యం వేసింది. చాలా బాధేసింది కూడా. మోటివేషనల్‌ స్పీకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో తుని, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ వంటి నగరాలు, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు దుబాయ్, సింగపూర్, అమెరికాల్లో కూడా పర్యటించాను. అన్ని ప్రదేశాలు, అన్ని సంస్కృతులు చూసిన తర్వాత మన దగ్గర అమ్మాయిల పట్ల వివక్ష ఇంట్లోనే ఉందని తెలిసింది. నాకు ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోవడం నా అదృష్టం. నిజానికి చాలా మంది అమ్మాయిలు తమకు ఇష్టమైన చదువుకి, ఇష్టమైన ఆటలకు కూడా నోచుకోవడం లేదు’’ అంటుంది నైనా.  

రోల్‌మోడల్‌
‘‘గుజరాత్‌ అమ్మాయి మాన్యా సోలంకి, పంజాబ్‌ నుంచి సానీ పటేల్, రాజస్తాన్‌ నుంచి యాషికా జైన్‌లయితే వాళ్ల రాష్ట్రాల్లో నా ప్రసంగం విన్నప్పటి నుంచి ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నారు. ‘నైనా! మాకు నువ్వే రోల్‌మోడల్‌’ అంటారు. ‘నీ స్పీచ్‌ విన్న తర్వాత మా పేరెంట్స్‌ చాలా మారిపోయారు. బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెడుతుంటారు. మరికొంతమంది అయితే... ‘చచ్చిపోదామనుకున్నాను. కానీ నిన్ను చూశాక, నీ స్పీచ్‌ విన్న తర్వాత జీవితం మీద ఆశ పుట్టింది’ అని పోస్ట్‌లు పెడుతుంటారు. వాటిని చూసినప్పుడు కన్నీళ్లు వస్తాయి. అమ్మాయిల్లో ఇంత ప్రతిభ ఉంది. మంచి డైరెక్షన్‌ ఇస్తే ఎంత బాగా రాణిస్తారో కదా! అనిపించేది. పిహెచ్‌డి టాపిక్‌గా ‘మైక్రో ఫైనాన్స్, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’ తీసుకోవడానికి కారణం ఇవన్నీ కూడా’’ అని నైనా తెలిపింది.

పిహెచ్‌డి కోసం గ్రామీణ ప్రాంతాల్లో వందలాది మంది స్వయం సహాయక బృందాల మహిళలను కలిసింది నైనా.  ‘‘అమ్మాయిలను చైతన్యవంతం చేయడం. వాళ్ల తెలివి తేటలు ఇంటి గోడల మధ్య ఇంకి పోనివ్వకుండా కాపాడటం, దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే పౌరులుగా తమ మీద తమకు విశ్వాసం కలిగించడం’ నా ఆశయాలు. ఇప్పటి వరకు నేను కలిసిన అమ్మాయిల్లో చాలా మంది తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం గమనించాను. ముందు భయాన్ని వదిలించుకోవాలి. అవసరమైతే ఆదిశక్తిగా మారగలగాలి తప్ప, ఆత్మన్యూనతలో మగ్గిపోకూడదని చెబుతాను. వాళ్లు నన్ను రోల్‌మోడల్‌ అనుకుంటున్నప్పుడు నాకూ బాధ్యత పెరుగుతుంది. అందుకే నన్ను ఇష్టపడే వాళ్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నన్ను నేను మలుచుకోవాలి’’ అని చెబుతోంది నైనా.

మా అమ్మానాన్నల్లా మారితే...
నన్ను కలిసిన పెద్దవాళ్లలో కొంతమంది ‘మా పిల్లలు కూడా మీ అక్కాతమ్ముళ్లలాగ (నైనా, నైనా తమ్ముడు అగస్త్య. అగస్త్యకు పన్నెండేళ్లు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు) ఉంటే బావుణ్ననిపిస్తోంది’ అంటుంటారు. వాళ్లతో ‘‘మీరు మా అమ్మానాన్నల్లాగ మారితే మీ పిల్లలు మాలా మారతారు’’ అని చెబుతుంటాను. అమ్మ పీజీ చేసి కూడా ఉద్యోగం చేయకుండా మా కోసమే ఫుల్‌టైమ్‌ కేటాయించింది. నాన్న బయట ఉద్యోగాలకు వెళ్లకుండా సొంతంగా ట్యూషన్స్‌ చెబుతూ మా కోసం టైమ్‌ ఉండేలా చూసుకున్నారు. ఎనిమిదేళ్లకు టెన్త్‌ రాయడానికి నన్ను ప్రిపేర్‌ చేయడానికంటే ఎక్కువగా, ఆ పరీక్ష రాయడానికి పర్మిషన్‌ తెచ్చుకోవడానికి కష్టపడ్డారాయన. చిన్న వయసులో కాలేజ్‌లో చేర్పించడానికి ప్రత్యేక పర్మిషన్‌లు... ఇలాంటివెన్నో. వాళ్ల లైఫ్‌లో ప్రతి గంటలోనూ మేమిద్దరమే ఉంటాం. అందుకే ‘పేరెంట్స్‌ ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతారు’ అని చెప్తుంటాను’’ అంది నైనా.

మేధకు పని పెట్టాలి
‘‘ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు పియానో ప్లే చేస్తాను. అరగంటలో హైదరాబాద్‌ బిర్యానీ చేసేస్తాను. మనిషి బద్ధకంగా ఉండకూడదు, మెదడును ఒక్క క్షణం కూడా నిరాసక్తంగా ఉంచకూడదంటారు నాన్న. తెలివితేటలు, మేధా సంపత్తి పెంచుకుంటే పెరుగుతాయి. ఏమీ చేయకుండా కాలం గడిపేస్తే చురుకుదనం తగ్గి మొద్దుబారుతుందని చెబుతుంటారు. ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో ఉండేట్లు చూశారు మా అమ్మానాన్న. అందుకే ఇంత చిన్న వయసులో ఇన్నింటిని సాధించగలిగాను. నా అచీవ్‌మెంట్స్‌ చూసుకుని సంతోషపడిన సందర్భాలు రెండు. ఒకటి పాకిస్తాన్‌లో జరిగిన సౌత్‌ ఏషియా చాంపియన్‌ షిప్‌లో గెలవడం, మరోటి 2016లో సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకోవడం.’’
- నైనా జైస్వాల్, అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి

మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎలక్షన్‌ అంబాసిడర్‌!
పద్దెనిమిదేళ్ల అమ్మాయి తొలిసారి ఓటు వేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదే అమ్మాయి బహిరంగ సభలో ఓటు విలువ గురించి ప్రసంగిస్తుంటే? ఓటు వేయడం పౌరుని కనీస ధర్మం అని ప్రజలకు బాధ్యత గుర్తు చేస్తుంటే? డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లోను కాకుండా మంచి పరిపాలన అందించే నిజాయితీపరులైన వ్యక్తులకే ఓటు వేయాలని హితబోధ చేస్తుంటే... ఏమనిపిస్తుంది? ఆమె చెప్పినట్లే చేయాలనిపించదూ? అందుకే ఆ అమ్మాయిని మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎలక్షన్‌ అంబాసిడర్‌గా నియమించింది ఎన్నికల కమిషన్‌. ఎన్నికలంటే... సమాజహితం, దేశ భవిష్యత్తు కోసం చట్టాలు చేసే ప్రతినిధులను ఎన్నుకోవడం అని, మన అవసరాన్ని, మన గళాన్ని చట్టసభలో వినిపించడానికి ఒక ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ అని ఆమె గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసింది.

- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement