11 ఏళ్లకే 12వ తరగతి పాస్!!
హైదరాబాద్: నైనా జైస్వాల్.. గుర్తుంది కదా.. అతిపిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించి ఔరా అనిపించింది. కేవలం 16 ఏళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి.. ఆసియాలోనే ఈ ఘనత సాధించిన చిచ్చర పిడుగు అనిపించుకుంది. ఇప్పుడు ఆమె సోదరుడు అగస్త్య జైస్వాల్ కూడా అక్కకు తగ్గ తమ్ముడనిపించుకుంటున్నాడు. కేవలం 11 ఏళ్లకే 12వ తరగతి ఉత్తీర్ణుడై రికార్డు సృష్టించాడు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోగల సెయింట్ మేరిస్ జూనియర్ కాలేజిలో చదువుతున్న అగస్త్య జైస్వాల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరాన్ని 63 శాతం మార్కులతో పాసయ్యాడు.
రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా తన కుమారుడు నిలిచాడని అగస్త్య తండ్రి అశ్వినీకూమార్ వెల్లడించారు. తొమ్మిదేళ్ల వయసులో పదోతరగతిని పూర్తిచేసిన రికార్డు కూడా ఆగస్త్య పేరుమీదే ఉంది. దీని కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డు వారికి సబ్జెక్టులు, ఏ మీడియంలో రాస్తున్నారు, సెకండ్ ల్యాంగ్వేజీ ఏంటి అనేది తెలిపితే సరిపోతుందన్నారు. వయసు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బోర్డు పరీక్ష రాసేవారిని పదో తరగతి డేటా ఆధారంగా తీసుకుంటారని, అందుకే ఎటువంటి అనుమతులు లేకుండానే ఇంటర్ పరీక్షలు రాశాడని, ఉత్తీర్ణుడు కావడం గర్వంగా ఉందని అశ్వినీకుమార్ తెలిపారు.