సనూతన సారధి...సేవా వారది
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే విలువల ఆచరణే నిజమైన ఆధ్యాత్మ సాధనని, కర్మ, భకి,్త జ్ఞాన యోగాల సమన్వయ భావనే సేవగా మానవుడు ఆధ్యాత్మ సాధన కొనసాగించాలని... ఈ సత్యబోధనందించటానికే తాను వచ్చానని చెప్పారు భగవాన్ సత్యసాయి బాబా. ఆయన మహా పరినిర్వాణం చెంది, నేటితో నాలుగేళ్లు పూర్తయింది.ఈ సందర్భంగా ఆయన సేవలను, బోధలను స్మరించుకుందాం.
ముందు డొక్క నింపాలని, తరువాత మనసుని నింపాలని, ఆపై హృదయం నిండేలా ఆధ్యాత్మ ప్రబోధం కొనసాగాలని తలచి, అన్నార్తుల ఆకలి తీర్చిన అన్నదాత, లక్షలాది మంది దాహం తీర్చిన జలదాత, విలువలతో కూడిన విద్యనందించిన విద్యాదాత, ప్రేమ, కరుణ, దయ, మానవత్వంతో కూడిన వైద్యం అందించిన ఆరోగ్య ప్రదాత. ఎవరి జీవితమైనా మరొకరికి ఆసరా కావాలి, ఏ సంపదైనా అందరికీ ఆధారం కావాలి, సాటివారికి సహాయపడని జీవితం వ్యర్థం, జీవించినంత కాలం ఆనందం, శాంతి, ప్రేమ, నిజ స్వభావంగా ఉండాలి...
అని బోధించిన ఆచార్యోత్తముడు సాయి. అలసత్వం, లాలస విడనాడి, అనునిత్యం కర్మిష్టిగా కాలాన్ని వినియోగించాలని బోధించేవారు బాబా. మతాలన్నీ మార్గాలేనని, మత బోధనల మూలమంతా శాంతి, సహనం, ప్రేమ, ఆనందమనేవారు. ఏ మార్గంలో ఉన్నా ఉన్నత స్థితిలో జీవయాత్ర సాగించాలని మార్గనిర్దేశనం చేసిన ఆ మహనీయమూర్తి చూపిన బాటలో నడుద్దాం... ఆయన పలుకులోని తీపిని అందుకుందాం. ఆయన అందించిన ప్రేమ పరిమళాలను అందరికీ పంచుదాం.
- డి.వి.ఆర్.