సాక్షి, పుట్టపర్తి: సత్య, ధర్మ ,శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవతా విలువలను పాటించినవారే నిజమైన మానవులనీ, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవనీ ప్రవచించిన భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. పట్టుమని చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేని కుగ్రామం విశ్వ చైతన్య శక్తిగా ఎదిగింది. జిల్లాలోనే అతి చిన్న మున్సిపాలిటీగా ఉన్న పుట్టపర్తి.. నేడు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా అందరినీ దృష్టిని ఆకట్టుకుంటోంది. దీంతో పర్యాటకులు, సత్యసాయి భక్తులతో పాటు జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు పనులపై వచ్చే వారి సంఖ్య పెరిగింది.
అటు కొత్తచెరువు... ఇటు బుక్కపట్నం
పుట్టపర్తికి ఓ వైపు బుక్కపట్నం చెరువు.. మరో వైపు కొత్తచెరువు ఉంటాయి. కేవలం పది కిలోమీటర్ల వ్యవధిలోనే మూడు మండల కేంద్రాలు ఉండడం మరో విశేషం.భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన ప్రాంతం కావడంతో పుట్టపర్తిలో నివసించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో ఆధునాతన ఎతైన భవంతులు వెలిసాయి.
మాంసాహారం నిషేధం..
ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశీయులు నెలల తరబడి పుట్టపర్తిలోనే మకాం ఉంటారు. ఫలితంగా పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. దేశవిదేశీయులు మెచ్చే వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. అత్యధికంగా తమిళనాడు, కేరళ శైలి వంటకాలు లభ్యమవుతాయి. ఇక క్రిస్పీగా ఉంటూ కాస్త కారంతో ఉండే ఫాస్ట్‌ఫుడ్ అంటే విదేశీయులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. అయితే కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ పుట్టపర్తిలో మాంసాహారం పూర్తిగా నిషేధం. కనీసం కోడి గుడ్డు కూడా ఇక్కడ లభ్యం కాదు. అలాగే సినిమా థియేటర్లూ ఉండవు. జిల్లా కేంద్రమే అయినా బార్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయాలకు అనుమతుల్లేవు. అత్యంత పవిత్ర ప్రాంతంగా నేటికీ భావిస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. చాలా హోటళ్లలో బర్గర్, పిజ్జాలతో పాటు పలు రకాల శాకాహార వంటలు అందుబాటులో ఉంటాయి.
ఓ వైపు నుంచి చూడాల్సిందే..
కొత్తచెరువు, బుక్కపట్నం మండల కేంద్రాలకు పుట్టపర్తికి మధ్యలో బుక్కపట్నం చెరువు ఉంటుంది. ఈ చెరువు చుట్టూ ఓ వైపు పుట్టపర్తి, మరోవైపు కొత్తచెరువు, ఇంకోవైపు పుట్టపర్తి ఉంటాయి. మూడు మండల కేంద్రాలు పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. అయితే ఎటు వైపు నుంచి చూసినా పుట్టపర్తి కనిపించదు. చుట్టూ కొండలే కనిపిస్తాయి. కేవలం ‘బుక్కపట్నం – నల్లమాడ’ మార్గంలో నుంచి మాత్రమే పుట్టపర్తిని దూరం నుంచి చూసే అవకాశం ఉంది. పుట్టపర్తి ముఖచిత్రం చూడాలంటే ఏరియల్ వ్యూ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పుట్టపర్తికి ఓ వైపు చిత్రావతి నది, మరో వైపు విమానాశ్రయం, ఇంకోవైపు చెరువు సరిహద్దులుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment