ప్రేమస్వరూపుడు పుడమిపై పుట్టిన వేళ... | If the birth of the earth to saibaba | Sakshi
Sakshi News home page

ప్రేమస్వరూపుడు పుడమిపై పుట్టిన వేళ...

Published Thu, Nov 20 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

ప్రేమస్వరూపుడు  పుడమిపై పుట్టిన వేళ...

ప్రేమస్వరూపుడు పుడమిపై పుట్టిన వేళ...

రత్నాకరం సత్యనారాయణ రాజు...

ఈ పేరు చెబితే చాలామందికి  తెలియకపోవచ్చు కానీ, భగవాన్ సత్యసాయిబాబా అని చెబితే మాత్రం ప్రతిఒక్కరికీ తెలుసు. 1923, నవంబర్ 23న అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామంలో (నేటి పుట్టపర్తి) ఈశ్వరాంబ, పెదవెంకమరాజు దంపతులకు జన్మించిన సత్యనారాయణరాజు భగవాన్ సత్యసాయిబాబాగా మానవతా విలువలతో కూడిన విద్యనందించిన విద్యాదాతగా... ప్రేమ, కరుణ, దయ, మానవత్వంతో కూడిన వైద్యం అందించిన ఆరోగ్య ప్రదాతగా... అధ్యాత్మ విద్యను సర్వమానవాళికి బోధించిన జ్ఞానదాతగా... నమ్మిన వారికి స్వామిగా... సాయి భగవానుడిగా... అఖండమైన కీర్తిని గడించారు. కోట్లాది మంది భక్తుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
 
అజరామరమైన బోధనలతో, అనితర సాధ్యమైన సేవానిరతితో బాబా కీర్తిప్రతిష్ఠలు జిల్లాలు, రాష్ట్రాలే కాదు... ఖండాంతరాలు దాటి, విశ్వవ్యాప్తమయ్యాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సనాతనధర్మాలను బోధిస్తూ, ఆచరిస్తూ, అనతికాలంలోనే పుట్టపర్తిని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. తోటివారికి సాయపడటంలోనే భగవంతుడున్నాడని బోధించిన సాయి, అదే విధానాన్ని తాను అక్షరాలా ఆచరించి, అతి సామాన్యుని నుంచి అసామాన్యుడి దాకా, చిరుద్యోగి నుంచి, సీఎం వరకు, ప్రభుత్వోద్యోగి నుంచి ప్రధాన మంత్రి వరకు, దరిద్ర నారాయణుని నుంచి దేశాధ్యక్షుని వరకు, కార్మికుని నుంచి, క్రీడాకారుల వరకు... కొన్ని కోట్ల గుండెల్లో కొలువుదీరారు. నేడు ఆయన మన మధ్య లేకున్నా, ఆయన అందించిన మకరంద బిందువులు కొన్ని...

కులం, మతం, జాతి, ప్రదేశం, దేశం... ఇవన్నీ మనం గీసుకున్న పరిధులు. వీటన్నింటి మధ్య సమన్వయం ప్రధానం. సంఘర్షణకు తావులేని రీతిలో మన ఆలోచనలు సాగాలి.

నేను ఆత్మనని తెలుసుకోవటమే సత్యం, పవిత్ర జీవనమే శివం, ఆదర్శజీవితమే సుందరం.

ఆత్మ నిగ్రహం అన్నింటికన్నా ముఖ్యం: రాముడు 34 విద్యలలో ఆరితేరితే రావణుడు 64 విద్యలు అభ్యసించాడు. రామునికంటె అధికంగా చదువుకున్నప్పటికీ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం మూలంగా రావణుడు రాక్షసుడయ్యాడు. ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉన్న రాముడు దేవుడయ్యాడు.

నమ్మిన దైవం యెడల దృఢవిశ్వాసం, దృఢమైన బలం కలిగి ఉండాలి. నిర్మలత్వం ఇందుకు తోడుగా ఉండాలి.

ఆధ్యాత్మికతనే అంటిపెట్టుకోవాలి: ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను వదలనిది, నీ దగ్గరనుంచి కదలనిది, నిన్ను అన్ని విధాల సన్మార్గంలో పెట్టేది ఆధ్యాత్మిక ధనమొకటే.

దైవం కోసం పరితపించాలి: లౌకిక విషయాలను కాకుండా  దైవాన్ని మాత్రమే కోరుకున్నప్పుడు విజయం వరిస్తుంది.

మాలిన్యాన్ని వదిలించుకోవాలి: తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షించనట్లే మనసులో మాలిన్యం ఉన్న వానికి భగవంతునిపై ఆసక్తి ఉండదు.

మంచిని మాత్రమే వెదకాలి: ఇతరుల తప్పులను వెదకడం గొప్ప కాదు, వారిలోని మంచిని గుర్తించి, ప్రేమించాలి.
సమర్థించుకోవడం కాదు... సమర్థతను పెంచుకోవాలి: మనలో దోషముంచుకుని, దానిని కప్పిపుచ్చుకునేందుకు దారులు వెదకటం తప్పు, సమర్థతను పెంచుకోవాలి  

ఆయన బోధనల ప్రకారం ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటం, ఆపదలో ఉన్న వారికి ఆసరా ఇవ్వటం, కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవటం, సేవ చేసేందుకు మార్గాన్ని వెతుక్కుని, సేవతోనే జీవితాన్ని లీనం చేయడమే భక్తులు ఆయనకు సమర్పించే పుట్టిన రోజు కానుక.
 - డి.వి.ఆర్.
 
 సేవార్తుడు
 తాగేందుకు గుక్కెడు నీరు లేక దప్పికతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి, 1700 గ్రామాలకు తాగునీరందించిన అపర భగీరథుడు సత్యసాయి. ఈ వితరణను తన జిల్లాకే పరిమితం కాకుండా కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, ఉభయ గోదావరితో సహా మరికొన్ని జిల్లాల ప్రజలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా దాహం తీర్చిన సేవార్తుడు.  ఈ సేవామూర్తిని, ప్రేమస్వరూపుని సందర్శించటానికి దాదాపు 180 దేశాలనుంచి భక్తులు పుట్టపర్తికి వచ్చేవారు. సాయి కుల్వంత్ హాలులో ఎత్తై ఆసనంపై నుంచి తనను సందర్శించటానికి వచ్చిన వేలాది భక్తులకు ఆశీస్సులందించిన సత్య సాయి నేడు మన మధ్య లేరు. అయితేనేం... ఆయనను నమ్మిన వారికి ఆయన మహాసమాధే అనంతమైన ఓదార్పుగా... కొండంత అండగా నిలుస్తోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement