2.0 ఒరేయ్ ...అక్కు పక్షి...! పోరా...నీ టెక్కు తీస్తా! | sapecial story to rajini kanth robo 2.0 | Sakshi
Sakshi News home page

2.0 ఒరేయ్ ...అక్కు పక్షి...! పోరా...నీ టెక్కు తీస్తా!

Published Sun, Sep 3 2017 6:38 AM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

2.0 ఒరేయ్ ...అక్కు పక్షి...! పోరా...నీ టెక్కు తీస్తా!

2.0 ఒరేయ్ ...అక్కు పక్షి...! పోరా...నీ టెక్కు తీస్తా!

1.0 లో వంద పాయింట్లు వచ్చాయి. శంకరన్న వంద పాయింట్లు కొట్టాడు. రజనీ ఇంకో వంద కొట్టారు. అమాంతం 200 పాయింట్లు వచ్చాయి కదా.. ఇప్పుడు 2.0 వస్తోంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌లో 2.0 అంటే ఇంప్రూవ్డ్‌ వెర్షన్‌ అని. ఆ రోబో అన్నీ చేసేశాడు.  ఇంప్రూవ్డ్‌ వెర్షన్‌లో ఇంకేం చేస్తాడో! స్క్రీన్లు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్‌.. టెక్నీషియన్లు, క్యాషూ, డ్యాషూ.. ఆటలు, పాటలు, ఫైట్‌లు, హీరోయిన్‌... కథ లైట్‌గా చెబుతున్నాం కానీ టూ పాయింట్‌ జీరో కథాకమామిషు మాత్రం.. ఫుల్‌ల్‌ల్‌ల్‌గా....!

కథేంటి?
మర మనిషి (రోబో)కి ఎమోషన్స్‌ ఉంటాయా? ఆలోచించగలుగు తుందా? ప్రేమలో కూడా పడుతుందా? మనం ‘కీ’ ఇచ్చినట్లు ఆడే రోబో మనకు సంబంధం లేకుండా పైవన్నీ చేస్తే, చూడ్డానికి ఓ థ్రిల్‌. ‘రోబో’ సినిమా అలాంటి థ్రిల్‌నే ఇచ్చింది. అందులో డాక్టర్‌ వశీ (రజనీకాంత్‌) ఎంతో శ్రమపడి ఓ రోబో (చిట్టి)ను తయారు చేస్తాడు. ఆ రోబోను ఇండియన్‌ ఆర్మీకి ఇవ్వాలన్నది అతని ఆశయం.

ఆర్మీకి ఉపయోగపడాలంటే చిట్టిలో హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉండాలి. వశీ ఆ పని కూడా చేసేస్తాడు. చివరికి అతని లవర్‌తోనే చిట్టి లవ్‌లో పడుతుంది. మరోవైపు చిట్టి దేశానికి ఉపయోగపడ కూడదని, దాన్ని అంతం చేయాలని విలన్‌ గ్యాంగ్‌ ప్లాన్‌ చేస్తుంది. క్లుప్తంగా ‘రోబో’ కథ ఇది. మరి.. ఈ చిత్రం సీక్వెల్‌ ఇ‘2.0’ కథేంటి? అంటే ఇప్పటివరకూ టూకీగా కూడా కథ గురించి బయటకు రాలేదు. అయితే చెన్నై కోడంబాక్కమ్‌లో ఓ కథ ప్రచారంలో ఉంది.

అదేంటంటే... పక్షులంటే ఓ వ్యక్తి (అక్షయ్‌కుమార్‌)కి పిచ్చి ప్రేమ. టెక్నాలజీ పెరుగుతోన్న కొద్దీ కొన్ని పక్షులు కనిపించకుండాపోతున్నాయి. ఆ బర్డ్‌ లవర్‌ బాధ అంతా అదే. అతనికి సెల్‌ టవర్లు చూస్తే ఒళ్లు మండిపోతుంది. వాటి నుంచి వచ్చే రేడియేషన్‌ వల్లే పక్షులు అంతమవుతున్నాయని టెక్నాలజీపై పగ పెంచుకుంటాడు.

సైంటిస్టులను అంతం చేయాలని, టెక్నాలజీని నాశనం చేయాలని అనుకుంటాడు. మరోవైపు... అవినీతిని అంతం చేయడానికి ఓ రోబోను కనిపెడతాడో సైంటిస్ట్‌ (రజనీకాంత్‌). ఆ సైంటిస్ట్, అతను కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు... ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ ‘2.0’ కథ ఉంటుందని సమాచారం. ఇది ఆసక్తిరాయుళ్లు అల్లిన కథా లేక నిజమైనదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ కథలో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని అక్షయ్‌ గెటప్‌ని బట్టి ఊహించవచ్చు.

ఐదు గెటప్స్‌లో రజనీ!
ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఐదు గెటప్స్‌లో కనిపిస్తారని ఓ టాక్‌. వాటిలో రోబో ఒకటి. దీనికోసం రజనీ ఫేస్‌ మాస్కులు తయారు చేశారు. అదంత ఈజీ కాదు. ఏవేవో పదార్థాలు రజనీ ఫేస్‌కి అప్లై చేసి, అది ఎండిన తర్వాత తీస్తే, వచ్చేదే మాస్క్‌. దీనికోసం రజనీ నాలుగైదు గంటలు కేటాయించాల్సి వచ్చింది.

ఈ సూపర్‌ స్టార్‌ వయసు దాదాపు 65. ఈ ఏజ్‌లో అన్నేసి గంటలు కదలకుండా కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. ‘లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’, ‘ఐరన్‌ మాన్‌’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ తదితర హిట్‌ సిన్మాలకు పని చేసిన హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ వాన్స్‌ హార్ట్‌వెల్‌ రజనీ– అక్షయ్‌ల స్పెషల్‌ గెటప్స్‌కి మేకప్‌ చేశారు. రజనీ ఇంత శ్రమపడ్డారు కదా? ఆయన ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు.. అనుకుంటు న్నారా? సినిమా సాధించే లాభాల్లో షేర్‌ ఇస్తారట. ఆ లెక్క రిలీజ్‌ తర్వాత తెలుస్తుంది.

ఈవీపీ వర్డ్‌లో...
చెన్నైలోని పూనమల్లిలో ‘ఈవీపీ వరల్డ్‌’ అనే థీమ్‌ వర్క్‌ ఉండేది. 2015లో దాన్ని మూసేశా రట. దాదాపు 150 ఎకరాలు ఉన్న ఆ పార్క్‌ని ‘2.0’ నిర్మాతలు హైర్‌ చేసుకున్నారు. అందులో భారీ సెట్స్‌ వేశారు. వాటిలో మొబైల్‌ ఫోన్‌ స్టోర్‌ సెట్‌ ఒకటి. అక్కడే మిలిటరీ ట్యాంక్స్‌ తయారు చేయించారట.

కేవలం షూటింగ్‌ కోసమే కాదు.. సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరపడానికి, అక్కడే బస చేయ డానికి వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారట. వేరే ప్లేస్‌లో తీసిన సీన్స్‌లో ప్యాచ్‌వర్క్‌ ఉంటే.. ఈవీపీ వరల్డ్‌లో సెట్‌ వేసి, మ్యాచింగ్‌ సీన్స్‌ తీసేవారట. దర్శకుడు శంకర్‌ ఇంటికి వెళ్ల కుండా ఆల్మోస్ట్‌ ఈ లొకేషన్‌లోనే ఉండేవారట. అంత డెడికేషన్, ఎంతో ప్యాషన్‌ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు తీయలేరు.

ఎప్పుడు మొదలు? ఎప్పుడు ముగింపు?
డిసెంబర్‌ 12 రజనీకాంత్‌ పుట్టినరోజు. 2015లో ఆయన బర్త్‌డే నాడు ‘2.0’ని ప్రారంభించారు. అప్పుడు చెన్నైలో తుఫాను కారణంగా సింపుల్‌గా ఆ వేడకను కానిచ్చేశారు. ఆ తర్వాత అదే నెల 16న రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ ఆగస్ట్‌కి మొత్తం షూటింగ్‌ పూర్తి చేశారు. కంటికి కనిపించేది 20 నెలలు. అంటే.. దాదాపు 600 రోజులు. కానీ, షూటింగ్‌కి పట్టిన రోజులు మాత్రం దాదాపు 300 రోజులు అట.

మధ్యలో అనారోగ్యం కారణంగా రజనీకాంత్‌ కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవడం వల్ల, షూటింగ్‌ డేస్‌ మినహా కొన్ని రోజులు ప్లానింగ్‌కి కేటాయించడం వల్ల ఆగస్ట్‌ వరకూ ఎక్స్‌టెండ్‌ అయింది. లేకపోతే ఇంకొంచెం ముందే అయ్యుండేదని టాక్‌. ఫస్ట్‌ పార్ట్‌కన్నా సెకండ్‌ పార్ట్‌ టెక్నాలజీ వైజ్‌గా రెండింతలు ఉండటం యూనిట్‌కి ఓ సవాల్‌. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకున్నారు. చిత్రీకరణ జరిపిన రోజులుకన్నా ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి ఎక్కువ రోజులు పడుతుంది.

అక్షయ్‌కుమార్‌ గెటప్‌ వెనక బోల్డంత కహానీ
హిందీలో హీరోగా దూసుకెళుతోన్న అక్షయ్‌కుమార్‌కి విలన్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? రెమ్యునరేషనా? స్టోరీయా? క్యారెక్టరా? రజనీకాంత్‌తో ఢీ కొనొచ్చనా? శంకర్‌ డైరెక్టర్‌ అనా? అని చాలామంది అనుకున్నారు. యస్‌.. అక్షయ్‌కుమార్‌ ఈ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి ఇవన్నీ కారణాలు.

‘‘రజనీకాంత్‌తో దెబ్బలు తినడంలో ఓ మజా ఉంది’ అని స్వయంగా అక్షయ్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇందులో విచిత్రమైన గెటప్‌లో అక్షయ్‌ కనిపిస్తోన్న ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

పక్షులు పలు రకాలు కదా. ఈ పక్షి ప్రేమికుడి గెటప్‌ని కూడా పలు రకాల పక్షులను తలపించే రీతిలో ప్లాన్‌ చేశారట. ఉదాహరణకు కనుబొమలు ఓ పక్షిలా, చేతి గోళ్లు మరో పక్షిలా, జుత్తు ఓ పక్షిని పోలినట్లుగా, మీసాలు మరో పక్షిలా... ఇలా అక్షయ్‌ గెటప్‌ని మౌల్డ్‌ చేశారు. అక్షయ్‌ మేకప్‌కి నాలుగైదు గంటలు పట్టేదట. ఒక్కసారి మేకప్‌ వేశాక ‘నో సాలిడ్‌ ఫుడ్‌’. ‘ఓన్లీ లిక్విడ్స్‌’. జ్యూసులు, నీళ్లు, పాలు లాంటివి. అందుకే ఎక్కువ గంటలు షూటింగ్‌ చేసేవారు కాదని సమాచారం. ఇంతకీ అక్షయ్‌ పారితోషికం ఎంతో తెలుసా? రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ సినిమాకి  ఆయన అక్షరాలా 50 కోట్లకు చెక్కు పుచ్చుకున్నారట. మామూలుగా హిందీలో హీరోగా నటించే సినిమాలకు అక్షయ్‌ 50 నుంచి 70 కోట్లు తీసుకుంటారని భోగట్టా.

తెలుగు రైట్స్‌ కోసం పోటాపోటీ!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని ఏషియన్‌ ఫిలింస్‌ సునీల్‌ నారంగ్‌ విడుదల చేయనున్నారు. రైట్స్‌ దక్కించుకోడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. చివరకు హక్కులు చేజిక్కించుకోవడానికి రాజకీయ నాయకుల సహాయం కూడా కొంతమంది తీసుకున్నారట. కానీ, ఈ ప్రెస్టీజియస్‌ మూవీని సరిగ్గా రిలీజ్‌ చేసి, నిలబెట్టగల సంస్థకే ఇవ్వాలని లైకా ప్రొడక్షన్స్‌ అనుకుందట. అందుకే 40 ఏళ్లుగా 500 చిత్రాలకు పైగా ఫైనాన్స్‌ చేసి, వందకు పైగా సినిమాలను పంపిణీ చేసిన ఏషియన్‌ ఫిలింస్‌కి ఇచ్చారు. ఫైనల్‌గా రిలయన్స్, సురేశ్‌ ప్రొడక్షన్స్‌తో కలసి ఏషియన్‌ ఫిలింస్‌ ఈ చిత్రం రైట్స్‌ను దాదాపు 80 కోట్లకు దక్కించుకుంది.

బడ్జెట్‌ ఎంత?
ఈ చిత్రంలో లెక్కలేనన్ని రోబోలు, టెక్నికల్‌గా క్రియేట్‌ చేసిన పక్షులు కనిపిస్తాయట. అలాగే, భారీ సెట్స్‌ కనువిందు చేస్తాయి. బోలెడంత మంది తారాగణం. ఇండియన్‌ టెక్నీషియన్స్‌తో పాటు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పని చేశారు. ఎక్కువమంది హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పని చేసిన మొదటి ఇండియన్‌ సినిమా ఇదే అవుతుంది. ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పని చేసిన సాంకేతిక నిపుణులు ‘2.0’కి చేశారు. కెమెరామేన్‌ నిరవ్‌ షా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌. రెహమాన్, సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి తదితర ఇండియన్‌ టెక్నీషియన్స్‌తో పాటు స్పెషల్‌ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడానికి మేరీ ఇ. వోగ్, స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ బేట్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ స్పెషలిస్ట్‌ జాన్‌ హ్యూగెస్, వాల్ట్‌ జోన్స్‌ వంటి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పని చేశారు.

అమెరికాకు చెందిన ‘ది లెగసీ ఎఫెక్ట్స్‌’ యానిమేట్రానిక్స్‌ వర్క్‌ చేసింది. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్‌ రెమ్యునరేషన్లు, సినిమా సెట్స్, లొకేషన్‌ ఖర్చు.. ఇలా టోటల్‌గా ఇది భారీ బడ్జెట్‌ సినిమా అయింది. ముందు 250 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్‌లోనే తీయాలనుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ముగిసేసరికి దాదాపు 450 కోట్లు అయింది. భారతీయ సినిమాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫస్ట్‌
మూవీ ఇదే అవుతుంది.

ఒక్క పాటకు 32 కోట్లు!
ఇది చదివినవాళ్లు 10 చిన్న సినిమాలు తీసే బడ్జెట్‌ ఒక్క పాటకా? అనుకోకుండా ఉండలేరు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల చెన్నైలో ఓ పాట తీశారు. ఆ పాటకు అయిన ఖర్చు 32 కోట్లు అట. రజనీకాంత్‌–అమీజాక్సన్, కొన్ని రోబోల మీద పదీ పదిహేను రోజుల పాటు ఈ పాట తీశారట. 32 కోట్లతో సాంగ్‌ అంటే.. ఎంత రిచ్‌గా ఉండి ఉంటుందో? సాంగ్స్‌ విషయంలో శంకర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెడుతుంటారని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

‘జీన్స్‌’ సినిమాలో ‘పూవుల్లో దాగున్న..’ పాటను ప్రపంచంలోని ఏడు వింతలైన తాజ్‌మహల్, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా, ఈఫిల్‌ టవర్, ఈజిప్టియన్‌ పిరమిడ్స్‌.. తదితర ప్రదేశాల్లో తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ పాట చిత్రీకరణకు 30 రోజులకు పైగా పట్టింది. ‘బాయ్స్‌’లో ఫ్రీజ్‌ టెక్నిక్‌తో ‘ఆలే.. ఆలే..’ సాంగ్‌ తీయడం అప్పట్లో ఓ హాట్‌ టాపిక్‌. రోబో’లో ‘కిల్లిమంజారో..’ పాటను పెరూలోని కొండల దగ్గర తీశారు. ఆ లొకేషన్లో షూట్‌ చేసిన ఫస్ట్‌ ఇండియన్‌ మూవీ ఇదే. ‘ఐ’లో ‘పూలనే కులికేయమంటా..’ పాటను చైనాలో తీశారు. పూల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఆ సాంగ్‌ ఐ–ఫీస్ట్‌. ‘ఈ పాటలన్నీ ఒక ఎత్తయితే ‘2.0’ కోసం తీసిన 32 కోట్ల పాట మరో ఎత్తు అవుతుందని చెన్నై టాక్‌.

ప్రమోషన్‌ అదుర్స్‌
సినిమా తీస్తే సరిపోదు.. దానికి సరైన పబ్లిసిటీ అవసరం. అది స్టార్‌ మూవీ అయినా నాన్‌–స్టార్‌ మూవీ అయినా. ఈ విషయంలో దర్శకుడు శంకర్, లైకా నిర్మాణ సంస్థకు ఫుల్‌ క్లారిటీ ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్‌ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ తయారు చేయించిన విషయం తెలిసిందే. 100 అడుగులు ఎత్తు ఉన్న ఈ బెలూన్‌ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో పలు చోట్ల దర్శనమిస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో పెట్టారు.

2 పాటలు! 3 చోట్ల ఆడియోలు!
ఆడియో వేడుకను బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నారు. అబుదాబి, హైదరాబాద్, చెన్నైలలో ఆడియో వేడుకను ప్లాన్‌ చేశారు. ఆ సంగతలా ఉంచితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెండే పాటలు ఉంటాయట. కానీ, ఏ.ఆర్‌. రహమాన్‌ ఐదు పాటలు తయారు చేసారట. అవి ఆల్బమ్‌ వరకే పరిమితమవుతాయని తెలిసింది. స్టోరీ పెద్దది కావడంతో పాటలకు పెద్దగా స్కోప్‌ లేకపోవడంవల్లే రెండు పాటలనే సినిమాలో పెట్టాలనుకున్నారట. మరి.. ఇది నిజమేనా? వేచి చూద్దాం.

తెలుగు ప్రమోషన్‌కు 5 కోట్లు?
జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటు న్నారు. అంతకు నెల ముందు ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచాలనుకుంటున్నారు. తెలుగు ప్రమోషనల్‌ కార్యక్రమాలకు 5 కోట్లు ఖర్చుపెట్టాలనుకుంటున్నా రట. ఈ ఖర్చుని లైకా ప్రొడక్షన్సే పెట్టుకుంటుందట.

అదిరిపోయే స్టేడియమ్‌ సీన్‌!
ఈ చిత్రంలో రజనీ– అక్షయ్‌  కాంబినేషన్‌లో వచ్చే స్టేడియమ్‌ సీన్స్‌ వన్నాఫ్‌ది హైలైట్స్‌ అని సమాచారం. ఢిల్లీల్లోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియమ్‌లో కొన్ని రోజులు ఆ సీన్స్‌ తీసి, ఆ తర్వాత చెన్నైలో ప్యాచ్‌ వర్క్‌ తీశారట. లెంగ్త్‌ తక్కువ ఉన్న ఈ సీన్స్‌ కోసం 60, 70 రోజులు కేటాయించడం విశేషం. దాన్నిబట్టి కథకు ఎంత కీలకమో ఊహించవచ్చు.

100 కోట్ల పైనే హిందీ హక్కులు!
‘2.0’ హిందీ రైట్స్‌ బాగానే పలికింది. ఫస్ట్‌ పార్ట్‌ సుమారు 20 కోట్లకు అమ్ముడుపోతే సెకండ్‌ పార్ట్‌ అందుకు ఐదింతలు పెరగడం విశేషం. దాదాపు 100 కోట్లకు పైనే హిందీ థియేట్రికల్‌ రైట్స్‌ అమ్ముడుపోయాయట.

110 కోట్లకు శాటిలైట్‌ రైట్స్‌
450 కోట్లతో ఈ సినిమాని తీస్తే అందులో పావు శాతం సినిమా విడుదలకు ముందే శాటిలైట్‌ రూపంలో వచ్చేసిందని టాక్‌. ఈ ప్రెస్టీజియస్‌ మూవీని దక్కించుకోవడానికి పలు ప్రముఖ ఛానళ్లు పోటీ పడ్డాయట. చివరికి ‘జీ టీవీ’ చేజిక్కించుకుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల శాటిలైట్‌ రైట్స్‌ను 110 కోట్లకు సొంతం చేసుకుందట.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement