సబ్యసాచీరలు
సబ్యసాచి దుప్పటి చుట్టినా అందంగానే ఉంటుంది. ఇక చీర చుడితే...ఆయన డిజైన్ చేసిన చీరలకు విదేశాలలోనూ మాంచి గిరాకీ ఉంటుంది. ‘ఏమిటయ్యా నీ మ్యాజిక్’ అని అడిగితే.... చీరల్ని చీరల్లా కాకుండా సబ్యసా‘చీర’ల్లా చూడమంటున్నాడు. ఆ గొప్పతనమేంటో మీరూ చూడండి. మీ చీరలకూ ఆ కొత్త కళను తీసుకురండి.
నిలయ పేరుతో సబ్యసాచి రూపొందించిన డిజైనరీ శారీ ఇది. ఎరుపు రంగు బెనారస్ పట్టుకు అదనంగా అమర్చిన ఎంబ్రాయిడరీ అంచు... దానికి తగ్గ అలంకరణ ఈ చీర అందాన్ని వెయ్యింతలు చేసింది.
పువ్వుల ప్రింట్ల క్రేప్ శారీకి ఎంబ్రాయిడరీ అంచు, మోడ్రన్ బ్లౌజ్‌తో తీర్చిదిద్దిన హంగులు కిందటేడాది కాన్స్ అంతర్జాతీయ సినిమా ఉత్సవంలో హైలైట్‌గా నిలిచాయి.
కథ చెబుతున్నంత అందంగా!
ఇండియన్ ఫ్యాషన్ రంగానికి రాచకళను తీసుకువచ్చిన ప్రసిద్ధ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి. రంగులు, హంగులతో దుస్తులకు అతనో అద్భుతమైన కళను తీసుకువస్తారు. వాటిని అలంకరించుకున్న అతివలు రాచఠీవితో వేదికలపైన అడుగులు కదుపుతారు. తన ప్రతీ డ్రెస్ డిజైన్ ఒక కథ చెబుతున్నట్టు, ఓ అందమైన కవిత అల్లుతున్నట్టు మనసులను హత్తుకుపోతుంది. ఇండియన్ ప్యాషన్ డిజైన్ కౌన్సిల్‌లో ముఖ్య సభ్యుడుగా కొనసాగుతున్న ‘సబ్యసాచి’ లేబుల్ డిజైన్స్ అంటే బాలీవుడ్ తారలు పోటీపడతారు. సబ్యసాచి డిజైన్స్ రూపకల్పనను పరిశీలిస్తే అత్యంత సాదాగా అనిపిస్తూనే ఒక అద్భుతమైన తత్త్వాన్ని మన కళ్లకు కడతాయి. ప్రాచీనసౌరభాలు వెదజల్లుతుతుంటాయి. ప్రాంతీయ పట్టణమైన కలకత్తా సాంస్కృతిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిపొందిన సబ్యసాచి ఆ వైభవాన్ని తన మేథాశక్తితో దుస్తుల మీద రూపొందిస్తుంటారు. అపూర్వమైన అల్లికతో కూడిన ఫ్యాబ్రిక్స్, ప్యాచ్ వర్క్స్, ఇతర అలంకారాలను సబ్యసాచి డ్రెస్ డిజైన్స్‌లో చూస్తాం. వెలకట్టలేని ఇతని డిజైన్స్ వేల రూపాయల నుంచి లక్షల్లో ధరపలుకుతున్నాయి. ఈ వైభవాన్ని కొద్దిపాటి మార్పులతో మీ చీరలకూ అద్దవచ్చు.