పొరుగింటి మీనాక్షమ్మను చూశారా! | Saudi Sisters Fight For Women Empowerment And Freedom | Sakshi
Sakshi News home page

పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!

Published Fri, Sep 27 2019 8:11 AM | Last Updated on Fri, Sep 27 2019 8:11 AM

Saudi Sisters Fight For Women Empowerment And Freedom - Sakshi

సగటు మహిళల స్వేచ్ఛాకాంక్షలకు ప్రతిరూపం : మాషల్‌ అల్‌–జలౌద్‌ (ఆరెంజ్‌ డ్రెస్‌)

మీనాక్షమ్మ అయినా, మాషల్‌ అల్‌–జలౌద్‌ అయినా ఇద్దరూ మన సిస్టర్సే.మీనాక్షి ఇండియాలో ఉంటున్నా, మాషల్‌ సౌదీలో ఉంటున్నా..వారిని వెంటాడే వివక్ష కూడా ఒకటే. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండే స్వేచ్ఛఇక్కడి మహిళకు, అక్కడి మహిళకు, అసలెక్కడి మహిళకైనా లేదు.ఆ ‘లేకపోవడాన్ని’ సౌదీలో ఇప్పుడు మాషల్‌ అనే మహిళ, మనహల్‌ అల్‌–ఒతైబీ అనే యువతి బ్రేక్‌ చేస్తున్నారు! ప్రపంచదేశాల్లోని ఆంక్షల పంజరాలలో ఉన్నసాటి  సిస్టర్స్‌కి ‘బ్రేక్‌ ద రూల్‌’ అంటూ ఇన్‌స్పిరేషన్‌ ఇస్తున్నారు.

ఓ మహిళ ఆధునిక వస్త్రాలు ధరించి ఠీవీగా నడుస్తోంది. హై హీల్స్‌ వేసుకున్న ఆమె అడుగుల శబ్దం అంతకంతకూ పెరుగుతోంది. ఇంతలో ఆమె పక్కగా నడుస్తున్న మహిళల బృందంలో గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆమెను వింతగా చూస్తున్నారు. ఇంతలో ఆ గుంపు నుంచి బయటికి వచ్చిన ఓ మహిళ.. ఆతృత పట్టలేక... ఆధునిక వేషధారణలో ఉన్న సదరు మహిళ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది.

‘‘ఏమ్మా నువ్వేమైనా సెలబ్రిటీవా?’’ అని అడిగింది. ‘‘ఊహూ..’’ అని ఆమె  సమాధానం.‘‘మరి మోడల్‌వా?’’ మరో ప్రశ్న.‘‘అబ్బే అదేం లేదండీ’’.‘‘మరి అలా అయితే ఈ డ్రెస్‌ వేసుకుని ఎందుకు బయటకు వచ్చావు?’’‘‘అదేంటండీ... ఇది నా ఇష్టం కదా. నాకు నచ్చినట్లుగా ఉంటా.. ఇందులో తప్పేముంది?’’.. ఈసారి ఎదురు ప్రశ్నించింది ఆ ఆధునిక మహిళ’. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.. ప్రశ్నలు సంధించిన ఆ మహిళ.

ఎందుకైనా మంచిది :  సౌదీలో తన కచ్చేరీని రద్దు చేసుకున్న పాశ్చాత్య పాప్‌ గాయని నిక్కీ మినాజ్‌
ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఆధునిక వస్త్రాలు ధరించి మహిళ పేరు మాషల్‌ అల్‌–జలౌద్‌ (33). సౌదీ అరేబియాకు చెందిన హ్యూమన్‌ రీసోర్సెస్‌ ప్రొఫెషనల్‌ ఆమె. అబయ, హిజాబ్‌ ధరించకపోతే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నా సరే ఆమె తన వైఖరి మార్చుకోలేదు. తనే కాదు, తన లాంటి ఎంతో మంది ఆ దేశపు నవ యుగపు మహిళలు గత కొంతకాలంగా అబయా (ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ ముసుగు) లేకుండానే బయటికి వస్తున్నారు. అనాదిగా వస్తున్న రాచరికపు సంప్రదాయాలు, కట్టుబాట్లకు అలవాటు పడిన వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూనే.. వారిని కూడా చైతన్యవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది. ‘సౌదీ అరేబియా విజన్‌– 2030’  కార్యక్రమంలో భాగంగా సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. లింగ వివక్షను తొలగించే దిశగా, మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు... సౌదీ ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్‌ చేసే అవకాశాన్ని కల్పించడం, పరుగు పందాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. కో– పైలట్లు, ఫ్లైట్‌ అటెండెంట్లుగా మహిళలకు అవకాశమిస్తున్నట్లుగా పలు సౌదీ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించాయి. అంతేకాదు సాయంకాలపు బులెటిన్‌ చదివేందుకు కూడా మహిళా జర్నలిస్టులకు సౌదీ కేంద్రంగా పనిచేసే కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇదంతా నిజంగా నిబంధనల సడలింపులో భాగమేనా అని ప్రశ్నిస్తే మాత్రం భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఏమైతే అదైంది : సంప్రదాయవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మనహల్‌ అల్‌–ఒతైబీ
నాపై దాడి జరగడం ఖాయం
కేవలం ఆంక్షలు సడలించినంత మాత్రాన పౌరుల్లో మార్పు రావడం లేదని, సంప్రదాయవాదుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినపుడు మాత్రమే తమకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనీ అంటోంది పాతికేళ్ల యువతి మనహల్‌ అల్‌– ఒతైబీ. ‘‘నాలుగు నెలలుగా అబయా ధరించకుండానే రియాద్‌లో సంచరిస్తున్నా. ఎటువంటి ఆంక్షలు లేకుండా.. నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరిస్తున్నా. నాకు ఇష్టంలేని పనులు చేయమని ఆదేశించే హక్కు ఎవరికీ లేదు. అయితే అబయా ధరించకుండా ఉండే విషయమై ఎటువంటి స్పష్టమైన చట్టాలు లేవు. కాబట్టి నేను రిస్క్‌ చేస్తున్నట్లే. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నాపై దాడి చేయవచ్చు కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు అల్‌–ఒతైబీ. జూలైలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్‌లో ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘అబయా ధరించని కారణంగా ఓ మాల్‌ నిర్వాహకులు నన్ను లోపలికి అనుమతించలేదు. నాతో వాగ్వాదానికి దిగారు. అబయా ధరించే విషయంలో నిబంధనలు సులభతరం చేసే అవకాశం ఉందంటూ గతేడాది వ్యాఖ్యలు చేసిన సౌదీ రాజు సల్మాన్‌ వీడియో క్లిప్‌ను వాళ్లకు చూపించాను. మహిళలు సౌకర్యవంతంగా, హుందాగా ఉండే దుస్తులు ధరిస్తే తనకేమీ ఇబ్బంది లేదని ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా వాళ్లలో ఏ మార్పూ లేదు’’  అని ఆ వీడియోలో వెల్లడించారు అల్‌–ఒతైబీ. అయితే ఇదంతా అబద్ధం, కేవలం ప్రచారం పొందేందుకే మనహల్‌ ఇలా చేసిందని ఆ మాల్‌ నిర్వాహకులు కొట్టిపడేశారు. 

కన్సర్ట్‌ రద్దు చేసుకున్న మినాజ్‌
సామాజిక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని భావించిన సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌... 35 ఏళ్ల సుదీర్ఘ నిషేధం తర్వాత గతేడాది ఏప్రిల్‌లో మొదటి సినిమా థియేటర్‌ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. సౌదీ ప్రేక్షకులతో పాటు మరికొంత మంది విదేశీ ప్రేక్షకులను థియేటర్‌లోకి అనుమతించిన నిర్వాహకులు.. దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామని ప్రకటన చేశారు. ఇందుకు కొనసాగింపు అన్నట్లు టాప్‌ మ్యుజిషియన్లు సైతం తమ దేశంలో ప్రదర్శన ఇచ్చేందుకు సౌదీ అనుమతించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాపర్‌గా గుర్తింపు పొందిన బోల్డ్‌ లేడీ నిక్కీ మినాజ్‌తో కన్సర్ట్‌ నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అంతలోనే మినాజ్‌ తన సౌదీ కన్సర్ట్‌ను రద్దు చేసుకున్నారని, మానవహక్కుల ఉల్లంఘనలో సౌదీకి ఉన్న రికార్డు చూసిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జలౌద్, ఒతైబీ వంటి యువతులు అబయా ధరించకుండా పెద్ద రిస్కే తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement