
పొదుపు పాఠం నేర్పండిలా..!
పేరెంటింగ్ టిప్స్
పిల్లలకు పొదుపు లక్షణాన్ని అలవరచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు ఒక్కసారి పొదుపులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే... ఆ తరువాత ‘రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు’. మీ చిన్నారికి ప్రతిరోజూ మీరు ఇచ్చే రూపాయి వారి పిగ్గీబ్యాంక్‌లో చేరుతుంది. ‘పిగ్గీబ్యాంక్ నిర్వహణ’పై వారికి అవగాహన వస్తుంది. పిగ్గీబ్యాంక్ నిండినపుడు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి పట్టిన ‘కాలం విలువ’ తెలిసివస్తుంది. ఎన్నిరోజులు కష్టపడితే లక్ష్యాన్ని చేరుకున్నామో తెలుస్తుంది. తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసుకుంటారు. ఆ ఆలోచన వారిని దుబారాకు దూరంగా ఉంచుతుంది.
6-10 ఏళ్లలో..: డబ్బు విలువను పిల్లలకు తెలియజేయడానికి ఇది సరైన వయసు. ఆర్థికపరమైన విషయాల్లో పిల్లలను భాగస్వాములను చేయండి. మీరు ఫలానా వస్తువు ఎందుకు కొంటున్నారో చెప్పండి. వారికి కావలసిన వస్తువు ధర ఎక్కువగా ఉంటే... అదే నాణ్యతలో అంతకన్నా తక్కువ ధరలో వస్తువులు ఎక్కడ దొరుకుతాయో తెలియజేయండి.
కొంత డబ్బు ఇచ్చి పిల్లలను సూపర్ మార్కెట్‌కు పంపండి. వాళ్లకు నచ్చిన వస్తువును కొనమని చెప్పండి. వారు కొనేటప్పుడు ఏం నేర్చుకున్నారో గమనించండి. ఇలాంటి పనులు వారిలో స్వయం నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని పెంపొందిస్తాయి. ప్రతి వస్తువును కొనేముందు అవసరం అనుకుంటేనే కొనాలని, ఇష్టానుసారంగా కొనుక్కుంటూ పోతే చివరికి మనవద్ద ఏమీ మిగలదని చెప్పండి.
11-13 ఏళ్లలో..: ఈ వయసులో వారికి వడ్డీ అంటే ఏంటో పరిచయం చెయ్యాలి. వారికోసం దాచే చిన్నమొత్తాలకు ఎంత వడ్డీ వస్తుందో వారితోనే లెక్కగట్టించాలి. వారికి 20 ఏళ్లు, 30 ఏళ్లు అలా ఎన్నేళ్లకు ఎంత వడ్డీ జమవుతుందో వారినే చెప్పమనండి. దాని ద్వారా పిల్లల్లో పొదుపు చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. పిగ్గీబ్యాంక్ ద్వారా డబ్బు కేవలం జమవుతుంది. అదే పొదుపుఖాతాల ద్వారా అయితే వడ్డీ కూడా వస్తుందని తెలిస్తే తప్పకుండా పాటిస్తారు. మరీ ఖరీదైన ఆటవస్తువులను కొనివ్వకండి. వాటికి బదులుగా ఇంట్లో కొద్దిసేపు వీడియోగేమ్‌లు ఆడుకోమని చెప్పండి.
14-18 ఏళ్లలో..: ఈ వయసు పిల్లల చేత బ్యాంకు, పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాలు తెరిపించండి. వారికి ప్రతినెలా పాకెట్ మనీ ఇవ్వడం ప్రారంభించండి. ముందు పొదుపు ఖాతాలో డబ్బులు వేసిన తరువాత మిగిలినవి ఖర్చు చేసుకోమని చెప్పండి.
మల్టీప్లెక్స్‌లు, పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్‌కు బదులు ఇంటికి సమీపంలో ఉన్న సాధారణ థియేటర్‌లోనూ అదే సినిమా తక్కువ ధరలో చూడవచ్చని వారు గ్రహించేలా చెప్పండి.
- అనిల్ కుమార్ బి.