చిట్టిసభ | Schoolly be provided to the toilet | Sakshi
Sakshi News home page

చిట్టిసభ

Published Tue, Aug 11 2015 11:07 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

చిట్టిసభ - Sakshi

చిట్టిసభ

పిల్లలకో మంచి అలవాటు.
ఏది కావాలన్నా అడిగేస్తారు.. కావాలంటే కడిగేస్తారు..
పిల్లల్లోని ప్రశ్నించే ఈ గుణాన్ని బలపరిస్తే సమాజం బాగుపడుతుంది.
లోగమ్మాళ్ ఆర్ముగం అలాగే అనుకుంది.
అందుకే పిల్లల్లో ఉండే ఈ మంచిగుణాన్ని పదునుపెట్టింది.
తమిళనాడులోని అరణ్‌వయళ్ అనే ఊళ్లో పిల్లలు ‘చిట్టిసభలు’ ఏర్పాటు చేసి
చుట్టుపక్కల ఉండే సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
వీథిలైటు దగ్గర నుంచి స్కూల్లలకు టాయిలెట్ల దాకా సమకూర్చుకోగలుగుతున్నారు.
ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథ చదివాక... మన ఊళ్లలో పిల్లలు కూడా
చట్టసభల్లాంటి చిట్టిసభలను ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది!
ఇలా సమస్యలకు పరిష్కారం కనుగొంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
ఇది చూసి పెద్దలూ గట్టిగా ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకుంటే దేశం బాగుపడుతుంది.

 
తమిళనాడు.. తిరువళ్లూర్  జిల్లాలోని అరణ్‌వయళ్ గ్రామం. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఆ ఊళ్లోని గుడి ఆవరణలో రకరాల వయసున్న పిల్లలు కొంతమంది సమావేశమయ్యారు. అందులోని ఒక పిల్లాడు ఆ ఊళ్లోని ఓ వీథిలో పాడైపోయి.. వైర్లు వేలాడుతున్న ఓ వీథిలైటు స్విచ్‌బోర్డ్ అంశాన్ని చర్చలో పెట్టాడు. స్పీకర్‌స్థానంలో ఉన్న  మరో అబ్బాయి ఆ చర్చకు అనుమతిచ్చాడు. ఈ అంశాన్ని చర్చకు పెట్టిన అబ్బాయే మాట్లాడుతూ.. స్విచ్‌బోర్డ్‌లోంచి బయటకు వచ్చిన ఆ వైర్లు ఆ వీథిలోని పాదచారులకు, ఆ బోర్డ్‌పక్కనే ఉన్న ఇళ్లవాళ్లకు ఎంత ప్రమాదరకంగా మారాయో వివరిస్తున్నాడు.

‘అక్కడ పరిస్థితి చాలా డేంజర్‌గా ఉంది. పొరపాటుగా ఏ తీగ తగిలినా షాక్ కొడ్తుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి సభ్యులందరూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వచ్చు’ అన్నాడు సమావేశంలోని మిగిలిన వారిని ఉద్దేశిస్తూ. ‘మన పీడబ్ల్యూడీ మినిస్టర్ ఉన్నాడు కదా.. కొత్త స్విచ్‌బోర్డ్ ఏర్పాటు చేయమని పంచాయతీ వార్డ్ మెంబర్‌కి ఓ పిటిషన్ రాస్తే సరి’ అంటూ ఒక సభ్యుడు సలహా ఇచ్చాడు.
 ఈ సలహా  సభ్యులందరికీ నచ్చింది. దాంతో ఆ చర్చ కొత్త స్విచ్‌బోర్డ్ కోసం పంచాయితీ వార్డ్‌మెంబర్‌కి పిటిషన్‌ను ఎప్పుడు సమర్పించాలి అనేదాని మీదకి మళ్లింది. ‘వచ్చే ఆదివారమైతే బాగుంటుంది’ అని సూచించింది ఒక సభ్యురాలు. ‘వచ్చే ఆదివారం గుళ్లో జాతర ఉంది. అందరూ అదే హడావిడిలో ఉంటారు. దీని గురించి  పట్టించుకోరు’ అన్నాడు ఇంకో సభ్యుడు. ‘నిజమే’ అంటూ మిగిలిన సభ్యులూ గొంతు కలిపారు. అలా వాళ్లంతా  పిటిషన్‌ను సమర్పించాల్సిన తేదీ గురించి తర్జనభర్జన పడుతున్నారు.

అప్పటిదాకా ఈ సమావేశాన్ని దూరం నుంచే చూస్తున్న 39 ఏళ్లున్న ఒకావిడ దగ్గరగా వచ్చి ‘గుడి జాతర కంటే ముందే కొత్త స్విచ్‌బోర్డ్ ఏర్పాటుకు పిటిషన్ వేస్తే మంచిది కదా’ అంటూ సూచించింది. ఆ సూచన సభ్యులందరికీ సమంజసంగా తోచింది. ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ వెంటనే మరో సమస్య మీద చర్చ ప్రారంభించారు. ఇది పిల్లలు పిల్లలు కలిసి ఆడుకుంటున్న ఆట కాదు. ఊసుపోక తలపోసుకుంటున్న ఊహా కాదు. నిజం! దేశంలోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు వెదికి.. చట్టంగా చేసే అచ్చు పార్లమెంట్ లాంటి ‘చిట్టిసభ’! పిల్లల పార్లమెంట్.  అరణ్‌వయళ్ ఊరి పార్లమెంట్. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్! ఆడిపాడే పసివాళ్లు సమాజం పట్ల స్పృహను పెంచుకోవడానికి చేస్తున్న అధ్యయనం. సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతలను తెలుసుకుంటున్న వైనం. వీళ్లకు ఈ విషయాన్ని  నేర్పుతున్నదెవరో కాదు.. ఆ సమావేశంలో మధ్యలో కల్పించుకొని ఓ చిన్న సూచన చేసిన నడివయసు స్త్రీ.. లోగమ్మాళ్ ఆర్ముగం.

 వయసుకు మించిన పరిణతి
 అర్ముగం గురించి పరిచయం కంటే ముందు ఆమె పరిచయం చేసిన ఈ పార్లమెంట్ సాధించిన విజయాలను  తెలుసుకుందాం. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్‌లోని పిల్ల సభ్యులు వయసుకు మించిన పరిణతి ప్రదర్శిస్తున్నారు. వాళ్లు పెంపొందించుకున్న అవగాహన అలాంటిది మరి! 2006 వరకు ఆ ఊరి నడిబొడ్డున.. బస్టాండ్ పక్కనే ప్రభుత్వం సారా దుకాణం నడిపేది. దీనివల్ల అక్కడి ఆడవాళ్లు, పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు ఈ పిల్లల పార్లమెంట్ ‘ప్రభుత్వం బస్టాండ్ పక్కనుంచి సారా దుకాణాన్ని ఎత్తేయాలి’ అంటూ ఊళ్లో వాళ్లందర్నీ కలుపుకొని ర్యాలీ నిర్వహించింది. దెబ్బకు ప్రభుత్వమే దిగొచ్చింది. ఆ దుకాణాన్ని ఊరి బయటకు మార్చింది. ఈ చైతన్యం ఆ ఊరికే పరిమితం కాలేదు. పక్క ఊరైన ఒండికుప్పంకీ పాకింది. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న ప్రైవేట్ లిక్కర్ షాప్ స్వచ్ఛందంగానే షట్టర్లు మూసేసుకొని ఊరి బయట కొత్త పాక వేసుకుంది.

 కమ్యునిటీ టాయ్‌లెట్లు
 కొన్నాళ్ల కిందటి వరకు అరణ్‌వయళ్‌లోని కమ్యూనిటీ టాయ్‌లెట్లు అపరిశుభ్రంగా.. శిథిలావస్థలో ఉండేవి. ఇది అక్కడి మహిళలు, పిల్లలకు సమస్యగా పరణమించింది.  అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్‌కి అప్పటి ప్రధాని అయిన శశికళ ఆ ఇక్కట్లను పంచాయతీ దృష్టికి తీసుకెళ్లింది. కమ్యూనిటీ టాయ్‌లెట్ల పునరుద్ధరణకు పెద్ద యుద్ధమే చేసింది. ఫలితంగా... వాటి పునర్నిర్మాణం జరిగింది. అంతేకాదు మెయింటెనెన్స్ కూడా మెరుగైంది. ‘ఈ పిల్లల పార్లమెంట్ పుణ్యమా అని ఇప్పుడా టాయ్‌లెట్లు అద్దంలా ఉంటున్నాయి. మా ఆడాళ్లు, పిల్లల కష్టాలూ తీరాయి’ అంటారు ఊళ్లోని స్త్రీలు. ఆ మాజీ ప్రధాని శశికళ ఇప్పుడు బీకాం ఫైనలియర్ చదువుతోంది. బాధ్యతల పరిధినీ పెంచుకుంటోంది.

 నీటి ప్రవాహం.. ప్రపంచ కిటికీ
 కొన్నేళ్ల కిందటి దాకా.. ఆ ఊళ్లో పబ్లిక్ వాటర్ ట్యాంక్ పాడైపోయి, నీళ్లున్నా గొంతు తడిసేది కాదు ఆ ఊరి జనాలకు. పెద్దవాళ్లు సమస్యను భరిస్తూ వచ్చారే కానీ బాధ్యతను గుర్తెరగలేదు. ఈ పిల్లలు ఊరుకోలేదు.. పార్లమెంట్‌లో చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. వారం రోజుల్లో వాటర్ ట్యాంక్ మరమ్మతు అయింది.. కొత్త కొళాయీ అమరింది. నీటి ప్రవాహం బిందెల్లో ఒదిగింది. దాహం తీరింది. అలాగే గ్రంథాలయం కూడా ఓ గొప్ప ప్రయత్నం తర్వాత మంచి పుస్తకాలతో కొలువుతీరింది. ఇప్పుడు ఆ ఊరి పిల్లలకు ప్రపంచాన్ని చూపిస్తున్న కిటికీ ఇదే! ఇవి మచ్చుకు మాత్రమే. ఆ ఊళ్లో ఏ సమస్య ఉన్నా స్పందించి పరిష్కారం కోసం పోరాడేది ఈ పిల్లల పార్లమెంటే. అదీ ఆ పిల్లల చిత్తశుద్ధి. బాధ్యతల పట్ల వాళ్లు పెంచుకున్న గౌరవం! ఇప్పటికే ఈ పార్లమెంట్ స్ఫూర్తి అరణ్‌వయళ్ చుట్టుపక్కల గ్రామాలకూ పాకి... అక్కడా పిల్లల పార్లమెంట్లు ఏర్పాటయ్యాయి.    - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 కోచ్.. మోటివేటర్.. మెంటర్..
 ‘పార్లమెంట్’ కాన్సెప్ట్‌తో పిల్లల్లో సమస్యల పట్ల అవగాహనను కుదిర్చి సామాజిక బాధ్యత తెలుసుకునేలా చేసిన లోగమ్మాళ్ ఆర్ముగం పెద్దగా చదువుకున్నది కాదు. ఆమెది డబ్బున్న కుటుంబమూ కాదు. అరణ్‌వయళ్ ఊళ్లోనే ఆమె తండ్రి రోజు కూలీ. అతి కష్టమ్మీద కూతురిని టెన్త్ వరకు చదివించగలిగాడు. లోగమ్మాళ్‌కి ఉన్నత చదువులు చదువాలనే ఆశ. పేదరికం వల్ల ఆ ఆశ నెరవేరలేదు. దాంతో అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించే ఇంకామ్‌వెల్ అనే ఎన్జీవోలో వాలంటీర్‌గా చేరింది. ఆ తర్వాత ‘పసుమై ట్రస్ట్’ అనే ఎన్జీవోలో హెల్త్ వర్కర్‌గా చేరింది. ఇటుకల బట్టీల్లోని బాలకార్మికులకు చదువు చెప్పే సంస్థ అది. హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూనే  పిల్లలకు పాఠాలూ చెప్పేది. తానూ ఎన్నో పాఠాలు  నేర్చుకుంది. అందులో ఒకటే పిల్లల పార్లమెంట్. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న ఆమె దాన్ని తన ఊళ్లోనే ఎందుకు మొదలు పెట్టకూడదనుకుంది. వెంటనే అరణ్‌వయళ్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లల పార్లమెంట్ గురించి వివరించింది. సహజంగానే పెద్దల కన్నా పిల్లల్లోనే ఉత్సాహం కనిపించింది. అలా 2006లో ‘అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్’ ప్రారంభమైంది. 2010లో తాను పనిచేస్తున్న ఎన్జీవో నుంచి బయటకు వచ్చేసిన లోగమ్మాళ్, పూర్తిగా దీనికే అకింతమైపోయింది. అయితే, అందులో చేసిన పనులను మాత్రం వదిలిపెట్టలేదు. అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్ ద్వారా వాటినీ చేస్తోంది. ఇటుకల బట్టీలు ఎక్కడుంటే అక్కడికి ఈ పిల్లలు వెళ్లి తోటి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. ఇదంతా చేయిస్తూనే పెద్ద చదువులు చదవాలన్న తన కలనూ నెరవేర్చుకుంటోంది లోగమ్మాళ్. కరెస్పాండెన్స్ ద్వారా బీఏ చదువుకుంది. తనకు ఇష్టమైన సోషల్‌వర్క్‌లో ఏడాది డిప్లొమా కోర్సునూ పూర్తి చేసింది. ‘సమాజ సంక్షేమం పట్ల పిల్లల్లో అవగాహన పెంపొందించడం, భవిష్యత్తులో వాళ్లు సమస్యల పరిష్కర్తలుగా నిలవడమే ఈ అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్లమెంట్ లక్ష్యం’ అంటుంది లోగమ్మాళ్ ఆర్ముగం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement